జూబిలీ హిల్స్ ఉప ఎన్నికపై బాధ్యులతో సీఎం రేవంత్
(కెవిఎస్ సుబ్రహ్మణ్యం)
తెలంగాణలోని జూబిలీ హిల్స్ శాసన సభ స్థానానికి ఉపఎన్నిక కోసం సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. ఎట్టి పరిస్థితులలోనూ అక్కడ నెగ్గాలనే కృతనిశ్చయాన్ని ప్రకటించారు. ఇందుకోసం ఆయన ప్రత్యేక కసరత్తును ప్రారంభించారు. ముందుగా నియోజకవర్గ పరిధిలోని డివిజన్ల ఇంచార్జ్ లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. వారందరికీ దిశా నిర్దేశం చేశారు.
ఉప ఎన్నికలో గెలుపు గురించి క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఆయన విపులంగా చర్చించారు.
ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రతీ ఒక్కరు కష్టపడి పని చేయాలనీ, ఇందుకు వీలు కల్పించేందుకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలనీ రేవంత్ సూచించారు. పోలింగ్ కేంద్రాల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసా ఓటర్లకు కల్పించాలని సీఎం వారిని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందన్న ప్రచారాన్ని బలంగా ప్రజలలోకి తీసుకుని వెళ్లన్నారు. అభ్యర్థి ఎంపిక విషయాన్ని ఏఐసీసీ చూసుకుంటుందనీ, ఆ అభ్యర్థి గెలుపునాకు పనిచేయాల్సిన గురుతర బాధ్యత అందరిపై ఉందన్నారు.
పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటానని అన్నప్పుడు ఆయన స్వరంలో హెచ్చరిక కనిపించింది. అందరూ జూబ్లీహిల్స్ లో పార్టీ గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. 2024 డిసెంబర్ ఎన్నికల్లో జూబిలీ హిల్స్ స్థానంలో బి.ఆర్.ఎస్. పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన మాగంటి గోపినాథ్, అనారోగ్యంతో మరణించిన కారణంగా ఇక్కడ ఉప ఎన్నిక వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

సీఎం రేవంత్ తో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, వివిధ డివిజన్ల ఇంచార్జులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న కార్పొరేషన్ చైర్మన్లు, ఈ సమావేశానికి హాజరయ్యారు.


