Monday, December 11, 2023
Homeటాప్ స్టోరీస్నాటి త్యాగాలకు ప్రతీక అమరుల జ్యోతి

నాటి త్యాగాలకు ప్రతీక అమరుల జ్యోతి

సమైక్య దాడిని తిప్పికొట్టి రాష్ట్రం సాధించాం
జయశంకర్ రెండు సిద్ధాంతాలతో లక్ష్యం దిశగా
ప్రతి శనివారం జయశంకర్ ఉపవాసం
హింసాత్మక విధానాలకు దూరంగా ఉద్యమం
ఉద్యమ ఘట్టాలను గుర్తుచేసుకున్న ముఖ్యమంత్రి
హైదరాబాద్, జూన్ 22 :
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు ‘తెలంగాణ అమరవీరుల స్మారక’ కట్టడాన్ని ఆవిష్కరించారు. అమరవీరుల స్మారక భవనంలోకి ప్రవేశించిన ఆయనకు పోలీసుల గౌరవ వందనం సమర్పించారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు అమరులకు నివాళులు అర్పించారు. తెలంగాణ అమరవీరుల స్మారక భవన శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మినీ థియేటర్ లో అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ రాష్ట్ర సాధనా క్రమాన్ని పొందుపరుస్తూ రూపొందించిన డాక్యుమెంటరీని సీఎం వీక్షించారు. డాక్యూమెంటరీని వీక్షిస్తున్నప్పుడు కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రదర్శన అనంతరం తెలంగాణ అమరవీరుల స్మారక జ్యోతిని ప్రజ్వలింప చేశారు.
గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అమరుల నివాళి గీతం ఆలపిస్తుండగా, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్ కొవ్వొత్తుల వెలుగుల‌తో అమరవీరులకు నివాళుల‌ర్పించారు. అమ‌ర‌వీరుల కుటుంబాల‌ను సీఎం కేసీఆర్ స‌త్క‌రించారు.


నినాదాలతో మార్మోగిన ప్రాంగణం
కార్యక్రమం ఆసాంతం ఎంతో భావోద్వేగంగా కొనసాగింది. అమరుల స్మరణతో సభ మొత్తం సంతాప వాతావరణం అలముకున్నది. తెలంగాణ సాధన పోరాటంలో పాల్గొన్న ఎంతోమంది ప్రముఖులు తెలంగాణ బిడ్డలు పలు రంగాలకు చెందిన కళాకారులు కవులు మేధావులు జర్నలిస్టులు సభకు హాజరయ్యారు. వారు ఉద్యమంలో పాల్గొన్న సంఘటనలు స్మరించుకుంటూ నాటి అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ.. జై తెలంగాణ’ అమరులకు జోహార్,,’ కొనసాగిస్తాం అమరుల ఆశయాలను’ జై కేసీఆర్’ అనే నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది.


అమరజ్యోతి వెలుగులో కె.సి.ఆర్. భావోద్వేగం
ఒకవైపు సచివాలయం అటువైపు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 ఫీట్ల విగ్రహం పక్కనే అమర జ్యోతి వెలుగులో సీఎం కేసీఆర్ ప్రసంగం కొనసాగింది. తాను తెలంగాణ కోసం శాంతియుత పందాలు పంథా లో అడుగు ముందుకేసిన నాటి నుంచి, తెలంగాణను సాధించి అనంతరం 9 ఏళ్ల కాలంలో సాగుతున్న అభివృద్ధి పాలనా క్రమాన్ని …సంఘటనలు గుర్తు చేసుకుంటూ సోదాహరణలతో వివరిస్తున్నంతసేపు సభలో నినాదాలు మార్మోగాయి.
తెలంగాణ సాధన కోసం తొలి దశ ఉద్యమాలు ఎట్లా ముందుకు సాగాయో వివరించారు.. ఒక రక్తపు బొట్టు కూడా చిందకుండా తెలంగాణ సాధించాలనే తన ఆశయం కొనసాగిన తీరు, అనుహమైన రీతిలో ముందుకు వచ్చిన ఆత్మహత్యలు తెలంగాణ యువతి యువకుల బలిదానాలు తనను ఎంతగానో కలిసి వేశాయని గద్గద స్వరంతో తన ఆవేదనను పంచుకున్నారు.


