సంగీతమే బాలమురళి ప్రపంచం

Date:

(డాక్టర్ వైజయంతి పురాణపండ)
తన గానామృతంతో ప్రపంచాన్ని ఓలలాడించారు పద్మవిభూషణ్‌ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. మరి ఇంట్లో తన ఆరుగురు పిల్లలతో ఎలా ఉండేవారనే విషయాన్ని తెలుసుకోవడానికి మంగళంపల్లి వారి పిల్లలను పలకరించింది. పెద్ద అబ్బాయి అభిరాం, రెండో అబ్బాయి సుధాకర్, మూడో అబ్బాయి వంశీమోహన్, పెద్దమ్మాయి కాంతి (అమ్మాజీ), రెండో అమ్మాయి లక్ష్మి, మూడో అమ్మాయి మహతి. పెద్ద అబ్బాయి, ప్రింటింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో స్టేట్‌ గవర్నమెంట్‌లో పనిచేసి రిటైరయ్యారు. రెండో అబ్బాయి, మూడో అబ్బాయి డాక్టర్లు. పెద్ద అమ్మాయి: బిఏ మ్యూజిక్‌ ఫిలాసఫీ, సైకాలజీ, రెండో అమ్మాయి: బిఎస్‌సి, మూడో అమ్మాయి: ఎంఏ ఇంగ్లీషు చదువుకున్నారు.
నాన్న నన్ను అమ్మాజీ అని పిలిచేవారు: పెద్ద అమ్మాయి అమ్మాజీ
మేం మొత్తం ఆరుగురం పిల్లలం, ముగ్గురు ఆడపిల్లలం, ముగ్గురు మగపిల్లలు. నేను అందరికంటె పెద్దదాన్ని. నన్ను నాన్నగారు అమ్మాజీ అని పిలిచేవారు. మా నాయనమ్మ గారి పేరు సూర్యకాంతమ్మ. అందువల్ల నాకు కాంతి అని పేరు పెట్టారు. కాని అమ్మాజీ అని పిలిచేవారు. నాన్నగారు మాతో చాలా స్నేహంగా, ఎంతో సరదాగా ఉండేవారు. కాలేజీలో సంగీతం పోటీలలో మొదటి బహుమతి వచ్చిన రోజున, ఆ విషయం అమ్మకు చెప్పాను. అమ్మ నాన్నతో చెబితే, ఆయన నన్ను దగ్గరకు తీసుకున్నారు. నాకు ఆనందంతో కళ్లల్లో నీళ్లు వచ్చాయి. ఇప్పటికీ ఆ సంఘటన నేను మరచిపోలేను. నా పెళ్లికి ముందు నాన్నగారి కచేరీలలో వెనకాలే కూర్చుని తంబురా వేసేదాన్ని. నాన్నగారితో పాడాను కూడా. నాన్నగారి కీర్తనలు చాలావరకు నేర్చుకున్నాను. చిన్న చెల్లెలు మహతి నాన్నగారి వెంట ఉండేది. నాన్నగారు రాసిన కల్యాణవసంతం రాగంలో ‘గానమాలించి’ కీర్తన చాలా ఇష్టం. మా వారి ఉద్యోగరీత్యా మేం పంజాబ్‌ భటిల్డాలో ఉన్నప్పుడు, నాన్న ఒకసారి మా ఇంటికి వచ్చారు. నాన్నగారికి జనం మధ్యన ఉండటం చాలా ఇష్టం. అందుకని మా వారితో పనిచేసేవారిని భోజనానికి పిలిచాం. వారందరితో కలిసి నాన్న డిన్నర్‌ చేశారు. వారంతా నాన్నని పాట పాడమన్నారు. నాన్న వారి కోసం కచేరీ చేశారు. వాళ్లు ఎంతో పరవశించిపోయారు. ఎవరు వచ్చినా నవ్వుతూ పలకరించేవారు. గుమ్మం దాకా వచ్చి సాగనంపేవారు. కుటుంబంలో ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా తప్పకుండా హాజరయ్యేవారు. నాన్నగారి షష్టిపూర్తి, 81వ పుట్టినరోజు వేడుకలు మేం ఆరుగురం కలిసి ఎంతో గ్రాండ్‌గా నిర్వహించాం. నాన్నగారికి సంతృప్తి ఎక్కువ. మేం అలా సరదాగా వేడుక చేయడం చూసి ఎంతో సంబరపడ్డారు.
ఎప్పుడూ కసురుకోను కూడా లేదు: పెద్ద అబ్బాయి అభిరామ్‌
మమ్మల్ని ఎప్పుడూ కొట్టలేదు. కనీసం కసిరేవారు కూడా కాదు. అసలు ఆయనకు కోపమే వచ్చేది కాదు. మాతో ఎంతో ప్రేమగా ఉండేవారు. ఏది అడిగితే అది ఇచ్చేవారు. మా చిన్నతనంలో విజయవాడలో ఉండేవాళ్లం. అక్కడ కొన్నాళ్లు ఆకాశవాణి కేంద్రంలోను, సంగీత కళాశాలలోను పనిచేశారు. 1964లో మ్యూజిక్‌ కాలేజీకి రాజీనామా చేశాక, మద్రాసు వచ్చేశాం. నాన్నగారికి అవకాశం దొరికినప్పుడల్లా మమ్మల్ని బీచ్‌కి తీసుకెళ్లేవారు. అక్కడ చాలా సరదాగా గడిపేవాళ్లం. తెలుగువారిని ఏ మాత్రం అంగీకరించని తమిళనాట నాన్న తట్టుకుని, నిలదొక్కుకుని, నంబర్‌ వన్‌ స్థాయికి చేరారు. సంగీత సాధన చేయమని మమ్మల్ని ఎన్నడూ బలవంతపెట్టలేదు. సంగీతం ఎవరో నేర్పితే వచ్చేది కాదని, అది భగవదత్తమైన కళ అని నమ్మేవారు. పిల్లలు చదువుకోవాలి, చక్కగా సెటిల్‌ అవ్వాలి అనుకునేవారు. నాన్నగారు నిరంతరం సంగీత కచేరీలలో ఉండటం వల్ల మమ్మల్ని ఎక్కువగా మా అమ్మే చూసుకునేవారు. మేం ఏం చదువుతానంటే అదే చదివించారు. అందరం బాగా సెటిల్‌ అవ్వాలని కోరుకున్నారు. ఆయన కోరుకున్నట్లుగానే అందరం బాగా సెటిల్‌ అయ్యాం. తొమ్మిది మంది మనవలు, ఆరుగురు మునిమనమలతో హాయిగా ఆడుకుంటూ నిండైన జీవితం అనుభవించారాయన. మా ఇల్లు ఒక మినీ ఇండియా. మా ఇంట్లో కొంకిణి, మలయాళం వాళ్లు కూడా సభ్యులే. ఇతర రాష్ట్రాలవారిని వివాహం చేసుకున్నా నాన్న ఏమీ అనలేదు. మా అబ్బాయి గుజరాతీ అమ్మాయిని చేసుకున్నాడు. ఆయనకు ఫోన్‌ చేసి చెప్పగానే, ఎంతో సంబర పడ్డారు. వాళ్ల రిసెప్షన్‌లో ∙‘సీతాకల్యాణ వైభోగమే’ పాట పాడుతూ ‘సదా కల్యాణ వైభోగమే, తను కల్యాణ వైభోగమే’ అంటూ పెళ్లికూతురు (తను), పెళ్లి కొడుకు (సదా) ల పేర్లతో పాడారు. వచ్చినవారంతా ఎంతో సంబరంగా తప్పట్లు కొట్టారు. నాన్నగారు ఆనందపడ్డారు. మా తమ్ముడు కొంకిణి అమ్మాయిని చేసుకున్నాడు. హీ ఈజ్‌ రివల్యూషనరీ నాట్‌ ఇన్‌ మ్యూజిక్‌ బట్‌ ఇన్‌ లైఫ్‌ ఆల్‌సో.

