రేడియో కార్య‌క్ర‌మాలు న‌చ్చ‌క‌పోతే…

0

వ్యాపకాల జ్ఞాపకాలు
(భండారు శ్రీనివాసరావు, 98491 30595)

వెనుకటి రోజుల్లో –
రేడియో ఒక్కటే రాజ్యమేలుతున్న కాలంలో-
ఒక పెద్ద మనిషి నేను పనిచేస్తున్న ఆకాశవాణి కార్యాలయానికి ఫోన్ చేసి, ‘ మీ రేడియో వార్తలు వినలేక చస్తున్నాము ‘ అన్నాడు కోపంగా.
‘పరిష్కారం మీ చేతుల్లోనే వుంది కదా’ అన్నాను జవాబుగా.
ఇందులో సమాధానం కన్నా ఎకసక్కెం పాలు ఎక్కువ వుందనుకున్నాడో ఏమో – ‘ఎలా?’ అన్నాడు మరింత కోపంగా.
‘మీ రేడియో నాబ్ ని ఎడమవైపు తిప్పండి సరిపోతుంది.’ అన్నాను కూల్ గా.
రేడియో పెట్టుకోవడం, ఆపుచేసుకోవడం మీ చేతుల్లో పనే కదా! అన్నట్టుగా ధ్వనించిన నా జవాబులో – ఏదయినా చమత్కారం తోచిందో ఏమో కాని, ‘భలే వారే’ అంటూ ఫోన్ పెట్టేసాడా శ్రోత.
మీడియాలో పనిచేస్తున్నప్పుడు ఇలాంటి అనుభవాలు మామూలే.
అయితే- ఎంతో కష్టపడి ప్రోగ్రాం తయారుచేసామనే భావనతో వుండే సిబ్బంది – విమర్శలను తట్టుకోలేకపోవడం కూడా సహజమే. కానీ, ఇక్కడ మరో నిజం కూడా ఒప్పుకోవాలి. వ్యంగ్యాస్త్రాలను అలవోకగా సంధించగల మీడియా వారు కూడా కొండొకచో వ్యంగ్యాన్ని భరించలేరు. కొన్ని పాళ్ళు స్వామి భక్తీ, కొన్నిపాళ్ళు వృత్తిమీది అనురక్తి – కలగలసి వారినలా మారుస్తుంది. అయితే- విమర్శలు చేసేవారికి – వాటిని స్వీకరించగల సహృదయత వుండాలనుకోవడం అత్యాశ కాదేమో!
ఆలోచిస్తే తప్పేముంది? (ర‌చ‌యిత సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌)

Bhandaru Srinivasarao

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here