Saturday, September 23, 2023
HomeAP Newsసహకారరంగ చరిత్రలో ప్రత్యేకమైన రోజు

సహకారరంగ చరిత్రలో ప్రత్యేకమైన రోజు

ఆప్కాబ్ వజ్రోత్సవంలో సీఎం జగన్
లోగో ఆవిష్కరణ
విజయవాడ, ఆగస్టు 04 :
రాష్ట్ర కోపరేటివ్‌ చరిత్రలో అంటే సహకార రంగ చరిత్రలో ఈ రోజు చాలా ప్రత్యేకమైనదని ఏపీ సీఎం వై.ఎస్. జగన్ చెప్పారు. విజయవాడ ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సహకార బ్యాంకు లిమిటెడ్‌ (ఆప్కాబ్‌) వజ్రోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆప్కాబ్‌ షష్టిపూర్తి జరుపుకుంటుందనీ, రాష్ట్రంలో రైతులకు అండగా నిలుస్తూ.. బ్యాంకింగ్‌ సేవల్లో రాష్ట్ర సహకార బ్యాంకు ఆప్కాబ్‌ నేటితో 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కాబట్టి.. ఈ రోజుకు ఒక విశిష్టత ఉందని ఆయన వివరించారు. ఆయన ప్రసంగ పాఠం ఇలా ఉంది. ముఖ్యంగా కోపరేటివ్‌ బ్యాంకు ఈ 60 సంవత్సరాల ప్రయాణం.. ఎలా ఉంది అని వెనక్కి తిరిగి చూసుకుంటే… చాలా గొప్పగా నిలబడింది అని చెప్పుకునే స్ధాయిలో ఆప్కాబ్‌ ఉంది. ఈ సందర్భంగా రైతన్నలకు, బ్యాంకు సిబ్బందికి, బ్యాంకును సమర్ధవంతంగా నిర్వహిస్తున్న యాజమాన్యానికి, బ్యాంకు కార్యకలాపాలలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా నా తరపున అభినందనలు తెలియజేస్తున్నాను.

ఈ రోజు మనందరికి తెలిసిన ఒక నానుడి కూడా చెప్పాలి. భారతరైతు అప్పుల్లోనే పుడతాడు.. అప్పుల్లోనే పెరుగుతాడు.. అప్పుల్లోనే తాను చనిపోతాడనే నానుడి ఒకప్పుడు ఉండేది. కారణం ఏమిటంటే.. విత్తనం నుంచి పంట కోత వరకూ అన్నింటిలోనూ రైతులకు పెట్టుబడి అవసరం. ఆ పెట్టుబడి అవసరం అయినప్పుడు దానికోసం రైతన్నలు అప్పు చేయాల్సి వస్తుంది. ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక అవస్ధలు పడుతున్న పరిస్థితులు వల్ల ఈ నానుడి వచ్చింది.
విప్లవం లాంటి మార్పు…
అప్పుడు విప్లవంలా ఒక మార్పు జరిగింది. అదేమిటంటే.. ఎప్పుడైతే రైతులకు దగ్గరగా బ్యాంకింగ్‌ వ్యవస్ధ అడుగులు వేసిందో అప్పుడే.. రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఒక్క మార్పుతో వ్యవసాయంలో రైతులు నిలబడగలిగే పరిస్థితి వచ్చింది. ఈ మార్పును మరింత ముందుకు తీసుకువెళ్తూ ఈ రాష్ట్రంలో మన బ్యాంకు, రైతుల బ్యాంకు అయిన ఆప్కాబ్‌ అనే కోపరేటివ్‌ బ్యాంకు వచ్చింది. ఒక చారిత్రాతక అవసరం అయిన సందర్భంలో ఈ బ్యాంకు వచ్చింది. రైతన్నలను చేయిపట్టుకుని నడిపించింది. ఇటువంటి ఈ బ్యాంకు ఎన్నో ఒడిదుడికులును కూడా చూసింది.
