Sunday, December 10, 2023
HomeArchieveసంపాద‌కీయాల‌కు విలువ‌ల వ‌లువ‌లు తొడిగిన పాత్రికేయుడు

సంపాద‌కీయాల‌కు విలువ‌ల వ‌లువ‌లు తొడిగిన పాత్రికేయుడు

అస‌లు సిస‌లు సంపాద‌కుడు
కృష్ణా ప‌త్రిక ఎడిట‌ర్ ముట్నూరి కృష్ణారావు
హైద‌రాబాద్‌, మార్చి 9:
సంపాద‌కుడు అంటే ఎలా ఉండాలి? ఈ ప్ర‌శ్న‌కు నిలువెత్తు స‌మాధానం ముట్నూరి కృష్ణారావు గారు. నాలుగు ద‌శాబ్దాల పాటు కృష్ణా ప‌త్రిక‌కు సంపాద‌క‌త్వం నెరిపి, ఉన్న‌త విలువ‌ల‌ను నెల‌కొల్పి, ప‌త్రికా రంగానికి నైతిక విలువ‌ల‌ను వ‌లువ‌లుగా అలంక‌రించారాయ‌న‌. ఆయ‌న సంపాద‌కీయాల‌పై మరుమాముల ద‌త్తాత్రేయ శ‌ర్మ చేసిన ప‌రిశోధ‌న గ్రంధాన్ని ఉప రాష్ట్ర‌ప‌తి ఎమ్. వెంక‌య్య‌నాయుడు ఆవిష్క‌రించారు. ప‌రిశోధ‌న గ్రంథాన్ని ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ జి. వ‌ల్లీశ్వ‌ర్ స‌మీక్షించారు. వ‌ల్లీశ్వ‌ర్ స‌మీక్ష ఆయ‌న మాట‌ల్లోనే…


ఎందుకు ముట్నూరి కృష్ణారావు గారి సంపాదకీయాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం ?
ఒక న్యాయమూర్తి, ఒక వైద్యుడు, ఒక టీచర్, ఒక రెవెన్యూ అధికారి … ఇలాంటి వాళ్ళు ఎలా ఉండాలని సమాజం కోరుకొంటుంది? అలాగే, ఒక పత్రిక సంపాదకుడు ఎంత నిర్భీతితో, నిజాయితీతో, నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా, హేతుబద్ధంగా, మాతృదేశ భవిష్యత్, సమాజ శ్రేయస్సు గురించి పాఠకుల్ని ఆలోచింపజేసేలా సంపాదకీయాలు రాయాలనీ, పత్రికను నడపాలనీ సమాజం కోరుకుంటుందో … అలా జీవించిన తొలితరం సంపాదకులలో ఒకరు ముట్నూరి కృష్ణారావు గారు.
ఉద్యోగం తీసేయించిన ఒక ఎడిటోరియ‌ల్‌
చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయారు. యుక్తవయస్సులో వివాహమైంది. 24 ఏళ్ళ వయస్సులోనే ‘కృష్ణాపత్రిక’ కు ఉప సంపాదకుడయ్యారు. ఒక కొడుకు పుట్టాడు. మళ్ళీ కష్టాలు వెంటాడాయి. ఆయన రాసిన ఒక సంపాదకీయం కారణంగా యాజమాన్యం ఉద్యోగంలోంచి తీసేసింది. వయసొచ్చాక ఉన్న ఒక్క కొడుకూ చనిపోయాడు. కొన్నాళ్ళకి రెండో అల్లుడు చనిపోయాడు. అంటే, తన కళ్ళ ముందే వయసులో ఉన్న కుమార్తె వితంతువు అయింది…. మనిషి కృంగిపోవటానికి ఈ కష్టాలు చాలు కదా! కాని, ఇవేవీ సంపాదకుడిగా ఎదిగే క్రమంలో ఆయనలోని ప్రజ్ఞని కాని, వృత్తిపట్ల ఆయనకున్న అంకిత భావాన్ని కాని ఇసుమంత కూడా కదిలించలేకపోయాయి.


