హైదరాబాద్, నవంబర్ 10 : ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు.
అందె శ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని, అందెశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ… ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు.
అందెశ్రీ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర
అందెశ్రీ స్వస్థలం సిద్ధిపేట సమీపంలోని రేబర్తి. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. ఆయన వయసు 64 . 1961 జులై 18 న జన్మించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. ఒక కుమారుడు ఉన్నారు. ఆశు కవిత్వం చెప్పడంలో ఆయన దిట్ట. 2015 లో రావూరి భరద్వాజ పురస్కారాన్ని, 2022 లో జానకమ్మ పురస్కారాన్ని 2024 లో దాశరధి పురస్కారాన్ని అందుకున్నారు. 2006 లో గంగ సినిమాకు ఆయన నంది పురస్కారం అందుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ అందించింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ ఆయన రచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఇటీవలే కోటి రూపాయల నగదు పురస్కారాన్ని అందించింది.
సోమవారం ఉదయం ఆయన ఇంట్లో కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఉదయం 7 25 గంటలకు అందెశ్రీ కన్నుమూసినట్టు వైద్యులు ప్రకటించారు.

