వంశమూ, కులమూ ఎందుకు?

0
199

అన్నమయ్య అన్నది-23
(రోచిష్మాన్, 9444012279)

“తలమేల కులమేల తపమే కారణము
ఎలమి హరిదాసులు యే జాతియైన నేమి?”

తరమూ (వంశమూ), కులమూ ఎందుకు? తపస్సు మాత్రమే కారణం. మనోవికాసం (ఎలమి) ఉన్న హరిభక్తులు ఏ కులమైతే ఏమిటి? అంటూ పండిన మదితో అన్నమయ్య మహోన్నతమైన సంకీర్తన చేస్తున్నారు. ఆలకించడం, అవగతం చేసుకోవడం మన బాధ్యత.

ప్రముఖ హరిభక్తులైన 12 మంది ఆళ్ష్‌వార్‌లలో
పెరియ ఆళ్ష్‌వార్‌, తొండరడిప్పొడి ఆళ్ష్‌వార్‌ (విప్రనారాయణ), మదురకవి ఆళ్ష్‌వార్‌ ఈ ముగ్గురు మాత్రమే బ్రాహ్మణులు. ఆణ్డాళ్ (ఆండాళ్ అనడం సరికాదు) పెరియ ఆళ్ష్‌వార్‌ పెంపుడు కూతురు. పేయ్ ఆళ్ష్‌వార్‌, బూదత్తు ఆళ్ష్‌వార్‌, పొదిగై ఆళ్ష్‌వార్‌ ఈ నలుగురూ ఏ కులం వాళ్లో తెలియదు. కులసేగర (కులశేఖర) ఆళ్ష్‌వార్‌, తిరుమఙ్‌గై (తిరుమంగై‌) ఆళ్ష్‌వార్‌, నమ్మ ఆళ్ష్‌వార్‌ ఈ ముగ్గరూ బ్రాహ్మణేతరులు. తిరుప్పాణ ఆళ్ష్‌వార్‌, తిరుమళ్షిసై ఆళ్ష్‌వార్‌ ఈ ఇద్దఱూ పంచములు అని అనబడిన వాళ్లు. ఇంకా శివభక్తులైన 63 మంది నాయన్మార్‌లలో పలువురు బ్రాహ్మణేతరులు, నిమ్న వర్గాలు అని అనబడిన వాళ్లు ఉన్నారు. భక్త కుంభార, కుమ్మరి మొల్ల వంటి ఎందఱో వేర్వేఱు తరగతుల వారు హరిభక్తులై‌ వాసికెక్కారు.

విల్లిపుత్తూర్ ఆళ్ష్‌వార్‌ (ఈయన 12 మంది ఆళ్ష్‌వార్‌లలో ఒకరు కాదు; విల్లిపుత్తూర్ ఆళ్ష్‌వార్‌ అని పిలవబడ్డారు అంతే; ఈయన ఒక తమిళ్ష్ వైష్ణవ పండితుడు.) ఒక సందర్భంలో “చదువుకున్న వాళ్ల, ఆరోగ్యవంతులైన కన్యల, దానం చేసే చేతులు ఉన్న వాళ్ల, వీరులుగా ఎదిగిన వాళ్ల, జ్ఞాన చరితుల, మంచివాళ్ల కులం ఒకటే” అని చెప్పారు.

తరం, కులం‌‌ ఎందుకు అని ఇక్కడ అడిగిన అన్నమయ్య ఇతర సందర్భాల్లో “విజాతులన్నియు వృథా, వృథా” ‌అనీ, “ఏ కులజుఁడేమి యెవ్వడైననేమి / ఆఁకడ నాతఁడే హరి నెఱిఁగినవాఁడు” అనీ, “ఎక్కువ కులజుఁడైన హీన కులజుఁడైన / నిక్కమెఱిఁగిన మహానిత్యుఁడే ఘనుఁడు” అనీ అన్నారు‌.

“కాకమువల్లఁ బుట్టదా ఘనమైన యశ్వత్థము
దాకొని గుల్లలోఁ బుట్టదా ముత్తెము
చౌకైన విషలతనె జన్మించదా నిర్విషము
ఏ కడ మహానుభావులెందు పుట్టరేమి”

కాకివల్ల పెద్ద రావిచెట్టు పుట్టదా; గుల్లలో ముత్యం పుట్టదా; తిరస్కరించబడ్డ (చౌకైన) విషపూరితమైన తీగలలోనే విషం లేనిది పుట్టదా; మహానుభావులు ఏ‌ స్థానంలో ఎక్కడ పుడితే ఏమిటి? అంటూ ప్రశ్నలలోనే సత్యాల సమాధానాలను తెలియజేస్తున్నారు అన్నమయ్య.

కాకి రావి పండును తిని అందులోని‌ గింజల్ని జీర్ణించుకోలేక రెట్టలో వదిలేస్తుంది. ఆ‌ గింజలవల్ల రావిచెట్టు మొలకెత్తుతుంది. ఆ విషయాన్నే చెబుతున్నారు ఇక్కడ అన్నమయ్య.‌ సహజంగా జరిగే ఇలాంటి సంఘటనల్ని పరిశీలించి వాటిని తీసుకుని కవిత్వం‌ చెప్పడం అన్నమయ్య గొప్పతనం.

