ఎవరీ తాలిబన్లు ?

0

అఫ్ఘ‌న్ చ‌రిత్ర మొత్తం ర‌క్త‌సిక్తం
నాడు సోవియ‌ట్‌…నేడు అమెరికా
ప‌రిణామాలు సేమ్ టు సేమ్‌
దెబ్బ‌తిన్న‌ది సామాన్యులే
(భండారు శ్రీనివాసరావు, 98491 30595)

ఓ యాభయ్ ఏళ్ళ క్రితం సైనిక తిరుగుబాట్లు జరిగి ప్రభుత్వాలను కూలదోసిన వార్తలు రేడియోలో లేదా పత్రికల్లో ఇలా పతాక శీర్షికలలో మొదలయ్యేవి. “తిరుగుబాటు దళాలు రాజధానిలోని జాతీయ రేడియో కేంద్రాన్ని తమ అదుపులోకి తీసుకున్నాయి” అంటే ఏమిటన్న మాట? మొత్తం దేశం తిరుగుబాటుదారుల స్వాధీనంలోకి వచ్చిందనడానికి అది సంకేతం.


ఇది చాలా పాత కాలం మాట. ఇప్పుడు 24X7 టీవీ వార్తాప్రసారాలు ప్రపంచవ్యాప్తంగా మొదలైన తర్వాత ఈ సాంప్రదాయానికి చెల్లు చీటీ రాసారు. గత నలభయ్ ఏళ్ళుగా అంతర్జాతీయ రాజకీయ పరిణామాలను నిశితంగా గమనించేవారికి ఆఫ్ఘన్ ప్రజల పట్ల సానుభూతి కలగక మానదు. దశాబ్దాల తరబడి అక్కడి ప్రజలు అనునిత్యం యుద్ధవాతావరణంలోనే బతుకులు వెళ్లదీస్తున్నారు. దానికి ప్రధాన కారణం అక్కడి బలహీన ప్రభుత్వాలే.
బలహీనుడు బలవంతుడిపై పూర్తిగా ఆధారపడి సొంత శక్తిని సమకూర్చుకోని పక్షంలో దెబ్బతినేది బలహీనుడే అనే వాస్తవాన్ని ఆఫ్ఘనిస్థాన్ పరిణామాలు తెలియచేస్తున్నాయి. మిహాయిల్ గోర్భచెవ్ నాయకత్వంలో అలనాటి సోవియట్ యూనియన్‌లో కమ్యూనిస్టుల పాలన కొనసాగుతున్న రోజుల్లో నేను మాస్కో రేడియోలో (1987- 1991) తెలుగు వార్తలు చదివే ఉద్యోగం చేసేవాడిని. వార్తల్లో ప్రాధాన్యత క్రమంలో గోర్భచెవ్ తర్వాత స్థానం నజీబుల్లాది. నజీబుల్లా అంటే అప్పటి ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు. ప్రస్తుతం యుద్ధవాతావరణం దట్టంగా అలుముకుని ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌లో ఆ రోజుల్లో సోవియట్ల కీలుబొమ్మ ప్రభుత్వం నడుస్తూ ఉండేది.

ఈ నజీబుల్లానే పాశ్చాత్య దేశాలు పేర్కొనే సోవియట్ కీలుబొమ్మ. సోవియట్ల అండ చూసుకుని నజీబుల్లా చెలరేగిపోయాడు. సోవియట్ సైన్యాలను ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఉపసంహరించుకుంటూ ఆనాటి సోవియట్ అధినేత మిహాయిల్ గోర్భచేవ్ తీసుకున్న నిర్ణయంతో అతడికి తన సొంత బలం ఏపాటిదో తెలిసివచ్చింది. ఆ సంగతి అతడికంటే ముందు పసికట్టింది తాలిబాన్లు. వాళ్ళు కాబూల్‌ని హస్తగతం చేసుకుని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో తలదాచుకున్న ఆఫ్ఘన్ అధ్యక్షుడు నజీబుల్లాను బందీగా పట్టుకు పోయారు. అతడిని ఒక వాహనానికి కట్టి నడి వీధుల్లో ఈడ్చుకుంటూ వెళ్లి, రక్తసిక్తమైన అతడి శరీరాన్ని నాలుగు రోడ్ల కూడలిలో ఓ దీపపు స్తంభానికి వేలాడగట్టి ఉరి తీశారు.

అప్పటివరకు ఆఫ్ఘన్ దేశాన్ని అప్రతిహతంగా పాలించిన నజీబుల్లా అదే దేశంలో ఇలాంటి దిక్కుమాలిన మరణం పొందాడు. రాజ్యాధికారం ఎవరికీ శాశ్వతం కాదు అనే నానుడి మరో మారు రుజువైంది.
సోవియట్ సేనల ఉపసంహరణ తర్వాత ఆ బాధ్యత అమెరికా తీసుకుంది. ప్రపంచానికి పెద్దన్నగా తనని తాను భావిస్తూ పెత్తనం చేస్తూ వచ్చిన అమెరికా, సోవియట్ యూనియన్ పతనం తర్వాత తానే ప్రపంచానికి పెద్ద దిక్కు అని పెంచుకున్న విశ్వాసానికి 2001లో ఆల్ ఖాయిదా ఉగ్రవాదులు తూట్లు పొడిచారు. న్యూయార్క్ లోని జంట హర్మ్యాలను విమానాలతో డీకొట్టి కూల్చివేయడంతో మొదటిసారి తన పరిస్థితి గురించి ఆలోచించుకోవాల్సిన దుస్థితి అమెరికాకు ఏర్పడింది.

