Thursday, September 28, 2023
HomeHomeప్ర‌గ‌తి ర‌థం ప‌రుగులు తీయాలి

ప్ర‌గ‌తి ర‌థం ప‌రుగులు తీయాలి

గ‌ర్వించే స్థాయిలో ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల అభివృద్ధి
గుర్తింపై మ‌న ప్ర‌గ‌తికి కొల‌మానం
దేశ‌వ్యాప్తంగా విశేష ఆద‌ర‌ణ‌పై సీఎం హ‌ర్షం
ప‌ల్లె ప్ర‌గ‌తి స‌మీక్ష‌లో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌
హైద‌రాబాద్‌, మే 18:
విధ్వంసానంతరం వ్యవస్థలను పునర్న్మించుకోవడం చాలా కష్టమైన పని అని, ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్ర పాలనలో ధ్వంసమైన తెలంగాణను తిరిగి బాగు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా కష్టపడాల్సి వస్తున్నదనీ, అన్ని కష్టాలను అధిగమించి నేడు దేశం గర్వించే స్థాయిలో తెలంగాణ పల్లెలను, పట్టణాలను అభివృద్ధి చేసుకుంటున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. మనం చేస్తున్న పనిని ఇతరులు గుర్తించడమే ప్రగతికి కొలమానమనీ, తెలంగాణలో అమలుచేస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు, ఆదరణ లభించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రెండు పర్యాయాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో, మొదటి దశలో పదికి పది గ్రామాలు, రెండవ దశలో 20కి 19 గ్రామాలు తెలంగాణ నుంచే ఎంపిక కావడం గొప్ప విషయమని అన్నారు. ఈ దిశగా కృషి చేసిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును,శాఖ అధికారులను., జిల్లాల కలెక్టర్లను,సంబంధిత శాఖల అధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు.


జూన్ 2న రాష్ట్ర ఆవిర్బావ దినోత్స‌వాలు
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు కోసం చేపట్టాల్సిన కార్యాచరణతో పాటు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు, వరి ధాన్యం సేకరణ మరియు జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణకు సంబంధించి బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.


విధ్వంసానంతరం పునర్నిర్మాణం కష్టమైన పని
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. “విధ్వంసం అనంతరం వ్యవస్థలను పునర్న్మించుకోవడమంటే ఎంతో కష్టంతో కూడుకున్నది. గత పాలనలో ధ్వంసమైన తెలంగాణను తిరిగి పునర్నిర్మించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తున్నది. అడ్డంకులు ఎన్నెదురైనా దేశం గర్వించే స్థాయిలో తెలంగాణ పల్లెలను, పట్టణాలను అభివృద్ధి చేసుకుంటున్నాం. ఫలితాలు ఊరికే రావు. ప్రజల సంక్షేమం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న కార్యాచరణలో అధికారులు శ్రద్ధాసక్తులతో, చిత్తశుద్ధితో పాల్గొన్నప్పుడే ఫలితాలు సాధ్యమైతాయి. తెలంగాణ నూతన పంచాయతీ రాజ్ చట్టం తెచ్చినప్పుడు పలువురు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. కానీ నేడు వారి అనుమానాలను పటాపంచలు చేసి తెలంగాణ పల్లెలను అభివృద్ధి పథాన నడిపించుకుంటున్నాం. ప్రతి గ్రామానికి మౌలిక వసతులను ఏర్పాటు చేసుకొని ప్రగతి సాధిస్తున్నాం. ప్రతీ పల్లెలో ఇవ్వాల ఒక ట్రాక్టర్ ను ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసుకున్నాం. ప్రభుత్వం చేపట్టిన చర్యలు నేడు గ్రామాల్లో స్ఫూర్తిని నింపాయి.


పీఆర్ ఉద్యమస్ఫూ ర్తిని పలుచన చేశారు
ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ…‘‘ నేను గతంలో చెప్పినట్టు, ఎస్ కె డే గారు ప్రారంభించిన పంచాయతీ రాజ్ వ్యవస్థ ఒక ఉద్యమం. కానీ నేడు అందులో రాజకీయాలు ప్రవేశించడం ద్వారా అన్ని రకాలుగా పంచాయతీ రాజ్ స్ఫూర్తి చంపివేయబడ్డది. దేశంలో ప్రారంభమైన సహకార ఉద్యమం కూడా కలుషితం చేయబడ్డది. ఇటువంటి నిర్లక్ష్యపూరిత పరిస్థితుల నేపథ్యంలోంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభ దశలో తీసుకున్న నిర్ణయాలు, ఎంచుకున్న ప్రాధాన్యతా క్రమాలు కొందరికి జోక్ లాగా కనిపించాయి. తెలంగాణ వచ్చిన ప్రారంభంలో నేను అటవీ శాఖ, అడవుల పరిరక్షణ మీద సమీక్ష సమావేశం నిర్వహిస్తే కొందరు నవ్వుకున్నారు. కానీ నేడు దేశ పర్యావరణం, పచ్చదనంలో భాగస్వామ్యం పంచుకోవడంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. తెలంగాణ వచ్చేనాటికి అస్తవ్యస్తంగా, యుద్ధవాతావరణంతో కూడుకొని ఉన్న గ్రామీణ మంచినీటి వ్యవస్థను ఇవ్వాల దేశం గర్వించేలా మిషన్ భగీరథ ద్వారా తీర్చిదిద్దుకున్నాం. ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తున్న పరిస్థితి దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేదు.


