రాజీయే రాజ‌మార్గం

0

తెలుగు రాష్ట్రాలు – నీటి పంచాయతీలు
పరస్పర సంప్రదింపులే పరిష్కారం.
సుప్రీం చీఫ్ జ‌స్టిస్ రమణ సూచన ఆచరణీయం
న్యాయ ప‌రిష్కారం వైపే ఏపీ మొగ్గు
(బండారు రామ్మోహనరావు., 98660 74027)

“కృష్ణా జలాల పంపకంలో ఆంధ్ర దాదాగిరి ఇక చెల్లదు కాక చెల్లదు” అన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మరొక్కసారి భగ్గుమంది. దానికి కౌంటర్ గా “ఎవరిది దాదాగిరి ఎవరు జల విద్యుత్ ఉత్పత్తి పేరుమీద 30 టీఎంసీల కృష్ణాజిల్లాలను వృధాగా బంగాళాఖాతంలో కలిపారని” ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు.


ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి జలాల వివాదాలపై పై కేంద్ర ప్రభుత్వం వేసిన బోర్డుల పరిధి పై కేంద్ర నిర్ణయమే శిరోధార్యమని ఆగస్టు 3న సమావేశమైన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు స్పష్టం చేసింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ అధికారులు హాజరుకాగా, తెలంగాణ ప్రభుత్వం తరఫున అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ బోర్డు పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని బోర్డుకు లేఖ రాశారు. సమావేశానికి హాజరుకాలేదు. దీంతో ఆగస్టు నెల 12 వ తేదీన పూర్తిస్థాయి బోర్డు సమావేశం జరపడానికి బోర్డు అంగీకరించింది. ఈ పరిణామాల కన్నా ముందు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పై సుప్రీంకోర్టులో వేసిన కృష్ణా జలాల నీటి వివాదం కేసు ఆగస్టు 2వ తేదీన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మన తెలుగువారైన ఎన్.వి.రమణ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్న సుప్రీంకోర్టు బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది.

తాను ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వాడినని కృష్ణా నదీ జలాల విషయంలో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు పరస్పర సంప్రదింపులు, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ సలహా ఇచ్చారు. “రాజీయే రాజమార్గమని”ఆయన పేర్కొన్నారు. ఎంత పెద్ద సమస్యకైనా ఒక పరిష్కారం ఉంటుందని దాన్ని కనుక్కోవడం లోనే తెలివితో, విజ్ఞతతో వ్యవహరించాలని ఆయన అన్నారు. తాను చెప్పిన సలహాలు కాదని ఒకవేళ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు మొండికేసి కేసును నడిపిద్దామనుకుంటే ఒక తెలుగువాడిగా తాను ఈ కేసు విచారణ నుంచి తప్పుకొని వేరే బెంచ్ కు అప్పగిస్తానని ఎన్.వి.రమణ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నదీ జలాల వివాదం ఎటువైపు దారి తీస్తుంది.

విభ‌జ‌న నాటి ప‌రిణామాలు పున‌రావృతం
రాష్ట్ర విభజన తర్వాత మొదటి రెండు సంవత్సరాలలో జరిగిన సంఘటనలు మళ్లీ రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్ల తర్వాత పునరావృతం అవుతున్నాయి. నాగార్జునసాగర్ డ్యాం పైన ఆనాడు ఇరు రాష్ట్రాల పోలీసులు అధికారుల మధ్య ఒక రకంగా నీటి యుద్ధమే జరిగింది. రెండు శత్రు దేశాల మధ్య జరిగిన నంత సీన్ మన కళ్ళకు కనిపించింది. ఆ తర్వాత ఐదేళ్ల ప్రశాంత వాతావరణం ఏర్పడింది. మళ్లీ అంతకంటే ఘోరంగా కృష్ణా నది మీద ఉమ్మడి ప్రాజెక్టు లుగా ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల డ్యాంల పై ఇరుపక్కల ఆయా రాష్ట్రాల పోలీసులు మోహరించారు. అక్కడ అలా ఉంటే తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు ఒకరిమీద ఒకరు నోరు పారేసుకుంటున్నారు. ఇక్కడ కేసీఆర్ అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా రాజకీయ వాతావరణాన్ని సృష్టించుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇరు రాష్ట్రాల మధ్యన మంచి సామరస్యపూర్వక వాతావరణంలో ఏర్పడిందని అందరూ సంతోషించారు. కెసిఆర్ ఆహ్వానం మేరకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కెసిఆర్ ఇంటికి వెళ్లడం ఆరోజు నదుల మీద “బేసిన్లు లేవు భేషజాలు లేవు అంటూ కెసిఆర్ తెలుగు ప్రజలకు ఒక మంచి సంకేతాన్ని ఇచ్చారు. సామరస్యపూర్వక చర్చల ద్వారా కృష్ణాజలాల పంపిణీ పూర్తి చేసుకుంటారని తెలుగు ప్రజలు అందరూ ఆశించారు. సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఇందులో ఎవరు మొదలు పెట్టారన్నది ప్రధానమే అయినా ఇరు రాష్ట్రాల మధ్యన ఈ మంటలు ఎలా చల్లారాలన్నది ప్రస్తుతం ఆలోచించాలి. దీనికి ఇరు రాష్ట్రాల ప్రజలు గెలిచే విన్ విన్ సొల్యూషన్ కనుక్కోవాలి. రాజకీయ విజ్ఞత ఉంటే అసాధ్య మేమి కాదు కానీ అది కొరవడడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది.