మూడు వారాలుగా కొనసాగుతున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఒకవైపు సంతోషాన్ని నింపగా.. అమరుల త్యాగాలు వెంటాడుతూ దుఃఖాన్ని కలిగించే సందర్భంలో ఉన్నామని, తెలంగాణ కోసం పోరాడి ప్రాణ త్యాగాలు చేసిన బిడ్డల స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నామని, పదేళ్లకు చేరుకున్న తెలంగాణ అభివృద్ధిలో వారి త్యాగాల స్ఫూర్తి ప్రతిబింబిస్తున్నదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ సాధనలో పాలుపంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను పేరుపేరునా తమ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.


అమరుల స్మారక సభలో సీఎం కేసీఆర్ ప్రసంగంలో ఏమన్నారంటే
• ఈ రోజు రెండు పార్శ్వాలు కలగలిసిన రోజు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను పురస్కరించుకొని నిన్నటి దాకా ఉత్సవాలు సంతోషంగా నిర్వహించుకున్నాం.
• ఈ రోజు ఈ ముగింపు సందర్భంలో చాలా ఘనంగా తెలంగాణ అమరులకు నివాళి అర్పించి ఉత్సవాలను ముగించాలని భావించి ఈ కార్యక్రమాన్ని చివరి దశలో పెట్టుకున్నాం.
• మీరందరు కూడా విచ్చేసి దీపాలు చేతబూని అమరులకు ఘనంగా నివాళి అర్పించినందుకు, మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
• ఈ సందర్భంలో సంతోషం ఒక పాలైతే, విషాదం రెండు పాళ్ళు ఉంది.
• ఈ రాష్ట్ర ఉద్యమ చరిత్ర చాలా పెద్దది. రాష్ట్రాన్ని విలీనం చేసే సమయంలోనే అనేక కుట్ర కోణాలు దాగి ఉండి, అమాయకమైన నాటి రాజకీయ నాయకత్వం, ప్రజలు ఏదో మంచి జరుగుతుందనే ఆశతో మనం బలై పోయినం. ఆ తర్వాత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలకే ఇబ్బందులు మొదలైనయి.
• మొట్టమొదట ఖమ్మం జిల్లా ఇల్లందులో ఉద్యమ పొలికేక మొదలై, అక్కడి నుండి అక్క‌డ్నుంచి 1965, 1966 నుంచి మొద‌లుకొని 1967 కు చేరుకునే వరకు యూనివర్సిటీలకు, విద్యార్థులకు చేరుకున్నారు. స్వామి గౌడ్ వంటి ధైర్యశాలులు, టిఎన్జీవోలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ నాటి అణచివేత పరిస్థితుల్లో కూడా 58 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో ఆసాంతం ఉద్యమంలో ఉన్నారు.
• ఎన్నో రకాల కేసులు, ఎన్నో రకాల వేధింపులు, పిడి యాక్టులు, ఉద్యోగాల బర్తరఫ్ లు.. ఇలా తెలంగాణ అనుభ వించని బాధ లేదు.
• ఆనాటి టీఎన్జీవో నేత ఆమోస్ వంటి వారిని మీసా యాక్ట్ కింద ఉద్యోగాల నుండి తీసేస్తే బద్రి విశాల్ పిట్టి అనే ఒక వ్యాపార వేత్త బకెట్లు పట్టుకొని దుకాణాదారుల దగ్గర డబ్బులు వసూలు చేసి వారి కుటుంబాలను ఆదుకున్నారు. టిఎన్జీవోలుఇలా మహత్తరమైన పోరాటాన్ని saagincharu.
• నాటి నుంచి నేటి వ‌ర‌కు కూడా మ‌న విద్యార్థి శ్రేణులు చాలా అద్భుతంగా పోరాడాయి.


