రోడ్డుపై కొట్టే హ‌క్కు ఎవ‌రిచ్చారు డీజీపీ గారూ!

0


(ప్రొఫెస‌ర్ మాడ‌భూషి శ్రీ‌ధ‌రాచార్యులు)
రోడ్డుపై క‌నిపించే ఎవ‌రినైనా కొట్టే అధికారం పోలీసులకు ఎవ‌రిచ్చారు? రైతులు, ఫుడ్ డెలివ‌రీ బాయ్స్‌, ఆస్ప‌త్రుల‌కు వెళ్ళేవారు.. ఇలా ఎంద‌రో రోడ్డుపై క‌నిపిస్తే కొట్ట‌డ‌మేనా? అలా కొట్ట‌డం ఏ నిబంధ‌న కింద‌కు వ‌స్తుంది..డీజీపీగారూ చెప్పండి. కొట్ట‌డానికి మీరెవ‌రు..ఏ చ‌ట్టం, ఏ జిఓ, ఏ లేఖ ఆధార‌మో తెలియ‌జేయండి సార్‌. మ‌నం మాన‌వుల క‌దా. మీరు కాదా! అలాంట‌ప్పుడు మాన‌వ‌త్వం ఎందుకు మ‌రిచిపోతున్నాం. పోలీసులు లాఠీలు ఝుళిపిస్తూ పొలాల‌కు వెడుతున్న రైతుల ఎముక‌లు విర‌గ్గొడుతున్నారు. వికారాబాద్ జిల్లాల‌లో జ‌రిగిందీ ఘ‌ట‌న‌. డ‌జ‌న్ల సంఖ్య‌లో రైతుల‌కు మాన‌వ‌త్వం లేని పోలీసుల లాఠీ దెబ్బ‌లు త‌ప్ప‌డం లేదు. నేను పొలానికి వెళ్ళి నీళ్ళు పెట్ట‌క‌పోతే దాహంతో పశువులు చ‌నిపోతాయ‌ని పోలీసుల‌కు మొర‌పెట్టుకున్నాడు. ఆ పోలీసుకు అత‌ను చెబుతున్న‌ది అర్థం కాలేదు. కాదు అర్థం చేసుకోలేదు. ఈ ర‌క‌మైన వ్య‌వ‌హార‌శైలి డిపార్ట్‌మెంట్‌కు సిగ్గుచేటు. వెంక‌ట‌య్య అనే వ్య‌క్తిని ఆస్ప‌త్రికి వెడుతున్నాన్ని చెప్పిన‌ప్ప‌టికీ విన‌కుండా గొడ్డును బాదిన‌ట్లు బాదారు. జిల్లా ఎస్పీ నారాయ‌ణ ఈ సంఘ‌ట‌న‌పై మాన‌వ‌త్వంతో స్పందించ‌డం అదృష్టం.

వెంట‌నే పోలీసుల‌కు ఫోన్ చేసి, ఆస్ప‌త్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. అత‌ను పోగొట్టుకున్న సొమ్మును కూడా తిరిగివ్వాలి. సున్నిత‌త్వం లేకుండా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించిన వ్య‌క్తి చేత క్ష‌మాప‌ణ చెప్పింప‌చ‌పాలి. ఇలాంటి చ‌ర్య‌లు పోలీసులు మ‌ళ్ళీ అమాన‌వీయ కార్య‌క్ర‌మాల‌కు పాల్ప‌డ‌కుండా చేస్తాయ‌నడంలో సందేహం లేదు.

An official with humanity Vikarabad Sp Narayana

మాన‌వ‌త్వం కొర‌వ‌డ‌డంతో పాటు కొంద‌రు పోలీసులు ఇంగితాన్ని సైతం కోల్పోయి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధ‌నల‌ను ఉల్లంఘిస్తున్నారంటూ ఫుడ్ డెలివ‌రీ బాయ్స్‌ను విచ‌క్ష‌ణా ర‌హితంగా కొట్టిన సంఘ‌ట‌న‌లు దీనికి సాక్ష్యం. వారికి జ‌రిమానాలు విధించ‌డం, వాహ‌నాల‌కు చ‌లాన్లు రాయ‌డం ఈ మూడు రోజుల్లో తీవ్రంగా పెరిగింది. క్యాబ్ డ్రైవ‌ర్లు సైతం పోలీసుల దురుసు ప్ర‌వ‌ర్త‌న‌ను చ‌వి చూడాల్సి వ‌స్తోంది. వీటికి చ‌లాన్లు తోడ‌వుతున్నాయి. ఎయిర్‌పోర్ట్ నుంచి ఒక ప్ర‌యాణికుణ్ణి ఇంటి ద‌గ్గ‌ర దింపి వెడుతున్న క్యాబ్ డ్రైవ‌ర్‌కు వెయ్యి రూపాయ‌ల చ‌లాన్ ప‌డింది. మంత్రీ, డీజీపీ జోక్యం చేసుకోవ‌డం వ‌ల్ల ఆదివారం నుంచి డెలివ‌రీ బాయ్స్‌కు అనుమ‌తి ల‌భించింది. లాక్ డౌన్ విధిస్తున్న‌ప్పుడే, కొట్టే అధికారం పోలీసుల‌కు లేద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసి ఉండాల్సింది. విచ‌క్ష‌ణ‌ను ఉప‌యోగించాల‌ని సూచించి ఉండాల్సింది. మాన‌వుడికి ఉండే ఇంగిత జ్ఞానాన్ని, ఆలోచ‌న‌ను పోలీసులు అల‌వాటు చేసుకోవాలి. ఒక వ్య‌క్తి రోడ్డుపైకి ఎందుకొచ్చాడు అనే అంశాన్ని వీటితో ఆలోచించాలి. అత‌ను చెప్పేది స‌రైన కార‌ణమా కాదా అనే అంశాన్ని రూఢీ చేసుకోగ‌ల‌గాలి. లాఠీ దెబ్బ‌లు తిన్న డెలివ‌రీ బాయ్స్‌కు న‌ష్ట‌ప‌రిహారంతో పాటు క్ష‌మాప‌ణ కూడా చెప్పాలి. లాఠీ ప్ర‌యోగించిన సిబ్బందిపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాలి. ఏ చ‌ట్ట‌మూ కొట్ట‌మ‌ని పోలీసుల‌కు చెప్ప‌దు. లాక్ డౌన్ నిబంధ‌న‌లను తోసి రాజ‌న‌డ‌మూ దీనికింద‌కు రాదు. ఈ విష‌యాన్ని డిపార్ట్‌మెంట్ తెలుసుకోవాలి.

Professor Madabhushi Sridharacharyulu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here