గుంటూరు ఐటీసీ వెల్కం హోటల్
ప్రారంభించిన సీఎం వైయస్.జగన్
గుంటూరు, జనవరి 12: ఐటీసీ భాగస్వామ్యం కారణంగా ఏపీ వ్యవసాయ రంగంలో దూసుకుపోతున్నామని ఏపీ సీఎం వైయస్ జగన్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఐటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పురీకి ధన్యవాదాలు తెలిపారు.
గుంటూరు ఐటీసీ భాగస్వామ్యంతో నిర్మించిన వెల్కమ్ ఫైవ్‌స్టార్ హొల్ను సీఎం బుధవారం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏ గ్రామానికి వెళ్లినా మూడు రంగాల్లో సమూలమైన మార్పులు చూస్తామనీ, విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఈ మార్పులు కనిపిస్తున్నాయనీ తెలిపారు.
వ్యవసాయ రంగంలో రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. 10,700 ఆర్బీకేలు విత్తనం నుంచి విక్రయం వరకు రైతులను చేయిపట్టుకుని నడిపిస్తున్నాయని చెప్పారు. వ్యవసాయ రంగంలో సమూల మార్పులే ఆర్బీకేల ప్రధాన లక్ష్యమని తెలిపారు.
గ్రామస్ధాయిలో వ్యవసాయరంగంలో ఏ రకమైన మౌలిక సదుపాయాలను ప్రైమరీ ప్రాససింగ్ లెవల్లో కల్పించామన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ స్ధాయిలో సెకండరీ ప్రాసెసింగ్ లెవల్లో ఏర్పాటు కానున్నాయని సీఎం తెలిపారు.
ఈ విషయంలో ఐటీసీ కూడా భాగస్వామి అయ్యి కీలకమైన పాత్ర పోషించనుందని జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు.
గుంటూరు పట్టణంలో ఫైవ్ స్టార్ హోటల్ రావడం చాలా మంచి పరిణామమన్నారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో తొలి లీడ్ ప్లాటినం సర్టిఫైడ్ ఫైవ్‌స్టార్ హోటల్ కూడా కావడం హర్షణీయమని తెలిపారు.
ఐటీసీతో పర్యాటక, వ్యవసాయ, పుడ్ ప్రాససింగ్ రంగాల్లో భాగస్వామ్యం దీర్ఘకాలం కొనసాగుతుందని నమ్ముతున్నట్లు సీఎం జగన్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, గృహనిర్మాణశాఖమంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.