మాతో క్యారమ్స్ ఆడేవారు: రెండో అమ్మాయి లక్ష్మి
మాతో క్యారమ్స్‌ బాగా ఆడేవారు నాన్న. అప్పుడప్పుడు అందరం కూర్చుని ప్లేయింగ్‌ కార్డ్స్‌ ఆడేవాళ్లం. గోదావరి జిల్లాలకు ప్రత్యేకమైన అడ్డాట మాతో బాగా అడేవారు. సరదా కోసం రమ్మీ కూడా ఆడేవారు. అందరం నాన్నతో కలిసి కూర్చుని భోజనం చేసేవాళ్లం. అన్నం కలిపి మా అందరికీ ముద్దలు పెట్టేవారు. నాన్నగారి 75 సంవత్సరాల పుట్టినరోజు పండుగకు నేను ప్లాటినమ్‌ రింగ్‌ బహుమతిగా ఇచ్చాను. అది చూసి నాన్న మురిసిపోతూ, చేతికి పెట్టుకుని, ‘లక్ష్మీ నీ ఉంగరం పెట్టుకున్నాను చూశావా’ అన్నారు. ఇచ్చిన బహుమతి చిన్నదా, పెద్దదా అనే ఆలోచనే ఆయనకు ఉండదు. వస్తువు విలువ గురించి అస్సలు పట్టించుకునేవారు కాదు. అలాగే ఏది చేసి పెడితే అది మాట్లాడకుండా తినేసేవారు. రుచి ఎలా ఉన్నా, ‘ఎంతో బాగుంది’ అనేవారు. ఆ సంఘటనలను ఎన్నడూ మరచిపోలేం. ఇప్పటికీ ఆ సంఘటనలు గుర్తుకు వచ్చినప్పుడల్లా మనసు చెదిరిపోతుంటుంది.