బ్రిట‌న్ వ్య‌తిరేకంగా నిప్పులు
బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన సంపాదకీయాలు నిప్పులు చెరిగాయి. యువతలో దేశభక్తి అనే అగ్నిని రగిల్చాయి. నిప్పు కణాల్లా ఎగిసిపడే ఆ డేశభక్తి – ఆజానుబాహుడైన కృష్ణారావుగారిని ఇంకా ఎత్తుకు పెంచేశాయి. మేరు నగధీరుడిలా నిలబెట్టాయి.
ఇంతవరకే అయితే, ఈ పుస్తకం గురించి ఇంత చర్చ అవసరం లేదు. కానీ, ఆయనలో అనేక పార్శ్వాలున్నాయి. చాలా అరుదుగా ఇప్పటి సంపాదకుల్లో ఆ కోణాలు కనుపిస్తాయి. ఇవ్వాళ చాలా పత్రికల్లో పేరు వేసుకునే సంపాదకుడి తరఫున – పేరు కనబడని వేర్వేరు వ్యక్తులు సంపాదకీయాలు రాస్తున్నారు.
అంత‌ర్జాతీయ అంశాల‌పై అధ్య‌యనం
అనేక రకాల అంశాల మీద ముట్నూరి వారు ఒక్కరే అనేక సంపాదకీయాలు రాశారు. గూగుల్‌ లేని రోజుల్లో అంతర్ జాతీయ విషయాలు అధ్యయనం చేశారు. వారి సంపాదకీయాలను ప్రశంసించిన వారిలో – అడవి బాపిరాజు, విశ్వనాథ సత్యనారాయణ, కోలవెన్ను రామకోటేశ్వర రావు, గొట్టిపాటి బ్రహ్మయ్య, పింగళి నాగేంద్ర రావు, మునిమాణిక్యం నరసింహారావు, గొర్రెపాటి వెంకట సుబ్బయ్య, చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి వగైరా ప్రముఖులు ఉన్నారు. ఎందుకు?


అపార‌మైన మేథ‌స్సు
ముట్నూరి వారు తన మేథస్సుతో విశ్లేషించి, తన కలంతో స్పృశించిన సామాజిక, సాంస్కృతిక, జాతీయ, అంతర్జాతీయ అంశాలు అపారంగా ఉన్నాయి. అంతకుమించి ఒక గొప్ప సాహితీవేత్త ఆయనలో ఉన్నాడు. ‘కృష్ణాపత్రిక’ కార్యాలయంలో సాహితీ దర్బారు జరిగేది. ఆయనే ఒక కృష్ణదేవరాయలుగా సభ తీర్చేవారు. ఒక్కోసారి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కూడా ఆ స్థానంలో ఉండేవారు. దర్బారులో సభ్యులు మాట్లాడిన విషయాలు ‘కృష్ణాపత్రిక ‘ లో వచ్చేవి.
ఏమైనా ఆయన సంపాదకీయాల కోసం ఎదురు చూసే పాఠకులు అనేకమంది ఆ రోజుల్లో. అయితే, ఇప్పుడు దత్తాత్రేయ శర్మగారు మాత్రం ఆ సంపాదకీయాలన్నింటికీ యధాతథంగా కట్టకట్టి నకళ్ళు తయారు చేసి, మన ముందు కుమ్మరించే ప్రయత్నం చేయలేదు.
ఆ సంపాదకీయాల్లో ప్రస్ఫుటంగా గానీ, అంతర్లీనంగా గానీ ఉన్న కృష్ణా రావుగారి విశ్లేషణా శక్తిని, వాస్తవిక దృక్పథాన్ని, సమాజ శ్రేయస్సు పట్ల వారి తహ తహని, భాషా పటిమని, విభిన్న రీతుల్లో రాయగల ఆ కలం శక్తిని, ధర్మం–తత్త్వం-మానవ సంబంధాలు వంటి అంశాలను లోతుగా అధ్యయనం చేసి రాసిన తీరుని జల్లెడ పట్టి తన ఎం ఫిల్ సిద్ధాంత వ్యాసంలో దట్టించారు దత్తాత్రేయ శర్మ గారు. అదే ఈ పుస్తకం ‘ముట్నూరి కృష్ణా రావు గారి సంపాదకీయాలు.’


