కన్నడ సంగీత దర్శక ముమ్మూర్తులలో ఒకరు జీ.కె.

0
192

సంగీత దర్శకుడు జీ.కె. వెంకటేశ్ జయంతి ఇవాళ
(రోచిష్మాన్, 9444012279)
దక్షిణ భారతదేశంలో వచ్చిన గొప్ప సంగీత దర్శకుల్లో ఒకరు జీ.కె. వెంకటేశ్(ష్). తెలుగు వారు జీ.కె. వెంకటేశ్(ష్); తెలుగు అభిరుచికి, తెలుగు రసజ్ఞతకు మించిన వారు జీ.కె. వెంకటేశ్(ష్); తెలుగు సంగీతజ్ఞతకు మించిన వారు జీ.కె. వెంకటేశ్(ష్); అందుకే తెలుగులో కన్నా కన్నడంలో గొప్ప సంగీత దర్శకుడిగా వినుతికెక్కారు జీ.కె. వెంకటేశ్(ష్).

కన్నడం సినిమా సంగీత దర్శక ముమ్మూర్తుల్లో ఇద్దరు విజయ భాస్కర్, రాజన్- నాగేంద్ర అయితే మరొకరు జీ.కె. వెంకటేశ్(ష్).

అంత ఇళైయరాజా (ఇళయరాజా కాదు) కూడా జీ.కె. వెంకటేశ్(ష్) ప్రభావితుడే. ఈ పరిణామం జీ.కె. వెంకటేశ్(ష్) గొప్పతనానికి ఋజువు.

పాశ్చాత్య, కర్ణాటక సంగీతాలను రంగరించి ప్రయోగించడంలో జీ.కె. వెంకటేశ్(ష్) శైలి ప్రత్యేకమైనది. పాశ్చాత్య సంగీతం ఆవశ్యకతను గుర్తించిన దక్షిణాది తొలిదశ సంగీత దర్శకుల్లో ముఖ్యులు జీ.కె. వెంకటేశ్(ష్).

దక్షిణ భారతదేశ సినిమాలో శాస్త్రీయ సంగీతాన్ని ఇళైయరాజాకు ముందు జీ.కె. వెంకటేశ్(ష్) ప్రయోగించినంత గొప్పగా, ప్రౌఢంగా మరో సంగీత దర్శకుడు ప్రయోగించినట్టు లేదు.

జీ.కె. వెంకటేశ్(ష్) సంగీతంలో 1966లో వచ్చిన కన్నడం సినిమా సంధ్యారాగ. హిందీ బసంత్ బహార్ సినిమా పాటల తరువాత మనదేశంలో శాస్త్రీయ సంగీత సాంద్రత పరంగా 80వ దశాబ్ది వరకూ ఈ సంధ్యారాగ సినిమా పాటలే గొప్పవి. (తెలుగుకు ఆవల లోకం లేదనుకునే, ఘంటసాల- పెండ్యాలకు అతీతమైన సంగీతం, గానం లేవు, ఉండవు అని అనే, అనుకునే తెలుగు మధ్యతరగతి మాంద్యంకు, జాడ్యంకు అతీతమైన ‘తెలివిడి’తో ఈ విషయంపై చర్చకు నేను సిద్ధం)

శాస్త్రీయ సంగీతంపరంగా శంకరాభరణం అనో, జయభేరి అనో అంటూ ‘తెలుగు మేధ’ నాపైకి ఉరికితే జాలిపడడం ఒక్కటే నేను చెయ్యగలిగింది. శంకరాభరణం, జయభేరి పాటలు గొప్ప పాటలు కావు అని నేను ఎంత మాత్రమూ అనడం లేదు. ఆ సినిమాల పాటలు గొప్పవే. శాస్త్రీయ సంగీత సాంద్రత విషయంగా సంధ్యారాగ సినిమా పాటలు నిర్ద్వంద్వంగా ఆ సినిమాల పాటలకన్నా చాల గొప్ప.

