Tuesday, March 21, 2023
HomeArchieveగురువుకే గురువు రామానుజ

గురువుకే గురువు రామానుజ

రామానుజ వైభ‌వం-2

(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 9440103345)
కాంచీపుర వాసి యాదవప్రకాశకులు ఉద్దండ పండితులు. ఆయన వద్ద అనేక మంది శిష్యరికం చేస్తున్నారు. ఏ సందేహాన్నయినా నివృత్తి చేయగల దిట్ట అని ఆయనకు పేరు. అంతటి గొప్పవ్యక్తి వద్ద వేదాంత రహస్యాలు తెలుసుకోవాలనుకున్నారు రామానుజ. యాద‌వ ప్ర‌కాశ‌కులు ఆయ‌న‌ను శిష్యునిగా అంగీక‌రించారు. ‘మొహం చూచిన వేళా విశేషం’అన్నసామెతలా, శిష్యుని చొరవ, పాండిత్యం గురువుకు నచ్చేది కాదట. రామానుజుల వినయ విధేయతలకు, గురుభక్తికి ముచ్చట పడే గురువు ఆయన విజ్ఞాన పాండిత్యాలను మాత్రం మెచ్చలేకపోయేవారట. గురువు చెప్పే అంశాల్లోని ఉచితానుచితాలను ఎత్తిచూపడమే రామానుజల తప్పు అన్నట్లుగా భావించేవారట. అందుకు ఒక ఉదాహరణ‌ను పరిశీలిస్తే….‘కప్యాసం పుండరీకమేవ యక్షిణీ….’అనే ఉపనిషద్వాక్యానికి ‘నారాయణుని కన్నులు కోతి పృష్ఠంలా తామరరేకుల వలె ఎర్రగా ఉన్నాయి’ అని చెప్పిన పోలికతో రామానుజల మనసు కలత చెందింది. గురుశుశ్రూషలో ఉన్న కళ్లు బాధతో చెమర్చి కన్నీటి చుక్కలు ఆయన పాదాలపై పడడంతో, ఆయన దుఃఖానికి కారణాన్ని ప్రశ్నించారు గురువు. ‘మన్నించండి గురుదేవా! జగదాది, అనాదియైన శ్రీమన్నారాయణుని కన్నులను కోతి పిర్రలతో పోల్చడం బాధకలిగించింది’ అని వివరణ ఇవ్వడం గురువులో అహాన్ని రేపింది. ‘అయితే ఇంతకంటే చక్కటి వ్యాఖ్యానం చెప్పు’ అనడంతో ‘శ్రీమన్నారాయణుని కన్నులు సూర్యకిరణాలతో వికసించిన తామర పువ్వుల మాదిరిగా మనోహరంగా ఉన్నాయి’ అని వివరణ ఇచ్చారు. అదీగాక కోతి పృష్టమనే నీచోపమానం బురదలో ఉండే తామరలకే కానీ విష్ణువు కన్నులకు కాదని ఆదిశంకరులే చెప్పారని గుర్తుచేస్తూ, ‘కం పిబతీతి సూర్యః’ అనే సూత్రాన్ని అనుసరించి, లోతైన నీటిని తాగే ‘కపి’ అంటే సూర్యుడి రాకతో విచ్చుకున్న తామరల్లా విష్ణునేత్రాలు ఒప్పుతున్నాయి’ అని వివరణ ఇచ్చారు. భాగవతులను, భగవంతుడిని దూషించడాన్ని, తక్కువ చేయడాన్ని సహించలేని స్వతః స్వభావం కలిగిన ఆయన గురువు వ్యాఖ్యలతో విభేదించారు. రామానుజల వివరణ సందర్భోచితమని తోచినప్పటికీ గురువు యాదవ ప్రకాశకులు సరిపెట్టుకోలేకపోయారు. కోపం తారస్థాయికి చేరింది. రామానుజులు వెనక్కి తగ్గలేదు. గురువు(ల)ను మన్నిస్తూనే వాస్తవాలను వ్యక్తీకరించడంలో నిక్కచ్చితత్త్వం, మనోధైర్యం అవసరమనే సందేశం రామానుజల వివరణతో వ్యక్తమవుతోంది. Samata Murty | Spoorthi daata: Sri Bhagavad Ramanujacharya Swamy.

ALSO READ: Complete compassionate appointments


గురువు విఫలయత్నం
శిష్యుడి ప్రజ్ఞాపాటవాలు గురువును కలవరప‌రిచాయి. ఈయన విషయంలో ‘శిష్యాదిచ్ఛేత్ పరాజయం’ అనే ఆర్యోక్తి వర్తించలేదని ప్రబోధకులు అంటారు. తమ ప్రయత్నాలతో పాటు ఇతర శిష్యుల సహకారంతో రామానుజను మట్టుపెట్టించాలనే విఫలయత్నాలు సాగాయి. కాంచీపుర రాజకుమారిని పట్టిన బ్రహ్మరాక్షసిని వదిలించే బాధ్యతను నెరవేర్చడంలో యాదవ ప్రకాశకులు విఫలమయ్యారు. తన పరాజయాన్ని పక్కనపెట్టి, రామానుజులను అందుకు నియోగించి ఆయన అడ్డుతొలగించుకకోవడంతో పాటు పేరు ప్రఖ్యాతులు పెంచుకోవచ్చనుకున్నారు.