ఒక రాజకీయ సంపాదకీయం చూడండి:
“…రాజకీయ దాస్యం ఫలితంగా మనం పాశ్చాత్య నాగరికతకి ఎంత బానిసలమైపోయామంటే – దొరల్లా సూటు, బూటు ధరించి, ఆంగ్లం మాట్లాడటమే మన జీవన విధానానికి ప్రామాణికం అనుకునే స్థాయికి దిగజారిపోయాం. ఏకరీతిలో ఉండే మన సంస్కృతి, సంస్కారం వదిలేస్తే ఇది భారత జాతి ఎలా అవుతుంది?”
మరొకటి చూడండి:
“…. హిందూ ముస్లిం సఖ్యత స్థిరపడటానికి ముందు కొంత రాపిడి ఉంటుంది. అలా ఒకరినొకరు అర్థం చేసుకొని, సర్దుకుపోయే దశలో ఒకరినొకరు శత్రువుల్లా చూడటం దేశానికి మంచిది కాదు.” (వాస్తవిక దృక్పథం)
నిశిత ప‌రిశీల‌న దృష్టికి అద్దం
మరో సంపాదకీయం ఆయనలోని నిశిత పరిశీలనా దృష్టికి అద్దం పడుతుంది:
(ఆ కాలంలో చాలామంది అనేవారు – దొరలు బాగానే పాలిస్తున్నారు కదా! అప్పుడు ….)
“…. బ్రిటిష్ వాడు తన భార్యా పిల్లలతో సుఖంగా జీవించటం కోసం మనల్ని ఇక్కడ పాలిస్తున్నాడు. ఈ ప్రక్రియలో వాడు భారత ఉపఖండాన్ని కనీసం ఒక ఉంపుడుగత్తెలా కూడా చూడటం లేదు. కేవలం పనిమనిషిలా వాడుకుంటున్నాడు.”


ఆలోచనాగ్నినిని రగిల్చే ఈ సంపాదకీయం చదవండి:
“…. దేవాలయాల్లో హరిజనులకు ఆలయ ప్రవేశం ఉండాలని గాంధీ వంటి నాయకులు పోరాడుతుంటే, ఈ తెల్ల దొరల కోర్టులు ఆలయవ్యవస్థలో వేలు పెట్టి, మన ఆశయానికి వ్యతిరేకంగా తీర్పులివ్వడమేమిటి? అంటే, మనం మత స్వాతంత్ర్యాన్ని కూడా కోల్పోయామా? ఎంత దౌర్భాగ్యం?”
దత్తాత్రేయ శర్మ గారు ఎంచుకున్న సంపాదకీయాల్లో మరో మణిపూస ఇది:
“….. మన దేశంలో ఈ దొరలు సాగిస్తున్న పాలన కన్నా అనేక రెట్లు భారీ నష్టం వాళ్ళు కలిగిస్తున్నదే మరొకటి ఉంది. వాళ్ళు మన శ్రమని, మన సంపదని కొల్లగొట్టడం. …. భారతజాతి యొక్క ప్రాణ రక్తము పీల్చివేయబడుచున్నది.”
… ఇలాంటి సంపాదకీయాల్ని వెలికి తీసి, ముట్నూరి వారి నిశిత పరిశీలనాదృష్టిని మన ముందుంచారు శర్మ గారు.
అనీబిసంట్, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, తిలక్ – ఈ ముగ్గురినీ కలిపి ‘త్రిమూర్తులు ‘ అనే శీర్షిక క్రింద రాసిన సంపాదకీయం యువతని బాగా ఆకట్టుకుంది. అలాగే, రవీంద్ర నాథ్ ఠాగోర్, ఆండ్రూస్, జవహర్ లాల్ నెహ్రూల గురించి, అంతర్జాతీయ రంగంలో రూజ్వెల్ట్, స్టాలిన్, చర్చిల్, హిట్లర్, ముస్సోలినీ …. ఇలా ఏ స్థాయి ప్రముఖుడినీ ఆయన వదల్లేదు…
ఆవకాయ నుంచి అణ్వస్త్రాల దాకా అన్నీ రాశారు అనవచ్చేమో!
ముట్నూరి వారి తాత్త్వికత, ఆధ్యాత్మికత ఎలాంటివో చెప్పే ఒక సంపాదకీయాన్ని శర్మగారు బాగా పట్టుకొని, విశ్లేషించారు. ఇందులో ముట్నూరి వారు రాసిందేమిటంటే –