• ఉద్య‌మం మొదట్లోనే నా మిత్రుడు వి. ప్ర‌కాశ్, మాజీ అసెంబ్లీ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారి లాంటి పిడికెడు మందితో మేధోమ‌ద‌నం చేశాం. రాష్ట్రం సాధించి తీరాల‌నే ఉద్దేశంతో అనేక మంది వ్య‌క్తుల‌ను క‌లిశాం. ఒక చక్కటి వ్యూహాన్నీ ర‌చించుకుని బ‌య‌ల్దేరాం.
• ఆ సంద‌ర్భంలో ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్‌ ని క‌లిశాం.. అనేకమంది అనేక రూపాల్లో కాంప్రమైజ్ అవుతారు. కాంప్రమైజ్ అయి నీరుగారి పోయేవారుంటారు. జయశంకర్ రెండు సిద్ధాంతాలు బ‌లంగా ఉండేవి. ఒక‌టి తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌. రెండోది శ‌నివారం పూర్తిగా ఉప‌వాసం ఉండేవారు. ఆ రకంగా ఆయ‌న ఆజ‌న్మ తెలంగాణ‌వాది. ఏ ఒక్క సంద‌ర్భంలో కూడా వెనుక‌డ‌గు వేయ‌లేదు.
• 1969 ఉద్య‌మం త‌ర్వాత ఏం జ‌రిగింద‌ని జ‌య‌శంక‌ర్‌ సార్ ను అడిగాం. కేసీఆర్ లాంటి వ్య‌క్తి రాక‌పోత‌డా అని చెప్పి మీటింగ్‌ల‌కు వెళ్లి మాట్లాడేవాళ్లం అని చెప్పేవారు. తెలంగాణ ఉద్య‌మ సోయి బ‌తికుండాల‌ని కొద్దిమందితోనైనా మీటింగ్ పెట్టేవాళ్లమని ఆయన చెప్పారు.
• ఆ సమయంలో లెఫ్ట్ పార్టీలు కూడా ఉద్య‌మానికి జీవం పోశాయి. తెలంగాణ మహాసభ అని, తెలంగాణ జనసభ అని ఉద్యమాన్ని సజీవంగా ఉంచడానికి, అయినంత వరకు ఆ సోయిని, స్పృహని సమాజంలో కలిగించడానికి అనేకానేక ప్రయత్నాలు సాగాయి.
• ఆ తదనంతరం మలిదశలో ఉద్యమం ప్రారంభమైన తర్వాత ముందు దశలో విద్యార్థులను రానీయవద్దని, మన ఉద్యోగులను మనమే బలి చేసుకోవద్దని ప్రజల్లోకి వెళ్ళి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ముందుకు పోదామని నిర్ణయించాం. ఈ నిర్ణయాలన్నీ చాలావరకు ఎవరికీ తెలియదు.


• చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… ఓ చోటకి వెళ్ళి వస్తుంటే నేటి పిల్లలకు కొత్తవాళ్ళకు తెలంగాణ ఉద్యమం గురించి తెలిసినట్లు లేదు మనం బాగా ప్రచారం చేయాలని ప్రకాశ్ అన్నారు. అప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి కొందరు విద్యార్థులు తనతో చర్చించిన విషయాన్ని ప్రకాశ్ కు చెప్పాను. వారికి ఉద్యమం పై సోయి ఉందని, సరైన వేదికను కల్పిస్తే ముందుకు సాగుతారని నేను స్పష్టం చేశాను.
• ఆ సందర్భంలో అనేక అనుభవాలు, అనేక మంది వ్యక్తులు, రాజకీయ నాయకులేమో ముసుగు వీరులుగా ఉండడం, వాళ్ళ మనసులో తెలంగాణ కాంక్ష ఉన్న బయటకు రాలేకపోవడం, రకరకాల బలహీనతలు ఇవన్నీ మనం చూశాం.
• మ‌లిద‌శ ఉద్య‌మంలో అనేక ర‌కాల చ‌ర్చ‌లు, వాదోప‌వాదాలు, హింస‌, పోలీసు కాల్పులు, 1969 లో దాదాపు 400 మంది చనిపోవడం, ఉద్య‌మం నీరుగారిపోవ‌డం వంటి ఘట్టాలను మనం చూశాం.
• ఎల్లకాలం మన గుండెల్లో నిలిచే విధంగా ఈ అమర జ్యోతిని మనం పెట్టుకున్నాం. అమరుల పేరు ఎప్పటికీ మన నోళ్ళలో ఉండే విధంగా ఇందులో హాల్ నిర్మాణం చేశారు. కొంతమంది మిత్రులు, పాత్రికేయ మిత్రులు ఈ దిశగా సాయమందించారు.