మామూలు గుల్లలోనే విలువైన ముత్యం పుడుతుంది. కొన్ని రకాల చెట్లు, వాటి తీగలు విష పూరితమైనవి. ఉదాహరణకు విషమంగలపు‌ చెట్టు (Crinum asiaticum or poison bulb). దీన్ని లక్ష్మీనారాయణ చెట్టు అనీ, కేసరీ చెట్టు అనీ, విషముంగలి అనీ అంటారు. ఇది విషకరమైనదైనా దీని ఆకులు మృదువుగా ఉంటాయి; దీని పువ్వులు తెల్లగా అందంగా ఉంటాయి‌. ఆ ఆకులు, పువ్వులు విషం లేనివి‌. పైగా ఆ ఆకులు ఔషధగుణాలు కలిగినవి. రాచపుళ్లను, గాయాల్ని , విషంవల్ల కలిగే పరిణామాల్ని హరిస్తాయి. ఎలాంటి మూలాల నుండైనా మహానుభావులు పుడతారు అన్న చారిత్రిక సత్యాన్ని చెబుతున్నారు‌ అన్నమయ్య.

“చిడిపి రాళ్లఁ బుట్టవా చెలువైన వజ్రములు
పుడమి నీగలవల్లఁ బుట్టదా తేనె
వెడఁగు బిల్లి మేనను వెళ్ళదాయెనా జవ్వాది
ఉడివోని పుణ్యులెందు నుదయించరేమి”

అల్పమైన‌ (చిడిపి) రాళ్లలో పుట్టవా కాంతివంతమైన (చెలువైన) వజ్రాలు; భువిలో‌ ఈగలవల్ల పుట్టదా తేనె; వికారమైన (వెడగు) పిల్లి శరీరం నుంచి బయటకు రాదా జవ్వాది; మొక్కపోని (ఉడివోని) పుణ్యవంతులు ఏ చోట ఉదయిస్తే ఏమిటి? అంటూ తాను చెబుతున్నదాన్ని మఱింత వెడల్పు చేస్తున్నారు అన్నమయ్య.

వజ్రం కూడా రాయే. వజ్రం అల్పమైన రాళ్లలోంచే వస్తుంది. విలువైన, ఘనమైన వజ్రంలోనూ విలువలేని నల్లసీసం (graphite) రాయిలోనూ ఉండే కర్బనం (carbon) అన్న మూలకం ఒకటే. కానీ వజ్రంలో ఉండే కర్బన‌ భౌతిక కణాల (carban atoms) నిర్మాణం వజ్రాన్ని దృఢమైనదిగానూ, ఘనమైనదిగానూ చేస్తుంది.

తేనె ఈగలవల్లే సమకూరుతుంది కదా? సుగంధ ద్రవ్యం జవ్వాది (జవ్వాదు) ఒక‌ జాతి పిల్లి (పునుగు పిల్లి) శరీరం నుంచి పుడుతుంది. ఈ జాతి పిల్లి బొడ్డు ప్రదేశంలో ఉండే రసగ్రంధి (gland)లో‌ ద్రవాలు ఊరి నిండిపోయినప్పుడు చిరాకుతో చెట్ల కొమ్మలకేసి రుద్దుకుంటుంది. అలా రుద్దుకున్నప్పుడు‌ పిల్లి శరీరం నుంచి కారే ద్రవమే జవ్వాది. మొక్కపోని పుణ్యవంతులు ఎక్కడ ఉదయిస్తే ఏమిటి? అంటూ ఎక్కడైనా ఉదయిస్తారు అన్న తెలివిడినిస్తున్నారు అన్నమయ్య.

“పంకములోఁ బుట్టదా పరిమళపు దామర
పొంకపుఁ గీటకములందు పుట్టదా పట్టు
కొంకక శ్రీవేంకటేశుఁ గొలిచిన దాసులు
సంకలేని జ్ఞానులెందు జనియించిరేమి?”

బురదలో పుట్టదా పరిమళించే తామరపువ్వు; మిడిసి పడే (పొంకపు) కీటకాలనుంచి పుట్టదా పట్టు; వక్రించకుండా (కొంకక) శ్రీవేంకటేశ్వరుణ్ణి కొలిచిన దాసులు దుఃఖం లేని (సంకలేని) జ్ఞానులు. వాళ్లు ఎక్కడ జన్మిస్తే ఏమిటి? అంటూ ముగించారు అన్నమయ్య.

వక్రించకుండా శ్రీ వేంకటేశ్వరుణ్ణి కొలిచిన దాసులు దుఃఖం లేని జ్ఞానులు అని అనడం గొప్పగా ఉంది. భక్తిలో వక్రత ఉండకూడదు. భక్తిలో వక్రతలేని వాళ్లు దుఃఖం లేని జ్ఞానులౌతారు. భక్త కుంభార, కుమ్మరి మొల్ల, తుకారాం, ఆళ్ష్‌వార్‌లు, నాయన్మార్‌లు,
రామకృష్ణ పరమ హంస, రాఘవేంద్ర, రమణ మహర్షి వంటి వాళ్లు వక్రతలేని భక్తితో దుఃఖం లేని జ్ఞానులయ్యారు.

ఉన్నతమైన భక్తులు, ఎక్కువ శాతం మంది భక్తులు గొప్ప వంశమూ, గొప్ప కులమూ నుంచి కాకుండా సామాన్యమైన మూలాల నుంచి, నిమ్న అనబడిన మూలాల నుంచి పైకొచ్చి చరితార్థులయ్యారు. అన్నమయ్య‌ ఈ వాస్తవాన్ని సరైన పదాల కూర్పుతో, ఆలోచింపజేసే భావాల పేర్పుతో ఉత్కృష్టంగా చెప్పారు. అన్నమయ్య చింతన పరిధి బహు విశాలమైనది. ఎన్నో విషయాలతో, ఎంతో అవగాహనతో ఎన్నెన్నో , ఎంతెంతో‌ రాశారు‌ అన్నమయ్య.

‘వంశం, కులం ఎందుకు? కావాల్సింది భక్తి, జ్ఞానం’ అని నినదిస్తూ అలరారుతూ ఉన్నది ఇలా అన్నమయ్య అన్నది.


(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here