Saturday, September 23, 2023
Homeతెలంగాణ వార్త‌లుగింజ మిగల్చకుండా సేకరిస్తాం

గింజ మిగల్చకుండా సేకరిస్తాం

అన్నదాతలకు సీఎం కె.సి.ఆర్. భరోసా
మార్చిలోగా వరికోతలు విధి విధానాలు
అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశం
హైదరాబాద్, మే 2 :
అకాలంగా కురుస్తున్న వర్షాల వల్ల చేతికొచ్చిన వరిపంట తడిసిపోతున్న నేపథ్యంలో రైతన్నలు ఎటువంటి ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్నికూడా గింజలేకుండా సేకరిస్తామని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు తెలంగాణ రైతు కుటుంబాలకు భరోసానిచ్చారు. మామూలు వరిధాన్యానికి చెల్లించిన ధరనే తడిసిన ధాన్యానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని సిఎం స్పష్టం చేశారు.
వ్యవసాయాన్ని కాపాడుతూ రైతుల కష్టాల్లో భాగస్వామ్యం పంచుకోవడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సిఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.
గతానికి భిన్నంగా అకాల వానలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో యాసంగి వరి కోతలు మార్చి నెలలోపే జరిగేలా ఎటువంటి విధానాలను అవలంబించాలో అధ్యయనం చేయాలని, ఈ దిశగా రాష్ట్ర రైతాంగాన్ని చైతన్యం చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని, సిఎం కేసిఆర్ వ్యవసాయ శాఖను ఆదేశించారు.
కాగా…..అకాల వర్షాలు కొనసాగుతున్ననేపథ్యంలో వరికోతలను మరో మూడు నాలుగు రోజులు వాయిదా వేసుకోవడం మంచిదని రైతులకు సిఎం కేసీఆర్ సూచించారు.
మంగళవారం నాడు డా. బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో … రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు జరుగుతున్న తీరు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో తడిసిన వరిధాన్యం సేకరణ, భవిష్యత్తులో యాసంగి వరి ముందస్తుగా కోతలకు వచ్చేలా చర్యలు, ఇందుకు వ్యవసాయశాఖ అనుసరించాల్సిన కార్యాచరణ తదితర అంశాలపై సిఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమేవేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో.. మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి; ఎమ్మెల్యేలు బాల్క సుమన్, బాజిరెడ్డి గోవర్ధన్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం సెక్రటరీలు స్మితా సభర్వాల్, రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సివిల్ సప్లైస్ కమిషనర్ వి. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ…. ‘‘ తెలంగాణ వ్యవసాయ అభివృద్ధికి, రైతు కుటుంబాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యాచరణ దేశానికే ఆదర్శంగా వూహించని రీతిలో సత్ఫలితాలను అందిస్తున్నది. నేడు ఎన్నో రాష్ట్రాలను అధిగమిస్తూ తెలంగాణ రైతులు వరి ధాన్యాన్ని పండిస్తున్నారు. అదే సందర్భంలో..ఎంత పండిస్తే అంత పంటను గింజలేకుంటా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కష్టాలకోర్చైనా రైతుల కల్లాలకాడికే పోయి సేకరిస్తున్నది. ఇట్లా రైతులకోసం చిత్తశుద్ధితో దృఢసంకల్పంతో కార్యాచరణ అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. ఇటువంటి పరిస్థితుల్లో ఊహించని విధంగా అకాలంగా కురుస్తున్న వడగండ్ల వానలు ఎడతెరిపిలేకుండా కొనసాగుతుండడం బాధాకరం. ప్రకృతి వైపరీత్యానికి ఎవరం ఏమీ చేయలేం. అయినా మనకేం సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించలేదు. వడగండ్ల వానలకు దెబ్బతిన్న పంటలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 10 వేల రూపాయలను అందిస్తూ ఇప్పటికే ఆదుకుంటున్నది. ఆర్థికంగా రాష్ట్ర ఖజానాకు ఎంత భారమైనా వెనుకంజ వేయకుండా రైతన్నలను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలో … యాసంగి వరి ధాన్యం తడుస్తున్ననేపథ్యంలో..రైతన్నల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుంటున్నది. ఆపత్కాలంలో వారి దు:ఖాన్ని, కష్టాన్ని పంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తడిసిన వరి ధాన్యాన్ని కూడా సేకరించాలని నిర్ణయించింది. వీలయినంత త్వరగా వొక్క గింజకూడా పోకుండా వరిధాన్య సేకరణ పూర్తి చేస్తాం. రైతన్నలు ఏమాత్రం ఆందోళన చెందవద్దు ’’ అని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

