బీజేపీ సృష్టించుకున్న జాతీయ ప్ర‌త్యామ్నాయం

2

చేజేతులా ప‌ట్టు కోల్పోతున్న మోడీ
బెంగాల్‌లో పాగా కోసం పాచిక బూమ్‌ర్యాంగ్
దెబ్బ తిన్న పులిలా రెచ్చిపోతున్న మ‌మ‌త‌
(సుబ్ర‌హ్మ‌ణ్యం వీఎస్ కూచిమంచి)

దేశంలో ప్ర‌త్యామ్నాయ శ‌క్తిని భార‌తీయ జ‌న‌తా పార్టీయే త‌యారు చేసుకుంటోందా? అంటే అవున‌నే అనిపిస్తోంది ప్ర‌స్తుత ప‌రిణామాలు చూస్తుంటే. 2014 నుంచి స‌రైన ప్ర‌తిప‌క్షం లేకుండా అధికారాన్ని ఆసాంతం మ‌జాగా ఆస్వాదించిన బీజేపీకి ఇప్పుడో ప్ర‌త్యామ్నాయం మ‌హిళ రూపంలో ఎదుర‌వుతున్నారు. అందుకు ప‌రోక్షంగా బీజేపీయే స‌హ‌క‌రిస్తోంది. బెంగాల్ టైగ‌ర్‌గా పేరుపొందిన దీదీ మోడీని ఢీకొనే శ‌క్తిగా త‌యార‌వుతున్నారు. ఆమె అలా ఎద‌గ‌డానికి కార‌ణం క‌చ్చితంగా బీజేపీ ఎత్తుగ‌డ‌లే. అసెంబ్లీ ఎన్నిక‌ల నాటి నుంచి జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లు దీనికి సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. ఎలాగైనా బెంగాల్‌లో పాగా వేయాల‌ని బీజేపీ ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంది. అందులో త‌ప్పులేదు.

ఆ ప్ర‌ణాళిక‌లు త‌మ చేతిలో ఉన్న అధికారం అండ‌తో వేసుకోవ‌డ‌మే త‌ప్పు. ప్ర‌థ‌మంగా 8 విడ‌త‌ల్లో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌. స్వ‌తంత్ర భార‌త చ‌రిత్ర‌లో ఏ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కూ ఇన్ని విడ‌త‌లు తీసుకోలేదు. సిబిఐ, ఈడీల ప్ర‌యోగం రెండో త‌ప్పిదం. ఎన్నిక‌ల‌కు ముందే కాకుండా.. త‌రువాత కూడా మంత్రుల‌ను అరెస్టు చేయించ‌డం అంత‌కంటే ఘోర‌మైన వ్యూహం. ఎవ‌రైనా అధికారంలోకి వ‌స్తే ప్ర‌తిప‌క్షంగా ఉన్న పార్టీ కొంత స‌మ‌యాన్ని ఇవ్వాలి. అలా ఇవ్వ‌కుండా మ‌రుక్ష‌ణం నుంచే ఎదురుదాడి ప్రారంభించింది బీజేపీ. దీనిని దురహంకార‌మ‌ని అన‌లేము కానీ, ఎంత ప్ర‌య‌త్నించినా ఓడిపోయామ‌నే నిరాశ బీజేపీలో విస్తృతంగా క‌నిపించింది. బెంగాల్ అన‌గానే బంగ్లాదేశ్‌తో సంబంధ‌మున్న‌ ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉంటారు. వీరిని ఆక‌ట్టుకోవ‌డానికి ఎన్నిక‌ల ముందు మోడీ ఢాకాకు వెళ్ళి వ‌చ్చారు. స్వాతంత్ర ఉత్స‌వాల‌లో పాల్గొని వ‌చ్చారు. అయినా ఫ‌లితం సున్న‌. పైగా మోడీ ప‌ర్య‌ట‌న‌కు వ్య‌తిరేకంగా ఢాకాలో హింస చెల‌రేగింది. ప‌దుల సంఖ్య‌లో ప్రాణాలు కోల్పోయారు.


ఇదేం వ్యూహం..
ఏడేళ్ళ క్రితం బీజేపీ దేశంలో అధికారాన్ని అందుకుంది. రెండేళ్ళ క్రితం రెండోసారి అధికారంలోకి రాగ‌లిగింది. 130ఏళ్ళ పైగా వ‌య‌సున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీకి స‌వాలు విస‌ర‌లేక‌పోయింది. రాహుల్ గాంధీ నిష్క్రియాప‌రత్వం మోడీకి అనుకోని వ‌రంగా ప‌రిణ‌మించింది. బీహార్‌లో ఉన్న నితీశ్ కుమార్ బీజేపీ గొడుగు కింద‌కు చేరిపోయారు. అఖిలేశ్ యాద‌వ్ బీజేపీని ఏమాత్రం దీటుగా ఎదుర్కొన‌లేక చ‌తికిల‌ప‌డ్డారు. మాయావ‌తి సంగ‌తి చెప్ప‌నే అక్క‌ర‌లేదు.

