త్యాగయ్య పరమపదించి 175 ఏళ్ళు
(వైజయంతి పురాణపండ, 8008551232)
ఆ ప్రాంతమంతా సంగీత విద్వాంసులు, కళాకారులు, వాద్యకారులతో కిటకిటలాడిపోతోంది.
గాత్ర విద్వాంసులు గొంతు సవరిస్తున్నారు.
వాద్యకళాకారులు తమ తమ వాద్యపరికరాలను శృతి చేసుకుంటున్నారు.
వారు మాత్రమే కాదు, ఆ పక్కనే గున్న మామి చెట్ల మీద ఉన్న కోకిలలు కంఠం సవరిస్తున్నాయి.
చిలుకలు పలుకులు పలకడానికి సిద్ధమవుతున్నాయి.
ఆవులు అంబారవాలు ప్రారంభించాయి.
ఇక సీతాకోకచిలుకలు రంగురంగుల దుస్తుల్లో అందంగా నాట్యం ప్రారంభించాయి.
ఇందరికీ ఒకటే ఆభరణం.
అదే త్యాగరాజ కీర్తన.
ఆ ఆభరణం లభించినవారంతా మురిసి, మైమరచిపోతున్నారు.
ఆ ఆభరణాన్ని ఆయనకు అలంకరించడానికి పోటీపడి మరీ కొంగలబారులాగ గుంపులుగుంపులుగా అక్కడకు చేరుకున్నారు.
అదే తిరువాయూరు
ఇంతలోనే అక్కడకు ఇద్దరు మహానుభావులు వచ్చారు.
ఒకరు సంగీతకారుడు త్యాగయ్య
మరొకరు ఆ త్యాగయ్యను నిరంతరం స్మరించుకుంటూ గానం చేసేందుకు కృషిచేసిన బెంగళూరు నాగరత్నమ్మ.
గంధర్వ గళం అపురూప గానం
తల్లీ! నీకు వందనం!
మహానుభావా! నీకు మేం వందనాలు అర్పించాలే కాని, మీరు మాకు వందనాలు చేయకూడదు, మీ గంధర్వ గళంతో మమ్మల్ని ఆశీర్వదించాలి.
నిజమే తల్లీ. మీకంటే వయసులో నేను పెద్దవాడిని కనుక నేను మిమ్మల్ని ఆశీర్వదించవలసిందే.
అదొక్కటే కాదయ్యా! మీరు సృష్టించిన కీర్తనలు మమ్మల్ని సన్మార్గంలో పెట్టడమే కాకుండా, ఎన్నో విషయాలు తెలుసుకునేందుకు ఉపయోగపడుతున్నాయి.
అదంతా ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహం తల్లీ!
అందరికీ ఆ రాముని దయ ఎందుకు లభించలేదు స్వామీ! మీరు ఏదో పుణ్యం చేశారు కనుకనే ఆయన అనుగ్రహం కలిగింది.
అంతా రామమయం! అంతా రామలీల! అంతా రామానుగ్రహం!
మీరు ఎనిమిది వందలకు పైగా కీర్తనలు రచించారు. ఎంత మహానుభావులు తండ్రీ మీరు! మీ కీర్తనలు గానం చేస్తూనే మేమంతా పేరుప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నాం.
అంతా మీ అభిమానం. నాకంటె ముందు ఎంతోమంది కీర్తనలు, సంకీర్తనలు రచించారు కదా!
అవునయ్యా! వారు కూడా మహానుభావులే. ఎవరి మార్గం వారది. మీరంతా వాగ్గేయకారులే. మీరంతా నిరాడంబరులే. మిమ్మల్ని మీరు ఆ భగవంతునికి అంకితం చేసుకుంటారు. మహాకవి పోతన కూడా అంతే. అందుకేగా మీరు నిధి చాల సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అంటూ కీర్తించారు. పోతన గారు పలికించెడివాడు రామభద్రుడు అన్నాడు. అందుకే మీరు మహానుభావులు.
అంతా రాముని శరణం తల్లీ!
ఇక్కడ నీ గురించి ఒక్కమాట చెప్పాలి తల్లీ! నీ యావదాస్తినీ నా కోసం ఖర్చు చేసి, నాకు దేవాలయం నిర్మించి, నేను రామ సన్నిధికి చేరిన తిథి నాడు నా ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగేలా పూనుకున్నావు కదా. అంతటి సంపదను అందరూ రెట్టింపు చేసుకోవాలనుకుంటారే కాని, ఇలా నాలాంటి సామాన్యుడి కోసం ఖర్చు చేయాలనుకుంటారా.
