నాన్నా!
శోభకృత్ నామ ఉగాది తన ప్రయాణాన్ని ముగించుకుని, క్రోధి నామ సంవత్సరానికి ప్రవేశం కల్పిస్తున్న శుభ తరుణం ఈ ఉగాది. తెలుగు పంచాంగం ప్రకారం నీ జయంతి ఏప్రిల్ 6 వ తేదీ శనివారం, ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు. కాని అందరం ఆంగ్ల క్యాలెండరును అనుసరిస్తున్నాం కనుక, నీ షష్టిపూర్తి నాటి నుంచి నీ పుట్టినరోజును మార్చి 16వ తేదీన జరుపుతున్నాం. వాస్తవానికి నీ పుట్టినతేదీ మార్చి 11వ తేదీ, బహుళ ద్వాదశి అని ఇప్పుడే చూశాను. అది పెద్ద విషయం కాదని నువ్వు ఎప్పుడూ చెబుతుంటావు నాన్నా. అన్ని ప్రాణులలాగే మనమూ పుడతాం. ఫలానా తారీకున, ఫలానా వారికి, ఫలానా ప్రాంతంలో అని చెప్పటం ఒక అలవాటుగా మారిపోయింది. కాని ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి పుట్టామనేది ప్రధానం కాదు. పుట్టి, ఏం సాధించాం అనేదే ప్రధానం అని నువ్వు చెప్పడం బాగా గుర్తు నాన్నా.
మా బాల్యంలో నువ్వు మాతో అన్నప్పుడు, అందులోని ఔన్నత్యం మాకు తెలిసి ఉండకపోవచ్చు. కాని వయసు పెరిగేకొద్దీ, నీ మాటల్లోని అంతరార్థం ఒక్కోటి తెలుస్తున్నాయి.
మరో మాట కూడా చెప్పావు –
చదివినదేదీ వృథా పోదని.
అప్పుడు అలా ఎందుకు చెప్పావో అర్థం కాలేదు.
కాని
నా జీవితంలో
నేను ఒక్కో పరీక్ష రాస్తున్నప్పుడు
నువ్వు చెప్పిన మాటలు అర్థం అవుతూ వచ్చాయి.
మొట్టమొదటిసారి
అంటే నా డిగ్రీ పూర్తి చేసి, పెళ్లి అయ్యి, పిల్లాడు పుట్టిన ఏడాదికి నేను రాజమండ్రి బొమ్మూరులోని తెలుగు విశ్వవిద్యాలయంలో తెలుగు ఎంఏ చేయడం కోసం ప్రవేశ పరీక్షకు హాజరయ్యాను. అప్పుడు నువ్వు చెప్పిన మాటలు మొదటిసారి ఆచరణలో కనిపించాయి.
నా చిన్నతనంలో నువ్వు నేర్పిన శతక పద్యాల మీద అక్కడ నాకు ప్రశ్న వచ్చింది. నువ్వు దాశరథీ, కాళహస్తీశ్వర శతకాలలో నుంచి పద్యాలు నేర్పించావు. ఆ పరీక్షలో శతక లక్షణాలు రాస్తూ, నువ్వు నేర్పిన పద్యాలను ఉదహరించాను. అలా ఏ మాత్రం ప్రిపరేషన్ లేకుండా ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను. విశ్వవిద్యాలయంలో ఎంఏ (తెలుగు) చేరాను. ప్రథమ శ్రేణిలో 64 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాను. అలా నువ్వు మా చేత చదివించిన చదువు నన్ను ఇంతవరకూ ముందుకు నడుపుతూనే ఉంది.
ఆ తరవాత నీ మీద పి.హెచ్‌డి చేశాను.
నీ కూతురుగా పుట్టినందుకు ఏదో ఒకటి చేసి, నీ ఋణం తీర్చుకోవాలనేదే నా ఉద్దేశ్యం. ఋణం తీర్చుకోవటం అంటామే కాని, తల్లిదండ్రుల ఋణం ఎన్నటికీ తీరేది కాదు. అందునా నీవంటి తండ్రిని పొందడమంటే ఎన్నో జన్మల పుణ్యమే కారణం. నీ ఋణం తీర్చుకోవడం కష్టమే కానీ, ఏదో ఉడతా భక్తిగా చిన్న చిన్న పనులు మాత్రం చేయగలుగుతున్నాం.
నీ ఋణం అని ఎందుకంటున్నానంటే –
నిజంగా నాన్నా నన్ను నువ్వు గాజు బొమ్మలా పెంచావు.
నా మనసు గాయపడకుండా చూశావు.
నీ ప్రాణం కంటె, నీ పిల్లల్నే (మేం నలుగురు ఆడపిల్లలం) నువ్వు ఎక్కువగా చూశావు. నీ ఆరోగ్యం కంటే, మా ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇచ్చావు.
