మధ్యాహ్నం ఆశ్చర్య పరిచిన ఫోన్…
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
మధ్యాహ్నం భోజనం చేస్తుండగా మొబైల్ మోగింది… కొత్త నెంబర్. సాధారణంగా కొత్త నంబర్లు ఆన్సర్ చెయ్యను. ఎందుకో ఎత్తాను. హలో అన్నాను. అవతలి గొంతు హలో అంటూ, మీరు సుబ్రహ్మణ్యం గారేనా? అని ప్రశ్నించారు. అవునండి మీరెవరు? అన్నాను. నేను హై కోర్ట్ అడ్వొకేటును అనడంతో నాతొ ఆయనకు ఏంపనబ్బా అనే ఆలోచనలో ఉండగానే … నా పేరు శ్రీనివాస్. నేను కూడా మాజేటి గురవయ్య స్కూలులోనే చదివాను. ఆంజనేయులు మాస్టారు గురించి మీరు రాసింది చూసి… ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసాను అనడంతో… నేను మరింత ఆశ్చర్యానికి లోనయ్యా. ఆ మాటా ఈ మాటా అయ్యాక మాస్టారి అబ్బాయి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆయనకూ నా నంబర్ పంపారు. ఇంతలో మాస్టారి ఫోటో కూడా పంపారు. ఆ ఫోటో చూడగానే, ఆయన ఇచ్చిన చెంపదెబ్బ మరోసారి గుర్తుకు వచ్చింది. ఆయన కిందటి ఏడాదే కన్నుమూశారని తెలిసి, కళ్ళ నీళ్లు తిరిగాయి. కిందటి ఏడాదే కొందరు విద్యార్థులు వచ్చి ఆయన జన్మ దినం సందర్భంగా నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారని వారి అబ్బాయి చెప్పారు. విజయవాడలోనే వారు పన్నెండేళ్లుగా ఉంటున్నారట. తరచూ అక్కడికి వెడుతున్నప్పటికీ మాస్టారిని కలవలేకపోయాననే బాధ వెన్నాడుతూనే ఉంటుంది.

వృత్తిలో ఉండగా రాసిన వార్తలకు ఎన్నో స్పందనలు వచ్చాయి. సమస్యలూ పరిష్కారమయ్యాయి. అది వృత్తికే వన్నె తెచ్చే అంశం. శభాష్ అనే ఒక పొగడ్తతో సరి. కానీ, ఈరోజు జరిగింది… వేరు. ఈనాడు నేను శీర్షికతో నేను రాస్తున్న నా అనుభవాలకూ స్పందన వస్తే? అంతకుమించిన ఆనందం ఉంటుందా?
ఇంటికి పరుగులు తీయించిన కంఠం? ఉదంతం నాకు ఈ ఆనందాన్ని వెతుక్కుంటూ తెచ్చింది. ఆంజనేయులు మాస్టారు దగ్గరే చదువుకున్న విద్యార్థి బి. శ్రీనివాస్ ద్వారా అది సాధ్యమైంది. సాధారణంగా ఇలాంటివి చదివి వదిలేస్తారు. కానీ అభిమానంగా ఫోన్ చేసిన శ్రీనివాస్ గారికీ, నా ఫోనును అందుకుని ఆత్మీయంగా మాట్లాడి, మాస్టారి ఫోటోలను పంపిన వారి కుమారునికీ (ఆయన పేరు కూడా శ్రీనివాస్) అనేకానేక కృతజ్ఞతలు. ఆనాటి అభిమానాలు, బంధాలను ఈ ఇద్దరూ నాకు గుర్తు చేశారు. ఒక సంఘటన ఒక తరాన్ని తట్టి లేపింది.
మాస్టారి ఎపిసోడ్ చదివిన మరొక మిత్రుడు దుగ్గరాజు శ్రీనివాస్ ప్రశంస కూడా ఎంతో ఆనందాన్నిచ్చింది.. రోజూ రాయటానికి మనింట్లో వెన్న వుండదు అనే మాట అద్భుతం…త్రివిక్రమ్ శ్రీనివాస్ చదివితే ఎక్కడో ఒక చోట సినిమా లో వాడే ప్రమాదం వుంది ..జాగ్రత్త… అంటూ జోక్ చేశారు. (కింది లింకును నొక్కితే ఆ ఎపిసోడ్ ను చదవచ్చు.)
https://vyus.in/my-school-experience-in-guntur/
ఆరో తరగతిలో ఆ స్కూలులో చేరాను. అప్పటి స్నేహితులెవరూ గుర్తులేరు కానీ, ఒక్క ఆంజనేయులు మాస్టారు మాత్రం నాకు ఎప్పటికీ గుర్తుంటారు. ఎందుకంటే ఆయన నన్ను కొట్టిన చెంపదెబ్బ ఇప్పటికీ జ్ఞప్తికి వస్తూనే ఉంటుంది.