మీరు సామాన్యులా! తప్పు తప్పు. మీరు అసామాన్యులు. అరుదైన వ్యక్తులు. అందరికీ ఆరాధ్యులు. కారణజన్ములు. మీలాంటి వారికి సేవ చేసుకునే భాగ్యం ఆ రాముడే నాకు కల్పించాడని భావిస్తాను. మీ కీర్తనలను గానం చేస్తూ, అందరినీ మెప్పించగలిగాను. మీరు రచించిన కీర్తనలకు ఒక్క పైసా కూడా మీరు సంపాదించుకోలేదు. అన్నిటినీ గుది గుచ్చి, మాల కట్టి, ఆ రాముని మెడలో వేసి ఆయనకే తెలియని ఆయన గొప్పదనాన్ని అందరికీ తెలియచేశావు. నీ కీర్తనలు వింటున్న ఆ శ్రీరామచంద్రుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. నాకు తెలియకుండా నాలో ఇన్ని అంశాలు ఉన్నాయా అనుకున్నాడు. అంతటి మహానుభావులు మీరు. ఆ కీర్తనలతోనే మేం ప్రపంచానికి పరిచితులమయ్యాము.
అయ్యో! అంత గొప్పవాడిని కాదు తల్లీ నేను.
మీరు స్థితప్రజ్ఞులు తండ్రీ!
మీరు రచించిన ఘనరాగ పంచరత్న కీర్తనలను ఇన్ని వేల మంది ముక్తకంఠంతో పాడుతున్నారు. ఇంతటి భాగ్యం ఎవరికి దక్కుతుంది చెప్పండి.
మీరంతా నేను రాసిన కీర్తనలను పాడుతుండటం వల్లే నేను నేటికీ చిరంజీవిగా ఉన్నాను.
మాకు ఆ భాగ్యాన్ని ప్రసాదించింది మీరే కదండీ. శ్రీపాద పినాకపాణి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, ఈమని శంకరశాస్త్రి, చిట్టిబాబు, మాండలిన్ శ్రీనివాస్… వేనవేల కళాకారులు మీ కీర్తనలు గానం చేయడానికి ఖండాలు దాటి ప్రపంచమంతా పర్యటించారు. ఇంతమంది ఇంతటి గుర్తింపు తెచ్చుకోవటానికి నీ కీర్తనలే కారణం కద తండ్రీ!
నేను రచించిన వాటిని అందరూ కలిసి గానం చేసేందుకు నువ్వు చేసిన కృషి అనన్యసామాన్యం తల్లీ!
అందుకేనేమో నన్ను మీ చెంతనే ప్రతిష్టించారు కదయ్యా.
ఈ రోజున వీరి గానం వింటుంటే నా మనసు మైమరచిపోతోంది.
మీరు గతించి నేటికి 175 సంవత్సరాలు పూర్తయ్యాయి.
అవును తల్లీ! నేటికీ నన్ను గానం చేయటం నాకు ఆ రాముడిచ్చిన వరం.
అక్కడ పంచరత్న కీర్తనల గానం పూర్తయింది.
ఆనందాశ్రువులతో నిండిన నయనాలతో త్యాగయ్య, నాగరత్నమ్మ అక్కడి నుంచి నిష్క్రమించారు.
భాషా బేధం లేకుండా కొన్ని కోట్ల మంది కళాకారులు నిన్ను నమ్ముకొని హాయిగా జీవిస్తున్నారు. దేశ విదేశాలలో ఈ ఉత్సవాలు సంగీతాభిమానులు జరుపుకోవడం పెద్ద విశేషం. సామ వేదమే సంగీతం అన్నారు. నీ సంగీతమే సామవేదం అయింది స్వామీ. ఎన్నని చెప్పగలను స్వామీ…
నీలాంటి కళాకారిణులు నన్ను పెద్ద వాడిని చేసేసారు.
కాదు స్వామి నేను ఒక చిన్న దీపాన్ని వెలిగించాను. అది 175 ఏళ్లుగా వెలుగుతూ అఖండ దీపమైంది
(త్యాగయ్య 175 వ ఆరాధనోత్సవాల సందర్భంగా సృజన రచన)