పద్యం ఆ గళంలో హృద్యం
ఘంటసాల గళంతోనే పద్యాలకు అందం
(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 9440103345)
‘పద్యం చచ్చిపోయిందని ఆనందంతో చిందులు త్రొక్కే పరమ మూర్ఖులు బయలుదేరారు ఈనాడు. ఈ పద్య ద్వేషం అన్న ద్వేషం వలె అనారోగ్యకర మైనది. పద్యమైనా, గేయమైనా, వచనమైనా కవిత్వమనే పదార్థం దానిలో ఉంటే అది తప్పక పది కాలాల పాటు బ్రతుకుతుంది. గంగాయమునా గోదావరీ కావేరీ నదులలో నీళ్లున్నంతవరకూ, నన్నయ తిక్కన పోతన్నల ఆత్మలు తెలుగు హృదయాలను ఆవహించి ఉన్నంత వరకూ హృద్యమూ అనవద్యమూ సహృదయైక వేద్యమూ అయిన పద్యం బ్రతికే ఉంటుంది’ అన్నారు కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి. పద్యం పట్ల నిరాదరణపై వారి ఆవేదన అది. ఆయన చెప్పిన నదులు, కవుల ఉపమానాల జాబితాలో ఘంటసాల గాత్రాన్నీ జోడించడంలో అతిశయం లేదని ఆయన అభిమానులు భావిస్తారు. పద్య పఠనానికి చిరునామాగా మారిన ఘంటసాల గాత్రంలానే పద్యమూ నిత్య నూతనం. అనేక కవుల పద్యాలను గానం చేసిన ఆయనకు మొదటి అవకాశం దక్కింది పద్యాలాపనతోనే అని ఆయన 1970వ దశకంలో ‘ఆకాశవాణి’కి ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖీలో చెప్పారు. ‘నగుమోమునకు నిశానాథ బింబముజోడు….’పద్యం గ్రామఫోన్ రికార్డు మొదట వచ్చిందని తెలిపారు.
వినూత్న ప్రయోగానికి యత్నం
‘ఏ సాహిత్యంలోనూ లేని అపురూప సంపద పద్యం. దీని పఠనంలో వినూత్న పద్ధతి ప్రవేశపెట్టాలని ప్రయత్నించాను’అని చెప్పేవారు ఘంటసాల. అంతవరకు పద్యాలాపన నాటక ఫక్కీలోనే సాగేది. ఆ స్థానంలో కొత్త పంథా ప్రవేశ పెట్టాలని ప్రయత్నించారు. అప్పటి ప్రేక్షకాభిరుచిని బట్టి రంగస్థల పద్య ఆలపన ఉండేదని, నాటకాలలో పద్యాల ఆలాపన రీతి తీసివేయదగ్గది కాకపోయినప్పటికీ ఆ ప్రక్రియలో నూతనత్వాన్ని పరిచయం చేయాలన్నది తన ప్రయత్నమని ఘంటసాల చెప్పేవారు. దానిని సాధించి చూపారు కూడా. రఘురామయ్య, సూరిబాబు లాంటి రంగస్థల, వెండితెర నట ప్రముఖులు కూడా ఆయన బాణీకి మద్దతు పలికారు. నాటి నుంచి చాలా మంది రంగస్థల నటులు ఆయన బాణీని అనుసరించేందుకు ప్రయత్నించారు, ప్రయత్నిస్తున్నారు. హరికథలలోనూ ఘంటసాల శైలిలో పద్యాలు పాడాలన్న ప్రయత్నం అప్రయత్నంగానే మొదలైంది. ఘంటసాలతో ప్రతినాయక పాత్రలకు పద్యాలు డిన మాధవపెద్ది సత్యం స్మరణీయులు.ఇతర నటుల సంగతి అటుంచితే ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావు పోటాపోటీగా ప్రదర్శించిన నటనా విన్యాసాన్ని ఆ గాయకద్వయం గళాల్లోని పద్యాలు మహోన్నతస్థాయికి చేర్చాయి.
