Monday, March 27, 2023
HomeArchieveసిరా వెన్నెల..సిరివెన్నెల..!

సిరా వెన్నెల..సిరివెన్నెల..!

(ఎలిశెట్టి సురేష్ కుమార్, 9948546286)
నా ఉచ్వాసం కవనం..
నా నిశ్వాసం గానం..
సరసస్వర సుర ఝరీ గమనమౌ
సామవేద సారమిది..
నే పాడిన జీవన గీతం
ఈ గీతం..
ఒకటా రెండా..మూడువేల మధురగీతాల సుమధుర కలం
ఆగిపోయింది..
సిరివెన్నెల మసకబారింది..
తెలుగు తెర మరోసారి చిన్నబోయింది..!
ముందు ఆత్రేయ..
మొన్న వేటూరి..
ఇప్పుడు సీతారామ శాస్త్రి..
ఇది ఓ పరంపర..
ఒకరి తర్వాత ఒకరు..
మధుర గీతాల పందిర్లు అల్లిన
పాటమాలీలు..
తెలుగు సినీ సంగీత భారాన్ని
తమ కలాలపై మోసిన హమాలీలు..
తిరిగిరాని తీరాలకు
పయనమైపోతే..
భోరున విలపించదా
తెలుగు పాట
అక్షరాల కన్నీరు కారుస్తూ..!
ఓయి.. సీతారామశాస్త్రి..
ఎప్పుడు వచ్చావో..
ఎన్ని పాటలు రాసావో..
సరిగమ పదనిస కరోకరో జరజల్సా..
ఒక చేత్తో విలాసం..
నమ్మకు నమ్మకు ఈ రేయిని..
కమ్ముకు వచ్చిన ఈ హాయిని..
మరో చేత్తో విరాగం..
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది..
చెలీ..ఇదేం గారడి..
నా నీడైనా అచ్చం నీలా అనిపిస్తూ ఉంది..
అరె..అదేం అల్లరి..
ఇలా రెండు చేతుల్తో
పాటల పల్లకి మోసి
ఊరేగే చిరుగాలి..
ఈ రోజున కంటికి కనపడవేం
నిన్నెక్కడ వెతకాలి..
ఇంత తొందరగా నిన్ను పిలవాలని
విధాత తలపున ప్రభవించినది..
తన లోకంలో ఇక నీ పాట
పల్లవించాలని..!
సిరివెన్నెలా..
నీ పాట ప్రాణనాడులకు
స్పందన మొసగిన
ఆది ప్రణవనాదం..
సినీ గీతాల కొలనులో
ప్రతిబింబించిన విశ్వరూపవిన్యాసం..
నువ్వే రాసుకున్నట్టు
విరించివై విరచించితివి
ఎన్నో కవనాలు..
విపంచివై వినిపించితివి
ఎన్నెన్నో గీతాలు..
అన్నీ మా ఎదకనుమలలో
ప్రతిధ్వనించిన విరించి విపంచి
గేయాలు..
గుండెకు చేసిన తీపి గాయాలు!
బోడి చదువులు వేస్టు
నీ బుర్రను భోంచేస్తూ అన్నా..
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అంటూ రెచ్చగొట్టినా..
నమ్మకు నమ్మకు ఈ రేయిని..
ఇలా ప్రబోధించినా..
భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు
భర్తకు మారకు బాచిలరు..
కుర్రాళ్లను హెచ్చరించినా..
అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఈ జన్మకు సరిపోలిక ఇల్లాలమ్మ..
స్త్రీమూర్తి గొప్పదనాన్ని
ప్రస్తుతించినా..
సీతారామయ్యా..
నీ పాటల్లో
లలిత ప్రియ కమలమే విరిసినది..
అవి వింటూ తెలుగు
సాహితీ అభిమానలోకమే మురిసినది..!
ఇక వినిపంచదు కదా నీ పాట
నీ తోడు లేనిదే సినిమా పాట
శ్వాసకు శ్వాస ఆడదే..
నీ పాట విననిదే గుండెకు సందడుండదే..!
(క‌విత ర‌చ‌న విజ‌య‌న‌గ‌రానికి చెందిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