• 1969 ఉద్యమం నాటి ఫోటోలను సేకరించాం. ఇంకా మిగిలినవి కూడా సేకరించి, అమరుల పేర్లతో సహా ఒక ప్రత్యేకమైన స్థానంలో అలంకరిస్తాం. ఎందుకంటే ఉద్యమం ప్రస్థానం చిరస్థాయిగా ఉండాలి. దీనికొక ప్రత్యేకత ఉంది.
• 1969 లో కొంత హింస ధోరణి చూపింది.
• తెలంగాణ కోసం తన పదవిని త్యాగం చేసిన మొట్టమొదటి త్యాగధనుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. వారి ఇల్లు ఇక్కడే జలదృశ్యం పక్కన ఉండేది. వారు ఆశ్రయం ఇచ్చి కార్యాలయం ఇక్కడ పెట్టుకోమన్నారు. దీంతో అక్కడ కార్యాలయం ఏర్పాటు చేసుకొని పనులు ప్రారంభించాం.
• ఈ సందర్భంలో లోకట్ బాడీస్ లో రెండు జిల్లా పరిషత్ లు, 100 మండల పరిషత్ ల పైచిలుకు గెలిచి పోచంపాడులో శిక్షణా శిబిరాలు పెట్టుకున్నాం.
• అప్పుడు నాటి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించి ఫర్నీచర్ ను, ఇక్కడి కార్యాలయ భవనాన్ని ధ్వంసం చేసింది. అదే చోట అమరుల స్మారకం కట్టాలని భావించి, జలదృశ్యంలో అమరవీరుల జ్యోతిని నిర్మించాం.
• చాలా మంది నాతో విభేదించారు. ఉద్యమం అంటే ఆందోళన చేపట్టాలి. బస్సులు తగులబెట్టాలి. ఆందోళనకు, బంద్ కు పిలుపునివ్వాలి అని నాతో చెప్పారు. అది సాధ్యమయ్యే పని కాదని చెప్పి, మేం ప్రస్థానాన్ని ప్రారంభించాం.
ఆ రకంగా ఆ ప్రస్థానం, ఆ వ్యూహమే ఫలించి చివరికి తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. అది అందరికీ తెలుసు.


• ఎన్నిసార్లు మేం పదవులకు రాజీనామా చేసినమో లెక్కే లేదు. మంత్రి పదవులు, డిప్యూటీ స్పీకర్ పదవులు, ఎమ్మెల్యే పదవులు, కేంద్రమంత్రి పదవులు, పార్లమెంటు సభ్యుల పదవులు లెక్కలేకుండా రాజీనామాలు చేసినం.
• తెలంగాణ సమాజం మీద, ప్రజల మీద మాకు నమ్మకం అందుకే రాజీనామాలు చేసేందుకు వెనుకాడం అని చెప్పాం. రాజీనామాలను కూడా అస్త్రాలుగా వాడి, కొత్త వ్యూహాలతో ముందుకు పోయాం
• మహాత్మాగాంధీ ఇచ్చిన స్ఫూర్తితోనే అహింసాయుతంగా ముందుకు సాగాం.
• మిత్రుడు దేశపతి శ్రీనివాస్ చెప్పినట్లు మాకు దేవుడిచ్చిన శక్తినంతా కూడగట్టుకొని హింస జరగకుండా చూశాం.
• సమైక్యవాదులు, తెలంగాణలో ఉండే సమైక్యవాదుల తొత్తులు నా మీద చేసిన దాడి ప్రపంచంలో ఏ నాయకుని మీద కూడా జరిగి ఉండదు. అయినా కూడా నేను ఏనాడు బాధ పడలేదు. నా ప్రజల కోసం నేను పాటుపడుతున్న కాబట్టీ ఈ తిట్లే దీవెనలు అనుకుంటా అనుకున్నాను గానీ వీటి గురించి బాధపడలేదు
• జయశంకర్, నేను, స్వామిగౌడ్, మిత్రుడు దేవి ప్రసాద్ అందరం కలిసి సిద్దిపేటలో ఉద్యోగ గర్జన కార్యక్రమం చేసినం. అక్కడి నుండి రిటర్న్ వస్తుంటే అప్పటి సీఎం రోశయ్య 14 ఎఫ్ అని ప్రెసిడిన్షియల్ ఆర్డర్ తెచ్చి హైదరాబాద్ సిటీలో మనకు ఉద్యోగాలు దక్కకుండా చేస్తే, దీన్ని నేను తీవ్రంగా నిరసించి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని హెచ్చరించాను.
• కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని ఆనాడు బయలుదేరినాం. ఆ సందర్భంలో నేను దీక్షలో కూర్చుంటే, నాతో బాటు చాలా చోట్ల దీక్షకు కూర్చున్నారు.


