ప్రాణం పోసిన పింగళి పాటలు
పది పాటలు ఆణిముత్యాలు
(డాక్టర్ వైజయంతి పురాణపండ)
కంబళి గింబళి
తల్పం గిల్పం
ఇలాగ
పింగళిని ఏమనాలి.
పింగళి గింగళి అంటే బాలేదు.
పింగళి గొంగళి అంటే బాలేదు.
పింగళి కంగాళి అంటే బాలేదు.
పింగళిని ఇలా జంట పదాలతో అనాలనిపించదు.
ఎందుకంటే..
పింగళి బంగారు పాళీ
పింగళి వాక్యం కదళీ పాకం
ఆ..
అది…
పింగళీ కలం… నీది కదళీ ఫలం అనేద్దాం.
ఇది కాస్త బావుందిగా.
బావుండటం కాదు..
నిజంగానే
పింగళి పాటలలోని భావం
కదళీపాకం.
అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లే ఉంటుంది.
పదాల కోసం పెద్దగా నిఘంటువు చూడక్కర్లేదు.
ఒకవేళ చూద్దామనుకున్నా..
ఈ నిఘంటువు వేరు కదా.
ఇది పింగళి నిఘంటువు.
అందుకే పింగళి గీతాల అర్థం కోసం తలపండు పగలగొట్టుకోవక్కర్లేదు.
––––––
ఈరోజు పింగళి కాదు..
మిస్ పింగళి
అదేనండీ మిస్ మేరీ లేదా మిస్సమ్మ అనే సావిత్రి పలికిన డైలాగ్ ఈ సినిమాలో ఉంది.. తెలుసుగా…
అందుకే ఈ నాగేంద్రుడు ఈ రోజు మిస్ పింగళి.
ఈ నాగేంద్రుడు అనే పేరును తల్లిదండ్రులు బాగా ఆలోచించి పెట్టారేమో.
ఒకటి –
ఫణిరాజు అంటే ఆదిశేషుడు.
ఇంకోటి –
గజరాజు (నాగము అంటే ఏనుగు) అంటే ఐరావతం.
ఒకరు విష్ణుమూర్తి తల్పం.
ఒకరు ఇంద్రుని సంపద.
అందుకే ఇంటి పేరు, ఒంటి పేరు కూడా ఘనంగానే ఉన్నాయి.
అమ్మో..
పింగళి గారు..
బాగా బాగు…
అలమలం..
ఓ హలా..
ఇక చాలు చాలు
నా గురించి హాయిగా పలికారు…
నిజం చెప్పారా… అబద్ధం చెప్పారా?
అని నన్ను ప్రశ్నిస్తున్నారు.
నిజమే చెప్పాను.
ఇంకా చెప్పాలంటే…
ఎంతో కొంత తక్కువే నిజం చెప్పాను..
అని సమాధానమిస్తాను.
ఈ రోజు అంటే 2025, జనవరి 12…
మిస్సమ్మకు 70 సంవత్సరాలు..
ఈ పుట్టినరోజును మనం ఘనం జరపాలి కదా.
అందుకే తల్పాలు, కంబళ్లు లేకుండా…
రావోయి పింగళయ్యా…
మా చెప్పు మాట వినవయ్యా…
అంటూ ఈ ఏడు పదుల మిస్ మేరీ పాటలను ఒక్కసారి నెమరువేసుకుందాం.
–––––––––––––––––
అదేం చిత్రమో కాని, పింగళి మామ రాసిన పాటల పల్లవులన్నీ చిత్రాలకు టైటిల్స్ అయ్యాయి.
రావోయి చందమామా… బృందావనం, గోవిందుడు అందరి వాడేలే.. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే.. ఔనన్నా కాదన్నా..
–––––––––––––––––––––
పింగళి మామా…
మరీ ఇంత చిన్నగిన్న పాటలా…
నాలుగు వాక్యాలు రాసేసి పాట అనేస్తావా…
అవునులే.. నిజమేలే..
అందుకేగా పింగళి కదళి అన్నాం.
అల్పవాక్యం అనంతార్థం…
నువ్వు బాగా చదువుకున్నావుగా…
అందుకే అంత వేదాంతాన్ని రెండు మాటల్లో తేల్చేశావు.
నువ్వు రాసిన పాటలు కూడా తక్కువే.
అందుకే నీ పాటలన్నీ… గాయకుల గొంతుల్లో వేలు పెడితే చేతికి చల్లగా తగులుతాయి..