సంగీతమే ఆయన జీవితం: రెండోఅబ్బాయి సుధాకర్‌
ఆయనకు అందమైన బాల్యం లేదు. ఆయనకు అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు లేరు. ఆయన ఒక్కరే. అందుకే చిన్నప్పుడు పెద్దగా ఆడుకోలేదట. అదీకాకుండా ఆయన ఆరో ఏట నుంచే సంగీతం పాడటం ప్రారంభించారు. సంగీతంతోనే ఆయన జీవితం గడిచిపోయింది. అందుకే ఆ లోటును ఆయన మాతో తీర్చుకున్నారు. మనవలతో కూడా సరదాగా ఆడేవారు నాన్న. మా అందరికీ సింగపూర్‌ నుంచి టేప్‌ రికార్డర్‌ తెచ్చారు. అది ఇప్పటికీ మా అందరి దగ్గర ఉంది. ఇంటి దగ్గర సెలబ్రిటీలా ఉండేవారు కాదు. స్నేహంగా, సింపుల్‌గా ఉండేవారు. నాలుగు సంవత్సరాల క్రితం నాన్నగారు సంగీత కచేరీ చేయడానికి వాషింగ్టన్‌ డిసి వచ్చారు. అప్పుడు నేను, నా భార్య న్యూయార్క్‌లో ఉన్నాం. నాన్నగారి దగ్గరకు వెళ్లి రెండు రోజులు అక్కడే సరదాగా గడిపాం. అక్కడ మా రెండో అమ్మాయి లాస్యతో కలిసి అందరం నాన్నగారి కచేరీకి వెళ్లాం. అక్కడ చాలామంది అమెరికన్లు మొట్టమొదటిసారిగా దక్షిణ భారత సంగీత కచేరీ వినడానికి వచ్చారు. వారంతా నాన్నగారి కచేరీ విని సంబరపడిపోయారు. నాన్న పాటకు తాళం వేశారు. ఆ నాటి దృశ్యం మా జీవితంలో మరచిపోలేని సంఘటనగా ముద్ర వేసింది. అదొక మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది.
నాన్న దగ్గర సంగీతం నేర్చుకున్న అదృష్టం నాది: మూడో అమ్మాయి మహతి
ఆయన మాతో చాలా అటాచ్‌డ్‌గా ఉండేవారు. నాన్నగారి దగ్గర సంగీతం నేర్చుకునే అదృష్టం కలిగింది నాకు. నేనే కాదు మా అమ్మాయి కూడా ఆయన దగ్గరే సంగీతం నేర్చుకుంది. ఆయన పాఠం చెప్పేటప్పుడు ఏనాడూ స్ట్రిక్ట్‌గా ఉండేవారు కాదు. చాలా సాధారణంగా నేర్పేవారు. పూర్వీకులు రాసిన పాటలు, కీర్తనలు… నాన్నకి ఏ పాట కావాలంటే ఆ పాట, ఏ పుస్తకం కావాలంటే అది వెతికి తీసి ఇచ్చే బాధ్యత నాది. వేసవి సెలవుల్లో నాన్నతో షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఆడేవాళ్లం. ఆయన చాలా బాగా ఆడేవారు. మా ప్రోగ్రెస్‌ కార్డు వస్తే ఏం మాట్లాడకుండా సంతకాలు పెట్టేవారు. మేమందరం బాగా సెటిల్‌ అవ్వాలని కోరుకున్నారు. ఆయన అనుకున్నట్లుగానే మేమే కాదు, మా పిల్లలు కూడా చక్కగా సెటిల్‌ అయ్యారు. ఆయన అన్నీ తన కళ్లతో చూశారు. నిండు జీవితం గడిపారు. మేం అందరం కలసిమెలసి ఉంటాం. ఎక్కడో ఒక చోట తరచు కలుస్తుంటాం. అది నాన్నగారి పెంపకంలో వచ్చిన సంస్కారం అనుకుంటాం. నేను కూడా చెన్నైలోనే ఉండటం వల్ల తరచుగా అమ్మనాన్నలను చూడటానికి ఇంటికి వెళ్తుండేదాన్ని. చివరి రోజుల్లో ఇంచుమించు ప్రతిరోజూ వెళ్లేదాన్ని. నాన్న దగ్గరకు వచ్చి ఆయనను చూసి, మళ్లీ ఇంటికి బయలుదేరుతుంటే, కళ్లనీళ్లు పెట్టుకుని, ‘అప్పుడే వెళ్లిపోతున్నావా’ అనేవారు. ఆయన ఇమ్మోర్టల్‌ అనే భావన మాలో ఉండిపోయింది. అందుకే ‘నాన్నలేరు’ అనే విషయాన్ని నమ్మలేకపోతున్నాం. ఆయన ఉన్నారన్న భావనలోనే జీవించాలి అనుకుంటాం. కాని బాధ మాత్రం పోవట్లేదు. నాన్నగారు రాసి పబ్లిష్‌ అవ్వని కీర్తనలను ఒక పుస్తకంలా తీసుకురావాలని,. విజయవాడలో ఉన్న ఇంట్లో నాన్నగారికి సంబంధించిన వస్తువులను ప్రదర్శనకు ఉంచాలని, చెన్నైలో నాన్న శిష్యులకు సంగీతం నేర్పించిన రూమ్‌ను కూడా ప్రదర్శనకు ఉంచాలనుకుంటున్నాం.
నాన్న చాలా బ్రాడ్ మైండెడ్: మూడో అబ్బాయి డా. వంశీమోహన్‌
నాన్నగారు ఏ విషయాన్నయినా చాలా తేలికగానే తీసుకునేవారు. సంగీతంలో మునిగితేలడం వలన, ఆ కీర్తనలలోని తత్త్వాన్ని ఒంట బట్టించుకోవడం వల్ల, ఆయన చాలా బ్రాడ్‌ మైండెడ్‌గా ఉండేవారు. ఇరుకుగా ఆలోచించే మనస్తత్వం కాదు ఆయనది. అందుకే ఇతర విషయాలను సెకండరీగా తీసుకునేవారు. ఎప్పుడైనా మా మనసుకి బాధ కలిగితే ఆయన తట్టుకోలేకపోయేవారు. అందుకని ఆయనకు చెప్పలేక అమ్మకు చెప్పేవాళ్లం. అయితే అమ్మ ద్వారా విషయం తెలుసుకుని, తన మనసులోనే బాధను దాచుకుని, మమ్మల్ని ఓదార్చేవారు. ఆయనకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. ఎప్పుడు తీరిక దొరికినా ఎత్తుకుని ఆడించేవారు. మనవలతో చెప్పే కబురులే వారికి జోలపాట అనుకునేవాళ్లం. ఆయన ఎత్తుకోగానే పిల్లలు ఒళ్లు తడిపితే, బట్టలు మార్చుకునేవారే కాని చిరాకు పడేవారు కాదు.
తాతగాని ఎవరూ సవాలు చేయలేరు: మనవడు (పెద్ద కూతురి కొడుకు)
తాతగారిని సంగీతంలో ఎవ్వరూ చాలెంజ్‌ చేయలేరు. కాని ఆయనకు ఎవరైనా చాలెంజ్‌ చేస్తేనే ఇష్టం. ఎన్నో చాలెంజ్‌లతో పైకి వచ్చారు. తాతగారిని నేను జెమ్స్‌ తాతయ్యా అని పిలిచేవాడిని. ఆయన నాకు ఎప్పుడూ తినడానికి జెమ్స్‌ తెచ్చేవారు. తాతయ్యను అలా పిలుస్తుంటే ఎంతో సరదాపడేవారు. చిన్నప్పుడు నేను ఆడుకోవడానికి ట్రక్‌ బొమ్మ కావాలని అడగగానే, ఫన్‌స్కూల్‌ ట్రక్‌ కొని ఇచ్చారు.