విరాట్‌పురుషునికి అస‌లైన నిర్వ‌చ‌నం
“..విరాట్ పురుషుడు ఒక బ్రాహ్మణుడు కాదు, ఒక క్షత్రియుడు కాదు, ఒక వైశ్యుడు కాదు, ఒక శూద్రుడు కాదు. వీటన్నింటికీ అతీతమై, అన్నింటినీ తనలో అంతర్భుక్తం చేసుకున్న దివ్యశక్తి . అలాంటి దివ్య శక్తి అవయవాలలో ఒకటి పవిత్రమైనది, ఒకటి అంటరానిది అంటూ ఎలా ఉంటుంది ? …”
ఇదొక్కటే కాదు. స్త్రీ స్వాతంత్య్రాన్ని కూడా ఆ రోజుల్లోనే ప్రోత్సహిస్తూ ఆయన సంపాదకీయాలు రాశారు. ఆయన భార్య రుక్మిణమ్మ కూడా ఉద్యమంలో పాల్గొంది. ఆయనైతే అయిదారుసార్లు జైలుకెళ్ళారు. జైల్లోనూ ఇతిహాసాలు చదివారు, సాటి ఖైదీలకు బోధించారు.
వ్యాసాలకు పఠనీయత ఎక్కడినుంచి వస్తుంది? చదివించే లక్షణంలోంచి. అది ఉండాలంటే, ఎత్తుగడనుంచి ప్రారంభం కావాలి. పునరుక్త దోషం ఉండకూడదు. భాషలో భావానికి తగిన పద ప్రయోగం ఉండాలి. భావం గుండె లోతుల్లోకి చొచ్చుకుపోయేలా ఉండాలి… ఇలా ఉండేలా ముట్నూరి వారు రాసిన సంపాదకీయాల్ని దత్తాత్రేయ శర్మ ఏరి ఏరి, విశ్లేషించి చూపించారు – అరటి పండు ఒలిచిపెట్టినంత సరళంగా.


విభిన్న రీతుల‌లో సంపాద‌కీయ ర‌చ‌న‌
ముట్నూరి వారి గొప్పదనం ఏమిటంటే – గ్రాంథికంలోనూ రాశారు, వ్యావహారికంలోనూ రాశారు. సంస్కృత, ఆంధ్ర పదాలను మిళితం చేసి కూడా రాశారు. ఎవరినైనా అభినందించాల్సి వచ్చిన చోట అవధులు దాటలేదు. అధిక్షేపించాల్సి వచ్చిన చోట తన, మన తేడా చూపించలేదు.
చర్చిల్‌ ప్రశంసలు అందుకున్న ఆంగ్ల భాషా నిపుణుడు, బ్రిటిష్‌ ప్రభుత్వం నుండి గొప్ప గొప్ప పదవులు పొందిన ప్రొఫెసర్ శ్రీనివాస శాస్త్రి గారి విషయంలో ముట్నూరి వారి సంపాదకీయం ఎలా వ్యంగ్య బాణాలు సంధించిందో చూడండి:
“…. స్వదేశంలో 25 వేల మంది యువ కార్యకర్తలూ, సి.ఆర్.దాస్, లజపతిరాయ్, నెహ్రూ, మాలవీయ, గాంధీ వంటి నాయకులూ జైళ్ళల్లో మ్రగ్గుతుంటే, శ్రీనివాస శాస్త్రి గారు బ్రిటిష్ దొరల ప్రాపకంలో తరిస్తూ, వారి ప్రాసాదాల్లో ఆరగించే విందులు చూసి, వారి గౌరవమే జాతి గౌరవం అని భారత దేశం గర్వించాలట ! గర్విద్దామా?”
రాసే ముందు లోతైన ప‌రిశీల‌న‌
భాష, వ్యాకరణం, వాక్య నిర్మాణం, రచనా శిల్పం, భావ వ్యక్తీకరణలో స్పష్టత, క్రమబద్ధత, అలంకారాలు, సమాసాలు, జాతీయాలు, తెలుగు నానుడులు వగైరాలు ఎలా ఉండేవో కూడా లోతుగా చూసి రాశారు శర్మగారు ఈ పుస్తకంలో. కేవలం ఎమ్‌ ఫిల్‌ కోసం కాక, ఒక తపనతో శర్మ గారు ఈ అధ్యయనం చేశారనిపిస్తుంది.
గ్రాంధిక ఆంధ్రంలో రాసిన సంపాదకీయంలో ఎలా సింహనాదం చేశారో చూడండి: (చీరాల-పేరాల పన్నుల నిరాకరణోద్యమ నాయకుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్యను, అరెస్టు చేసి, ఆయన మీద ప్రభుత్వం కేసు పెట్టింది. అప్పుడు…)


