Wednesday, November 29, 2023
Homeటాప్ స్టోరీస్దిగ్విజయంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు

దిగ్విజయంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు

తొమ్మిదేళ్లు పూర్తిచేసుకుని 10 ఏళ్లకు చేరిన అభివృద్ధిపై సంబురాలు

మరోవారం కొనసాగనున్న సంబరాలు

  • విజయవంతంగా రెండు వారాలు పూర్తి
  • అన్ని శాఖల వారీగా కార్యక్రమాలు
  • పదేండ్లలోసాధించిన అభివృద్ధిపై సమీక్షలు
  • సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన
  • సంబురంగా పాల్గొంటున్న సబ్బండ వర్ణాలు
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతల వెల్లువ

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలు కన్నులపండువగా సాగుతున్నాయి. సబ్బండ వర్ణాల సంపూర్ణ మద్దతుతో దిగ్విజయంగా రెండు వారాలు పూర్తిచేసుకొన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తీవ్ర వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతం.. స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత గడిచిన తొమ్మిదేండ్లలో సాధించిన అభివృద్ధి, దేశానికే రోల్‌మాడల్‌గా నిలిచిన వైనాన్ని కళ్లకు కడుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దార్శనికతతో తెలంగాణ రాష్ట్రం నేడు దేశానికే దిక్సూచీగా నిలుస్తున్నది. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా వినూత్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం దూసుకెళ్తున్నది. రాష్ట్రం పదో వడిలోకి అడుగిడుతున్న తరుణంలో జూన్ 2న ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలు రెండు వారాలు పూర్తిచేసుకొన్నాయి. ప్రతి రోజు ఓ రంగంలో చేపడుతున్న వేడుకకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. ఉమ్మడి పాలనలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులు, పడ్డ అవమానాలను తలచుకొంటున్నారు. స్వరాష్ట్రంలో నేడు సగర్వంగా బతుకుతున్న తీరు, అందుకు కారకుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గత రెండు వారాలుగా విజయవంతంగా జరుగుతున్నదశాబ్ది ఉత్సవ ప్రగతి నివేదిక ఇది.
అమరుల స్మరణలో..
తెలంగాణ స్వరాష్ట్ర సాధనకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన అమరవీరులకు ఘన నివాళి అర్పించడంతో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మొదలయ్యాయి. గన్‌పార్క్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అమరవీరులకు ఘన నివాళి అర్పించారు. స్వరాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలను స్మరించుకున్నారు. అమర వీరుల కుటుంబాలను సన్మానించారు. అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ సమాజం రుణపడి ఉంటుందని, ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.
అన్నదాతలకు అన్నీతానై..
తెలంగాణ ఆవిర్బావం తర్వాత తొలినుంచి వ్యవసాయ రంగానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న కేసీఆర్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల్లో రెండో రోజు రైతు దినోత్సవం నిర్వహించింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి పెట్టుబడి కోసం ఎకరానికి 10 వేల రూపాయల సాయం అందించే రైతుబంధు, ఏ కారణంతోనైనా రైతు చనిపోతే ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేలా ప్రారంభించిన 5 లక్షల రూపాయాలు అందించే రైతుబీమా, సకాలంలో విత్తనాలు, ఎరువులు అందజేత, 24 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్తు సరఫరా, పండిన పంట చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుండటంతో తెలంగాణలో సాగు పండుగైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జూన్ 3న నిర్వహించిన రైతు దినోత్సవం రోజు అన్నదాతలు పెద్ద ఎత్తున హాజరై, అభివ్రుద్ధి ప్రధాత, సీఎం కేసీఆర్ చిత్రపటాలు, ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. సమైక్య పాలనలో పెట్టుబడు కోసం వడ్డీ వ్యాపారుల వద్ద మిత్తీలకు తెచ్చుకున్న రుణాలు, భార్య మెడలోని పుస్తెలు కుదువపెట్టిన పరిస్థితులను రైతులు గుర్తుచేసుకున్నారు. విత్తనాలు, ఎరువుల కోసం రోడ్డెక్కిన వైనాన్ని మననం చేసుకొన్నారు. స్వరాష్ట్రం వచ్చాక అలాంటి బాధలనుంచి విముక్తి కల్పించిన సీఎం కేసీఆర్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పారు. తమ కష్టాలు తీర్చిన రైతుబిడ్డ కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు.