• అప్పుడు డాక్టర్లు నేను కోమాలోకి పోతే తిరిగి కోలుకోలేనని డాక్టర్లు హెచ్చరించారు. అప్పుడు నాకు మద్దతుగా విద్యార్థుల, ప్రజల నిరసనలతో ఢిల్లీ సర్కారు దిగివచ్చి లోక్ సభలో చర్చకు పెట్టింది. ఈ ఘట్టాన్ని నేను నిమ్స్ హాస్పటల్ లో నిరాహార దీక్ష చేస్తూ చూశాను. ఆనాటి ప్రధాని మీద లోక్ సభ దద్దరిల్లేటట్టు చర్చిస్తే, మొత్తం భారత రాజకీయ వ్యవస్థనే అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే మనకు తెలంగాణ ఇస్తమనే ప్రకటన వచ్చింది. దాని తర్వాత నేను దీక్ష విరమించాను.
• చివరి నిమిషం వరకు వలసవాదులు, సమైక్యవాదులు దీన్ని అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశారో భారతదేశమంతా చూసింది. పార్లమెంటులోనే పెప్పర్ స్ప్రేలు చల్లే స్థాయికి దిగజారి, తెలంగాణ రాకుండా అడ్డుకోవాలని చూశారు.
• అనూహ్యంగా ఒక్క రక్తపు చుక్క కారకుండా, ఎవరికీ నష్టం జరగకుండా, అహింసాయుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలనుకున్నాం. నా నిరాహారదీక్ష సందర్భంగా ఉద్యమం విచిత్రంగా మలుపుతీసుకొని, పిల్లలు దారుణమైన పద్ధతిలో బలయ్యారు. మేం చస్తెనన్న కేంద్ర ప్రభుత్వం కండ్లు తెరుస్తదేమో, బుద్ది వస్తదేమోనని భావించి, వారు వారి ప్రాణాలను త్యాగం చేశారు. ఆ ప్రాణాలకు మనం వెలకట్టలేం.
• అందిన సమాచారం ఆధారంగా ఆరేడు వందల అమరుల కుటుంబాలకు ఉద్యోగాలిచ్చాం. ఇంటికి పది లక్షల రూపాయలిచ్చాం. ఇల్లు లేనివారికి ఇల్లు కూడా సమకూర్చినం. ఉన్నంతలో కొంత సహాయం చేసుకున్నాం. ఇంకా ఎవరైనా ఉంటే మనం ఉదారంగా సహాయం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు.


• తెలంగాణ బిడ్డల త్యాగాలే నన్ను బాధ పెట్టాయి. నన్ను వ్యక్తిగతంగా హింసించినా నేను బాధ పడలేదు. కానీ అనూహ్యంగా తెలంగాణ బిడ్డల బలిదానాలు నన్ను కలిచివేసింది. బాధ కలిగింది.
• అక్కడక్కడ కొంతమంది మూర్ఖులుంటారు. వారికి తత్తరపాటు, తొందరపాటు ఎక్కువుంటుంది. అమరుల స్థూపం ఏమైంది అని అక్కడక్కడ కొంతమంది మాట్లాడారు.
• మలేషియా, చైనా, సింగపూర్ కు పోయినప్పుడు అక్కడ అమరులకు కట్టిన స్మారకాలను చూసి తెలంగాణ అమరులకు స్మారకాన్ని యూనిక్ గా కట్టాలని భావించాను. అద్భుతమైన కళాకారుడు మిత్రులు రమణారెడ్డిని పిలిపించుకొని, ఈఎన్సి గణపతి రెడ్డిని పిలిచి మాట్లాడితే నా సూచనల ప్రకారం ఈ అమరజ్యోతికి రూపమిచ్చారు. ఖర్చు, సమయంతో సంబంధం లేకుండా శాశ్వతంగా ఉండిపోయేలా రూపొందించమని చెప్పాను.
• ఇతర రాష్ట్రాలవారు, విదేశీయులు వచ్చినా, ఎవరు వచ్చినా అమరుల జ్యోతికి పుష్పాంజలి ఘటించిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు జరిగేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది. ఇకముందు జరగబోయే కార్యక్రమాలన్నీ ఇలాగే జరుగుతాయి.
• ఆశించిన రీతిలో మిత్రులు రమణారెడ్డి గారు, ఇంజనీర్లు అందరూ కలిసి అద్భుతమైన రీతిలో అమరుల జ్యోతిని రూపొందించారు.
• తెలంగాణ చరిత్రను కండ్లకు కట్టే విధంగా ఫోటో గ్యాలరీని, తెలంగాణ ఉద్యమ ప్రస్థానం చరిత్రను సమగ్రంగా ఇక్కడ పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.
• 1969 ఉద్యమం, తరువాత మలిదశ ఉద్యమ ఘట్టాలకు సంబంధించిన వివరాలుంటే ప్రభుత్వానికి పంపిస్తే, ప్రభుత్వం ఇందులో చేరుస్తుందని విన్నవిస్తున్నాను.
• సాధించుకున్న తెలంగాణలో మనం అద్భుతంగా పురోగమిస్తున్నాం.

