ఎవరూ లేకున్నా ప్రత్యేక సంచిక
దీని వెనుక డి.ఎన్. ప్రసాద్ కృషి
బాలయోగి మరణించి 23 ఏళ్ళు
నేను – ఈనాడు – 40
(కూచిమంచి వి.ఎస్. సుబ్రహ్మణ్యం)

2002 మార్చి 3 వ తేదీ…. ఉదయం పదిగంటల ప్రాంతంలో సంభవించిన దుర్ఘటన యావద్దేశాన్నీ షాక్ కు గురిచేసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని ఒక కాల్వలో ఒక హెలికాప్టర్ కుప్ప కూలింది. అందులో ఉన్న వారందరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతులలో అప్పటి లోక్ సభ స్పీకర్ కూడా ఉన్నారు. ఆయనే జి.ఎం.సి. బాలయోగి. అమలాపురం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఘటనతో కోనసీమ తల్లడిల్లిపోయింది. సొంత బిడ్డను కోల్పోయిన తల్లిలా రోదించింది.

ఆ సమయంలో నేను హైదరాబాద్ ఈనాడు రీజినల్ డెస్కులో పనిచేస్తున్నాను. అప్పుడు మా డెస్కుకు ఇంచార్జి బి. సర్వేశ్వరరావు. అంతకు ముందు రోజు తెల్లవారుఝామున ఇంటికివచ్చిన తరవాత… మరుసటి రోజు ఉదయం పనిమీద సికింద్రాబాదులో ఉన్న మా మేనమామ గారి ఇంటికి వెళ్లాను. కాసేపటి తరవాత యధాలాపంగా టీవీలో వార్తలు పెట్టాను. పెద్ద పెద్ద అక్షరాలతో బాలయోగి దుర్మరణం వార్త వస్తోంది. ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది. ఏమి చేయాలో పాలుపోలేదు. వెంటనే ఇంటికి బయలుదేరి, అక్కడి నుంచి ఆఫీసుకు వెళ్ళాను.
అక్కడి దృశ్యం చూసి కొంత భయం వేసింది.. జనరల్ డెస్కులో ఎప్పుడూ కనిపించని పెద్దస్థాయి వ్యక్తులు కనిపించారు. వారి ఎదురుగా బాలయోగి దుర్మరణం వార్త ప్రచురించిన స్పెషల్ ఉంది. నల్లని అక్షరాలతో బాలయోగి ఫోటో కొట్టొచ్చినట్టు ముద్రించి ఉంది. పక్కనే… హెలికాఫ్టర్ కుప్పకూలిన బొమ్మ ఉంది. కొద్దిసేపు ఆశ్చర్యం వేసింది. డెస్కులో ఎవరూ లేకుండా ఇదెలా సాధ్యమైంది? అనే ప్రశ్న.