తెలంగాణ పోలీస్ బేష్
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు తెలంగాణ పోలీస్ శాఖ సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నది. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో ఫిర్యాదులపై తక్షణమే స్పందించడం, బాధితులకు వేగంగా న్యాయం జరిగేలా చూడటం, కేసుల దర్యాప్తులో అధునాతన సాంకేతిక వినియోగంతో మన పోలీస్ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నది. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా హైదరాబాద్ నుంచే పర్యవేక్షించేలా నిర్మించిన కమాండ్ కంట్రోల్ రూం, రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని సీసీ కెమెరాలతో అనుసంధానించడం, మహిళల రక్షణకు షీటీమ్స్, ఫ్రెండ్లీ పోలీసింగ్ తదితర వినూత్న నిర్ణయాలతో తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే నంబర్ వన్ స్థానంలోనిలిచింది. జూన్ 4న నిర్వహించిన సురక్ష దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోలీసులు కార్లు, బైక్ ర్యాలీలు నిర్వహించారు. పోలీసులు అందిస్తున్న సేవలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
వెలుగుల దివ్వె తెలంగాణ
తెలంగాణ వస్తే చిమ్మచీకట్లు కమ్ముకొంటాయన్న సమైక్య పాలకుల దురంహకార మాటలను పటాపంచలు చేస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలంగాణను వెలుగుల దివ్వెగా మార్చారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు ఉండగా, సీఎం కేసీఆర్ దూరదృష్టి, చక్కని వ్యూహాలు, ప్రణాళికలతో నేడు అది 18,567 మెగావాట్లకు చేరుకొన్నది. రాష్ట్రంలో 2,140 యూనిట్ల సగటు విద్యుత్తు వినియోగంతో దేశంలోనే ఎంతో ముందు నిలిచినం. రైతులకు 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్తు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే కావడం విశేషం. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చీరాని కరెంట్‌తో మోటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. నేడు నాణ్యమైన నిరంతర విద్యుత్తు సరఫరాతో రైతుల కష్టాలు తీరాయి. రాష్ట్రంలో విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిదేండ్లలో రూ.97,321 కోట్లను ఖర్చుచేసింది. తెలంగాణ ప్రభుత్వ చర్యలతో హైదరాబాద్ పవర్ ఐలాండ్‌గా నిలిచింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 5న అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించిన విద్యుత్తు విజయోత్సవాల్లో రైతులు, వినియోగదారులు, విద్యుత్తు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణలో పారిశ్రామిక విప్లవం
వేల సంఖ్యలో పరిశ్రమలు, లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పన, ప్రపంచ దిగ్గజ సంస్థల పెట్టుబడిదారులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారింది తెలంగాణ. ‘పరిశ్రమలు వర్ధిల్లాలి.. ఉపాధి పెరగాలి.. తెలంగాణ పచ్చబడాలి.. ఇదే మన ధ్యేయం’ అని తరచూ చెప్పే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. ఆ మాట ప్రకారమే ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తూ తెలంగాణను పరిశ్రమల అడ్డాగా మార్చారు. సీఎం కేసీఆర్ దార్శనికతకు తోడు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తోడవ్వడంతో దేశ, విదేశీ కంపెనీలు తెలంగాణకు క్యూ కడుతున్నాయి. పరిశ్రమల స్థాపనకు సులభంగా అనుమతి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2015లో టీఎస్‌ఐపాస్ చట్టాన్ని తీసుకురావడంతో తెలంగాణకు ఎదురే లేకుండా పోయింది. దీంతో 2.65 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో 23 వేల పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయి. తద్వారా దాదాపు 17.77 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.45 లక్షల ఎకరాలు పరిశ్రమల స్థాపనకు కేటాయించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పటివరకు 28,000 ఎకరాలు కేటాయించింది. వీటిలో ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్, వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ తదితర పారిశ్రామిక వాడలు ఏర్పాటవుతున్నాయి. ఎస్సీ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.1,400 కోట్లు అందజేసింది.
ఐటీలో మేటి..