బీజేపీ త‌న వ్యూహంతో ఎన్సీపీ శ‌ర‌ద్‌ప‌వార్ మ‌హారాష్ట్ర‌కు ప‌రిమితం చేసింది. ఆ రాష్ట్రం నుంచి జాతీయ రాజ‌కీయాల వైపు చూసే అవ‌కాశం లేకుండా చేసింది. కేంద్ర పాలిత‌ప్రాంత‌మైన ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ కొంత‌కాలం కేంద్రానికి చికాకులు సృష్టించారు.

త‌ర‌వాత ఎందుకో ప‌ట్టు విడిచేశారు. క్ర‌మేపీ నెమ్మ‌దయిపోయారు. ఇక ద‌క్షిణాది రాష్ట్రాలు స‌రేస‌రి. ఆ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు త‌మ‌త‌మ అవ‌స‌రాల దృష్ట్యా గోడ మీద పిల్లివాటంలా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట‌ని ఉవ్విళ్ళూరిన కేసీఆర్ 2018 ఎన్నిక‌ల త‌ర‌వాత ఆ ఊసు మ‌రిచారు.

న‌వీన్ ప‌ట్నాయ‌క్ ఎప్పుడూ సాత్విక ధోర‌ణే. త‌న రాష్ట్రం బాగుంటే చాల‌ని కోరుకునే త‌త్త్వం. మిగిలిన ఏ రాష్ట్రంలోనూ బీజేపీని ఢీకొట్టే ధీరుడు క‌నిపించ‌లేదు. ఇదే ఆలంబ‌నగా బెంగాల్‌లోనూ చ‌క్రం తిప్పాల‌నుకుని బీజేపీ బోల్తాప‌డింది. కానీ ఆ అంశం వారిలో ప్ర‌తీకారాన్ని ర‌గిల్చింది. ఆ ప్ర‌తీకార‌మే బెంగాల్ టైగర్ పుండు మీద కారం జ‌ల్లిన‌ట్ల‌య్యింది. గాయ‌ప‌డిన పులి ఊరుకుంటుందా? గ‌ట్టిగానే గాండ్రిస్తోంది. ఫ‌లితం కోల్‌క‌తాలో ప్ర‌కంప‌న‌లు మొద‌ల‌య్యాయి. దేశంలోని ప్ర‌ధాన ప్రతిప‌క్ష పార్టీల దృష్టి ఆమెపైకి మ‌ర‌లుతోంది.

ఆమె రూపంలో మోడీకి ప్ర‌త్యామ్నాయాన్ని వారు చూస్తున్నారు. ఈ ప‌రిస్థితికి పూర్తి బాధ్య‌త బీజేపీదే. ప్ర‌తిప‌క్ష‌మే లేద‌నుకున్న త‌రుణంలో మోడీకి ప్ర‌త్యామ్నాయ నేత‌ను ప్ర‌తిప‌క్షంలో త‌యారు చేస్తున్న ఘ‌న‌త ఆ పార్టీకే ద‌క్కుతుంది. బెంగాల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో బీజేపీ స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డింది. మొత్తం జాతీయ నాయ‌క‌త్వాన్ని రంగంలోకి దింపింది. అయినా అధికారంలోకి రాలేక‌పోయింది. ఈ ఫ‌లితాల‌ను చూసి, మేథావులు ఇలా వ్యాఖ్యానించారు. బీజేపీ ఓడించింది టీఎంసీని కాదు… ప్ర‌తిప‌క్షాల‌ను అంటూ చేసిన వ్యాఖ్య ఆలోచ‌నీయ‌మే. కార‌ణం.. కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదు. రాజ‌కీయ చ‌తుర‌త పార్టీకి మేలు చేకూర్చేలా ఉండాలి త‌ప్ప కీడు క‌లిగించేదిగా ఉండ‌కూడ‌ద‌న్న కనీసం జ్ఞానం బీజేపీ నాయ‌కుల‌కు లేక‌పోయింది. ఆ ఫ‌లిత‌మే దీదీ మ‌మ‌తా బెన‌ర్జీ రూపంలో దేశంలో బీజేపీ ప్ర‌త్యామ్నాయ శ‌క్తి రూపొంద‌డం.

2 COMMENTS

  1. ఇదివరలో బెంగాల్లో 6 దఫాలు గా ఎన్నికలు నిర్వించారు. అప్పుడు బిజెపి అధికారం లో లేదు. ఇప్పుడు కొరొనా, స్థానిక అంశాల ఆధారం గా 8 దఫాల నిర్ణయం ఇసి తీసుకుంది. అది తప్పు ఎలా అవుతుంది. దానివల్ల బిజెపి కి నష్టం కలగటం ఎమిటి?

    • 6 ద‌ఫాల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ త‌ర‌వాతే కాంగ్రెస్ ఇంటికి వెళ్ళింది. ఈ వ్యాసంలో నేను చెప్పింది… అప్ర‌తిహ‌తంగా సాగుతున్న బీజేపీ జాతీయ స్థాయిలో త‌న ప్ర‌త్యామ్నాయాన్ని తానే త‌యారుచేసుకుంటోంద‌ని మాత్ర‌మే. మ‌మ‌త నుంచే ఇప్పుడు అస‌లు వార్నింగ్ బీజేపీ నుంచే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here