ఆప్కాబ్‌– వైఎస్సార్‌– మార్పులు.
గతంలో ఎన్నో ఇబ్బందకర పరిస్థితులను ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి. అప్పట్లో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు.. నాన్నగారు, ప్రియతమ నేత రాజశేఖరరెడ్డి గారు కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ఆప్కాబ్‌ను నిలబెట్టడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అప్పట్లో వైద్యనా«ధన్‌ సిఫార్సులను తాను ఆమోదించి.. సహకార పరపతి వ్యవస్ధ అంటే కోపరేటివ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ను బలోపేతం చేయడం కోసం రూ.1850 కోట్లు ఇచ్చిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ఇదొక్కటే కాకుండా రైతులకు మరింత మంచి జరగాలని 9 జిల్లా కేంద్ర సహకారబ్యాంకులు(డీసీసీబీ)కు అప్పట్లో రూ.217 కోట్లు షేర్‌ కేపిటల్‌గా ఇన్‌ఫ్యూజ్‌ చేసి సహకార రంగాన్ని ఆదుకున్నారు.
పావలా వడ్డీ – రైతు రుణాలు..
రైతులకు మరింత తోడుగా నిలుస్తూ.. 2008 ఖరీప్‌ నుంచి పావలా వడ్డీకి రుణాలు ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి గారు. నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్లీ అదే ఒడిదుడుకులు ఈ సహకార రంగంలో ఎదురవడం చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈ బ్యాంకును మళ్లీ నిలబెట్టాలి.. తోడుగా నిలబడాలని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా ఆలోచనలు చేయడం మొదలుపెట్టి.. వేగంగా అడుగులు కూడా వేస్తున్నాం.


మరింత మెరుగ్గా ఆప్కాబ్‌…
మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2019లో నాబార్డ్‌ కన్సెల్టెన్సీ సర్వీసు అయిన నాబ్‌కాన్స్‌(నాబార్డు కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ప్రైయివేట్‌ లిమిటెడ్‌) అధ్యయం చేయమని.. అప్కాబ్‌ను మెరుగైన పరిస్థితుల్లోకి ఎలా తీసుకొని పొగలుగుతామో అధ్యయనం చేయమని నాబ్‌కాన్స్‌ బృందానికి బాధ్యతలు అప్పగించాం. వారు దాదాపు ఏడాది టైం తీసుకుని.. ప్రతి బ్యాంకు తిరిగి ఉన్న పరిస్థితులు అన్నీ గమనించారు. కొన్ని సూచనలు, సలహాలు అందించారు. వాటిన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ రాష్ట్రంలో సహకార సంఘాలు, రైతుల ప్రస్తుత పరిస్థితి, అవసరాలకు అనుగుణంగా 1964 నాటి చట్టాన్ని సవరించాం. అనంతరం కోపరేటివ్‌ గవర్నెన్స్‌ను మరింత మెరుగుపరుస్తూ.. ఆప్కాబ్‌లో డీసీసీబీ బోర్డులలో ప్రొఫెషనల్స్‌ కూడా ఉండేటట్టుగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే చర్యలు తీసుకున్నాం. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది. సామర్ధ్యం పెరుగుతుంది. ప్రొఫెషనల్‌ డైరెక్టర్లు ఎప్పుడైతే బ్యాంకుల్లో కూర్చోవడం మొదలుపెట్టారో.. అప్పుడు రాజకీయంగా వేరే అడుగులు వేసే కార్యక్రమాలు కూడా తగ్గే పరిస్థితి వచ్చింది.