––––––––––––––
- రావోయి చందమామ మా వింత గాథ వినుమా
సామంతము గల సతికీ ధీమంతుడనగు పతినోయ్
సతి పతి పోరే బలమై సతమతమాయెను బ్రతుకే
ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్
మాటలు బూటకమాయే నటనలు నేర్చెను చాలా
తన మతమేమో తనది మన మతమసలే పడదోయ్
మనమూ మనదను మాటే అననీయదు తాననదోయ్
నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో
ఈ విధి కాపురమెటులో నీవొక కంటను గనుమా
పిల్లలు అన్నం తినకపోతే..
చందమామ రావే జాబిల్లిరావే అంటూ తల్లి చందమామను పిలుస్తూ అన్నం తినిపిస్తుంది.
ప్రేమికుల మధ్య విరహం కలిగితే చంద్రుడినే స్మరిస్తారు.
ఇక్కడ ఈ దంపతులు కాని దంపతుల మధ్య వచ్చిన సరదా తగాదాకి తీర్పు చెప్పమని చంద్రుణ్ని పిలుస్తున్నారు.
ఈ పాటను పూర్తిగా అర్థం చేసుకుంటే ఇది ఎంత చిలిపి తగాదానో అర్థమవుతుంది.
‘తగవులు పడటం కూడా ముచ్చట’ అన్నారు చూడండి పింగళి. అది నిజం. దంపతులు ముచ్చటగానే తగవులాడుకోవాలి.
ఒకటి కాదు రెండు కాదు అన్ని పదాలకూ ఓ భాష్యం రాస్తే, ఇదొక పెద్ద పరిశోధన గ్రంథం అవుతుంది.
––––––––––––––
- బృందావనమది అందరిదీ గోవిందుడు అందరివాడేలే
ఎందుకె రాధా ఈశునసూయలు అందములందరి ఆనందములే
పిల్లనగ్రోవిని పిలుపుని వింటే ఉల్లము ఝల్లున పొంగదటే
రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటె
రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోసులు వేయవటే ఎందుకె రాధా ఈశునసూయలు అందములందరి ఆనందములే
మోసులు అంటే వర్థిల్లటం, మొక్కలు పెరగటం అని నిఘంటువు పలుకుతోంది.
ఇంత అలతి పదాలతో పాటలు రాయటంలో ఆద్యుడు పింగళి అనిపిస్తోంది కదూ. అలతి పదాలలో ఎంతో వేదాంతాన్ని నింపేసి, మన మనసుల్లోకి తోసేశారు. ఎందుకే రాధా ఈర్ష్య అసూయలు.. అని మనకు ఉండకూడని లక్షణాన్ని ఒక్క ముక్కలో తేల్చేశారు. బృందావనం రాధది మాత్రమే కాదు, అందరిదీ, ఆ గోవిందుడు అందరివాడని భగవద్గీత బోధించేశారు ఈ పింగళి శ్రీకృష్ణుడు.
–––––––––––––––––––
- కరుణించు మేరిమాత
శరణింక మేరిమాత
నీవే శరణింక మేరిమాత
పరిశుద్ధాత్మ మహిమ వరపుత్రు గంటివమ్మ
ప్రభు ఏసునాథు కృపచే మా భువికి కలిగే రక్ష
తుది లేని దారి చేరి పరిహాసమాయే బ్రతుకు
క్షణమైనా శాంతిలేదే దినదినము శోధనాయే
పింగళి పాళీ ఎటు కావాలంటే అటు తిరుగుతుంది. ఏ అక్షరం కావాలంటే ఆ అక్షరంగా రూపాంతరం చెందుతుంది. మేరిమాత మీద ఇంత వేదాంత గీతాన్ని మరొకరు రాయలేరేమో. ‘తుది లేని దారి’ ఈ వాక్యాన్ని రెండుమూడు సార్లు చదువుకుందాం. ప్రతి దారికి ఎక్కడో ఒక చోట ముగింపు ఉంటుంది. లేదంటే మలుపులు తిరుగుతుంది. కాని ఈ దారికి తుది లేదు. అదే జీవితం. తుది లేని దారి చేరుకున్నాననడం. మరో వాక్యంలో ‘దినదినము శోధనాయే’.. అన్నారు. మనిషి నిరంతర అన్వేషి. అనునిత్యం శోధిస్తూనే ఉండాలి. అందుకే శ్రీశ్రీ శోధించి సాధించాలి, అదియే ధీర గుణం అన్నాడు.
