శర్మ గారు చెప్పిన పేరు వినగానే…
ఈనాడు – నేను: 7
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
ఈ భాగంలోకి వెళ్ళే ముందు నేనో మహత్తరమైన వ్యక్తిని పరిచయం చేయాలి. ఆయనే శ్రీ జి. కేశవరామయ్య గారు. జనరల్ డెస్కులో సబ్ ఎడిటర్. పొట్టిగా.. కొంచెం నల్లగాఉండేవారు. మృదుభాషి… చాలా మెల్లగా మాట్లాడే వారు ఎంతగా అంటే.. దగ్గరకు వెళ్ళి వింటే తప్ప వినపడనంతగా.. ఆయన ముఖంపై నవ్వు చెదరడం ఎప్పుడూ చూడలేదు. ఎంత కఠోరమైన పరిస్థితిలోనూ ఆయన అదే హావభావంతోకనిపించేవారు. నేను చాలా అభిమానించిన వ్యక్తి ఆయన. ఎటువంటి సందేహాలున్నా ఆయన్ను అడిగేవాడిని. కొందర్ని అడిగితే.. చెప్పేవారు కానీ.. ముందుగా అది కూడా తెలియదా! అనేటట్టు ఓ చూపు విసిరి.. ఆపై చెప్పాల్సింది చెప్పేవారు. ఈయన అలా కాదు. అడిగిన దానికి సూటిగా బదులు చెప్పేవారు. చెబుతున్నంత సేపు భుజం మీద ఆప్యాయంగా చేయి వేసి ఉంచేవారు. ఆయన గొప్పదనం గురించి.. మంచి మనసు గురించి ముందుముందు రాస్తాను.
రిటైరైన తొలి ఉద్యోగి
ఈయనకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే. ఈనాడు సంస్థలో పదవీ విరమణ చేసిన మొదటి వ్యక్తి. ఆయనకు ముందు చాలామంది సంస్థను వివిధ కారణాల వల్ల విడిచివెళ్ళారు. కేశవరామయ్యగారు అందరికీ తలలో నాలుకలా మెలిగేవారు. సంస్థలో పెద్దస్థాయిలో ఉన్నవారు కూడా ఆయన్ను గౌరవవాచకంతో సంబోధించేవారు. ఆయనను గారు లేకుండా పిలిచిన వారిని నేను చూడలేదు.
ఇక అసలు విషయంలోకి వద్దాం…
డెస్క్ ఇన్చార్జి సబ్ ఎడిటర్ని బతిమాలిన వేళ…
.. ఓ రోజు డెస్క్ ఇన్చార్జిని వారం రోజులు సెలవడిగారు. ఠాట్ వీల్లేదన్నాడాయన. వెళ్ళి ఓ పెద్దాయనతో చెప్పాడు. ఇన్ఛార్జి నో అంటే నేను కల్పించుకోవడం బాగోదు.. ఎందుకు వద్దాన్నాడో అడిగిచూస్తానన్నాడాయన. నిజమే డెస్కులో తక్కువ మంది ఉన్నారు. వారం రోజులు కుదరదని తేలింది. కొత్తగా మినీలు పెట్టారు. జాగ్రత్తగా చూసుకోవాల్సిన దశ. అందుకని వద్దన్నాని చెప్పారా ఇన్చార్జి. మరోసారి మూడ్ బాగున్నప్పుడు అడగని సలహా ఇచ్చారు. డ్యూటీ అయిపోయిన తరవాత మరో ప్రయత్నం. ఇన్చార్జి మళ్ళీ కస్సుమన్నాడు. ఎన్నిసార్లు చెప్పాలని గదమాయించాడాయన. అంతే… మరుసటి రోజు ఆ సబ్ ఎడిటర్ రాలేదు. లేట్‌గా వస్తాడనుకుని చూశారు…. రాలేదు…