ఐటీ రంగంలోనూ తెలంగాణ సత్తా చాటుతున్నది. రాష్ట్ర ఆవిర్భావం నాటికి రూ.57,258 కోట్లుగా ఉన్న వార్షిక ఐటీ ఎగుమతులు.. నేడు రూ.1,83,569 కోట్లకు పెరిగాయి. గడిచిన తొమ్మిదేండ్లలో 220 శాతం వృద్ధిరేటు నమోదైంది. ఐటీ ఉద్యోగుల సంఖ్య సైతం 3.23 లక్షల నుంచి 8.27 లక్షలకు చేరింది. ఐటీ రంగం ఒక్క హైదరాబాద్‌కే పరిమితం కావద్దన్న ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు ద్వితీయశ్రేణి నగరాలకు సైతం ఐటీ పరిశ్రమలను విస్తరించారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం,నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేటలోనూ ఐటీ టవర్లు నిర్మించారు. పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్, రీచ్ సంస్థలు దోహదపడుతున్నాయి. దేశంలోనే అత్యుత్తమ ఇంక్యూబేటర్‌గా టీ-హబ్ కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డును అందుకొన్నది.
సాగు నీటికి స్వర్ణయుగం
స్వరాష్ట్ర కాంక్షల్లో ఒకటైన సాగు నీటి సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తలాపున గోదావరి, కృష్ణమ్మలు పరుగులు తీస్తున్నా సమైక్య పాలనలో తెలంగాణ తాగు, సాగు నీటి కోసం గోస పడ్డది. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడు తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు. కాకతీయుల కాలం నాటి గొలుసుకటుట చెరువుల వ్యవస్థను సైతం ఉమ్మడి పాలకులు విధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆవిర్భావం, ముఖ్యమంత్రిగా అధికారం స్వీకరించిన వెంటనే సీఎం కేసీఆర్ సాగునీటి రంగంపై దృష్టిసారించారు. దాదాపు 600 మీటర్ల ఎత్తుకు గోదావరి నీటిని తరలించేలా ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకురార్పన చేశారు. మూడు బరాజ్‌లు, ఏడు రిజర్వాయర్లతో దాదాపు 13 జిల్లాల్లోని వ్యవసాయ భూములకు సాగునీరు, హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించేందుకు 2016 మే 2న సీఎం కేసీఆర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మూడేండ్ల అతి స్వల్ప కాలంలో, యుద్ధప్రాతిపదికన నిర్మించి 2019 జూన్ 21న ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. కాళేశ్వర జలాలతో మండు వేసవిలోనూ చెరువులు నిండుకుండల్లా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నుంచి 90 టీఎంసీల నీటిని వాడుకోలేని దుస్థితి నుంచి, కాళేశ్వరం పూర్తిచేసుకొని నేడు 400 టీఎంసీల నీటిని వాడుకొనే స్థాయికి ఎదగడం సీఎం కేసీఆర్ కృషికి నిదర్శనం. కాళేశ్వరం ఎత్తిపోతల నీటి ద్వారా ఒకనాటి కరువు ప్రాంతాలన్నీ నేడు సస్యశ్యామలంగా మారాయి. బీడు భూములన్నీ పసిడి పంటలు పండుతూ తెలంగాణ మాగాణంలా మారింది. కాళేశ్వరం నీటితో సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఊటూరు నుంచి పెన్‌పహాడ్ మండలం రావిచెరువు వరకు 126 గ్రామాల పరిధిలో 68 కిలోమీటర్ల కాలువలో సంవత్సరం పాటు నిరంతరాయంగా సాగునీరు పారింది. ఈ నేపథ్యంలో సాగు నీటి దినోత్సవం సందర్భంగా జూన్ 7న కాలువకు లక్ష జన మహా హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు.
