(శ్రీధర్ వాడవల్లి, 9989855445)
జగదానందకారకుడైన రాముడిని బంటు రీతి కొలువు ఇవ్వమని కోరుతూ తాదాత్మ్యం చెందిన భక్తుడు, సంప్రదాయ సంగీతమూర్తి త్యాగయ్య. ఎందరో మహానుభావులు అంటూ తన వినమ్రతను చాటుకున్న భక్తుడు త్యాగయ్య. అనుదినం రఘుకుల రాముడిని స్మరించే మహానుభావుడు త్యాగయ్య. కొద్దిపాటి సంగీత పరిజ్ఞానం ఉన్నవారెవరైనా కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్నీ, త్యాగరాజునీ వేరు చేసి చూడ లేరు. కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఆయన చేసిన అసమానమైన కృషి అలాంటిది. కర్ణాటక సంగీతానికీ, త్యాగరాజుకీ విడదీయరాని బంధం అది. మాధుర్యం చూపించీ, సంగీతం అంటే మరింత ఆసక్తిని కలిగించిన వాడు త్యాగరాజు. ప్రస్తుతమున్న కచేరీ పద్ధతికి ఆద్యుడు. సరళమైన భాషలో వినసొంపైన శాస్తీయ సంగీతాన్ని అజరామరం చేసాడు. రామ భక్తుడిగా తనదైన ముద్రతో సంగీతాన్ని భక్తి వాహకంగా వాడుకొన్న వ్యక్తి త్యాగరాజు.
త్యాగరాజు కీర్తనలను జన బాహుళ్యంలోకి చొప్పించటానికి తెలుగు సినిమా దర్శకులు సంగీత దర్శకులు అవకాశం వచ్చినప్పుడు ఈ కీర్తనలను సినిమాల ద్వారా తెలుగువారిని అలరించారు. కొన్ని సార్లు పూర్తి కీర్తనని సినీ సంగీత ఫక్కీలోకి మార్చారు. కొంతమంది కీర్తనలోని పల్లవులను తీసుకొని పాశ్చాత్య సంగీత ధోరణిలో నవ్యతను మేళవించారు. (ఇక్కడ కీర్తనలను చిన్నబుచ్చాలని అపహాస్యం పాలు చెయ్యాలని కాదు. వాటి నుంచి ప్రేరణ పొంది అలా మార్చారని అర్దం చేసుకోవాలి)
“సామజ వరగమనా” ఈ పదం వినగానే చాలా మందికి అలవైకుంఠ పురంలోని పాట గుర్తుకొస్తుంది. అదే ముందు తరం వారికైతే త్యాగరాయ కీర్తన గుర్తుకొస్తుంది. ఇక 80లో వారికైతే శారదా అంటూ గట్టిగా అరిచే శంకరాభరణం శంకర శాస్త్రిగారు గుర్తుకొస్తారు. 90 లో అయితే బాలకృష్ణ సామజవరగమనా గుర్తొస్తుంది.. సామజవరగమన ‘ అనే పదం త్యాగరాజ స్వామి కీర్తనలోనిది … ‘ సామజ ‘ అనగా ” ఏనుగు ” అని ..’ వరగమనా ‘ అనగా ” చక్కని నడక ” అని అర్థం … అలానే సామవేదం అనగా సంగీతం! .. మన భారతీయ సంగీతానికి మూలం సామవేదం! ” సామజవరగమన ” అంటే ఏనుగులా గంభీరంగా, హుందాగా, ఠీవిగా నడిచేవారు అని అర్థం.
వాల్మీకి తన రామాయణం లో ‘అరణ్యవాసం’లో ఒకచోట రాముడిని “గజ విక్రాంతగమనుడు” అని వర్ణించారు. అంటే రాముడు ఏనుగులా హుందాగా నడిచే వాడు అని అర్ధం.. ఇదే అర్థం వచ్చేలా త్యాగరాజు తన కీర్తనలో ‘ సామజవరగమన ‘ అంటూ శ్రీరాముణ్ణి స్తుతించారు. ఏనుగు నడకవంటి గంభీరమైన నడకతో అందరి హృదయాలను ఏలుతున్న ఓ శ్రీహరి, నువ్వు కాలం తో సంబంధం లేకుండా అందరి చేత పొగడ బడతావు.. సామవేదం పుట్టుక నీవల్లే జరిగింది.. సంగీతాన్ని రక్షించేవాడివి నీవే, గుణమునకి, దయకి ఉదాహరణ నీవే.. నన్ను కూడా నీవే నడిపించాలి.. సమా వేదమునుండి పుట్టిన సప్తస్వరముల వల్ల, ప్రకాశిస్తూ.. గోవులని రక్షిస్తూ.. మురళీ గానం తో మమ్మల్నందరినీ ఆనంద పరుస్తూ.., ఈ త్యాగరాజ వందనములను అందుకో.. ఇదీ సామజవరగమన కు సంబంధించిన అసలు భావం. శాస్త్రీయ సంగీతానికి పెద్ద పీట వేసే కళా తపస్వి కె. విశ్వనాధ్ గారు శంకరా భరణం సినిమాలో (సామజ వర గమనా ) శృతిలయలు చిత్రంలో (శ్రీగణనాధం ) సప్తపదిలో (మరుగేలలా ఓ రాఘవా ) లాంటి త్యాగరాజ కృతులను సినీ సంగీత బాణిలో చొప్పించి శ్రోతలకు పరిచయం చేశారు .
బాపు దర్శకత్వం వహించిన పెళ్ళి పుస్తకం చిత్రంలో (జగదానందకారక) కృతిని శ్రోతలకు అందించారు . కమర్షియల్ చిత్రాల గరిమనాభి దర్శకేంద్రుడు రాఘ వేంద్రరావు అల్లుడుగారు చిత్రంలో (నగుమోము ) అన్న కృతిని సందర్బోచితంగా చిత్రీకరించి జేసు దాస్ గాత్రం ద్వారా శ్రోతలకు పరిచయం చేశారు. ఇళయరాజు సంగీతంలో ఘర్షణ చిత్రంలోని ఒక పాటలోని పల్లవిగా త్యాగయ్య కృతిని ఉపయోగించుకున్నారు. నారీ నారీ నడుమ మురారి చిత్రంలో మనసులోని మర్మమును తెలుసుకో అన్న కృతిని మరియు వేటూరి వ్రాసిన చరణాన్ని కలిపి కె.వి మహదేవన్ కూర్చిన బాణి ప్రజాదరణ పొందింది.
త్యాగయ్య కృతులు సంప్రదాయ సంగీతానికి మధురస్మృతులు. ఆ కీర్తనలు అనాటి తరం నుంచి నేటి తరం వరకూ ఆనందాన్ని ఇస్తున్నాయి. యువ గాయనీ గాయకులు, యువ సంగీత వాయిద్య కళాకారులు అనేక రకాలుగా వాటికి ప్రాచుర్యం కల్పిస్తున్నారు. దొరకునా ఇటువంటి సేవ అంటూ ఆ సంగీత మూర్తికి నివాళి అర్పిస్తున్నారు. (వ్యాస రచయిత ప్రముఖ సినీ విమర్శకుడు)
ALSO READ: Kaziranga National Park Endowed with Pristine Beauty