కాసేపటి తరవాత తెలిసింది దుర్ఘటనకు సంబంధించిన స్పెషల్ వచ్చేలా పనిచేసింది అప్పటి నెట్ వర్క్ ఇంచార్జి డి.ఎన్. ప్రసాద్. ఆయన చకచకా పనిచేసి స్పెషల్ ఎడిషన్ తెచ్చారు. అప్పుడే నాకు చైర్మన్ రామోజీ గారు అన్న మాట గుర్తొచ్చింది. నావల్లే ఈనాడు బయటికి వస్తోందని అనుకోవద్దు. నేను లేకున్నా అది ఆగదు. ఒకరు లేకపోతే పత్రిక ఆగదు… అనేవారు. అది ఈ సందర్భంలో మననం చేసుకున్నాను. ఆరోజుల్లో మొబైల్ ఫోన్లు లేవు. ల్యాండ్ లైన్లు మాత్రమే ఉండేవి. చిన్న జీతాలతో బతుకులు వెళ్లదీసే మాబోటి చిన్న ఉద్యోగులు వాటి గురించి అప్పట్లో ఆలోచించేవాళ్ళం కూడా కాదు.
డి.ఎన్. ప్రసాద్ ఒకప్పుడు రిపోర్టర్ గా చేశారు. తర్వాత మేనేజర్ అయ్యారు. అక్కడి నుంచి ఎం.డి. కిరణ్ గారి పేషీకి అనుబంధంగా రిపోర్టింగ్ నెట్ వర్క్ ను సమన్వయం చేసేవారు. ఇప్పుడు ఈనాడుకు తెలంగాణ ఎడిటర్ గా ఉన్నారు. ఆయన డ్యూటీ టైమింగ్స్ ఉదయం 11 నుంచి మొదలవుతాయి. దుర్ఘటన వార్త తెలిసిన వెంటనే ఆయన అందుబాటులో (అంతే ఆఫీస్ కి దగ్గరలో ఉన్న ఎడిటోరియల్ సిబ్బంది) ఉన్న వారిని రప్పించుకున్నారు. తూర్పు గోదావరి డెస్కుతో సమన్వయం చేసుకుంటూ స్పెషల్ ఎడిషన్ ను తీసుకొచ్చారు. ఆ పని వేరే ఏ పత్రికా చెయ్యలేదు. అది ఈనాడు పవర్. వార్త తెలిసి వెంటనే ఆఫీసుకి రానివారికి అక్షతలు ఎలాగూ పడ్డాయనుకోండి. అది ఇక్కడ అప్రస్తుతం.
ఎంత కాదనుకున్నా ఆ పనిలో నేను భాగస్తుడిని కాలేకపోయానే అనే అంశం ఇప్పటికీ మనసులో పీకుతూనే ఉంటుంది. సరే తదుపరి పూర్తి వివరాలతో మరుసటి రోజు పత్రికను ఇచ్చాము. కొత్తగా జర్నలిజం ఫీల్డులోకి వచ్చేవారికి ఇదొక పాఠంలా ఉపయోగపడుతుంది. బాలయోగి మరణించి 23 ఏళ్ళయినప్పటికీ ఆయన జ్ఞాపకాలు కోనసీమలో సజీవంగా ఉన్నాయి. ఆయన చేసిన పనులు చూసిన ప్రతి ఒక్కరూ బాలయోగిని గుర్తుచేసుకుంటున్నారు.
ఆయన చేసిన అభివృద్ధి పనులు ఒక ఎత్తయితే… వాజపేయి ప్రభుత్వంపై అవిశ్వాసం సందర్భంగా బాలయోగి వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అప్పటి ఒరిస్సా ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ ఓటు వెయ్యడానికి వీలు లేదు అని బాలయోగి రూలింగ్ ఇచ్చివుంటే… స్పీకర్ ఓటుతో వాజపేయి ప్రభుత్వం గట్టెక్కింది. చరిత్రలో నిలిచిపోయేవి ఇటువంటి చర్యలే. 1999 ఆయన పార్లమెంటు సభ్యుడు. అదే సమయంలో ఒరిస్సా ముఖ్యమంత్రి. నైతికంగా ఆయనకు అవిశ్వాస తీర్మానంపై ఓటింగులో పాల్గొనే హక్కు లేదు. కానీ, ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కాంగ్రెస్ ఇచ్చిన విప్ ను శిరసావహించారు. అది ఆయనపై విమర్శలకు దారితీసింది. రాజ్యాంగ చర్చకూ తావిచ్చింది. వాజపేయి కూడా ఆ సమయంలో మౌనంగా ఉండడంతో గమాంగ్ ఓటు వేయగలిగారు. అది 13 రోజుల వాజపేయి ప్రభుత్వ పతనానికి దారితీసింది. బహుశా ఒక ప్రధాని నైతిక విలువలకు కట్టుబడి ప్రభుత్వాన్ని కూలగొట్టుకోవడం అదే ప్రథమమేమో.

గంటి మోహన చంద్ర బాలయోగి… ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో ఇది చెరపలేని పేరు. శాంతస్వభావి అయిన బాలయోగి, స్వయంకృషితో ఎదిగారు. వృత్తిరీత్యా అడ్వకేట్. తదుపరి రాజకీయాలలోకి వచ్చారు. తూర్పు గోదావరి జిలా ప్రజా పరిషత్తు అధ్యక్షులయ్యారు. తదుపరి ఎమ్మెల్యే అయ్యారు. రాష్ట్ర మంత్రిగా సేవలందించారు. లోక్ సభ స్పీకర్ గా రెండు సార్లు పనిచేశారు. ఆ పదవికి వన్నె తెచ్చారు. 1999 లో ఆయన స్పీకరుగా వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి ఒక మచ్చు తునక.