బెంగళూరుకి చెందిన శ్రీనివాసమూర్తి అనే ఆయనకు నాన్నగారంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర నాన్నగారి క్యాసెట్లు అన్నీ ఉన్నాయి. తిరువనంతపురానికి చెందిన ప్రిన్స్‌ రామవర్మ, డి. వి. మోహనకృష్ణ… నాన్నగారికి పుత్ర సమానులు. మేం సంగీతం పాడదామనుకుంటే, మమ్మల్ని నాన్నగారితో పోల్చి మాట్లాడతారు. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆయనలా ఆయన ఒక్కరే ఉంటారు. అలా పాడటం ఎవ్వరికీ సాధ్యం కాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఇండియన్ బ్రాండ్ అంబాసడర్ టాటా

ఉప్పు నుంచి ఉక్కు వరకూ…టీ నుంచి ట్రక్ వరకూఅప్రెంటిస్ నుంచి చైర్మన్...

Will China collapse after possible alliance of US with India?

An Analysis about Communist China’s 75th anniversary (Dr Pentapati Pullarao) On...

కుల గణనకు ఏక సభ్య కమిషన్: రేవంత్

60 రోజుల్లో నివేదిక : ఆ తరవాతే ఉద్యోగ నోటిఫికేషన్లుకులగణన కమిటీలతో...

Wiki for All: Empowering Voices, Expanding Horizons

Hyderabad, October 08: The Wikimedia Technology Summit 2024 successfully...