––––––––––––––
- ఔనంటే కాదనిలే కాదంటే అవుననిలే
ఔనంటే కాదనిలే కాదంటే అవుననిలే
ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
అర్థాలే వేరులే… అర్థాలే వేరులే…
(ఆడువారు అంటే.. ద్రావిడ ప్రబంధ కర్తలగు పన్నెండుగురు విష్ణుభక్తులుట)
అలిగి తొలగి నిలిచినచో చెలిమిజేయ రమ్మనిలే
చొరవ చేసి రమ్మనుచో మర్యాదగ పొమ్మనిలే
ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
అర్థాలే వేరులే… అర్థాలే వేరులే…
విసిగినసిగి కసిరినచో విషయమసలు ఇష్టమెలే
తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే
ఎలా మాట్లాడిదే ఏమర్థం తీసుకోవాలో ప్రేమికులు పాఠం బోధించారు గురువర్యులు పింగళివారు. ఘోటక బ్రహ్మచారికి ఇలాంటి విషయాలు ఎలా తెలిశాయి అని ఓ తుంటరి ప్రశ్నిస్తే, ‘పెళ్లి చేసుకోలేదు కాబట్టే ఇంత బాగా రాయగలిగాను’ అని తుంటతుంటరి సమాధానం ఇచ్చారట ప్రేమరి పింగళి.
–––––––––––––––––
- తెలుసుకొనవె యువతి.. అలా నడుచుకొనవె యువతీ
యువకుల శాసించుటకే..యువతులవతరించిరని
సాధింపులు బెదరింపులు ముదితలకిట కూడవనీ
హృయమిచ్చి పుచ్చుకునే చదువేదో నేర్పాలనీ
మూతి బిగింపులు అలకలు పాతబడిన విద్యలనీ
మగువలెపుడు మగవారిని చిరునవ్వుల గెలవాలని
- తెలుసుకొనవే చెల్లీ.. అలా నడుచుకొనవే చెల్లీ
మగవారికి దూరముగ మగువలెపుడు మెలగాలని
మనకు మనమె వారికడకు పని ఉన్నా పోరాదని
అలుసు చేసి నలుగురిలో చులకనగ చూసెదరని
పదిమాటలకొక మాటయు బదులు చెప్పకూడదని
లేనిపోని అర్థాలను మన వెనుకనె చాటెదరని
అంటూ…
అమ్మాయిలకు, అబ్బాయిలకు కూడా ఆదర్శమైన హాయిని గొలిపే దాంపత్య సూత్రాలు బోధపరిచారు. డెబ్బై సంవత్సరాల తరవాత ఏం కావాలో తెలిసిన మహా ఋషి, యతి, కవీనూ మన పింగళి మామ.
–––––––––––
- బాబు ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు
ధర్మం చేస్తే పుణ్యమొస్తది ఖర్మ నసిస్తది బాబూ
ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు
కోటి విద్యలు కూటి కోసమే పూటే గడవని ముష్టి జీవితం
పాటు పడగ యే పని రాదాయే సాటి మనిషిని సావనా బాబూ
ఐస్ క్రీం తింటే ఆకలి పోదు కాసులతోనే కడుపు నిండదు
అయ్యా..అమ్మా..బాబూ..
చేసే దానం చిన్నది అయినా పాపాలన్నీ బాపును బాబూ
ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు
నీ చెయి పైన నా చెయి కింద ఇచ్చి పుచ్చుకొను రుణమే బాబూ
ముష్టి ఏమిటిది ముసలి బ్రహ్మ మన చిట్టాలు రాసే జమలే బాబూ
ధర్మం ఆరణా ఒరణా రెండణా
ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు
ధర్మం చేస్తే పుణ్యమొస్తది ఖర్మ నసిస్తది బాబూ
ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు
అమ్మో…
ఇంత లోకరీతా…
ఇంత లోకనీతా…
అయ్యబాబోయ్ ….
ఈ జగత్ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం కాదు కాదు అర్థం శాసుకోవడం మన తరమా.
–––––––––––––––––
బాలనురా మదనా
విరి తూపులు వేయకురా మదనా
నిలిచిన చోటనే నిలువగ నీయక
వలపులు కురియునురా
తియ్యని తలపులు విరియునురా మదనా
చిలుకల వలె గోర్వంకల వలెనో
కులుకగ తోచునురా
తనువున పులకలు కలుగునురా మదనా
చిలిపి కోయిలలు చిత్తములోనే
కల కల కూయునురా
మనసులు కలవర పరచునురా మదనా
–––––––––––––––
- ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో
చిత్రములన్నీ నావేలే
కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే
తళుకు తళుకుమని తారలు మెరిసే నీలాకశము నాదేలే
ఎల్లరి మనముల కలవర పరిచే జిలిబిలి జాబిలి నాదేలే
ప్రశాంత జగమును హుషారు చేసే వసంత ఋతువు నాదేలే
పూవుల ఘుమ ఘుమ చల్లగ విసిరే మలయమారుతము నాదేలే
ప్రేమలో పడితే అన్నీ మనవేగా.
జాబిలి కలవర పరుస్తుందట.
జగమును వసంత ఋతువు హుషారు పరుస్తుందట.
పువ్వులు ఘుమఘుమలు విసిరే మలయమారుతం
అన్నీ..
ప్రేమికులవేనట.
మామ ఎప్పుడైనా ప్రేమలో పడ్డారేమోను.
లేకపోతే ఇంత బాగా ప్రేమికుల అంతరంగం ఆవిష్కరించగలడా.
––––––––––––––––––––
- ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
వినుటయే కాని వెన్నెల మహిమలు
అనుభవించి నేనెరుగనయా
నీలో వెలసిన కళలు కాంతులు
లీలగా ఇపుడే కనిపించెనయా
కనుల కలికమిది నీ కిరణములే
(చల్లదనం కోసం కంటికి వేసే మందు)
మనసును వెన్నగా చేసెనయా
చెలిమి కోరుతూ ఏవో పిలుపులు
నాలో నాకే వినిపించెనయా
ప్రేమ గీతాలు ఒకదానిని మించి ఒకటి రచించాడు ఈ ప్రేమ పెళ్లి లేని పింగళి మామ. రాయటానికి ప్రేమించాలా. హాయిగా చల్లని మనసుతో అనుభవించితే చాలదా. చాలు కదా. చాలునే చాలు కదా.
––––––––––––––
సీతారాం సీతారాం సీతారాం జయ సీతారాం
సీతారాం సీతారాం సీతారాం జయ సీతారాం
పైన పటారం లోన లొటారం
ఈ జగమంతా డంబాచారం
సీతారాం సీతారాం సీతారాం జయ సీతారాం
నీతులు పలుకుతూ ధర్మ విచారం
గోతులు తీసే గూఢాచారం
చందాలంటూ భలే ప్రచారం వందలు వేలు తమ ఫలహారం
గుళ్ళో హాజరు ప్రతి శనివారం
గూడుపుఠాణి ప్రతాదివారం
డాబులు కొడుతూ లోక విహారం
జేబులు కొట్టే ఘన వ్యాపారం
టాకు టీకుల టక్కు టమారం
కలికాలం మన గ్రహచారం
ఇందులో…
కలికాలం మన గ్రహచారం అనే ఒక్క వాక్యం చాలు.
వందల సంవత్సరాలుగా ఈ ప్రపంచం ఇలానే ఉంది. ఇలానే ఉంటుంది. ఇలానే ఉండబోతోంది. శిలాశాసనం రచించేశాడు అంగళ పింగళ మామ.
––––––––––––––––––––––
శ్రీజానకీదేవి సీమంతమనరే
మహలక్ష్మి సుందర వదనము గనరే
పన్నీరు గంధాలు సతిపైన చిలికించి
కానుకలు కట్నాలు చదివించరమ్మా
మల్లెమొల్లల సరులు సతిజడలో సవరించి
ఎల్లవేడుకలిపుడు చేయించరమ్మా
కులుకుచు కూచున్న కలికిని తిలకించి
అలకచెందనీక అలరించరమ్మా
పుడమెల్ల దీవించు కొమరుని గనుమంచు
ఎల్లముత్తయిదువలు దీవించరమ్మా
పింగళి నిజంగానే మామయ్య. చందమామయ్య.
అందుకే మేనకోడలికి సీమంతం కూడా చేసేశాడు.
మేనకోడలికా లేక సొంత కూతురికా అనేట్లుగా దగ్గరుండి సీమంతం చేయించేశారు. మంచి కుమారుడు పుట్టాలని ఆశీర్వదించేశాడు.
మొత్తానికి మిస్సమ్మని చంకనెత్తుకుని చందమామను చూపిస్తూ, ప్రేమ భాషను నేర్పిస్తూ, సీమంతం చేసేసి, మనవణ్ని మనకు ఇచ్చేశాడు. ఆ మనవడి వయసు ఈ రోజుకి 70 సంవత్సరాలు. మిస్సమ్మకి కూడా 70 సంవత్సరాలే.
మిస్సమ్మ నిత్య యవ్వనురాలు.
దేవతలలాగ ఈవిడ కూడా త్రిదశుల కోటాలోకే వస్తుంది.
రావడమేమిటి…
రప్పించేశారు..
కాస్తంత తైలం అందరికీ పంచి…
ఈ ఏడు పదుల బాలికను మిస్సమ్మగాను మిస్ మేరీగాను మనకు బహుమతిగా ఇచ్చేశారు.