సరే మరుసటి రోజూ రాలేదు. బాయ్‌ని ఆతగాడి రూమ్‌కి పంపారు. ఆ ఉద్యోగి ఇంట్లోనే ఉన్నాడు. మానేశానని చెప్పమని సెలవిచ్చాడు. విషయం తెలిసింది. ఇక ఆతగాడి ఇంటికి కొందరు పరుగులు తీశారు.ఆశ్చర్యమేసింది. ఇన్చార్జి నన్ను అవమానించాడు. ఉద్యోగం నాకవసరం లేదు. రాను పొమ్మన్నాడు ఆతగాడు. ఇకలాభం లేదనుకుని ఇన్చార్జే బయలుదేరాడు. బాబు! ఉద్యోగం అంటే సవాలక్ష ఉంటాయి.. నేనన్నది మనసులో పెట్టుకోకుండా ఆఫీసుకు రమ్మని బతిమాలాడు. ఉద్యోగం నీకు అవసరం లేకపోయినా నాకు అవసరం.. నా మూలంగా నువ్వు రిజైన్ చేశావంటే.. అది నా ఉద్యోగానికి ప్రమాదమని మొరపెట్టుకున్నాడాయన. మొత్తానికి ఆ ఉద్యోగి కరిగిపోయాడు. ఆఫీసుకు వచ్చాడు. (ఇప్పుడు ఆ సబ్ ఎడిటర్ చాలా ఉన్నత స్థానంలో ఉన్నాడు)
ఈ ఉదంతాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందీ అంటే అప్పట్లో సాధారణ సబ్ ఎడిటర్ని కూడా కడుపులో పెట్టుకుని చూసుకునే వారని చెప్పడానికి మాత్రమే. ఎవరినో కించపరచడానికో.. పొగడడానికో కాదు. (ఈ ఉదంతంలో పేర్లు రాయకపోవడానికి కారణం ఆ కుటుంబాల మనోభావాలు గాయపడకుండా ఉండడానికి)
శర్మగారి ఇంటర్వ్యూ
కొన్నాళ్ళు గడిచింది.. మా డెస్కులోనే ఉన్న ఎ.వి.ఎన్.హెచ్.ఎస్. శర్మ గారు(నాకు రమారమి రెండేళ్ళ సీనియర్) సుబ్రహ్మణ్యంగారు.. కొంచెం మీ ఇంటర్వ్యూ కావాలంటూ అక్టోబర్(1989) రెండోవారంలో అడిగారు. ఎవరి విషయమూ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళే ఆయన నన్నలా అడగడం కొంచెం ఆశ్చర్యమేసింది. ఏమిటన్నట్లు చూశాను. టీ కి వెళ్ళినప్పుడు మాట్లాడదామన్నారు. సరేనన్నాను. సాయంత్రం నాలుగున్నరకి అందరం టీకి వెడతాం. ఈనాడు క్యాంటీన్లోనే కొందరూ.. నచ్చని వారు ఆఫీసు పక్కనే ఉన్న లక్ష్మీ కేఫ్‌కి వెళ్లి టీ తాగేవారు. కేఫ్ గోడమీద కూర్చుని పది నిముషాల బాతాఖానీ వేసుకునేవారు. హరిప్రసాద్ (ఇప్పుడు ఏపీ శాసన మండలిలో జనసేన ఎం.ఎల్.సి.), రవికుమార్, కేశవ్, మరొకరి పేరు గుర్తులేదు.. వీరితో శర్మగారు టీ కి వెళ్ళేవారు. నాతో ఇంటర్వ్యూ కోసం ఆయన ఆ రోజు వారితో కలవలేదు.

ఏమిటి చెప్పండన్నాను..టీ తాగుతూ.. మీరు పెళ్ళి చేసుకుంటారా… ఓ సంబంధం ఉంది.. అన్నారు. షాకయ్యాను. అప్పటిదాకా ఆ ఉద్దేశం లేదు. అయినా జాబ్ పెర్మనెంట్ కాలేదు. జీతం ఎనిమిదొందలు. పెళ్ళి చేసుకుంటే ఏం పెట్టి పోషించాలి.(ఇదంతా అంతర్గతం)
మా నాన్నగారిని అడగాలన్నాను. తరవాత చెబుతానన్నాను. సరే కంగారు లేదు.. అడిగే చెప్పండి.. అన్నట్లు మీరు చూడబోయే అమ్మాయి తండ్రి ఫలానా.. అంటూ పేరు చెప్పారు. అంతే ఒక్కసారి నాలో ఉద్వేగం… పట్టరాని సంతోషం. మనసు 1975-1977 సంవత్సరాల మధ్య కాలంలోకి పరుగులు తీసింది. స్కూలు భోజన విరామ సమయంలో నేను ఇంటికి తీసిన పరుగులు జ్ఞాపకం వచ్చాయి. ఆ పరుగులు వివరం తెలుసుకోవాలంటే రేపటి దాకా అంటే ఎనిమిదో భాగందాకా ఆగాల్సిందే… (సశేషం)