ఏపీ జారీ చేసిన 203 జీవో తో మొదలైన కొత్త వివాదం.
ముఖ్యమంత్రుల చర్చల మధ్య మొదలైన ప్రతిపాదన పక్కనపెట్టి మొదట పోతిరెడ్డిపాడు దగ్గర లిఫ్ట్ చేసే నీళ్లు పోయే కాలువ వెడల్పు చేసే పని అనే పేరు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు పనులు మొదలు పెట్టింది. ఆ తర్వాత మే అయిదవ తేదీ 2020 వ సంవత్సరంలో 203 జీవో విడుదల చేసి వివాదానికి కారణమైంది. అక్కడి నుంచి సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. గత సంవత్సరంగా ఈ వివాదం రాష్ట్రాల రాజకీయ ప్రయోజనాల లో నలుగుతూ అప్పుడప్పుడు రేగుతూ, చల్లారుతూ వస్తుంది. ఇరు రాష్ట్రాలు కృష్ణ రివర్ బోర్డు కి పరస్పరం ఫిర్యాదులు ఇచ్చి ఉన్నాయి. ఆ ఫిర్యాదులు సమస్య మళ్లీ మొదటికి తెచ్చేవిగా ఉన్నాయి. ఇరు రాష్ట్రాలు కృష్ణా నది మీద గతంలో కట్టిన ప్రాజెక్టు తో సహా రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుతం మొదలు పెట్టిన కొన్ని ప్రాజెక్టుల మీద కూడా ప్రాత ప్రాజెక్టులతో కలిపి అన్నీ అక్రమ ప్రాజెక్టులు గా తేల్చి ఫిర్యాదులు చేసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆకు ఎక్కువ చదివి గోదావరి నది మీద కూడా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు అన్నీ అక్రమ మేనని తేల్చిచెప్పింది. ఇదెలా ఉందంటే “కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు” జరిగింది.
ఇప్పుడేంటి….
ఇక ప్రస్తుత విషయానికి వస్తే పోతిరెడ్డిపాడు పైన సంగమేశ్వరం కింద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పేరు మీద ప్రతిరోజు 5 టిఎంసిల కు పైగా నీరు తీసుకువెళ్లే పరిస్థితి ఉందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అది కాక మొదట పోతిరెడ్డిపాడు నుండి 11 వేల క్యూసెక్కుల నీరు తీసుకోవాల్సింది పోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఆ వరద వీటి తరలింపు 11 వేల నుండి 44 వేల క్యూసెక్కులకు పెంచార నేది అందరికీ తెలుసు. ఇప్పుడు దానికి అదనంగా రాయలసీమ లిఫ్ట్ ద్వారా మరింత జల దోపిడీ జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది. ఇది పూర్తయితే ప్రతిరోజు మరో ఏడు నుంచి ఎనిమిది టీఎంసీల నీరు రాయలసీమ ఈ ప్రాంతానికి తరలిస్తారని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. దీనిపై స్పందించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదిలో శ్రీశైలం పైన కల్వకుర్తి దిండి నుండి మొదలుకొని తెలంగాణ నిర్మిస్తున్న మరో రెండు మూడు ప్రాజెక్టులు అక్రమమని వాదిస్తోంది.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు Vs తెలంగాణ హైడల్ విద్యుత్ ఉత్పత్తి
ఇక ప్రస్తుతం పోతిరెడ్డిపాడు తో సహా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపమని కృష్ణ రివర్ బోర్డు తో సహా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించినా కూడా పనులు ఆపడం లేదని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఆ నది పై ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టు వద్ద ఎడమ పక్కన తెలంగాణ భూభాగంలో ఉన్న ఉన్న అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి మొదలు పెట్టింది. దీంతో శ్రీశైలం లోకి వచ్చిన వరద జలాలు ఎనిమిది వందల అడుగుల నీటిమట్టం ఉండగానే వెంట వెంట విద్యుత్ ఉత్పత్తి చేస్తూ కిందికి జారి పోతున్నాయని ఏపీ ఆరోపిస్తోంది. అలాగే నాగార్జునసాగర్ దగ్గర విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న నీరు పులిచింతల కు వెళ్లి పులిచింతల దగ్గర విద్యుత్ ఉత్పత్తి తో కిందికి వెళ్లి నీళ్లు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆపుకోలేక సముద్రంలో విడిచి పెట్టాల్సి వస్తుంది. అసలు శ్రీశైలం ప్రాజెక్టు సాగునీటి కోసం కానేకాదని కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమే ఈ ప్రాజెక్టు కట్టారని తెలంగాణ ప్రభుత్వం అంటుంది. తమ అవసరాలకు తగిన విద్యుత్తును ఉత్పత్తి చేయకుండా ఊరుకునేది లేదని తెలంగాణ ప్రభుత్వం అంటుంది. ఈ స్థితిలో ఇరుపక్షాలు, పార్టీలు ఒకరినొకరు నిందించుకుంటూ వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్నారు. అదీకాక ప్రజల మధ్య భావోద్వేగాలు, కాస్త భావోద్రేకాలు గా మారుస్తూ రెచ్చగొడుతున్నారు. ఇదంతా హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే అని ఏపీ నాయకులు ఆరోపిస్తుంటే అదేం కాదు కావాలని మీరే కావాలని గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తెలంగాణ నాయకులు దుమ్మెత్తి పోతున్నారు.
కింకర్తవ్యం… విన్ విన్ సొల్యూషన్ కావాలి
(1)విభజన చట్టంలో పేర్కొన్న విధంగా జల వనరుల పంపిణీ సరియైన విధంగా జరగాలి.
(2)రెండు రాష్ట్రాల మధ్య జల వనరుల మధ్య జల వనరుల విషయంలో వివాదం ఏర్పడితే కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి.
(3)కృష్ణ జలాలపై బ్రిజేష్ కుమార్ ఇచ్చిన మధ్యంతర తీర్పును పునః పరిశీలించాలి. శాశ్వత తీర్పును వెలువరించాలి.
(4) కృష్ణాజిల్లాలో ఇప్పటి దాకా మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బచావత్ అవార్డు ద్వారా నీటి పంపిణీ జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి తాత్కాలిక ప్రాతిపదిక పై మాత్రమే ఒక ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వేరువేరుగా ఉన్నాయి కనుక కృష్ణా నది పరివాహక ప్రాంతాన్ని బట్టి మళ్లీ ఏపీ తెలంగాణ మధ్య నీటి పంపిణీ జరగాలి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తన శాశ్వత తీర్పులో కొత్తగా నాలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ చేయాలి.
(5)రాష్ట్రాల నీటి వివాదాల పరిష్కార బాధ్యత కేంద్రానిదే కనుక కేంద్ర ప్రభుత్వం వెంటనే బచావత్ ట్రిబ్యునల్ తీర్పు తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2011 లో ఇచ్చిన తీర్పును పునః పరిశీలించి కొత్తగా అంతిమ తీర్పు కోసం ప్రయత్నించాలి.
(6) కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి కొత్తగా వేసిన కృష్ణా రివర్ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. వివాదం లేని ప్రాజెక్టులను కృష్ణ రివర్ బోర్డు విచారణ పరిధి నుంచి తొలగించాలి. కేవలం కృష్ణా నది పై ఉన్న ఉభయ రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ప్రాజెక్టుల వరకే కృష్ణ రివర్ బోర్డు అధికారాలను పరిమితం చేయాలి. ఆ సమావేశంలో అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం సాధించాలి.
(7)నీళ్లు లేని కృష్ణా నది అనే “వట్టి కుండ” కాడ ఇరు రాష్ట్రాలు కొట్లాడుకోవడంమాని బేసిన్లు భేషజాలు లేకుండా గోదావరిలో ఉన్న మిగులు జలాలను శ్రీశైలం నాగార్జునసాగర్ లకు తరలించే ప్రయత్నం చేయాలి. అది కెసిఆర్ ప్రతిపాదించినట్లు తెలంగాణ నుంచా లేక జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ భూభాగం గుండానా అనేది కూడా ఆలోచించాలి. ఇరువురికి కి ఏది ఆమోదయోగ్యం అయితే దాన్ని ఆచరించాలి.
(8)పేరెంట్ బేసిన్ ఆధారంగా మొదట ఆ నదీ పరివాహక ప్రాంతంలోని ప్రాంతాలను పరిగణలోకి తీసుకోవాలి. ఆ తర్వాతనే బేసిన్లు దాటి ఆలోచించాలి.
(9) 2014 రాష్ట్ర విభజన నాటికి ఇరు రాష్ట్రాలలో ఉన్న పాత ప్రాజెక్టులు అన్నిటిని వివాదాస్పదం చేయకుండా యధావిధిగా ఆమోదించాలి. ఆ తర్వాత రాష్ట్రాలు కొత్తగా ఏవైనా ప్రాజెక్టులు మొదలు పెట్టినా కూడా వాటిని ఎట్టి పరిస్థితులలో ఆమోదించ కూడదు.
రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచించకుండా ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టకుండా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం సామరస్యపూర్వక పరిష్కారం సాధిస్తే అంతకంటే కావలసింది ఏముంటుంది. (వ్యాస ర‌చ‌యిత ప్ర‌ముఖ రాజ‌కీయ విశ్లేష‌కుడు)

Bandaru Ramamohanarao

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here