అన్ని రంగాల్లో జరిగిన తెలంగాణ అభివృద్ధిని ఇటీవల కొన్ని జాతీయ మీడియా ఛానళ్ళు ప్రసారం చేశాయి. ఇది చూసిన ఇతర రాష్ట్రాల వారికి ఆశ్చర్యం కలిగింది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి నాకు ఫోన్లు చేసి అడుగుతన్నారు. అంటే మనం అనతికాలంలో అనితర సాధ్యమైన అభివృద్ధిని సాధించాం. ఇందులో భాగస్వాములైన ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇదే సందర్భంలో ఒక విషయాన్ని మీ దృష్టికి తేదలిచాను. పంచాయతీ రాజ్ వ్యవస్థలో మూడంచెల విధానం వచ్చిన తర్వాత నాటి రాజీవ్ గాంధీ నుంచి నేటి వరకు ప్రధాని పదవిలో ఉన్నవారు రాష్ట్రాలను నమ్మకుండా, కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చాలా చిల్లర వ్యవహారంగా ఉన్నది.

జవహర్ రోజ్ గార్ యోజన, ప్రధాని గ్రామ సడక్ యోజన, నరేగా వంటి పథకాలను రాష్ట్రాల ద్వారా కాకుండా కేంద్రమే నేరుగా ఢిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సమర్థనీయం కాదు. రాష్ట్రాలలో నెలకొన్న స్థానిక పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయి. రోజువారి కూలీల డబ్బులు కూడా నేరుగా ఢిల్లీ నుంచి కేంద్రమే పంచాలనుకోవడం సరైన విధానం కాదు. 75 సంవత్సరాల అమృత మహోత్సవాల నేపథ్యంలో దేశంలో ఇంకా కరెంటు లేక పల్లెలు, పట్టణాలు చీకట్లలో మగ్గుతున్నాయి. త్రాగునీరు, సాగునీరు లేక ప్రజలు రోడ్ల మీదకు ఎక్కుతున్నారు. విద్య, వైద్యం అనేక రంగాలల్లో రావాల్సినంత ప్రగతి రాలేదు. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి అంశాల మీద దృష్టి పెట్టకుండా, రాష్ట్రాల విధులలో జోక్యం చేసుకోవాలనుకోవడం సమర్థనీయం కాదు” అని సీఎం వివరించారు. దేశం ఒక సమగ్రమైన ఆకలింపు, అవగాహన, అభ్యుదయం వైపు అడుగులు వేస్తున్నట్లు అనిపించడం లేదని సీఎం కేసీఆర్ ఆవేదన చెందారు.


పంచాయితీరాజ్ వ్యవస్థ గౌరవనీయమైనది : జెడ్పీ చైర్మన్ల పాత్ర కీలకం
గతంలో పంచాయితీరాజ్ వ్యవస్థ అంటే ప్రత్యేక గౌరవం ఉండేదని సిఎం అన్నారు. నాటి ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి ఎం. బాగారెడ్డి లాంటి మహామహులు మంత్రులుగాకంటే, జెడ్పీ ఛైర్మన్ లుగానే కొనసాగడానికి ఇష్టపడే వారని సిఎం గుర్తు చేశారు. పంచాయతీ రాజ్ లో జెడ్పీ ఛైర్మన్ పాత్ర అంత కీలకమైనదని, ప్రస్తుత జెడ్పీ ఛైర్మన్ లు వారిని స్ఫూర్తిగా తీసుకొని పల్లె ప్రగతిలో కర్తలు, దర్తలు కావాలన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో జెడ్పీ ఛైర్మన్ లు కీలక భూమిక పోషించాలని, ఎంపిపిలు, ఎంపిడీవోల సేవలను కూడా ఉపయోగించుకోవాలన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా పల్లెలు, పట్టణాల ఉన్నత స్థితి నుంచి అత్యున్నత స్థితి దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిఎం తెలిపారు. రాష్ట్రంలో అన్ని గ్రామపంచాయతీల్లో వైకుంఠధామం పనులు 100 శాతం పూర్తి చేయాలనీ, పనుల పురోగతిని జడ్పీ ఛైర్మన్ లు నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేసి పర్యవేక్షించాలని తెలిపారు. ఉత్తమ గ్రామపంచాయతీలను ప్రోత్సహించడంతో పాటు, పనులు సరిగా జరగని చోట అధికారులు ప్రజాప్రతినిధులకు సహకరించాలన్నారు. ఓడిఎఫ్ (బహిరంగ మల విసర్జన రహిత) విషయంలో 100 శాతం ఫలితాలను రాబట్టేందుకు 15 రోజుల్లో నివేదికలు తెప్పించుకొని, తగిన చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు.