అందుకు ప్రతీకారంగా ఆల్ ఖయిదా సంస్థ అధినాయకుడు ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టేవరకు అమెరికా శాంతించలేదు. అదే క్రమంలో సోవియట్ యూనియన్ ఒకప్పుడు చేసిన తప్పునే అమెరికా కూడా ఆఫ్ఘన్ విషయంలో చేసింది. అక్కడి కీలుబొమ్మ ప్రభుత్వాలకు తన సైన్యంతో బాసటగా నిలిచింది. ఇరవై ఏళ్ళు గడుస్తున్నా అక్కడ పరిస్థితుల్లో ఏ మార్పు రాకపోవడంతో అగ్రదేశం పునరాలోచనలో పడింది. వచ్చే నెల, సెప్టెంబర్ పదకొండో తేదీకి జంట హర్మ్యాల విధ్వంసానికి ఇరవై ఏళ్ళు నిండుతాయి.

ఇక ఆఫ్ఘన్ స్తాన్ లో తన ప్రమేయం అనవసరం అనుకుందో తెలవదు. లేక మతఛాందస ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమొందించడం ఇష్టం లేకనో తెలవదు, ప్రపంచ దేశాల దృష్టిలో మరింత పలచన కాకముందే మేలుకోవాలని సంకల్పించిందో తెలవదు, కారణాలు ఏమైనా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తన సైన్యాలను ఉపసంహరించుకుంది. సమయం కోసం కాచుకుని ఉన్న తాలిబాన్లకు మంచి అవకాశం దొరికింది. వాళ్ళు మళ్ళీ కాబూల్ పై దండయాత్ర చేశారు. వరసగా ఆఫ్ఘనిస్థాన్ లోని రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంటూ పోయి అనుకున్నది సాధించారు.

ఆఫ్ఘనిస్థాన్ పైపట్టు బిగించారు.
నజీబుల్లా ఆఖరి ఘడియలు స్పురణలో ఉన్నందువల్ల కాబోలు, ఆఫ్ఘన్ అధ్యక్షుడు ఆష్రాఫ్ ఘని, ముందుగా జాగ్రత్త పడి, అధికార మార్పిడికి అంగీకరించి, కనీసం సహచర మంత్రులకు కూడా చెప్పకుండా దేశం విడిచి పారిపోయాడు. దాంతో ఆఫ్ఘనిస్థాన్ లో అధికారం తాలిబాన్ల వశం అయింది.
ఇప్పుడు ఏమి జరగబోతోంది అనేది జవాబు చెప్పలేని ప్రశ్న. గతంలో తాలిబాన్ల అకృత్యాలు, అరాచకాలు గుర్తున్న ఆఫ్ఘన్లు, ప్రాణాలకు తెగించి దేశం వదిలి బతుకు జీవుడా అని పారిపోతున్నారు. తాజాగా మీడియాలో కానవస్తున్న కాబూల్ విమానాశ్రయం దృశ్యాలు చూస్తుంటే తాలిబాన్లు అంటే వాళ్ళ మనస్సులో పేరుకుపోయిన భయాన్ని అర్ధం చేసుకోవచ్చు.
అయితే, గతంలోకంటే తాలిబాన్ల వైఖరిలో కొంత మార్పు వచ్చినట్టు కానవస్తోంది.

వెనుకటి మాదిరిగా కాకుండా గత ప్రభుత్వంలో పనిచేసినవారితో సహా ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తూ చేసిన ప్రకటన ఊరట కలిగిస్తోంది. వారిలో ఈ మార్పు శాశ్వతమా కాదా అన్నది కాలమే చెప్పాలి.
మిగిలిన దేశాల సంగతేమో కానీ, ఆఫ్ఘన్ పరిణామాలు భారత దేశానికి ఆందోళన కలిగించేవే అని చెప్పవచ్చు. ఓ రెండు దశాబ్దాల పాటు ఆ దేశంలో ప్రజాస్వామ్య విధానం విలసిల్లిన రోజుల్లో ఆ దేశంతో భారత్ కు మంచి సంబంధాలే కొనసాగాయి. అక్కడ పార్లమెంటు భవనాన్ని కూడా మన దేశమే నిర్మించి ఇచ్చింది.

ఇంకా అనేక రకాలుగా సహాయ హస్తం అందించింది. ఇప్పుడు హఠాత్తుగా పాకిస్తాన్, చైనాలకు అనుకూలంగా వుండే తాలిబాన్ల చేతిలోకి ఆఫ్ఘనిస్థాన్ వెళ్ళడం అంటే మరో బల్లెం మన పక్కలో చేరినట్టే.
తాలిబాన్ అంటే నిఘంటు అర్ధం ఉగ్రవాది అని కాదు. చిత్రం ఏమిటంటే ఆ పదానికి అర్ధం విద్యార్థి. (వ్యాస ర‌చ‌యిత ప్ర‌ముఖ విశ్లేష‌కుడు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, సోవియ‌ట్ యూనియ‌న్‌లో మార్పునకు ప్ర‌త్య‌క్ష‌సాక్షి)

Bhandaru Srinivasarao

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here