ఉషశ్రీ జ్ఞాపకాలు

0
178

ఉషశ్రీ గారి శతజయంతి సమారంభం ఆరంభమైంది. 2027 మార్చి 16 నుంచి 2028 మార్చి 16 వరకూ దీనిని నిర్వహించతలపెట్టాము. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఉషశ్రీ గారి జీవితంలోని ప్రధాన ఘాట్టాలను వరుసగా అందిస్తాము. ఇప్పుడు అందిస్తున్నది లహరి ఆడియో అందించిన మహాభారతం క్యాసెట్స్ ఆవిష్కర సభ వార్త. చదవండి…

విజయవాడ, 1986, ఏప్రిల్, 16

గంభీర గాత్రశ్రీ ‘ఉషశ్రీ’

విలువలు తరిగి, ఆర్భాటాలు పెరిగి, అంగుష్ఠమాత్రులు అఖండులుగా చలామణీ అవుతున్న ఈ రోజుల్లో… ఎక్కడో ఎప్పుడో ఒక్కచోట ఒక్క వెలుగు తళుక్కుమంటే, ప్రమాణాల కోసం ప్రాణాలు పణం పెట్టే పరమ ‘నైష్ఠికులు’ పులకించే క్షణాలు మరీ మరీ అరుదు.

సంగీతానికి, నేటి సాహిత్యానికి, ఇంకా మనం ఘనంగా చెప్పుకుంటున్న కళాశాఖలన్నింటికీ ఈ వాక్యంలో ఉన్న ప్రత్యక్షరం అద్భుతంగా అన్వయిస్తుంది, అవుననిపిస్తుంది. ‘స్వరం’ మీద అమోఘమైన అధికారం సంపాదించి, సభ ముందుకు సగర్వంగా రాగలిగే రోజులు గతించి, మరుగుజ్జులు మహాపండితులుగా చలామణి అవుతున్న రోజులివి. సాహిత్యంలో, తక్కిన రంగాలన్నింటిలోను ఇదే వరస. ప్రజ్ఞతో పనిలేదు. ప్రవేశం ఉందనిపించుకుంటే చాలు, భుజాలకెత్తుకుని, ఆకాశానికి ఎగరేసే ప్రచార తంత్రాంగానికి లోటు లేని రోజులివి.

అందుకే శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు అన్నారు… రేడియోలో ఇంకా జనాన్ని నమ్మించి అటువైపే నడిపించగల మంత్ర శక్తి గల ఇతర ప్రచార యంత్రాంగాల్లో ‘గుత్త’ ధోరణి తగదని,.. తప్పని.. అది మారాలని. వివిధభారతి విందామంటే రెండు మూడు గొంతులు. లలిత సంగీతంలో వైవిధ్యం ఉంటుందనుకుంటే అక్కడా మూస గాత్రాల తంతు.. ఇది సైతం మారి తీరాలని… సంగీత సాహిత్యాల్లో తలపండిన ఆ ‘తెలుగు పండు’ ఖండితంగా అనేసిన మాటలివి…

ఇంతకీ.. శ్రీ రజనీ మనసులో మాట అలా బయటపెట్టిన సమయం..కృష్ణా తీరాన ఓ చల్లని సాయంత్రం. సందర్భం… ఆరు కోట్ల ఆంధ్రులకు అలవాటైన గాత్రశ్రీ ఉషశ్రీ భారతం క్యాసెట్ల ఆవిష్కరణోత్సవం.

ఆ సాయంత్రం శ్రీ రజని మాటల్లో ఆవేదన ధ్వనించింది. నిజం వినిపించింది. అందుకే అన్నారాయన… రికార్డింగ్‌ కంపెనీలు ఇద్దరికో ముగ్గురికో ముడిపడి, మరుగున పడిన మాణిక్యాలను మరచిపోరాదని, పౌరాణిక ప్రముఖులను, పౌరాణిక నాటకాలను క్యాసెట్లలో పదిలపరచాలని… ప్రజ్ఞ గల ఉషశ్రీ వంటి అరుదైన గాత్ర శుద్ధి, నిశిత బుద్ధి గల తెలుగు ప్రముఖులను నెత్తిన పెట్టుకోవాలని…