ముందంజలో నూతన తెలంగాణ రాష్ట్రం
పంటల ఉత్పత్తిలో, తలసరి ఆదాయంలో ప్రధానమంత్రి స్వంత రాష్ట్రం గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక వంటి దశబ్దాలుగా స్థిరపడిన రాష్ట్రాలకంటే తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని సిఎం తెలిపారు. నిజమైన స్ఫూర్తి, లక్ష్యంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయనడానికి తెలంగాణ ఒక ఉదాహరణగా నిలిచిందని సిఎం తెలిపారు. అడవులు, తాగునీరు, సాగునీళ్లు, ఆరోగ్యరంగం, మన ఊరు – మన బడి, దళితబంధు ఇలా అనేక రంగాల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతి దిశగా ముందుకు సాగుతున్నదని సిఎం తెలిపారు.భవిష్యత్తు తరాలు సుఖవంతంగా ఉండాలంటే మనం ప్రత్యేక శ్రద్ధ వహించి, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు.


ప్రజారోగ్యం వైద్యం లో పురోగతి
తెలంగాణలో మొత్తం 10 వేల పడకల సామర్థ్యం తో 6 కొత్త మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానాలను నిర్మించుకోనున్నామనీ, వరంగల్ లో 24 అంతస్తుల్లో 38 విభాగాలతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు.
హైదరాబాద్ నలువైపులా 2000 పడకల సామర్థ్యం గల సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్ ను అల్వాల, సనత్ నగర్, గడ్డి అన్నారం, గచ్చిబౌలి నిమ్స్ లలో ఢిల్లీ ఎయిమ్స్ తరహాలో టిమ్స్ పేరుతో నిర్మిస్తున్నామన్నారు.


ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కలిపి 57 వేల ఆక్సిజన్ బెడ్స్ కలిగిన సామర్థ్యం తెలంగాణ వైద్య రంగంలో ఏర్పడ్డట్లు వివరించారు. 550 టన్నుల ఆక్సిజన్ ఇక్కడే ఉత్పత్తి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనే శక్తి తెలంగాణ రాష్ట్రానికి ఉందని సిఎం తెలిపారు.


తెలంగాణ బెంచ్ మార్క్
మొట్టమొదటి సారి ప్రపంచానికి గ్రీన్ ఫండ్ కాన్సెప్ట్ ను తెలంగాణ పరిచయం చేసిందని సిఎం అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు తమ వేతనంలో 100 నుండి 500 రూపాయల వరకు ప్రతీ నెలా కంట్రిబ్యూట్ చేసే విధానం, అడ్మిషన్లు, రిజిస్ట్రేషన్ ఫీజుల్లో కొంత గ్రీన్ ఫండ్ వసూలు చేస్తున్నాన్నారు. స్థానిక సంస్థల నిధుల్లో 10 శాతం బడ్జెట్ ను హరితహారానికి కేటాయించడం తప్పనిసరని, ఈ నిబంధనను కచ్చితంగా అమలుచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లో భాగంగా జరుగుతున్న అన్ని పనులను మంత్రులు, చీఫ్ సెక్రటరీలు, జడ్పీ ఛైర్మన్ లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, లోకల్ బాడీ కలెక్టర్లు, డిపీవోలు, నిరంతరం తనిఖీలు చేసి, ఎవరి పరిధిలో వారు రెగ్యులర్ గా సమీక్ష జరపాలని ఆదేశించారు.