నిండు కుండల్లా చెరువు
చెరువు.. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆదరువు. కానీ, సమైక్య పాలకుల కుట్రపూరిత చర్యలతో చెరువు నిర్లక్ష్యానికి గురైంది. జలదోపిడీకి గురైంది. పూడిక చేరి, కట్టలు ముళ్లపొదలు మొలిచి, నీరు లేకుండా బోసిపోయింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం చెరువులకు పునరుజ్జీవం పోసింది. 2015 మార్చి 12న నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ పాత చెరువు వద్ద సీఎం కేసీఆర్ స్వయంగా మిషన్ కాకతీయకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు 4 దశల్లో రూ.9,155 కోట్లతో 27,527 చెరువులను పునరుద్ధరించడంతో ఆయా చెరువుల నీటి నిల్వ సామర్థ్యం 9 టీఎంసీలకు చేరింది. చెరువుల పునరుద్ధరణతోనే ఆగిపోకుండా తెలంగాణ ప్రభుత్వం చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు 15 వేల చెరువులను ప్రాజెక్టులతో లింక్ చేశారు. క్రమం తప్పకుండా వాటిని నీటితో నింపుతున్నారు. ఫలితంగా ఎండాకాలంలోనూ ఆయా చెరువులు నిండుకుండల్లా నీటితో కళకళలాడుతున్నాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 8న నిర్వహించిన చెరువుల పండుగ రోజు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు చెరువుల వద్ద పండుగ జరుపుకొన్నారు. బోనాలతో ఇంటిల్లిపాది తరలివచ్చి కట్టకు మొక్కులు చెల్లించుకొన్నారు. చెరువులకు ప్రత్యేక పూజలు చేశారు.
సంక్షేమ సంబురం
సబ్బండ వర్ణాల సంక్షేమానికి పథకాల రూపకల్పన, వాటి అమలులోనూ తెలంగాణ దేశానికే రోల్‌మాడల్‌గా నిలుస్తున్నది. తెలంగాణలో అమలవుతున్న పలు పథకాలను కేంద్ర ప్రభుత్వంతోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కాపీ కొడుతున్నాయంటే వాటి ఫలితం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎప్పటికప్పుడు అనేక విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. సబ్బండ వర్ణాలకు సంపదలో సమవాటా పంచుతున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్, అనాథలు, చేతివృత్తిదారులు, కుల వృత్తిదారులు, బీడీ కార్మికులు తదితర అట్టడుగు వర్గాలకు చెందిన వారికి అభివృద్ధి ఫలాలను పంచుతూ అండగా నిలుస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డలకు మేనమామలా మారి పెండ్లిళ్లు చేయిస్తున్నారు. గురుకుల విద్యాలయాలు, ఉచిత విద్యుత్తు, గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, దళితబంధు, బీసీలకు రూ.లక్ష సాయం తదితర సంక్షేమ పథకాలతో తెలంగాణ దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నది. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ఆసరా పింఛన్ కింద వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 అందజేస్తుండటం విశేషం. ఆసరా పింఛన్ అందుకున్న అవ్వలు తమ పెద్ద కొడుకు కేసీఆర్ అని, కల్యాణలక్ష్మి సాయం పొందిన ఆడబిడ్డలు తమ మేనమామ కేసీఆర్ అని తమ కుటుంబ సభ్యుడిలా భావించి కృతజ్ఞతలు తెలుపుతుండటం విశేషం.
సుపరిపాలనలో నంబర్1
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 10 జిల్లాలు ఉండేవి. వందల కిలోమీటర్ల దూరంలోని జిల్లాకేంద్రంలో ఉన్న అధికారులను కలువాలంటే నాడు ప్రజలు ప్రయాస పడేవారు. కష్టపడి అక్కడికి వెళ్తే తీరా అధికారులు లేకుంటే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారేది. అభివ్రుద్ధి కార్యక్రమాల అమలు, పరిశీలన కోసం మారుమూల గ్రామాలకు వెళ్లాలంటే అధికారులు సైతం ఇబ్బందులు పడేవారు. ఉద్యమ సమయంలో ఇలాంటి పరిస్థితులను గమనించిన సీఎం కేసీఆర్ స్వరాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జిల్లాల పునర్విభజనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో 33 జిల్లాలను ఏర్పాటు చేశారు. ప్రజలందరికీ అధికార యంత్రాంగం అందుబాటులో ఉండేలా చర్యలు చేపటాటరు. పాలన యంత్రాంగం అంతా ఒకే ప్రాంగణంలో ఉండేలా సమీక్రుత కలెక్టరేట్లను నిర్మించారు. అదే సమయంలో రెవెన్యూ డివిజన్లు, మండలాలను పునర్వ్యవస్థీకరించారు. దీంతో ప్రజలకు సర్కార్ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. అన్ని ప్రభుత్వ శాఖల పునర్ వ్యవస్థీకరణ తర్వాత ప్రజల ముంగిటకు సేవలు వచ్చాయి. కలెక్టర్ స్థాయి అధికారులు సైతం తమకు అందుబాటులో ఉండటంతో ప్రజలు తమ సమస్యలను నేరుగా పరిష్కరించుకొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారానే ఇది సాధ్యమైందని సంబుర పడుతున్నారు.