భీమ్‌సేన్ జోషీ … దేశంలో వచ్చిన మహోన్నతమైన శాస్త్రీయ సంగీత గాయకుడు భీమ్‌సేన్ జోషీ. మహోన్నతమైన నాదం ఆయనది (భీమ్‌సేన్ జోషీ కన్నడం వారు; మరాఠీ కాదు).
భీమ్‌సేన్ జోషీ ఈ సంధ్యారాగ సినిమాలో నాలుగు పాటలు పాడారు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఆ పాటల్లో ఏ మేరకు శాస్త్రీయ సంగీత సాంద్రత ఉంటుందో. ఇంకా ఈ సినిమాలో బాలమురళీకృష్ణ కూడా పాడారు.

ఘంటసాల, పెండ్యాల దగ్గర తెలుగు రసజ్ఞ మేధ కూరుకుపోవడంవల్ల తెలుగువ్యక్తి జీ.కె. వెంకటేష్ తెలుగులో కాకుండా ఒక గొప్ప సంగీత దర్శకుడిగా కన్నడంలో ప్రసిద్ధమయ్యారు!

గొప్ప సంగీతజ్ఞతతో తెలుగువ్యక్తి జీ.కె. వెంకటేశ్(ష్) చేసిన గొప్ప పాటలు కన్నడంలో ఎన్నో ఉన్నాయి. మొత్తం దక్షిణాదిలోనే గొప్ప పాటలు అనతగ్గ పాటలు చేశారు జీ.కె. వెంకటే(శ్)ష్.

పీ.బీ. శ్రీనివాస్, జీ.కె. వెంకటేశ్ ఇద్దరికీ 1960 దశాబ్దికే గజల్ సంగీతంపై సరైన, మేలైన అవగాహన ఉండేది. మేలైన అవగాహనతో జీ.కె. వెంకటేశ్ కన్నడంలో “ఒలవిన ప్రియ లతే అవళదే చింతే…” (కులవధు)
“బా తాయి భారతియే భావ భాగీరథియే…” (తాయికరుళు)
వంటి గజలియత్ పాటలు చేశారు.

జీ.కె. వెంకటేశ్ వీణ వాదనకారుడుగా సినిమాల్లోకి వచ్చారు. తమిళ్ష్, తెలుగు, కన్నడం భాషల్లో కొన్ని పాటలు కూడా పాడారు. తరం మారింది (1977) తెలుగు సినిమాలో “సల్లగాలి ఈస్తూ ఉంటే / కళ్లల్లోకి సూస్తూ ఉంటే…” పాటను జీ.కె. వెంకటేశ్ కడుచక్కగా పాడారు.

తెలుగు వ్యక్తి అయిన జీ.కె. వెంకటేశ్ కన్నడంలో రాణించడం, అంత ఇళైయరాజాను ప్రభావితం చెయ్యడం దేన్ని సూచిస్తోంది? ఈ ప్రశ్నకు జవాబును 2025లోనైనా తెలుసుకుని, ‘ఘంటసాల-పెండ్యాల మూస’ నుంచి బయటకు వచ్చి జీ.కె. వెంకటేశ్ వంటి మేలైన తెలుగు కళాకారుల సంగీతజ్ఞతను మధ్యతరగతి మాంద్యంను, జాడ్యంను పూర్తిగా త్యజించి ఇకనైనా ఆకళింపు చేసుకోవడం తెలుగుకు అవసరం.

కొన్ని జీ.కె. వెంకటేశ్ పాటలు

“రంగా… విట్ఠలా…” (భక్త కుంభార)

“ఆడోనా …” (కస్తూరి నివాస)

“కణ్ణంచిన ఈ మాతలి…” (దారి తప్పిద మగ)

తెలుగులో ఈ పాట “ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక…”

“ఇవళు యారు బల్లె యేను…” (గౌరి)

“సల్లగాలి ఈస్తూ ఉంటే…” (తరం మారింది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here