60 రోజుల్లో నివేదిక : ఆ తరవాతే ఉద్యోగ నోటిఫికేషన్లు
కులగణన కమిటీలతో సమావేశంలో సీఎం ఆదేశాలు
హైదరాబాద్, అక్టోబర్ 09 : ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇందుకు అనుగుణంగా ఏక సభ్య కమిషనును 24 గంటల్లోగా నియమించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో నివేదికను సమర్పించాలని రేవంత్ ఆదేశించారు. ఈ కమిటీ సబ్ కమిటీ సూచనల ఆధారంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఏక సభ్య కమిషన్ రిపోర్ట్ సమర్పించాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు రేవంత్ వెల్లడించారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని ఆయన సూచించారు. 24 గంటల్లో కమిషన్ కు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా ఏక సభ్య కమిషన్ నివేదికను సమర్పించాల్సిందేనని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై కమిటీలతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.