నువ్వు –
ఉద్యోగం, ఉపన్యాసాలు అన్నీ పూర్తి చేసుకుని వచ్చి, ఏ అర్ధరాత్రో పడుకునేవాడివి. అంతలోనే, ‘నాన్నా! దాహంగా ఉంది’ అనగానే నువ్వు నిద్రలోంచి లేచి, మంచినీళ్లు ఇచ్చేవాడివే కానీ, ఒక్కనాడూ మమ్మల్ని విసుక్కున్న క్షణం లేదు. అంత ఓరిమి నీకు ఎలా వచ్చిందో అర్థం కాదు.
ఇంటికి పెద్దవాళ్లు వచ్చినప్పుడు ప్రవర్తించవలసిన విధానం చిన్నతనంలోనే నేర్పేశావు. అందుకే ఇంటికి ఎవరు వచ్చినా మంచినీళ్లు అడగటం ఇప్పటికీ ఆనవాయితీ అయిపోయింది. నీతో పాటే మమ్మల్ని అన్నానికి కూర్చోబెట్టుకుని, మెతుకులు కింద పడకుండా, కంచంలో అన్నం పారేయకుండా, వంటకు వంకలు పెట్టకుండా తినటం అలవాటు చేశావు. నువ్వు కూడా కూరలో ఉప్పు వేయకపోయినా మాట్లాడకుండా తినేవాడివని మామ్మ (మీ అమ్మ) చెప్పేది. తల్లిని ఎంత ప్రేమగా, గౌరవంగా చూడాలో నీ దగ్గరే నేర్చుకున్నాం నాన్నా. అందుకేనేమో నువ్వు కన్నుమూసిన తరవాత అమ్మని పదమూడు సంవత్సరాల పాటు కంటిపాపలా, మా అందరి ఇంటిపాపాయిలా చూసుకున్నాం. అమ్మకు మేమే అమ్మలుగా మారి, అన్ని పనులూ స్వయంగా చేసిపెట్టాం.
ఇవన్నీ మన వ్యక్తిగత విషయాలే –
నువ్వొక సెలబ్రిటీ అన్న విషయమే మాకు తెలియకుండా ప్రవర్తించావు ఇంట్లో. చిన్న లుంగీ కట్టుకునేవాడివి. ఏనాడూ ఫోన్ పెట్టుకోలేదు. అదొక్కటే కాదు, ఫ్రిజ్, ఏసీలు వద్దన్నావు. సుఖానికి అలవాటు పడితే కష్టానికి తట్టుకోవటం కష్టమన్నావు. నిజంగా ఆలోచిస్తే, ఏనాడూ నీకోసం నువ్వు ఒక్క పైసా కూడా ఖర్చు చేసుకోలేదు. నిత్యం మా గురించే ఆలోచించావు. నువ్వు దర్జాగా గడపాలని ఎన్నడూ అనుకోలేదు.
మరో విషయం నాన్నా
మనం ఇల్లు కట్టుకోవటం –
ఆ విషయం గురించి నువ్వు ఆశ్చర్యపోతూనే ఉంటావు.
‘నేనేమిటి, ఇల్లు కట్టడమేమిటి. ఆ స్టూడెంట్ బుక్ సెంటర్ గోపాల్రావుగారు దగ్గరుండకపోతే ఈ పని చేయగలిగేవాడిని కాను. అలాగే పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు నా పుస్తకాలు తితిదే తరఫున ప్రచురించకపోతే ఇది సంభవించేది కాదు, ఈ ఇల్లు తిరుపతి ప్రసాదం, గోపాలరావుగారి దీక్షాదక్షత’ అంటుండేవాడివి.
నిజమే –
అప్పట్లో ఆ విషయం అర్థం అయ్యేది కాదు మాకు.
నీ చేతిలోకి డబ్బులు రాగానే, గోపాలరావుగారిని పిలిచి ‘అయ్యా! ఇటుకలు కొంటారో, సిమెంటు కొంటారో తెలీదు. ఈ డబ్బుని మీరు ఎలా అవసరమనుకుంటే అలా ఖర్చు చేయండి’ అని ఇచ్చేసేవాడివి. ఆయన లెక్కలు చెప్పబోతుంటే, ‘నాకు మనిషి మీద నమ్మకం, లెక్కల మీద కాదు. మీరు చెప్పే లెక్కలు వినాల్సి వస్తే, అసలు ఆ పని మీకు అప్పచెప్పేవాడినే కాదు’ అని ఆయనతో అనటం మేమందరం స్వయంగా విన్నాం. ఒక వ్యక్తి మీద నీకు నమ్మకం ఏర్పడితే, ఇక జీవితాంతం ఆ వ్యక్తిని నీ గుండెల్లో పొదువుకునేవాడివి.