కవుల పద్యాలు ఘంటసాల గళంలో అమృతధారలా…
కరుణశ్రీ, జాషువా తదితర కవుల లలిత పదాల పద్యాల మాదిరిగానే తిక్కన, శ్రీనాథుడు కవులు శబ్దబంధుర పద్యాలనూ సునాయాసంగా ఆలపించిన గళం ఘంటసాలది. ఉదాహరణకు, ‘పుష్పవిలాపం‘ కావ్యాన్నే పరిశీలిస్తే…రచనలో పాదం విరిచినట్టి వైవిధ్యాన్నే గాత్రంలోనూ కనబరిచారు. ఈ తన ఖండిక పాటగా మారిందంటే అది కేవలం ఘంటసాల జోడించిన గాత్రాభినయం వల్లనే అని కరుణశ్రీ అనేవారు. ‘నేనొక పూలమొక్కకడ నిల్చి…’ అని మొదలైన ఈ కావ్యంలో ‘ఎందుకయ్యా..మేము నీకేం అపకారం చేశాం?’ అంటూ పూలబాలలు అమాయకంగా వేసే ప్రశ్నలో ‘బాలభాష ’ కనిపిస్తుందని విశ్లేషకులు అంటారు.అలాగే ‘కాంచనమయ వేదికా కనకత్కేతనోజ్జ్వల….’ (నర్తనశాల)తిక్కన పద్యం అంతే గభీరంగా ఆవిష్కృతమైంది. ‘నను భవదీయ దాసుని మనంబున…’ పద్యాన్ని., ‘పరిత్రాణాయసాధూనాం.., కస్తూరి తిలకం’ లాంటి శ్లోకాలను ఒక్కొక్క చిత్రంలో ఒక్కొక్కలా ఆలపించడం ఆ గాత్రం ప్రత్యేకత. ఆయా నటుల హావభావాలకు, స్థాయికి తగినట్లుగా, పెదవుల కదలికకు అనుగుణంగా పాడడం మరో ప్రత్యేకత. ఒకే సన్నివేశంలో నటించిన నాటి అగ్ర నటులకు తగినట్లుగా (శ్రీకృష్ణార్జున యుద్ధం, శ్రీకృష్ణ తులా భారం, ప్రమీలార్జునీయం, వీరాభిమన్యు) పాడిన సంగతి ప్రేక్షక శ్రోతలకు తెలిసిందే.
ఆయన పాడిన వందలాది పద్యాలలో ప్రతిదీ సుధామధురమే. కళాకారుడు రసవేత్త అయితేనే ఇలాంటి వి సాధ్యమని అంటారు.
అది ఆయన సాధికారిత…
ఇతర సంగీత దర్శకులు తమ చిత్రాలలోని పద్యాలకు బాణీలు కట్టే అవకాశం ఘంటసాల వారికే ఇచ్చేవారంటే ఈ విషయంలో ఆయనకు గల సాధికారిత అవగతమవుతుంది. వారి సూచనలను మన్నిస్తూనే బాణీలు కట్టేవారట.ఇతర సంగీత దర్శకులతో ఎంతో సఖ్యంగా ఉండేవారని, వారి మధ్య ఆప్యాయతలే తప్ప అసూయలు లేవని సావిత్రీ ఘంటసాల చెబుతారు.
ఘంటసాల యుగంలో సాంఘిక చిత్రాలలోనూ పద్యాలు చోటు చేసుకున్నాయి. అవి కథాకథనానికి ఏ మేరకు ఉపకరించాయన్నది అటుంచితే, ప్రేక్షక, శ్రోతలను విశేషంగా అలరించాయి. నేటికీ అలరిస్తున్నాయి.పౌరాణిక చిత్రాలలోనే కాకుండా సాంఘిక చిత్రాలలోని అంతర్నాటకాలలోనూ ‘కంఠ’శాల పద్య కుసుమాలను విరబూయించింది.
ఆయన భువిని వీడడానికి కొన్నేళ్ల ముందు నుంచే పౌరాణిక చిత్రాల నిర్మాణం నెమ్మదించగా ఆయన తరువాత అవి మరింత తగ్గాయి. వచ్చిన ఒకటి, అర చిత్రాలలోనూ ఆయన గాత్ర లోటు, ముఖ్యంగా పద్యాలు, శ్లోకాల విషయంలో స్పష్టంగా కనిపించింది.ఆయన అమరులైన తరువాత వచ్చిన ఒక చిత్రం కురుక్షేత్రం యుద్ధం సన్నివేశంలో ఆయన పాడిన ‘గీత’శ్లోకాలను వాడుకున్నారు.వర్ధమాన గాయకులు తమ శక్తిమేరకు పద్యాలు పాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన గాన మాధుర్యానికి అలవాటు పడిన శ్రోతలు సరిపెట్టుకోలేకపోయారనడంలో సందేహం లేదు.
గాత్రలోటుతో పౌరాణికాలు తగ్గుముఖం
పౌరాణిక చిత్రాల నిర్మాణం వ్యయంతో కూడుకున్నది కావడంతో పాటు ఘంటసాల పద్యాలు లేని చిత్రాలను ఊహించుకోలేమని ‘పౌరాణిక చిత్ర బ్రహ్మ’ కమలాకర కామేశ్వరరావు, ‘మధురగళం’ చివరి దశలో ఎక్కువ పద్యాలు ఆలపించిన ‘శ్రీకృష్ణాంజనేయయుద్ధం’ చిత్ర దర్శకుడు సి.ఎస్.రావు వ్యాఖ్యానిం చడం గమనార్హం. (వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్ట్)