ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలిచ్చాం
గ్రూప్ 2 కు ఎంపికైన వారికి నియామక పత్రాలు
పదేళ్ళూ నిరుద్యోగుల గురించి యోచించని గత ప్రభుత్వం
హైదరాబాద్, అక్టోబర్ 18 : విద్యార్థి, నిరుద్యోగ యువత ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాకారమైందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించిన వాళ్లు ఒక్కక్షణం కూడా నిరుద్యోగుల గురించి ఆలోచించలేదని ఆయన మండిపడ్డారు. అమరుల ఆశయ సాధనపై వాళ్లు ఆలోచన చేసి ఉంటే మీకు ఎనిమిదేళ్ల క్రితమే ఉద్యోగాలు వచ్చేవని ఆయన గ్రూప్ టుకు ఎంపికైన ఉద్యోలతో అన్నారు. గ్రూప్-2 ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. గత పాలకులు వాళ్ల కుటుంబంలో పదవులు భర్తీ చేసుకున్నారు తప్ప గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు.

పదిహేనేళ్లుగా గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కాకపోవడం కంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా అని సీఎం ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. గ్రూప్ 2 పరీక్షలలో ఎంపికైన వారికి నియామక పత్రాలను అందిస్తున్నామన్నారు.

మిమ్మల్ని తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములను చేసే బాధ్యత టీజీపీఎస్సీ తీసుకుందని సీఎం చెప్పారు. మీరు, మేము వేరు కాదు.. మీరే మేము.. మేమే మీరు అంటూ ఉద్యోగులలో ఉత్సాహాన్ని నింపారు. చీకటి రోజులు పోవాలి.. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని గ్రూప్ 1 విషయంలో సమస్యలన్నింటినీ ఎదుర్కొని నియామక పత్రాలు అందజేశామని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం తెలిపారు.

గత పాలకులు ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు కేసులు వేసి అక్రమ సంపాదనతో ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా వ్యవస్థతో మాపై బురద జల్లే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తమకు అలాంటి ఏ వ్యవస్థ లేదు.. మా వ్యవస్థనే మీరు.. ఆ వ్యవస్థలో మీరే మా కుటుంబ సభ్యులు అంటూ చెప్పారు. ఇప్పటి వరకు మీరు సామాన్యులు.. ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్ అని ప్రకటించారు. మీ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించి రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా పనిచేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. దేశంలోనే తెలంగాణను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలని కోరారు. రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ఇంతవాళ్లను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దని విజ్ఞప్తి చేశారు. నిస్సహాయులకు సహాయం చేయండి.. పేదలకు అండగా నిలవాలని సీఎం కోరారు.

గత పాలకుల పాపాల పుట్ట పగులుతోందన్నారు. వాళ్ల దోపిడీ గురించి మేం చెప్పడం కాదు..వాళ్ల కుటుంబ సభ్యులే చెబుతున్నారని చెప్పారు. హాస్టల్స్ లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే వాళ్లు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెంటిమెంట్ తో మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారనీ, అలాంటి వారి పట్ల మీరు జాగ్రత్తగ ఉండాలనీ సీఎం హెచ్చరించారు. ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా, ఫుడ్ పాయిజన్ తో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా చూడాలని కొత్తగా ఎంపికైన ఉద్యోగులకు పిలుపునిచ్చారు. సమర్ధవంతంగా పనిచేసి ఆదర్శంగా నిలవాలని వారికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.






