రాజధానిపై సజ్జల మాటల మర్మం: ఒక విశ్లేషణ
(నవీన్ పెద్దాడ)
వే 2 న్యూస్ సదస్సులో వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీ వైఖరిలో ఇది పెద్ద మార్పుగా కనిపిస్తోంది. “మళ్లీ అధికారంలోకి వస్తే అమరావతే ఏకైక రాజధాని. జగన్ అమరావతి నుంచే పాలిస్తారు” అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ మాటలు వింటే, వైఎస్సార్సీపీ మూడు రాజధానుల విధానాన్ని పూర్తిగా వదిలేసిందని అనిపిస్తుంది. ఇది నిజమైన మార్పేనా? లేక రాజకీయ అవసరం కోసం వేసిన పిల్లిమొగ్గనా? సజ్జల మాటలను లోతుగా పరిశీలిస్తే, అందులో స్పష్టత కంటే గందరగోళమే ఎక్కువ కనిపిస్తుంది. పైకి అమరావతిని అంగీకరించినట్లే ఉన్నా, లోపల పాత వ్యతిరేకతే ధ్వనించింది.
ప్రకటనలో మెలికలు
సజ్జల తన ప్రధాన ప్రకటనకు కొన్ని మెలికలు పెట్టారు. అమరావతిలో ఇప్పుడున్న భవనాలు చాలని, కొత్త నిర్మాణాలు అవసరం లేదని అన్నారు. విజయవాడ-గుంటూరు మధ్య అభివృద్ధి చేస్తే సరిపోతుందని, అదే మచిలీపట్నం దాకా విస్తరించి మెగా సిటీ అవుతుందని ఒక కొత్త సిద్ధాంతం చెప్పారు. లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ముంచలేమని, ఆర్థిక బాధ్యత ముఖ్యమని నొక్కిచెప్పారు.
ఇది అంగీకారం కాదు ఆత్మను వ్యతిరేకించడం
ఈ మాటల సారాంశం ఒక్కటే. రాజధానిగా అమరావతి పేరును అంగీకరిస్తారు, కానీ టీడీపీ ప్రభుత్వం ఊహించిన బృహత్తర ప్రణాళికను తిరస్కరిస్తారు. ఇది అమరావతిని అంగీకరించడం కాదు, దాని ఆత్మను వ్యతిరేకించడమే. ఇదే సదస్సులో సజ్జల చేసిన మరో వింత వాదన, తమ పార్టీ ఎప్పుడూ మూడు రాజధానులు అనలేదని, అదంతా “తప్పుడు ప్రచారం” అని చెప్పడం. ఇది పూర్తిగా చారిత్రక వాస్తవాలకు విరుద్ధం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు రాజధానుల కోసం ప్రత్యేకంగా చట్టం చేసింది. స్వయంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో, బయట ఎన్నోసార్లు ఆ విధానాన్ని సమర్థించారు. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మూడు రాజధానుల హామీ ఇచ్చారు. ఐదేళ్ల పాటు తమ అధికారిక విధానంగా ప్రచారం చేసుకున్న అంశాన్ని ఇప్పుడు తప్పుడు ప్రచారం అనడం, రాజకీయంగా ఎంత నష్టం జరిగిందో అంగీకరించడమే.
మార్పునకు కారణం ఏమిటి?
వైఎస్సార్సీపీ వైఖరిలో ఈ ఆకస్మిక మార్పుకు అసలు కారణం 2024 ఎన్నికల ఫలితాలే. పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితం కావడంతో , తమ విధానాలను పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు రాజధానుల విధానం ప్రజల్లోకి వెళ్లలేదని, రాజకీయంగా తమను దెబ్బతీసిందని పార్టీ గ్రహించింది. అందుకే ఇప్పుడు ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు నటిస్తూ, అమరావతిని అంగీకరిస్తున్నారు. ఇది ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడం కంటే, రాజకీయంగా మనుగడ సాగించడానికి వేసిన వ్యూహాత్మక ఎత్తుగడ. టీడీపీ చేతిలోని ప్రధాన అస్త్రాన్ని నిర్వీర్యం చేయాలనే తాపత్రయం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది.
మొత్తం మీద సజ్జల వ్యాఖ్యలను విశ్లేషిస్తే, ఇది మనస్ఫూర్తిగా వచ్చిన మార్పు కాదు. ఎన్నికల ఓటమి తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్న రాజకీయ నిర్ణయం.


