Tuesday, March 28, 2023
Homeతెలంగాణ వార్త‌లుతెలంగాణ ఆత్మ‌గౌర‌వ ప్ర‌తీక అంబేద్క‌ర్ స‌చివాల‌యం

తెలంగాణ ఆత్మ‌గౌర‌వ ప్ర‌తీక అంబేద్క‌ర్ స‌చివాల‌యం

ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిర్మాణం
అమ‌రుల త్యాగ ఫ‌లిత‌మే ఈ నిర్మాణం
స‌చివాల‌య ప‌నుల‌ను ఆమూలాగ్రం ప‌రిశీలించిన ముఖ్య‌మంత్రి
అధికారుల‌కు సూచ‌న‌లు చేసిన కేసీఆర్‌
హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 17:
నూతనంగా నిర్మితమౌతున్న డా.బిఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరుల త్యాగ ఫలితమేనని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. దేశానికే ఆదర్శంగా ప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరింత ఇనుమడింపచేసే దిశగా, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ సచివాలయం రూపుదిద్దుకుంటున్నదని సిఎం తెలిపారు. గురువారం నాడు తుది దశకు చేరుకుంటున్న తెలంగాణ సచివాలయ పనుల పురోగతిని సిఎం కెసిఆర్ పర్యవేక్షించారు.


సచివాలయం ప్రధాన ద్వారం దగ్గరునుంచి పై అంతస్తు వరకు పరిశీలించిన సిఎం, వర్క్ ఏజెన్సీలకు, ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. ప్రధాన ద్వారం ఎలివేషన్ సహా, ఇటీవల బిగించిన డోములను, దోల్ పూర్ స్టోన్ తో రూపొందించిన వాల్ క్లాడింగ్ తదితర అలంకరణలను సిఎం కలియ తిరిగి పరిశీలించారు. సచివాలయానికి ఉత్తర దక్షిణ భాగాల్లో ఏర్పాటు చేసిన ప్రవేశ ద్వారాలను, కాంపౌండ్ వాల్స్ ను, వాటికి అమరుస్తున్న రైలింగులను, సుందరంగా రూపుదిద్దుకుంటున్న వాటర్ ఫౌంటేన్లను, లాన్ లను, స్టెయిర్ కేస్ లను సిఎం క్షుణ్ణంగా పరీక్షించారు. ముఖ్యమంత్రి, మంత్రులు సహా ఉన్నతాధికారులు సిబ్బంది సందర్శకుల వాహనాల ప్రవేశ ద్వారాలను పార్కింగు స్థలాలను తుది దశకు చేరుకుంటున్న వాటి నిర్మాణాలను సిఎం పరిశీలించారు.


చాంబ‌ర్ల నిర్మాణంపై కేసీఆర్ సంతృప్తి
మంత్రుల ఛాంబర్లను వారి సెక్రటరీలు సిబ్బంది కార్యాలయాలను పరిశీలించారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచుతూ, సమర్థవంతంగా గుణాత్మకంగా పనితీరును కనబరిచే విధంగా చాంబర్లు నిర్మితమౌతున్నాయని సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు. విశాలవంతమైన కారిడార్లను, ఛాంబర్లను పరిశీలించి, మంత్రులు వారి సిబ్బంది వొకే చోట విధి నిర్వహణ చేసే విధంగా అనుకూలంగా వుందని సిఎం వివరించారు. క్యాంటీన్లను, సమావేశ మందిరాలను పరిశీలించిన సిఎం తగు సూచనలు చేశారు. వాహనాల రాకపోకలకు అనుగుణంగా తను సూచించిన విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయా అనే విషయాన్ని సిఎం నిర్ధారించుకున్నారు.

