సరసాల వరస

0

(జంధ్యాల శరత్ బాబు, 99483 45013)
ఒకటీ రెండూ మూడూ కాదు…ఇందులో ఉన్న నవ్వుల గుళికలు నూట పదార్లకు పైనే. అనేకం సచిత్రాలు. రుచి చెప్పిన
ఇంద్రగంటివారన్నట్లు- అన్ని శ్రీరమణీయాలే!
నవ్వు- బతుకు చెట్టు చివర్న పూచే పువ్వు. ఉంటేనే అందం.
ఇందులోని హాస్య రస హృదయులు ఎందరెందరో. విశ్వనాథ, మొక్కపాటి, జరుక్ శాస్త్రివంటివారు. అందుకే మెరుపులూ విరుపులూ చరుపులూ బోలెడన్ని. రెట్టింపు సొగసులు తెచ్చే బాపు బొమ్మలు సరేసరి.
అప్పుడెప్పుడో ఆరుద్ర కితాబిచ్చినట్లు-పేరడీలన్నీ ఈ రచయితకు దంచికొట్టిన పిండి.
నాడు రెండు భాగాలుగా ఉండిన హాస్యజ్యోతి ఆ తర్వాత ఇలా ఒకే సంపుటి అయింది. అప్పటి ఆ ఇద్దరి (ఆరుద్ర,ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి) మెప్పునే ఇప్పుడిక్కడ ముందు పేజీల్లో జోడించారు.
ఇదంతా అసిధారా… కాదు కాదు…హాస్యధారావ్రతం. సాహితి ప్రచురణతో మరింత సుందరీకృతం.
మెచ్చుతునకల్లో కొన్ని:
ఇచ్చేద్దురూ

 • ముళ్ళపూడి తన ఫ్రెండుకి ఫోన్ చేసి అడిగారు “డబ్బు కావాలి”
  ఎప్పటికి?
  మొన్నటికి!
  *స.. స.. సరదాగా
  టైముకు రావడం శాస్త్రీయం
  రాకపోవడం కృష్ణశాస్త్రీయం- (శ్రీశ్రీ)
  *పైగా ఇదొకటా!
  జ్వరంతో ఉన్న దుగ్గిరాలను చెయ్యిపట్టి పలకరించారు దువ్వూరి సుబ్బమ్మ. “ఎలా ఉంది”
  అసలే బాధపడుతున్నా. ఇలా పాణిగ్రహణం కూడానా (ఛలోక్తిగా)
 • అమ్మో.. ఇంతా
  కొత్తగా మోపెడ్ కొన్న భరాగో ను మిత్రుడడిగాడు “ఎంతైంది?”
  తడిసి మోపెడంత
  *తోస్తే రచయితను నేను
  ఏమీ తోచకపోతే కథలు రాస్తాను
  అవి రాస్తే కానీ తోచదు నాకు – రాచకొండ
  *మహా క్షణం
  *మల్లాది ఒకసారి రమణ ఇంటికొచ్చి రెండు రోజులు ఉండి వెళుతూ అన్నారు “రెండు రోజులూ రెండు క్షణాల్లా గడిచిపోయాయి”
  రమణ: పోనీ మరో క్షణం గడిపి వెళ్ళరాదూ?
  *మచ్చుకో రెండు న్యూ నుడులు
 • అవకాశవాదుల సభకు అందరూ అధ్యక్షులే!
 • ఆర్భాటపు ప్రొడ్యూసరుకు ఆరుగురు డిస్ట్రిబ్యూటర్లు
  మనలో మాట : ఈ పుస్తకాన్ని ఏకబిగిన చదవలేం. ఎందుకంటే- ఇది రమణగారి నవ్వుల గిలిగిలి!
  హాస్య జ్యోతి
  పుటలు: 183; వెల: రూ. 100
  ప్రతులకు : శ్రీరమణ, హైదరాబాదు
  ఫోన్: 76600 12439

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here