Tuesday, March 21, 2023
HomeArchieve‘సముద్రాల‌’ అండతో ‘అమృత’ గళం

‘సముద్రాల‌’ అండతో ‘అమృత’ గళం

వారంవారం ఘంట‌సాల స్మృతి ప‌థం-3
(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 9440103345)
ఆయన అందరికి ‘మాష్టారు’. ఒక పెద్దాయనకు మాత్రం ‘ఒరేయ్…!నాయనా!’ . ఆ పిలుపులో ఎంతో ప్రేమ, మార్దవం. అలా పిలిపించుకున్నది ఘంటసాల గారని ప్రత్యేకించి చెప్పనవసరంలేదు కానీ పిలిచింది సినీకవుల కులగురువు సముద్రాల రాఘవాచార్యుల వారు. ఆయనంటే ఘంటసాల గారికి అమిత గౌరవం, అభిమానమని శ్రీమతి సావిత్రి ఘంటసాల చెబుతారు. తమ ఊరి (పెదపులిపర్రు) అల్లుడు. తన పెళ్లినాడు తానే సంగీత కచేరి చేసుకున్న కుర్రవాడు ఆచార్యుల వారికి మొదటి చూపులోనే నచ్చేశారు. ‘ఇంత అద్భుతమైన గాత్రంతో ఇక్కడ ఎందుకు? మద్రాసు వచ్చి నీ అదృష్టాన్ని పరీక్షించుకో. వేషం ఇవ్వకపోయినా పాటలు పాడించుకుంటారు’ అని సినీ రంగంలో అప్పటికే లబ్ధప్రతిష్ఠులైన ఆయన ఆహ్వానించారు. వసతి కూడా కల్పించారు. అవకాశాలు కల్పించాలని తెలిసిన వారందరికి సిఫారసు చేశారు. సంగీత విభావరులు ఏర్పాటు చేశారు. ఆయన గాత్రగాంభీర్యాన్ని పదుగురికి చాటారు. అయితే ఆయన సిఫారసు చేసిన హెచ్..ఎం.వీ. సంస్థ గాత్రాన్ని తిరస్కరించింది. పట్టువిడవని సముద్రాల గళాన్ని ‘ఆకాశవాణి’కి సూచించారు. బాలాంత్రపు రజనీకాంతరావు గారి చొరవ‌తో తొలుత ఘంటసాల గళం ఆకాశ’వాణి’గా అలరించింది.
తండ్రి సూర్యనారాయణగారి నుంచి వారసత్వంగా అబ్బిన సంగీత కళతో నాటకం, హరికథ లాంటి ప్రక్రియలతో పొట్టపోసుకోవాలనుకున్న ఘంటసాల గారి జీవితాన్ని సముద్రాల వారి సలహా మార్చేసింది. తెలుగుజాతికి అపూర్వ గాయకుడిని, తరతరాలకు తరిగిపోని అపురూప అందించింది.


సంరక్షకుడిగా…
సముద్రాల వారు ఆయనకు సంరక్షకులు. సలహాలు ఇవ్వడంలో, మంచిచెడులు చెప్పడంలో ఆచితూచి వ్యవహరించేవారు. విజయ సంస్థ చిత్రం ‘షావుకారు’కు మాటలు, పాటలు రాసిన ఆయన నిర్మాతల అభ్యర్థన మేరకు ఘంటసాల వారి పేరు సూచించారు. ‘నాగిరెడ్డి, చక్రపాణి గార్లది మంచి, పెద్ద సంస్థ. అవకాశాన్ని వదులుకోవద్దు. పారితోషికం సంగతి నేను మాట్లాడతా’ అని హితవు చెప్పారట. ఘంటసాల గారు తన సంపాదనను ఆయన చేతికే ఇచ్చి అవసరమైనప్పుడు తగు మొత్తం అడిగి తీసుకునేవారట. అవసరానికి కారణాలు అడిగి మరీ ఇచ్చేవారట. ప్రయోజకుడు అవుతున్న ఘంటసాలతో ‘నీ డబ్బులకు సంబంధించిన లెక్క చూసుకో’ అన్నప్పుడు, ‘నన్ను చేరదీసి ఆశ్రయం ఇచ్చి, ఎదుగుదలకు ప్రోత్సహించిన ఆచార్యుల గారితో లెక్కల తేల్చుకోవడం ఏమిటి’అని మృదువుగా తోసి పుచ్చేవారట.


సంగీత దర్శకుడిగా..
సముద్రాల దర్శకత్వం వహించిన ‘వినాయక చవితి’కి, ఆయన ఇతరుల చిత్రాలకు రాసిన పాటలకు బాణీలు కట్టడం పూర్వజన్మ సుకృతంగా భావించే వారు ఘంటసాల. తన ముందు వికసించిన గాత్ర‘సిరి’కి ముగ్ధులయ్యేవారట సముద్రాల. సినిమాలలో పద్యాలను చొప్పించడాన్ని వ్యతిరేకించిన ఆచార్యుల వారు ఆయన కంఠమాధుర్యానికి పరవశించి, పద్యం చేసుకున్న అదృష్టంగా భావించేవారని ఘంటసాల రత్నకుమార్ గుర్తు చేసేవారు. ‘జనసామాన్యానికి అర్థం కాని పద్యాలను సినిమాలలో వాడడంలో అర్థంలేదు. వాదనలు, కోప తాపాలు తదితర సందర్భాలలో పద్యాలు పాడడం అసందర్భమనిపిస్తుంది. దర్శకనిర్మాతల అభిమతం కాదనరానిది’ అన్నది సముద్రాల వారి భావన. అయితే పద్యపఠనంలో ఘంటసాల గారు ప్రవేశపెట్టిన ఒరవడికి ప్రశంసలు కురిపించారు. అంతప్రేమించినా, కోపం వస్తే సహించేవారు కారట. ఘంటసాల సావిత్రమ్మ గారి మాటల్లోనే…. ఒకసినిమాకు పాట రాసి, బాణీ కట్టాలని తన కుమారుడు రామానుజాచార్యులు (జూనియర్ సముద్రాల), ఘంటసాలకు (వీరిద్దరు ప్రాణమిత్రులు) పురమాయించి పనిమీద వెళ్లారు. తిరిగి వచ్చేసరికి మిత్రులిద్దరు కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. పాటసంగతి అడిగితే సమాధానం లేకపోవడంతో గట్టిగానే గదమాయించారు. మిత్రులు పట్టుదలతో మరునాడు ఆ పనిని పూర్తి చేయగా, పెద్దాయన సంతోషించి మెరుగులు దిద్దారు.అదే ‘పంచదార వంటి పోలీసెంకటసామి. (వ్యాస ర‌చ‌యిత సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