పాత పుస్తకాలు సీఎం రేవంత్ కు ఉద్యోగుల కృతజ్ఞతలు
సంక్షేమ పథకాల ప్రకటనపై హర్షం
హైదరాబాద్, ఫిబ్రవరి 24 : దశాబ్దాల తమ వాంఛను నెరవేర్చారంటూ ఉద్యోగ, పెన్షనర్ సంఘాల నేతలు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లకూ రూ.1.20 కోట్ల ప్రమాద బీమా వర్తింపు, రూ.1,056 కోట్ల మూలనిధితో ఉద్యోగుల, పెన్షనర్ల ఆరోగ్య పథకానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నేతలు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం ప్రకటించిన ఆరోగ్య, బీమా పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని వారు కొనియాడారు. 1,998 వ్యాధులకు నగదు రహిత చికిత్సలను పొందే విధంగా ఉద్యోగులు, పెన్షనర్లకు అవకాశం లభించడం నిజంగా వరమని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని క్యాబినెట్ ఉద్యోగులు, పెన్షనర్ల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ తీసుకున్న ఈ నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిపోతాయని ఉద్యోగ సంఘాల నాయకులు కొనియాడారు. ముఖ్యమంత్రికి, మంత్రివర్గ సభ్యులకు ఉద్యోగ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు.

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐకాస నాయకులు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు, పి.దామోదర్ రెడ్డి (పీఆర్‌టీయూ), చావా రవి (యూటీఎఫ్), కే.వెంకటేశ్వర్లు (టీఎన్జీవో), ఉపేందర్ రెడ్డి (టీజీవో), జి.సదానందగౌడ్ (ఎస్టీయూ), దామోదర్ రెడ్డి, ఉమాదేవి (పెన్షనర్స్), వి.రవీందర్ రెడ్డి (రెవెన్యూ), గిరి శ్రీనివాస్ రెడ్డి (సెక్రటేరియట్), ఖాదర్ (ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్), టి.లక్ష్మన్ (ఎక్సైజ్), తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి , కె.రామకృష్ణ (డిప్యూటీ కలెక్టర్ల సంఘం), ఎస్.రాములు, రమేష్ పాక, సీహెచ్.శ్రీనివాస్ (తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్), బాణాల రాంరెడ్డి, వి.భిక్షం (తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్), డా.నిర్మల, ఎల్.దశరథ్(టీజీసీపీఎస్ఈయూ), గరికె ఉపేందర్‌రావు (జీపీవో), సుగంధిని (హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్‌డబ్ల్యూ), భూమేశ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