పాలమూరు భేష్
మహబూబ్ నగర్ లో 2087 ఎకరాల్లో అద్భుతంగా నిర్మించిన పార్కును ఆదర్శంగా తీసుకొని, ఇతర జిల్లాల్లో కూడా అర్బన్ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సిఎం సూచించారు. హైదరాబాద్ కు ఓఆర్ఆర్ గ్రీన్ నెక్లెస్ వంటిదని, దాని గ్రీనరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరక్టర్ లను సిఎం ఆదేశించారు. జాతీయ రహదారులకు ఇరువైపులా చెట్ల పెంపకం విషయంలో జెడ్పీ ఛైర్మన్లు, కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మల్టీ లేయర్ ప్లాంటేషన్ చేపట్టాలని సిఎం ఆదేశించారు.


కోల్పోయిన స్వర్గాన్ని తిరిగి తెచ్చుకుందాం
అడవులను పునరుజ్జీవింప చేయడం ద్వారా కోల్పోయిన స్వర్గాన్ని మళ్ళీ తెచ్చుకుందామని సిఎం పిలుపునిచ్చారు. ఈ విషయంలో అటవీ శాఖ అధికారులు, కలెక్టర్లు, ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.


పక్కరాష్ట్రాల ప్రజలకూ తెలంగాణే ఆదెరువు
తెలంగాణలో ఉన్న నిరంతర విద్యుత్, వ్యవసాయానికి అందిస్తున్న పథకాలు సహా తదితర సంక్షేమ పథకాలను రాష్ట్రాన్ని ఆనుకుని వున్న ప్రజలు అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని వార్తలొస్తున్నాయని సిఎం తెలిపారు. కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్ బిజెపి ఎమ్మెల్యే తెలంగాణ పథకాలను కర్నాటకలో అమలు చేయాలని, లేకపోతే తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని కోరుతున్న విషయాన్ని గమనించాలని సిఎం అన్నారు.
రాష్ట్రంలోని ప్రతీ గ్రామపంచాయతీ వైకుంఠధామానికి 10 రోజుల్లోగా మిషన్ భగీరథ మంచినీటి కనెక్షన్ అందించాలని కలెక్టర్లను ఆదేశించారు.

గ్రామపంచాయతీల పరిధిలో ఉండే పాఠశాలలు, అంగన్వాడీ, ఎఎన్ఎం తదితర ప్రజావినియోగ సంస్థల పరిశుభ్రం, త్రాగునీటి వసతి తదితర బాధ్యతలు గ్రామపంచాయతీలు నిర్వహించేలా డిపీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

చెరువులు, వాగులు, వర్రెలు, వంకలు,నదులు, ఉపనదుల తీరాల వెంట గ్రీన్ కవర్ అవకాశం ఉన్న ప్రతీ చోట మొక్కలు నాటించాలని ఆదేశించారు. మున్సిపల్ వార్డుల్లో నర్సరీలు ఏర్పాటు చేయకపోతే, దానికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలనీ, ఈ నర్సరీల విషయంలో తనిఖీలు నిర్వహించాలనీ చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరక్టర్ లకూ సీఎం సూచించారు. మంత్రులు జిల్లాల్లో మున్సిపాలిటీల పై ఛైర్మన్ లు, మేయర్లు, కమిషనర్లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. తాను ఆకస్మిక తనిఖీలు చేపడతానని సిఎం స్పష్టం చేశారు.


ఈ కార్యక్రమంలో.. రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంవో అధికారులు సహా.. పర్యాటక, సాంస్కృతి, దేవాదాయ, యువత వ్యవహారాల సలహాదారు , అటవీ వ్యవహారాల సలహాదారు; ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్, ఫైనాన్స్ విభాగాలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు; పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, వ్యవసాయం, విభాగాలకు చెందిన ప్రభుత్వ కార్యదర్శులు; పిసిసిఎఫ్ (హెచ్ఓఎఫ్ఎఫ్), పిసిసిఎఫ్ (ఎఫ్ఎఫ్); సివిల్ సప్లైస్, మున్సిపల్ అడ్మినిస్రే;ంషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ విభాగాలకు చెందిన కమిషనర్ లు; మార్కెటింగ్, కల్చర్ విభాగాలకు చెందిన డైరక్టర్ లు, జిల్లా పరిషత్ చైర్మన్ లు, మేయర్లు, మున్సిపల్ కమిషనర్లు, , రైతు సమన్వయ సమితి చైర్మన్లు, జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, జిల్లా పంచాయతీ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Prof Shankar Chatterjee, Hyderabad on A Success Story of a Doctor
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on My Experience in Eritrea
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Keep focus on alternative livelihood opportunities
Prof Shankar Chatterjee, Hyderabad on The Power of a Diverse Diet
Prof Shankar Chatterjee, Hyderabad on Food for Health Rhymes
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