నాన్నా! నువ్వు మాకు ఎంతో ఆత్మీయ స్నేహితులనిచ్చావు. ఇలా అంటే నీకు ఆశ్చర్యం కలగచ్చు. నిజం నాన్నా. నీ స్నేహితులందరూ, నువ్వు గతించాక మాతో ఎంతో ఆప్యాయంగా, ఆత్మీయంగా, స్నేహంగా ఉన్నారు నాన్నా. పాలగుమ్మి విశ్వనాథంగారు, బాలాంత్రపు రజనీకాంతరావుగారు, పోలాప్రగడ సత్యనారాయణ మూర్తిగారు, సి. రాఘవాచారి గారు, శ్రీరమణ గారు , కె. కె. రామానుజాచార్యులుగారు, చామర్తి కనకయ్య గారు, ఆర్ బి. పెండ్యాల గారు, చిర్రావూరి సుబ్రహ్మణ్యంగారు… కె. రామచంద్రమూర్తి గారు, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, బేతవోలు రామబ్రహ్మం గారుచెప్పాలంటే చాలామందే ఉన్నారు. అందరూ మమ్మల్ని వారి సొంత పిల్లల్లా చూసుకున్నారు. స్నేహంగా సలహాలు, సూచనలిచ్చారు.
ఇంత మంచి ప్రపంచాన్ని మాకు అందించావు నాన్నా నువ్వు.
అందరిలోనూ మంచినే చూడమన్నావు.
చెడును ఎత్తిచూపద్దన్నావు.
ప్రయత్నించాం.
కాని అప్పుడప్పుడు తెలియక చెడును ఎత్తి చూపుతున్నాం.
ఆ అలవాటును క్రమంగా విస్మరించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం.
నీతో గడిపిన రోజులు చాలా తక్కువే నాన్నా.
శైశవం, బాల్యం, యవ్వనం… అన్నీ తెలియకుండానే గడిచిపోయాయి.
నీ గురించి కొద్దికొద్దిగా అర్థం చేసుకుంటున్నామనుకుంటుంటే… నువ్వు మాకు మూడు పదుల వయసు రాకుండానే మమ్మల్ని విడిచి వెళ్లిపోయావు.
మా పెళ్లిళ్లు చేసేసి, ఇక నీ బాధ్యతలు పూర్తయిపోయాయి అనుకున్నావేమో.
కాని నీ విలువ, నీ గొప్పదనం, నీ ఔన్నత్యం ఇప్పుడు తెలుస్తున్నాయి నాన్నా.
నిత్యం నీతో మాట్లాడుకుంటూనే ఉంటాం.
మా గుండెల్లో కాదు, మా రక్తంలో నువ్వున్నావు.
నువ్వు పంచి ఇచ్చిన రక్తం కదా ఇది.
అందుకే నువ్వు మా ప్రతి రక్త బిందువులోనూ నిక్షిప్తమై ఉన్నావు.
నీ ప్రతిరూపాలుగా జన్మించిన మాలో నువ్వు నిరంతరం మేల్కొనే ఉంటావు. మమ్మల్ని సన్మార్గంలో నడిపిస్తూనే ఉంటావు.
అంటే నువ్వు మాతో ఉన్నట్లే కదా.
మేం చేసే ప్రతి పనినీ చూస్తున్నట్లే కదా.
మా వెన్నంటి మమ్మల్ని నడిపిస్తున్నట్లే కదా.
చాలు నాన్నా!
మాకు ఇంతకంటె ఏం కావాలి?
నీ కళ్లతోనే చూస్తున్నాం
నీ వాక్కుతోనే పలుకుతున్నాం.
నీ ఊపిరినే పీలుస్తున్నాం.
నీ శ్వాసగా జీవిస్తున్నాం.
నువ్వు తినిపించిన గోరుముద్దలనే తింటున్నాం.
నీ నలుగురు పిల్లలం నీ ప్రతిరూపాలుగా, సఖ్యంగా, ఏకత్రాటిపై నడుస్తున్నాం.
ఇది నీ మార్గం నాన్నా.
నీ మార్గాన్ని అనుసరిస్తాం.
మా ఊపిరిగా నువ్వు ఉన్నంతవరకు నిన్ను శ్వాసిస్తూనే ఉంటాం నాన్నా.
నీ పేరు మీద నీ మార్గంలో పయనిస్తున్న వారిని నీ పుట్టిన రోజునాడు సత్కరించుకుంటున్నాం.
–––––––––––––––
(ఉషశ్రీ 96 వ జయంతి సందర్భంగా)
డా. పురాణపండ వైజయంతి (ఉషశ్రీ మూడవ కుమార్తె)
No words
ఆహా! అద్భుతమైన జ్ఞాపకాలు, నిజమైన నివాళి. మొత్తం పూర్తయ్యేసరికి కన్నీటి తెర అడ్డం వచ్చి ఎంతో రాద్దమనుకుని రాయలేక పోతున్నా.
చాలా బాగా చెప్పారు. నా చిన్నతనంలో మీ నాన్నగారి ఉపన్యాసాలు అంతగా అర్థం కాకపోయినా ఆయన కంఠానికి ముగ్ధులై వింటూ ఉండేవాడిని. ఉషశ్రీ గారు అంటే రామాయణం మీద ప్రవచనాలు చెపుతారని ఆయన గొప్పతనం మాత్రమే తెలుసు కానీ మీ వ్యాసం తో ఆయన వ్యక్తిత్వం & వ్యక్తిగత విషయాలు కూడా తెలిసాయి. చాలా సంతోషం. అంతటి మహనీయులు కుమార్తెలు గా మీరు చాలా ధన్యజీవులు.