ఆంధ్రపురాణ రచయితకు వింత అనుభవం
(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)
ప్రముఖ రచయితలకు వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. గతంలో ఒకానొక రచయిత ఒక పుస్తకం రాశారట. ఆ పుస్తకాన్ని ఒక ప్రముఖుని దగ్గరకు తీసుకెళ్లి పీఠిక రాయమని విన్నవించుకున్నారట. పద్య కవిత రూపంలో ఉన్న ఆ పుస్తకాన్ని చదివిన ఆ ప్రముఖుడికి, పద్య కవితకు ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేకపోవడంతో ఒళ్ళు మండి… అరవై పేజీల పీఠిక రాశారట. పీఠికను చూసిన రచయితకు నోట మాట రాలేదు. ముప్పై పేజీల పుస్తకాన్ని అరవై పేజీల పీఠికతో అందునా విమర్శలతో కూడిన ముందుమాటతో ఎలా ప్రచురించాలో అర్ధం కాక తలపట్టుకుని… ఆ ఆలోచన విరమించుకున్నారట. కొన్నాళ్ళకు పీఠిక రాసిన ప్రముఖుడు తారసపడి, పుస్తకాన్ని ప్రచురించారా అని అడిగినప్పుడు… ఆ రచయిత బదులిస్తూ, పుస్తకాన్ని ప్రచురించకుండా ఉండడమే మీకు సన్మానం చేసినట్టుగా భావించానని చెప్పారట. సాహిత్యకారుల మధ్య చమత్కారాలు ఇలా ఉంటాయి.

ఇలాంటిదే మరొకటి… అది కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి అనుభవం. ఒక ప్రముఖ రచయిత ఒక పద్య కావ్యాన్ని రాశారట. ఆ రచయిత పేరు… కావ్యం పేరు అప్రస్తుతం. పద్య కావ్యం కాబట్టి, తప్పులు సరిచూడడానికి ఎంతో అలోచించి, అప్పట్లో ప్రముఖుడైన, ఆంధ్రపురాణ రచయిత మధునాపంతుల వారిని సంప్రదించారట. పద్య రచనలో మిమ్మల్ని మించిన వారు లేరు. నా రచనలో తప్పులు దొర్లితే, ముందు తరాలకు తప్పులు అందించినట్టవుతుంది, కాబట్టి నా రచనను దిద్దిపెట్టమని అభ్యర్ధించడంతో, మధునాపంతుల వారు పెద్ద మనసుతో అంగీకరించారట. పుస్తకాన్ని ప్రచురించిన రచయిత, అందుకు కృతజ్ఞతాపూర్వకంగా.. అట్టపై తనపేరు కింద, ఈ పుస్తకానికి ప్రూఫులు దిద్దిన వారు కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి అని ముద్రించారట.
దీనిని చూసిన మధునాపంతుల వారు… చూశావటోయ్… అభిమానం హద్దులు దాటితే ఎలా పరిణమిస్తుందో అంటూ సన్నిధానం నరసింహశర్మగారితో చమత్కారంగా వ్యాఖ్యానించారట. తన పేరును ధన్యవాదాలు చెప్పిన వ్యక్తుల పేర్లతో కలిపి రాస్తారు అనుకున్నాను కానీ, ఇలా రచయిత పేరు కిందే ప్రచురించి, ఇంత ప్రాధాన్యత ఇస్తారని అనుకోలేదు అని నవ్వుతూ చెప్పారట. చదువుకున్నవారు, విజ్ఞుల స్పందనలు బహు చమత్కారంగా ఉంటాయని చెప్పడానికి ఇవి ఉదాహరణలు అని సన్నిధానం నరసింహ శర్మ గారు… నాతో మాట్లాడుతూ ఈ రెండు సంఘటనలనూ చెప్పారు.