షూటింగ్‌లో భారత్‌కు మరో కాంస్యం

0
139

ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మను భాకర్
(శ్రీధర్ వాడవల్లి)
పారిస్:
ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున షూటింగ్‌ విభాగంలో 12 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించుతూ.. మను కాంస్యాన్ని కైవసం చేసుకుంది. విశ్వ క్రీడా వేదికపై సంచలన ప్రదర్శనతో ప్రపంచ మేటి షూటర్లలో ఒకరుగా ఎదిగిన యువ క్రీడాకారిణి మను భాకర్‌ షూటింగ్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళగానూ ఘనత సాధించింది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మను భాకర్, సరబ్‌జ్యోత్‌లతో కూడిన భారత జట్టు కాంస్యాన్ని గెలుచుకుంది.
కాంస్య పతక పోరులో భారత్ 16-10తో దక్షిణ కొరియా జట్టుపై నెగ్గింది.
ఈ పతకంతో భారత షూటర్ మను భాకర్ ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు ఏ భారతీయ ప్లేయర్ సాధించలేని అరుదైన ఘనత సాధించారు. తద్వారా, ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారత ప్లేయర్‌గా, మహిళా షూటర్‌గా మను భాకర్ చరిత్ర సృష్టించారు. ఆదివారం మహిళల 10మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లోనూ ఆమె కాంస్య పతకాన్ని గెలిచారు.దీంతో ఆమె ఖాతాలో రెండు ఒలింపిక్స్ పతకాలు చేరాయి.
మంగళవారం జరిగిన 10మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మను భాకర్- సరబ్‌జ్యోత్‌లతో కూడిన భారత జట్టు 16-10తో దక్షిణ కొరియా ద్వయం లీ-యెజిన్‌పై గెలుపొందారు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది రెండో పతకం. ఈ రెండు పతకాలు షూటింగ్‌లోనే వచ్చాయి. ఒలింపిక్స్‌లో 10మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారత్ గెలిచిన తొలి పతకం ఇదే.
అన్ని ఒలింపిక్స్‌లలో కలిసి షూటింగ్ ఈవెంట్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య ఆరుకు చేరింది. షూటింగ్ టీమ్ ఈవెంట్‌లోనూ ఇది భారత్‌కు తొలి ఒలింపిక్ పతకం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here