అదే విధంగా పారదర్శకత, సామర్ధ్యం పెంచడంలో భాగంగానే… డీసీసీబీల సీఈఓల ఎంపిక కూడా రాష్ట్రస్ధాయిలో ఒక కామన్‌ సెలక్షన్‌ కమిటీ ఏర్పాటు చేసి.. దాని ద్వారా చేయడం మొదలుపెట్టాం. తద్వారా డీసీసీబీల సీఈఓలను కూడా మరింత ప్రొఫెషనల్‌గా ఎన్నుకునే కార్యక్రమం తీసుకొచ్చాం. వీటితో పాటు ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం మూలధనాన్ని సమకూర్చుకోలేని డీసీసీబీలకు ఆప్కాబ్‌కు గత ఏడాది రూ.295 కోట్లు షేర్‌ కేపిటల్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌ప్యూజ్‌ చేసింది.


ఆప్కాబ్‌ – డిజిటలైజేషన్‌– కంప్యూటరైజేషన్‌
ఇవన్నీ ఆప్కాబ్‌ను బలోపేతం చేసే దిశగా వేసిన అడుగులు. ఇదొక్కటే కాకుండా.. మొత్తం ఆప్కాబ్‌ వ్యవస్ధలన్నింటిలోనూ కూడా పారదర్శకతను, సామర్ధ్యాన్ని పెంచేందుకు ఈ వ్యవస్ధలన్నింటిలోనూ డిజిటలైజేషన్, కంప్యూటరైజేషన్‌ను తీసుకుని వచ్చాం. టీసీఎస్‌ను ఇన్‌వాల్వ్‌ చేసి ఈ ప్రక్రియను వేగంగా చేపడుతున్నాం.
రాబోయే రోజుల్లో డిజిటలైజేషన్‌లో భాగంగా ప్రతి ప్యాక్‌కు పూర్తిగా అనుసంధానం అయిన వెంటనే.. పారదర్శకత, సామర్ధ్యం అన్నవి గణనీయంగా పెరుగుతాయి.
నాలుగేళ్లలో ప్రగతి…
ఈ చర్యలన్నింటి వల్ల రాష్ట్రంలో వ్యవసాయ పరపతి సంఘాల వ్యవస్ధ గణనీయంగా అభివృద్ధి చెందింది. ఏ స్ధాయిలో అభివృద్ధి ఉందంటే… 2019 నుంచి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో సహకార బ్యాంకుల వాణిజ్య కార్యకలాపాలు 24 శాతం పెరిగాయి. ఆప్కాబ్‌ లావాదేవీలు గణనీయంగా విస్తరించాయి. 2019 మార్చి 31న.. మనం అధికారంలోకి వచ్చేనాటికి రూ.53,249 కోట్లుగా ఉన్న సహకార బ్యాంకుల పరపతి ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.1,05,089 కోట్లకు చేరింది. నాలుగేళ్లలో ఏకంగా రెట్టింపు అయింది. అలాగే 2019లో రూ.13,700 కోట్లుగా ఉన్న ఆప్కాబ్‌ పరపతి నాలుగేళ్లలో 2023 నాటికి ఏకంగా రూ.36,700 కోట్లకు పెరిగింది. దాదాపు మూడురెట్లు పెరిగింది.


లాభాల బాటలో డీసీసీబీలు…
గత ఆర్ధిక సంవత్సరంలో ఒక్క ఏలూరు మినహా అన్ని డీసీసీబీలు లాభాల్లో నడుస్తున్నాయి. నిజంగా ఎంత బాగా నడుస్తున్నాయి అంటే 36 ఏళ్లు తర్వాత లాభాలు గడించిన కర్నూలు డీసీసీబీని ఇవాల మనం చూస్తున్నాం. 28 సంవత్సరాల తర్వాత లాభాలు పొందిన కడప డీసీసీబిని కూడా చూస్తున్నాం. ఈ సందర్భంగా ఇంత గొప్ప అడుగులు వేయగలిగినందుకు, వేయించినందుకు సిబ్బందికి, యాజమాన్యానికి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.
భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు…
ఇంతకముందు నేను చెప్పినట్టుగా.. ఎప్పుడైతే డిజిటలైజేషన్, కంప్యూటరైజేషన్‌ పూర్తవుతుందో, ఆప్కాబ్, డీసీసీబీల బలోపేతం ప్యాక్స్‌(పీఏసీఎస్‌) వరకు తీసుకుని రావడం ఎప్పుడు పూర్తవుతుందో… అప్పుడు ఇవాళ మనం చూస్తున్న మార్పు కన్నా మెరుగైన ఫలితాలు కూడా రాబోయే రోజుల్లో చూస్తాం. దీనికోసం ప్రత్యేకంగా రూ.25 కోట్లు నిధులు కేటాయించాం. వాటితో పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.
ఇదొక్కటే కాకుండా ప్యాక్స్‌ను ఆర్‌బీకేలకు అనుసంధానం చేసే గొప్ప మార్పు కూడా జరిగింది. రైతును ప్రతి అడుగులోనూ గ్రామస్ధాయిలో చేయిపట్టుకుని నడిపిస్తున్న వ్యవస్ధ.. రైతు భరోసా కేంద్రాలు. ఈ ఆర్బీకేలను ప్యాక్స్‌కు అనుసంధానం చేశాం. ఆ తర్వాత ఈ వ్యవస్ధను డీసీసీబీకి అనుసంధానం చేశాం. డీసీసీబీ నుంచి ఆప్కాబ్‌కు అనుసంధానం చేసే గొప్ప ప్రక్రియ జరుగుతుంది. ఈ రోజు మిగిలిన బ్యాంకుల సహాయసహకారాలతో ప్రతి ఆర్బీకేలోనే బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు కూడా అందుబాటులో ఉన్నారు. డిజిటలైజేషన్, బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు, ఆర్బీకేలతో అనుసంధానం ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో విప్లవాత్మక మార్పులు గ్రామస్ధాయిలోనే జరుగుతాయి అని చెప్పడానికి నిదర్శనంగా నిలబడతాయి.


రైతులకు ఆర్బీకే వద్దే క్రెడిట్‌- అగ్రీ ఇన్‌పుట్స్‌..
రైతులకు ఆర్బేకేల వద్దనే క్రెడిట్‌తో సహా వ్యవసాయ ఇన్‌పుట్స్‌ పొందే వీలు కూడా రాబోయే రోజుల్లో మన కళ్లెదుటనే కనిపించే పరిస్థితి వస్తుంది. బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు అక్కడే ఉన్నారు, ప్రతి ఆర్బీకే స్ధాయిలోనూ ఇ–క్రాపింగ్‌ జరుగుతుంది. మొత్తం డిజిటలైజేషన్, కంప్యూటరైజేషన్‌ జరుగుతుంది. ఇన్ని కనిపిస్తున్నప్పుడు సహజంగానే ఆర్బీకే స్ధాయిలోనే క్రెడిట్‌ ఇవ్వడం అన్నది రాబోయే రోజుల్లో మనం చూడబోయే గొప్ప మార్పు అవుతుంది.
ఈ రోజు రైతులందరికీ కూడా ఆప్కాబ్‌ సేవలు విస్తరిస్తున్నాయి. మొట్టమొదటిసారిగా ఆప్కాబ్, డీసీసీబీలు ఏ స్ధాయిలో ఇన్‌వాల్వ్‌ అయ్యాయంటే… ఆర్బీకే స్ధాయిలోనే కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు అంటే ఫామ్‌మెకనైజేషన్‌ను తీసుకొచ్చాం. రైతులు గ్రూపుగా ఏర్పడి 10 శాతం కడితే.. 40శాతం బ్యాంకు రుణాలు, 50 శాతం ప్రభుత్వ నుంచి సబ్సిడీ వస్తుంది. పెద్ద పెద్ద వ్యవసాయ ఉపకరణాలు ఆర్బీకే స్ధాయిలోనే అందుబాటులోకి వచ్చాయి. దీనికోసం ఏకంగా ఆప్కాబ్‌ దగ్గర నుంచి రూ.500 కోట్ల రుణాలు మంజూరు కూడా జరిగింది.
