య‌డియూర‌ప్ప రాజీనామా చేశారా?

0

ర‌స‌కందాయంలో క‌ర్ణాట‌క రాజ‌కీయాలు
కాబోయే సీఎం ఎవ‌రు
బిఎస్‌వైకి ద‌క్క‌బోయే ప‌ద‌వి ఏమిటి?
ఏపీ గ‌వ‌ర్న‌ర్‌గా వ‌స్తారంటూ క‌థ‌నాలు
23తో ముగుస్తున్న బిశ్వ‌భూష‌ణ్ ప‌దవీకాలం
(సుబ్ర‌హ్మ‌ణ్యం వి.ఎస్. కూచిమంచి)

బెంగ‌ళూరు, జూలై 17: క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీతో ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి బి.ఎస్. య‌డియూరప్ప క‌ల‌వ‌డం రాజ‌కీయ స‌మీకర‌ణాలు మారుతున్నాయా అన్న అనుమానం రేకెత్తిస్తోంది. కేంద్ర క్యాబినెట్‌లోకి య‌డియూర‌ప్ప స‌న్నిహితురాలు శోభా క‌రాంద్లాజెను తీసుకోవ‌డంతోనే ఇలాంటిది ఏదో జ‌రుగుతుంద‌నే ఊహాగానాలు ప్రారంభ‌మ‌య్యాయి. బీజేపీ త‌న సిద్ధాంతాల‌కు విరుద్ధంగా వ‌యోవృద్ధుడైన య‌డియూర‌ప్ప‌ను క‌ర్ణాట‌క సీఎం చేసింది. 75 సంవ‌త్స‌రాలు దాటిన వారెవ‌రికీ అధికారిక ప‌ద‌వులు ఇవ్వ‌కూడ‌ద‌నేది బీజేపీ సిద్ధాంతం. ఇదే సూత్రంతో ఎల్.కె. అద్వానీ, ముర‌ళీమ‌నోహ‌ర్ జోషి వంటి సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టారు. య‌డియూర‌ప్ప ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి, రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు, కుల స‌మీక‌ర‌ణాల దృష్ట్యా సీఎంను చేయ‌క త‌ప్ప‌లేదు.

కానీ నాయ‌క‌త్వం ఆయ‌న్ను ఎలా త‌ప్పించాలా అనే అంశాన్ని విడిచిపెట్ట‌లేదు. ఆయ‌న్ని త‌ప్పిస్తే సీఎం కాద‌గ్గ‌వారెవ‌రు అనేదానికి అధినాయ‌క‌త్వం వ‌ద్ద జ‌వాబు లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఉంది. గాలి సోద‌రుల‌కు క‌ర్ణాట‌క‌లో గ‌ట్టి ప‌ట్టు ఉంది. వారిద్ద‌రూ ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి స‌న్నిహితులు. వారి ద్వారా య‌డియూర‌ప్ప‌కు కూడా ఆయ‌న‌తో స‌త్సంబంధాలున్నాయి. ఇప్పుడు వాటిని చూపించే ఏపీకి గ‌వ‌ర్న‌ర్‌గా య‌డియూర‌ప్ప‌ను పంపించాల‌నేది బీజేపీ వ్యూహంగా ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. తద్వారా ద‌క్షిణాదిలో ముఖ్యంగా ఏపీలో బీజేపీని బ‌ల‌ప‌ర‌చాల‌నేది కాషాయ బృందం ఆలోచ‌న అయి ఉంటుందంటున్నారు.

BL Santhosh


జ‌వాబు లేని ప్ర‌శ్న‌
య‌డియూర‌ప్ప‌ను త‌ప్పిస్తే…క‌ర్ణాట‌క సీఎం ఎవ‌రు? ఇది జ‌వాబు లేని ప్ర‌శ్న‌. ఎప్ప‌టినుంచో పార్టీకి రాష్ట్రంలో ఆర్థికంగా మ‌ద్ద‌తు ఇస్తున్న రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్‌ను కూడా కేంద్ర మంత్రివ‌ర్గంలోకి తీసుకున్నారు. అంటే నాయ‌క‌త్వం మ‌న‌సులో రాష్ట్ర సీఎం కాగ‌ల నేత ఎవ‌రో ఉన్నారు. అది ఎవ‌రు? ఇప్ప‌టి వ‌ర‌కూ తేల‌లేదు. ప్ర‌హ్లాద్ జోషి (ఇప్ప‌టికే కేంద్ర మంత్రివ‌ర్గంలో ఉన్నారు. అమిత్ షా, న‌రేంద్ర మోడీకి స‌న్నిహితుడు), జ‌గ‌దీశ్ షెట్ట‌ర్ ప్ర‌స్తుతం య‌డియూర‌ప్ప క్యాబినెట్‌లో నెంబ‌ర్ 2. వీరు కాకుండా అనిల్ షెటార్‌, బి.ఎల్‌. సంతోష్ కూడా సీఎం ప‌ద‌విని ఆశిస్తారు. ఈసారి లింగాయ‌త్‌ల‌కు కాకుండా బ్రాహ్మ‌ణ సామాజిక‌వ‌ర్గానికి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టాల‌ని నాయ‌క‌త్వం భావిస్తే బిఎల్ సంతోష్‌కు అవ‌కాశం ద‌క్క‌వ‌చ్చు. య‌డియూర‌ప్ప త‌ప్పుకోవ‌డానికి అంగీక‌రిస్తే…అప్పుడు ప్ర‌త్యామ్నాయం వెత‌కడం కంటే ముందే ఎంపిక చేసుకోవాల‌నేది నాయ‌క‌త్వం ఆలోచ‌న‌.

BS Vijayendra


త‌ప్పుకోవ‌డానికి య‌డియూర‌ప్ప కొన్ని ష‌ర‌తులు విధించిన‌ట్లు తెలుస్తోంది. త‌న‌ను గానీ, త‌న కుమారుడు విజ‌యేంద్రను గానీ కేంద్ర మంత్రివ‌ర్గంలోకి తీసుకోవాల‌ని ఆయ‌న కోరుతున్న‌ట్లు స‌మాచారం. య‌డియూర‌ప్ప‌ను తీసుకోవ‌డం సాధ్యం కాని ప‌ని కార‌ణం ఆయ‌న వ‌య‌సు కాబ‌ట్టి విజ‌యేందర్‌ను క్యాబినెట్‌లోకి తీసుకుని య‌డియూర‌ప్ప‌ను ఏపీ ఎక్స్‌ప్రెస్ ఎక్కించే అవ‌కాశ‌ముంది. ఈ నెల 22 లోగా ఈ విష‌యం వెల్ల‌డి కాగ‌ల‌దు. ఢిల్లీ రాజ‌కీయ‌వ‌ర్గాలు మాత్రం య‌డియూర‌ప్ప రాజీనామాకు రంగం సిద్ధ‌మైపోయిన‌ట్లు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here