సాహిత్య పండుగ
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సాహిత్యంపై, ఇక్కడి కవులు, కళాకారులపైనా చిన్న చూపు ఉండేది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. తెలంగాణ సాహిత్యానికి, కవులు, రచయితలు, కళాకారులకు పెద్దపీట వేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీని ఏర్పాటు చేసి, కవులు, రచయితలను ప్రోత్సహించేవారు. ఏటా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు కవులు, కళాకారులను సన్మానించేవారు. ఎవరైన కళాకారుడు ఆపదలో ఉంటే సీఎం కేసీఆర్ ఆపద్బాందవుడయేయవారు. అవసరమైన వారికి వైద్యం, ఆర్థిక సాయం అందజేశారు. జూన్11న నిర్వహించిన సాహిత్య దినోత్సవం రోజున రాష్ట్రంలోని కవులు, కళాకారులు, రచయితలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు కవులు సమైక్య పాలనలో తమ దుస్థితిని గుర్తుచేసుకొన్నారు. సాహితీ వేత్తలకు పెద్దపీట వేసి, ఏటా సత్కరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నారు.
తెలంగాణలో ప్రగతి పరుగులు
స్వరాష్ట్రం సాకారమైన తర్వాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలంగాణ సమగ్రాభివృద్ధిపై ద్రుష్టి సారించారు. ఆయా రంగాల్లో తిష్టవేసిన సమస్యలను పరిష్కరించుకొంటూ అభివృద్ధికి బాటలు వేశారు. గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని దేశంలోని మరే ఇతర రాష్ట్రం సాధించలేదంటే అతిశయోక్తి కాదు. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని జూన్ 12న పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రన్ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ మద్దతు లభించింది. యువత స్వతహాగా వచ్చి తెలంగాణ రన్ లో భాగస్వామ్యం అయ్యింది. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణను వారు అభివర్ణించారు.
ఆడబిడ్డకు అందలం
తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి, వారి ఆర్థిక అభ్యున్నతికి ప్రాధాన్యం ఇచ్చింది. సీఎం కేసీఆర్ మహిళాకేంద్రంగానే పాలన కొనసాగించారు. ఒంటరి మహిళలు, వృద్దులు, బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్లు, పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద లక్షా నూట పదహారు రూపాయల ఆర్థిక సాయం, ఆరోగ్య మహిళ, ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ అందజేసి వారి ఆరోగ్య సంరక్షణకు కృషి చేశారు. పోలీసు శాఖలో 33 శాతం రిజర్వేషన్, మార్కెట్ కమిటీ పదవులలోనూ రిజర్వేషన్ కల్పించారు, షీటీమ్స్ ఏర్పాటు చేసి మహిళా భద్రతకు భరోసా కల్పించారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను పెంచి మంచి మనసు చాటుకొన్నారు. సమైక్య పాలనలో అత్తెసరు జీతాలతో బతుకులీడ్చిన అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ఇతర మహిళా ఉద్యోగులకు వేతనాలు పెంచి ఆత్మగౌరవం పెంచారు. బాలికా విద్యకు పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా మహిళా డిగ్రీ కళాశాలలను భారీగా ఏర్పాటు చేశారు. జూన్ 13న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవంలో పెద్ద ఎత్తున మహిళలు, మహిళా ఉద్యోగులు, అధికారులు, మహిళా ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉత్తమ మహిళా ఉద్యోగులకు సన్మానాలు చేశారు.