ఇటీవలే బిగించిన డోమ్ లను పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు. జీఆర్ సీ పట్టీలను సిఎం పరిశీలించారు. సచివాలయం ప్రాంగణంలో హెలీప్యాడ్ కోసం స్థలాన్ని పరిశీలించిన సిఎం అనువైన చోట నిర్మాణం చేపట్టాలన్నారు. అందరికీ అనువైన రీతిలో ఏర్పాటు చేస్తున్న డైనింగ్ హాల్స్, మంత్రులు అధికారులు కలెక్టర్ల కోసం ఏర్పాటు చేసిన సమావేశ మందిరాలను సిఎం పరిశీలించి తగు సూచనలు చేశారు. సిబ్బందికి సందర్శకులకు అసౌకర్యం కలగకుండా అన్ని చోట్లా లిఫ్టుల నిర్మాణం చేపట్టడం పట్ల సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు. సెక్యూరిటీ సిబ్బంది కార్యాలయాలు సహా అడుగడుగునా కదలికలను పసిగట్టే సిసి కెమెరాల ఏర్పాటు పటిష్టమైన భధ్రత ఏర్పాట్ల దిశగా చేపట్టిన చర్యలను పరిశీలించారు. రికార్డులను భధ్రపరిచే స్ట్రాంగు రూం లనిర్మాణాలను , జాతీయ అంతర్జాతీయ అతిథులకోసం నిర్మించిన సమావేశ మందిరాలను సిఎం పరిశీలించారు.


గత వంద ఏండ్లనుంచి ఇంతపెద్ద మొత్తంలో దోల్ పూర్ స్టోన్ ను వాడిన కట్టడం దేశంలో తెలంగాణ సచివాలయమేనని అధికారులు సిఎం కు వివరించారు. దేశంలో మరే రాష్ట్రంలోకూడా ఇంతటి గొప్ప స్థాయిలో సచివాలయ నిర్మాణం జరగలేదని తెలిపారు. పార్లమెంట్ తరహాలో నిర్మాణం చేస్తున్న లోపల బయట టెర్రకోటా వాల్ క్లాడింగును సిఎం పరిశీలించారు.


తుదిమెరుగుల‌పై ఆదేశాలు
కాగా సిఎం చాంబర్ సహా పలు సమావేశ మందిరాల్లో ఏర్పాటు చేయబోతున్న ఫర్నీచర్ సుందరీకరణ అంతర్గత ఫర్నీచర్ తదితర తుది మెరుగుల అంశాలను నిర్మాణ ఏజెన్సీ ఆర్ అండ్ బీ అధికారులు ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా సిఎం పరిశీలించి తుది ఆదేశాలిచ్చారు.


నిర్మాణ కౌశలంపై ప్ర‌జాప్ర‌తినిధుల‌కు వివ‌ర‌ణ‌
అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న సచివాలయ నిర్మాణ కౌశలాన్ని, ఉద్దేశ్యాన్ని తనవెంట వచ్చిన ప్రజాప్రతినిధులకు సిఎం కెసిఆర్ వివరించి చెప్పారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ….‘‘ తెలంగాణ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకునే విధంగా సచివాలయానికి ఎదరుగా అమర వీరుల స్థూపం నిర్మాణమౌతున్నది. ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా బీదలు బడుగు బలహీన వర్గాల సంక్షేమమే వారి అభివృద్ధే లక్ష్యంగా, అంబేద్కర్ పేరును సార్థకం చేసే విధంగా, తెలంగాణ సచివాలయానికి డా. బిఆర్ అంబేద్కర్ పేరును పెట్టుకున్నాం.

సచివాలయం పక్కనే నిర్మాణం అవుతున్న అత్యంత ఎత్తయిన డా. బిఆర్. అంబేద్కర్ విగ్రహం ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఎప్పడికప్పడు తమ కర్తవ్య నిర్వహణను గుర్తు చేస్తూ వుంటది. అమరుల త్యాగాలు, అంబేద్కర్ ఆశయాల స్పూర్తితో, భావి తరాల బంగారు భవిష్యత్తు దిశగా, తెలంగాణ వున్నన్నాల్లూ సచివాలయం లో విధి నిర్వహణ కొనసాగుతుందని సిఎం కెసిఆర్ తన ఆశాభావాన్ని ప్రకటించారు.


భవిష్యత్తు అవసరాలను దృష్టిలో వుంచుకునే సచివాలయం నిర్మాణం అవుతుందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా డా బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం రూపుదిద్దుకుంటున్నదని సిఎం తెలిపారు.


ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వెంట వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాల్క్ సుమన్, దానం నాగేందర్, కంచర్ల భూపాల్ రెడ్డి, మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ బండా శ్రీనివాస్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేష్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రియాంకా వర్గీస్, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, ఆర్ అండ్ బి సెక్రటరీ శ్రీనివాస రాజు, ఈఎన్సీ రవీందర్ రావు, టిఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పల్లె రవి కుమార్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, వర్క్ ఏజెన్సీల ఇంజనీర్లు ఆర్ అండ్ బి అధికారులు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