బీహార్ అసెంబ్లీ ఎన్నికలు
(నవీన్ పెద్దాడ)
బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (నవంబర్ 6, 11) కు ముందు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారీ నగదు బదిలీ పథకం పెను దుమారం రేపుతోంది. ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ (MMRY) పేరుతో కోట్లాది మహిళల ఖాతాల్లోకి నేరుగా పదివేల రూపాయలు చొప్పున జమ అవుతున్నాయి. ఎన్నికల ప్రకటనకు కొద్ది రోజుల ముందు ఈ పథకం తేవడం ఓటర్లను ప్రభావితం చేయడానికే అన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
ఆగస్టు 29న రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి ఆమోదం తెలిపింది. కేవలం నెల తిరక్కుండా, సెప్టెంబర్ 26న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75 లక్షల మంది మహిళలకు నిధులు బదిలీ చేసి పథకాన్ని ప్రారంభించారు. ఆ తరువాత, అక్టోబర్ 3న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 25 లక్షల మందికి పంపిణీ చేశారు. సరిగ్గా పది రోజుల తర్వాత, అక్టోబర్ 6న, కేంద్ర ఎన్నికల సంఘం (ECI) బీహార్ ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఆశ్చర్యకరంగా, ఎన్నికల తేదీలు ప్రకటించిన అదే రోజున, నితీష్ కుమార్ మరో 21 లక్షల మంది మహిళలకు నిధులు విడుదల చేశారు.
కోడ్ అమల్లోనూ ఆగని బదిలీలు
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చాక కూడా నగదు బదిలీలు ఆగకపోవడం వివాదాన్ని తీవ్రతరం చేసింది. అక్టోబర్ 17, 24, 31 తేదీలలో కూడా డబ్బు పంపిణీ కొనసాగింది. తదుపరి విడత బదిలీ నవంబర్ 7న (మొదటి దశ పోలింగ్‌కు మరుసటి రోజు) షెడ్యూల్ చేసినట్లు RJD ఆరోపించింది. అక్టోబర్ 31 నాటికి 1.41 కోట్ల మంది మహిళలు డబ్బు అందుకున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నలంద సభలో స్వయంగా ప్రకటించారు. ఈ రూ. 10,000 “వెనక్కి తీసుకోబడవు” అని, లబ్ధిదారులకు భవిష్యత్తులో అదనంగా రూ. 2 లక్షల రుణం కూడా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఉద్దేశంపై సందేహాలు
మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చడమే ఈ పథకం లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. కానీ క్షేత్రస్థాయి నివేదికలు భిన్నంగా ఉన్నాయి. బేగుసరాయ్‌లో డబ్బు అందుకున్న చాలా మంది మహిళలు, ఆ డబ్బును దీపావళి ఖర్చులకు, బట్టలకు, పాత అప్పులు తీర్చడానికి వాడినట్లు అంగీకరించారు. పథకం ఆమోదించిన 28 రోజుల్లోనే 75 లక్షల మంది మహిళలు వ్యాపార ప్రణాళికలు ఎలా సమర్పించారని, అధికారులు వాటిని ఎప్పుడు పరిశీలించారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 కింద “అనుచిత ప్రభావం” (Undue Influence) కిందకు వస్తుందని RJD ఎంపీ మనోజ్ ఝా ఎన్నికల సంఘానికి అక్టోబర్ 31న ఫిర్యాదు చేశారు.
ఈసీ వైఖరిపై విమర్శలు
ఈ ఫిర్యాదుపై ECI ఇప్పటికీ స్పందించలేదు. ఇది “కొనసాగుతున్న పథకం” కాబట్టి కోడ్ వర్తించదని ECI వర్గాలు చెప్పినట్లు వార్తలొచ్చాయి. కానీ ఇది ఎన్నికలకు నెల రోజుల ముందు తెచ్చిన సరికొత్త పథకం. విచిత్రంగా, 2023 తెలంగాణ ఎన్నికల్లో, ఐదేళ్లుగా అమల్లో ఉన్న ‘రైతు బంధు’ పథకాన్ని ECI నిలిపివేసింది. బీహార్ విషయంలో ఈసీ భిన్నంగా వ్యవహరించడం దాని తటస్థతపై సందేహాలు రేకెత్తిస్తోంది.
ఖజానాపై పెను భారం
రాష్ట్రంలోని 2.97 కోట్ల కుటుంబాలకు పదివేల చొప్పున ఇస్తే, ఖజానాపై తక్షణమే రూ. 29,700 కోట్ల భారం పడుతుంది. ఇది రాష్ట్ర బడ్జెట్‌లో 9.4 శాతం. ఇప్పటికే బీహార్ అప్పులు GSDPలో 5 శాతానికి చేరాయి. ఎన్నికల వేళ ఇంత భారీ నగదు పంపిణీ, దానిపై ECI మౌనం… ఇవి స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ, సమాన అవకాశాల కల్పన సూత్రాలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

(వ్యాస రచయిత ప్రముఖ జర్నలిస్టు)