మన వైద్యం.. దేశానికే ఆదర్శం
ఉమ్మడి రాష్ట్రంలో ‘నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానకు’ అన్న పరిస్థితులు ఉండేవి. స్వరాష్ట్రంలో, సీఎం కేసీఆర్ పాలనలో ఆ పరిస్థితులు తలకిందులయ్యాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రభుత్వ వైద్యంపై దృష్టి సారించారు. సర్కారు దవాఖానలోల సౌకర్యాల పెంపు, వైద్య సిబ్బంది నియామకాలు, ల్యాబోరేటరీలు, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకొన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో మాతాశిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు, కేసీఆర్ కిట్ల పంపిణీతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య భారీగా పెరిగింది. అన్ని జిల్లా కేంద్రాల్లోని దవాఖానల్లో డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో మధుమేహ బాధితుల ఇబ్బందులు తొలగిపోయాయి. జిల్లా దవాఖానలోల ఏర్పాటు చేసిన ల్యాబోరేటరీలోల దాదాపు 60 రకాల రోగ నిర్దారణ పరీక్షలు నిర్వహించే సదుపాయాలు కల్పించడంతో రోగ నిర్దారణ కోసం పెద్ద పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ దవాఖానల తరహాలో హైదరాబాద్ నలు వైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మిస్తున్నారు. వరంగల్ లో హెల్త్ సిటీ ఏర్పాటు చేస్తున్నారు. పెదల కార్పొరేట్ దవాఖానగా పేరుగాంచిన నిమ్స్ దవాఖాన విస్తరణకు సీఎం కేసార్ శంకుస్థాపన చేశారు. దాదాపు 33 ఎకరాల్లో 2000 సూపర్ స్పెషాలిటీ పడకలు అందుబాటులోకి వచ్చేలా కొత్త భవనాలు నిర్మించనున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద మంజూరు చేస్తున్న నిధులను భారీగా పెంచారు. 2014-15 సంవత్సరంలో ఆరోగ్యశ్రీ చికిత్సలకు దాదాపు రూ.26 కోట్లు కేటాయించగా.. 2022-23 నాటికి రూ.96.97 కోట్లకు చేరింది. అటు ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎమ్మారెఫ్) కింద భారీగా నిధులు మంజూరు చేస్తూ సీఎం కేసీఆర్ మానవత్వాన్ని చాటుకొంటున్నారు. జూన్ 14న వైద్యారోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లో సీఎం కేసీఆర్ 2000 పడకలతో చేపట్టిన నిమ్స్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఉత్తమ ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నిషీయన్, డాక్టర్లకు సన్మానం చేసి, అవార్డులు అందజేశారు.
పల్లెకు ప్రగతి పట్టం
ఉమ్మడి రాష్ట్రంలో, సమైక్య పాలకుల వివక్షతో కుంటుపడిపోయిన తెలంగాణ గ్రామాల అభివృద్ధి.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో పరుగులు పెట్టింది. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగు పరచడం, పచ్చదనం పెంపొందించడం, మౌలిక వసతులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. వినూత్నంగా ‘పల్లె ప్రగతి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణలోని ప్రతి పల్లెను దేశానికే ఆదర్శంగా నిలుపాలని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగు కోసం ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్, ట్రాలీ చొప్పున 12,789 పల్లెల్లో కొనుగోలు చేశారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ కోసం ట్యాంకర్ ను మంజూరుచేశారు. ట్రాక్టర్ల ద్వారా సేకరించిన చెత్తను వేసేందుకు 12,769 గ్రామాలోల డంప్ యార్డులను ఏర్పాటుచేశారు. ప్రతీ వీధిలో సీసీ రోడ్లను వేశారు. గ్రామస్థులు సేదతీరేందుకు పల్లె ప్రకృతి వనాలను తీర్చిదిద్దారు. నర్సరీ, అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు 14,456 క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుచేశారు. చనిపోయిన మనిషికి అంతిమసంస్కారం గౌరవ ప్రదంగా నిర్వహించేందుకు 12,769 గ్రామాలోల వైకుంఠధామాలను నిర్మించారు. ప్రతి ఇంటికి నల్లా ద్వారా శుద్ధి చేసిన మంచి నీటిని సరఫరా చేస్తున్న రాష్ట్రం మనదే. ఐదు విడతలోల రూ.11,162 కోట్లతో పల్లె ప్రగతి కింద ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టారు. వీటన్నింటి పర్యవేక్షణకు ప్రతి గ్రామానికో కార్యదర్శిని నియమించింది. గ్రామంలో సకల సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో నేడు పల్లెలె మెరిసిపోతున్నాయి. అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అందజేసే అవార్డులోల సింహభాగం తెలంగాణ పల్లెలకు రావడమే ఇందుకు నిదర్శనం. 2019, 2022లో తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఒ.డి.ఎఫ్ ప్లస్ గా ప్రకటించింది. జూన్ 15న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవంలో ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచులు, ఉత్తమ మండలాల ఎంపీపీలకు సన్మానం చేశారు. తమ గ్రామం ఇంతలా మారుతుందని కలలో కూడా ఊహించలేదని పలువురు గ్రామస్థులు సంతోషంగా చెప్తున్నారు.