కాగా…రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొనసాగుతున్న యాసంగి వరిధాన్యం సేకరణ వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ధాన్యం సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నదని, కొన్ని చోట్ల అకాలవానలు కొనసాగుతుండడంతో సేకరణకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని అధికారులు వివరించారు. అయినా త్వరలోనే ధాన్య సేకరణ పూర్తి చేయనున్నట్టు సివిల్ సప్లైస్ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ సిఎం కేసీఆర్ కు వివరించారు. కాగా… మరో మూడు నాలుగు రోజులపాటు వానలు కొనసాగనున్నాయని అధికారులందించిన వివరాల మేరకు….అప్పటిదాకా వరిపంటను కోయకుండా సంయమనం పాటించడం మంచిదని, తద్వారా ధాన్యం తడవకుండా జాగ్రత్త పడాలని రైతులకు సిఎం సూచించారు.
అదే సందర్భంలో….కురుస్తున్న ఈ అకాల వానలను గుణపాఠంగా తీసుకుని భవిష్యత్తులో నష్టాలు జరగకుండా ముందస్తు అవగాహనను ఏర్పరుచుకోవాలని అటు వ్యవసాయ శాఖకు, ఇటు రైతాంగానికి సిఎం సూచించారు. అందులో భాగంగా…. ప్రతి ఏటా మార్చినెలాఖరుకల్లా యాసంగి వరికోతలు పూర్తయ్యేలా రాష్ట్ర రైతాంగం వరిని ముందస్తుగానే నాటుకోవాలని సిఎం పిలపునిచ్చారు. మార్చి నెల తర్వాత అకాల వానలు పడే అవకాశాలున్నందున ఆ లోపే కోతలు పూర్తి చేసుకోవడం మంచిదన్నారు. ఏప్రిల్, మే నెలలు వచ్చేదాకా వరిపంట నూర్పకుంటే ఎండలు ఎక్కువయ్యి ధాన్యం లో నూకశాతం పెరిగిపోతుందన్నారు. అటు అకాల వానలనుంచి తప్పించుకోవటం ఇటు నూకలు కాకుండా వుండాలంటే మార్చి నెలాఖరుకల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ కోతకొచ్చేలా ముందస్తుగానే నాట్లు వేస్తుకోవాలని రైతాంగానికి సిఎం సూచించారు.
ఈ దిశగా మరింత శాస్త్రీయ అధ్యయనం చేసి రాష్ట్ర రైతాంగాన్ని చైతన్యపరచాలని వ్యవసాయ శాఖను సిఎం కేసీఆర్ ఆదేశించారు. అదే సందర్భంలో… ఫర్టిలైజర్స్ వాడే విషయంలో కూడా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
ప్రకృతి వైపరీత్యాలు తదితర సందర్భాల్లో మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో తలెత్తే మార్పులను ఎప్పటికప్పుడు రైతాంగానికి అర్థమయ్యే రీతిలో కరపత్రాలు, పోస్టర్లు, అడ్వర్ టైజ్ మెంట్లు తదితర ప్రచార మార్గాల ద్వారా అవగాహనను, చైతన్యాన్ని కల్పించాలన్నారు. వ్యవసాయ శాఖలోని కిందిస్థాయి ఏ.ఈ.వో లను, అధికారులను ఎప్పటికప్పుడు ఈ దిశగా అప్రమత్తం చేయాలని, వారు నిరంతరం రైతులకు అందుబాటులో వుంటూ ఎప్పటికప్పుడు తగు సూచనలందించాలని , ఆ దిశగా నిరంతరం పర్యవేక్షణ చేస్తుండాలని, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావును సిఎం ఆదేశించారు.


రాష్ట్రంలో నిర్మించిన రైతు వేదికలను వేదికగా చేసుకుని వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని స్పష్టం చేశారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలుంటాయన్నారు. ఈ దిశగా పనితీరును పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సిఎం ఆదేశించారు.
‘‘ తెలంగాణ వ్యవసాయం అత్యంత వేగంగా పురోగతిని సాధిస్తున్నది. ఈ స్పీడును అందుకునే దిశగా వ్యవసాయ శాఖ నిత్యం అప్రమత్తంగా వుండాలె. ఏ మాత్రం అలసత్వం వహించినా కఠిన చర్యలుంటాయి. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ విధానాలను, లక్ష్యాలను క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ మరింత డైనమిక్ గా పనిచేయాల్సిన అవసరం వ్యవసాయశాఖకు ఉన్నది.’’ అని సిఎం స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Prof Shankar Chatterjee, Hyderabad on A Success Story of a Doctor
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on My Experience in Eritrea
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Keep focus on alternative livelihood opportunities
Prof Shankar Chatterjee, Hyderabad on The Power of a Diverse Diet
Prof Shankar Chatterjee, Hyderabad on Food for Health Rhymes
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