రైతు- గ్రామం రెండూ బాగుండాలని…
గ్రామీణ వ్యవస్ధలో రైతు, గ్రామం రెండూ బాగుండాలంటే.. గ్రామస్ధాయిలో వ్యవసాయంతోపాటు పాడి, పంట వారి ఆర్ధిక స్వావలంబన కూడా ముడిపడి ఉన్నాయి. గ్రామీణ వ్యవస్ధలో అక్కచెల్లెమ్మలు, రైతులు వీళ్లంతా ఆర్ధికంగా ఎదగగలిగితే గ్రామీణ వ్యవస్ధ బ్రతుకుతుంది. అటువంటి అక్కచెల్లెమ్మలకు కూడా మంచి చేసే గొప్ప అడుగు కూడా ఆప్కాబ్‌ ద్వారా పడింది. దానివల్ల పాడి, పంట విపరీతంగా పెరిగాయి. ఇవాల మనం ఇస్తున్న చేయూత, ఆసరా, సున్నావడ్డీ వీటన్నింటినీ బ్యాంకులతో అనుసంధానం చేసి, ఆ డబ్బులను సరైన పద్ధతితో వాడుకోగలిగితే… అమూల్‌ లాంటి సంస్ధ గ్రామస్ధాయిలోకి రావడం ఎప్పుడు మొదలుపెడుతుందో.. అప్పుడు ఏ రైతన్న, అక్కచెల్లెమ్మ మోసపోకుండా మంచి డబ్బులు సంపాదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
గ్రామ స్ధాయిలో వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు గతంలో 12శాతం లేదా అంతకంటే ఎక్కువ వడ్డీకి రుణాలిస్తున్న పరిస్థితిలుండేవి. ఆప్కాబ్‌ వీటన్నింటిలో ముందడుగు వేస్తూ.. అన్ని రంగాల్లో విస్తరించి, గ్రామస్ధాయిలో రుణాలు ఇప్పించగలిగే స్ధాయిలోకి ఏర్పడింది. రాబోయే రోజుల్లో ఆప్కాబ్, డీసీసీబీలు, ప్యాక్స్‌తో అనుసంధానం అయిన ఆర్బీకేలు.. ఈ పంపిణీ వ్యవస్ధ బహుశా దేశ చరిత్రలో ఏ ఒక్క బ్యాంకుకూ లేని విధంగా.. మన ఆప్కాబ్‌కు ఉంటుంది.


ఆప్కాబ్‌– భారీ నెట్‌వర్క్‌….
ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే, ప్యాక్స్‌కు అనుసంధానం, కంప్యూటరైజేషన్, డిజిటలైజేషన్, అక్కడ నుంచి డీసీసీబీ, అక్కడ నుంచి ఆప్కాబ్‌కు అనుసంధానం ఈ రకమైన భారీ నెట్‌వర్క్‌ ఏ బ్యాంకుకూ లేదు. వీటన్నింటికి తోడు ఆర్బీకేల్లోనే బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు ఉన్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రతి గ్రామంలోనూ డిజిటల్‌ లైబ్రరీలు తయారవుతున్నాయి. గ్రామస్ధాయిలోకి ఫైబర్‌ గ్రిడ్‌ చేరుకుంటుంది. ఇవన్నీ రాబోయే రోజుల్లో మార్పులకు శ్రీకారం చుట్టినట్టవుతుంది.
ఆప్కాబ్‌ ఇంకా గొప్పగా ఎదగాలని, దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. రైతులకు ఇంకా మంచి చేసే అవకాశం దేవుడివ్వాలని ఆకాంక్షిస్తూ..సెలవు తీసుకుంటున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Prof Shankar Chatterjee, Hyderabad on A Success Story of a Doctor
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on My Experience in Eritrea
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Keep focus on alternative livelihood opportunities
Prof Shankar Chatterjee, Hyderabad on The Power of a Diverse Diet
Prof Shankar Chatterjee, Hyderabad on Food for Health Rhymes
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