తాను ఆకాశవాణిలో ఉన్నప్పుడు ఉషశ్రీ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించినందుకు ఇప్పుడు తాను ఎంతో గర్విస్తున్నానన్నారు. ధర్మసూక్ష్మాలు ఎన్నో నిక్షిప్తమై ఉన్న మహాభారత కథను సామాన్యులు సైతం విని, ఆ మహేతిహాసాలలోని సందేశాన్ని గ్రహించగల చక్కని శైలిలో చెప్పిన ఉషశ్రీ భారతాన్ని శ్లాఘిస్తూ బెంగుళూరు సంస్థ ఆడియో విజన్‌ రూపొందించిన క్యాసెట్లను ఆవిష్కరించి, వేదికను అలంకరించిన పెద్దలకు అందించారు.

ప్రముఖ పాత్రికేయుడు, విశాలాంధ్ర సంపాదకుడు శ్రీ సి. రాఘవాచారి అధ్యక్షుడుగా సభకు సారథ్యం వహించారు. నమ్మిన విషయాన్ని ఇంత చక్కగా జనం చెవుల్లో నూరిపోసే కిటుకు,ప్రచార ప్రక్రియల్లో ఆరితేరిన వామ పక్షాలకే తెలియలేదని అంగీకరించారు. అది తెలిసి అందరినీ తన వైపు తిప్పుకుంటున్న ఉషశ్రీ ని అభినందించారు. మతం, నమ్మకం మాట అటుంచి మరో దృష్టితో చూస్తే, మహాభారత కథలోని నీతి గొప్పదన్నారు. భారతానువాదం ఏనాడో ఒక్క తెలుగులోనే జరిగినందుకు తెలుగులు గర్వించాలన్నారు. కాని, ప్రత్యేక అతిథిగా వేదికను అలంకరించిన శ్రీరామస్వామి సంపత్‌ (ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అసిస్టెంట్‌ ఎడిటర్‌) ‘‘మా తమిళంలో విల్లు భారతం ఉందండోయ్‌’’ అన్నారు. అయినా సుబ్రహ్మణ్య భారతి ఎంతో అభిమానించిన (సుందర తెలుంగు) లో వెలువడిన భారతమే మిన్న’ అన్నారు. అందుకే తెలుగు భాషకు గోదావరిలా సాగే చక్కని తెలుగు వచనంలో భారతాన్ని వినిపించిన ఉషశ్రీకి చేతులు జోడిస్తున్నామన్నారు.

పూర్వాశ్రమంలో గీర్వాణాంధ్రాలు ఔపోసన పట్టిన లక్ష్మణ యతీంద్రులు ఉషశ్రీ గాత్రం భద్రపరచిన పేటికల తొలి కానుకను స్వీకరించి, నిరక్షరాస్యుడు సైతం నిలబడి వినేలా భారతాన్ని వినిపించిన ఉషశ్రీ ప్రజ్ఞను శ్లాఘించి, మంగళాశీస్సులు అనుగ్రహించారు. ఆ తరవాత కొన్ని క్షణాలు నిశ్శబ్దం. ఆపై ఉషశ్రీ సమాధానం. సభకు నమస్కరించి, తనను ‘‘ఇంత వాడిని’’ చేసిన శ్రీ రజనీకి చేతులు జోడించారు. ఎప్పుడో తాను కాలేజీలో చదివే రోజుల్లో తొలిసారి తాను విన్న శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ ప్రసంగం తనను మార్చివేసిందన్నారు. తరవాత స్వయంకృషితో తాను సాధించిన ‘‘గాత్ర సంస్కారానికి’’ ఇదే కారణమన్నారు. ప్రతి తెలుగింట ఉండవలసిన మహాభారత కథను ఇలా వచనంలో క్యాసెట్లో బంధించాలన్న ఆలోచన కలిగిన బెంగుళూరు ఆడియో విజన్‌ సంస్థను అభినందించారు. తెలుగు అభిమానాన్ని అవనత శిరస్కుడై స్వీకరిస్తున్నానన్నారు. ఇలాగే మున్ముందు ఇంకా ఇతిహాస సేవ చేస్తూనే ఉంటానన్నారు. (ఈ వార్త రచయిత పేరు చక్రపాణి)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here