“… ఏ విధానము క్రింద దేశీయుల స్వభావ, ధర్మములకు హానికరమైన జాతీయ విద్యనొసగబడుచున్నదో, ఏ విధానముచే దేశీయుల శిల్పకళా చాతుర్యము నశించి హిందూ దేశము పాశ్చాత్య పారిశ్రామిక సంఘట్టనమున దగుల్కొనుచున్నదో, ఏ విధానమువలన భారత వర్షము నానాటికి దరిద్రవంతమైన క్షామదేవతకు బుట్టినిల్లైనదో, ఏ విధానముచే హిందూ దేశీయుల సంఘ వికాసము పరంపరానుగతమైన ఐతిహాసికధార ననుసరింపక, వికృత సాంకర్యరూపము దాల్చుచున్నదో, ఏ విధానము ఈ భారత వర్షము – ధర్మసామ్రాజ్యమునందీశ్వరోద్ధిష్టమైన గురుపీఠమలంకరించుటకు అడ్డుపడుచున్నదో, ఏ విధానము ముప్పది కోట్ల భారతీయులను నిరస్తృలను జేసి, నిర్వీర్యులనుగ జేసివైచెనో – అట్టి విధానము యెడల అసంతృప్తిని గలిగించుటయే వీరు చేసిన నేరమైన యెడల, అట్టి ప్రచారకులెల్లరును ఈ మహా దోషమునకు బాల్పడిన వారేయని ఘంటాపథముగ జెప్పుచున్నాము ….” (అంటే, 30 కోట్ల జనాభా ఈ నేరం చేసిన వాళ్ళే అవుతారు, అందర్నీ జైళ్ళల్లో పెట్టి, పాలించగలరా ?)
అలాగే అతి సరళ వ్యావహారికంలో సంపాదకీయం :
“… నీ దేహాన్ని, నీ ప్రాణాన్ని, నీ ఇంద్రియాలను, నీ మనస్సును, నీ అహంకారాన్ని, నీ సంఘాన్ని, నీ దేశాన్ని, నీ జ్ఞానాన్ని ముందుకు ముందుకు నడవనీ, సాగనీ, ఆలోచించనీ. నీ చూపును మందగించనీయకు, నీ కత్తిని తుప్పు పట్టనీయకు, నీ విజయాభిలాషను చల్లారనీయకు, మరొక ప్రపంచం, మళ్ళీ మళ్ళీ మరొక ప్రపంచం అంటూ, వైరి వర్గాన్ని సంహరించుకుంటూ, బురుజులపై బురుజులనెక్కుతూ, నీ సామ్రాజ్యాన్ని ప్రతిష్టించుకో… ప్రతిష్టించుకో …”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Prof Shankar Chatterjee, Hyderabad on A Success Story of a Doctor
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on My Experience in Eritrea
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Keep focus on alternative livelihood opportunities
Prof Shankar Chatterjee, Hyderabad on The Power of a Diverse Diet
Prof Shankar Chatterjee, Hyderabad on Food for Health Rhymes
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