దేశానికే ఆదర్శం మన పట్టణాలు
పట్టణాల సమగ్ర అభివృద్ధికి రూపొందించిన పథకం పట్టణ ప్రగతి. పక్కా ప్రణాళికతో పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేని వాతావరణాన్ని కల్పించేందుకు 2020లో పట్టణ ప్రగతి కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు నేతృత్వంలో తొమ్మిదేండ్లలోనే తెలంగాణ పట్టణాలు ప్రపంచ గుర్తింపు పొందాయి. ఇందులో పారిశుద్ధ్యం ప్రధానమైంది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో 4,713 వాహనాల ద్వారా నిత్యం 4,356 టన్నుల చెత్తను తరలిస్తున్నారు. ఇందుకోసం వివిధ ప్రాంతాల్లో 1233.27 ఎకరాల విస్తీర్ణంలో 141 డంప్ యార్డులను ఏర్పాటుచేశారు. 229 కంపోస్ట్ షెడ్స్ ద్వారా ఎరువును తయారుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో 100 శాతం చెత్తను సేకరిస్తున్న రాష్ట్రంగా తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒకేచోట కూరగాయలు, మాంసం, చేపలు, పండ్లు లభించేలా రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లతో సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం చేపట్టింది. 57 పట్టణాల్లో రూ.2 కోట్లతో, 81 పట్టణాల్లో రూ.4.5 కోట్లతో నిర్మిస్తున్నది. 141 పట్టణాల్లో 453 వైకుంఠధామాల నిర్మాణానికి పూనుకొన్నది. ఇప్పటివరకు 304 వైకుంఠధామాలు అందుబాటులోకి వచ్చాయి. 176 వైకుంఠ రథాలను ఏర్పాటు చేశారు. పట్టణ ప్రజల కోసం 368 ఓపెన్ జిమ్స్, 1,273 క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుచేసింది. హరితహారంలో భాగంగా 3,618 వార్డుల్లో 1,612 నర్సరీలను ఏర్పాటుచేసి, 24.83 కోట్ల మొక్కల్ని పెంచుతున్నారు. నిరుడు 25.16 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం నిర్దేశించుకోగా, 25.22 కోట్ల మొక్కలు నాటి రికార్డు లిఖించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం కోసం మొత్తం రూ.4537.79 కోట్లు విడుదల చేయగా, రూ.4138.84 కోట్లు ఖర్చు చేశారు. టీఎస్ బీపాస్ ద్వారా భవన నిర్మాణ అనుమతులు సులభతరం చేశారు. కాగా, 23 పట్టణ స్థానిక సంస్థలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు, 3 పట్టణ స్థానిక సంస్థలకు ఇండియన్ స్వచ్ఛత లీగ్ అవార్డులు లభించాయి. ఆసియా పసిఫిక్ స్థిరత్వ సూచిక 2021 ప్రకారం.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని మొదటి 20 స్థిరమైన నగరాల్లో హైదరాబాద్ కూడా ఉన్నది. భారతీయ నగరాలోల మూడో స్థానంలో నిలిచింది. పట్టణీకరణలోనూ హైదరాబాద్ దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. ఐక్యరాజ్య సమితిలోని అర్బన్ డే ఫౌండేషన్, ఆహార, వ్యవసాయ సంస్థ హైదరాబాద్ ను ప్రపంచ వృక్ష నగరంగా వరుసగా రెండేండుల గుర్తించింది. మన పట్టణాల్లో వివిధ రాష్ట్రాల బృందాలు అధ్యయనం చేసే స్థాయికి తెలంగాణ ఎదగడం విశేషం. జూన్ 16న నిర్వహించిన పట్టణ ప్రగతి దినోత్సవంలో భాగంగా ఉత్తమ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వార్డు కౌన్సిలర్లకు, చైర్మన్లకు, మేయర్లకు, ఉద్యోగులకు సన్మానం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Prof Shankar Chatterjee, Hyderabad on A Success Story of a Doctor
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on My Experience in Eritrea
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Keep focus on alternative livelihood opportunities
Prof Shankar Chatterjee, Hyderabad on The Power of a Diverse Diet
Prof Shankar Chatterjee, Hyderabad on Food for Health Rhymes
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