• స్వల్పకాలంలో మన రాష్ట్రం ఇంతటి పురోగతి సాధిస్తుందని ఎవరూ కూడా ఊహించలేదు.
• తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నప్పుడు శ్రీకృష్ణ కమిటి మొదలు ఎందరో అడిగిన లక్షలాది యక్ష ప్రశ్నలకు మేం సమాధానమిచ్చాం.
• కానీ ఈ రోజు తెలంగాణ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తలసారి సూచీల్లో అనేక విషయాల్లో నెంబర్ వన్ గా ఉన్నాం.
• తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను 20 రోజులుగా జరుపుకుంటున్నాం.
• తలసరి విద్యుత్ వినియోగంలో, తాగునీటిలో, సాగునీటిని అందించుకోవడం వంటి అనేక విషయాల్లో మనం నెంబర్ వన్ గా ఉన్నాం. వరి పంట ఉత్పత్తిలో పంజాబ్ నే తలదన్నేంత ధాన్యం ఉత్పత్తి తెలంగాణలో జరుగుతున్నది.
• తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సౌష్టవం సాధించిన తర్వాత, దళితజాతిని ఉద్ధరించి దేశానికే మార్గదర్శనం చేసేందుకు దళితబంధు పథకాన్ని తెచ్చుకున్నాం.
• అమెరికా ప్రజలు అక్కడి నల్లజాతీయులను అవమానించినందుకు పరిహారంగా అక్కడ బరాక్ ఒబామాను దేశాధ్యక్షున్నిచేసి పాపం పరిహారం చేసుకున్నట్లుగా, మనకు కూడా పరిణతి రావాలని నేను అనేక మందికి చెప్పాను.
• ఎంతోమంది త్యాగాలతో తెలంగాణ వచ్చిందనే స్మరణను కల్పించడానికి అమరుల జ్యోతిని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రవచించిన సమతా సిద్ధాంతాన్ని ప్రపంచానికి చెప్పాలని 125 అడుగులు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రపంచమంతా శాంతి,కరుణ, ప్రేమతో బతకాలని ప్రవచించిన బుద్ధిని విగ్రహాలతో ఈ ప్రాంతమంతా యూనిక్ ప్లేస్ గా ఆవిష్కృతమైంది.
• ప్రభుత్వం అవసరార్థులైన అన్ని వర్గాలకు చేయూతనిస్తూ పురోగమిస్తున్నది. కచ్చితంగా ఇదే స్ఫూర్తితోని తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను.
• మరొక్కమారు తెలంగాణ అమరవీరులకు హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తూ, జోహార్లు అర్పిస్తున్నాను.
• జై తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ముగించారు కె.సి.ఆర్.


ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు తారక రామారావు, హరీష్ రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రారెడ్డి,శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ , మల్లారెడ్డి , ఎంపీలు కేశవ రావు, నమ నాగేశ్వర్ రావు , జోగినపల్లి సంతోష్ కుమార్, సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, డిప్యూటీ స్పీకర్ పద్మ రావు , ఎమ్మెల్సీలు మధుసూధనా చారి,కవిత పళ్ళ రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఆశన్న గారి జీవన్ రెడ్డి, రసమయి బాలకిషన్, లక్ష్మా రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, గొంగిడి సునీత, పద్మ దేవేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారులు సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Prof Shankar Chatterjee, Hyderabad on A Success Story of a Doctor
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on My Experience in Eritrea
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Keep focus on alternative livelihood opportunities
Prof Shankar Chatterjee, Hyderabad on The Power of a Diverse Diet
Prof Shankar Chatterjee, Hyderabad on Food for Health Rhymes
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