బ్రహ్మరాక్షసికి కావలసిందీ రామానుజలు రాకే (రామానుజు ద్వారానే తనకు శాపవిముక్తి అని రాక్షసికి తెలుసట).‘బ్రాహ్మణుడై శాపవశాత్తు బ్రహ్మరాక్షసిగా సంచరిస్తున్న నాకు రామానుజుల పాదతీర్థం సేవనంతోనే మోక్షం. అప్పుడే రాకుమారికి నానుంచి ముక్తి’ అనడంతో రాజు ఆయనను పిలిపిం చారు. రామానుజ పాదస్పర్శతో బ్రహ్మరాక్షసికి మోక్షం, పుత్రికకు విముక్తితో పరమానంద భరితుడైన రాజు ఆయనను ధనకనక వస్తువాహనాదులతో సంభావించి, అంతటి మహాత్ముడిని శిష్యునిగా పొందిన యాదవ ప్రకాశకులనూ గౌరవించారు. రామానుజులు తాము స్వీకరించిన వస్తు సంపదను గురువుకే అర్పించారు. అయినా, గురువు మనసు స్థిమితపడలేదు. ఆ తర్వాత శాస్త్రాధ్యయనానికి కాశీయాత్ర సాకుతో ఇతర శిష్యుల సహకారంతో రామానుజులను దారిలో అంతమొందించేందుకు కుట్రపన్నారు. ప్రమాదాన్ని పసిగట్టి తప్పించుకునే ప్రయత్నంలో వింధ్యారణ్యంలో దారితప్పిన ఆయనను కిరాత దంపతులు (కంచి వరదరాజ పెరుమాళ్, పేరిందేవి) కాపాడారట. ‘పగలంతా నడచి అలసిన తమకు ఆకలిదప్పులుగా ఉన్నాయని, సమీపంలోని బావి నుంచి నీరు తేవలసింది’గా కోరగా, ఆయన అమలు చేశారు. పక్కకు తిరిగి చూడగా ఆ దంపతులు కనిపించ లేదు. సమీపంలోని కాంచీపుర స్వామి మహిమే అని భావించారు రామానుజులు. Samata Murty | Spoorthi daata: Sri Bhagavad Ramanujacharya Swamy.


కాంచీపూర్ణుల శిష్యరికం
కాంచీపురం వరదరాజ పెరుమాళ్ సేవలో ఉన్న భక్తాగ్రగణ్యులు కాంచీపూర్ణులకు తన చేదు అనుభవాలను విన్నవించారు రామానుజ. యాదవ ప్రకాశకులు తలపెట్టిన కీడుతో గురుశుశ్రూషకు దూరమైన తన మనస్సు విలవిలలాడుతోందని, తనను శిష్యునిగా అనుగ్రహించాలని కోరారు. పుట్టుకతో వైశ్యుడైన తనను, శ్రీవైష్ణవ సంప్రదాయంలొ పుట్టిన రామానుజులు ఆశ్రయించడమేమిటి? అని కాంచీపూర్ణులు సంభ్రమ ఆశ్చర్యాలలో మునిగారు. ఆయన విన్నపాన్ని మృదువుగా తిరస్కరించారు. అయినా పట్టువీడని రామానుజులు ‘ఆయాచితంగా లభించిన ఉన్నత జన్మతో అహంక రించేవారి కంటే వినయం, భక్తి, భగవంతుని పట్ల శరణాగతి గలవారే జ్ఞానులు. అవన్నీ మీలో మూర్తీభవించి ఉన్నాయి. మీరు నన్ను శిష్యుడిగా స్వీకరించాల్సిందే’ అని వారి పాదాలను ఆశ్రయించారు. ‘నీ భక్తి ప్రపత్తులతో నా జన్మచరితార్థమైందనిపిస్తోంది. నాకు బదులు ఆ స్వామికే సేవ చేయి. నీ మహాప్రాజ్ఞతకు, భక్తిప్రపత్తులకు ముగ్ధుడై, నీతో సేవలు చేయించుకునేందుకే కాబోలు స్వామి దేవీసమేతుడై మారువేషంలో కారడవిలో నిన్ను కాపాడాడు. స్వామి దంపతులకు దప్పిక తీర్చిన బావి నుంచి తెచ్చిన జలాన్నే నిత్యం బ్రాహ్మీ ముహూర్తంలో సమర్పించు. అదే నీకు ఇహపర సాధకం’ అని పూర్ణులు ఆశీర్విదించారు. వారి సూచన ప్రకారం, రామానుజులు నిత్యం ఆ బావి జలాన్ని బంగారు కలశంతో తెచ్చి సమర్పించేవారు. కాంచీ క్షేత్రంలోని కైంకర్యాలన్నీ నేటికీ ఆ బావి నీటితోనే జరుగుతున్నాయి.


గురువులో పరివర్తన
క్రమేణ గురువు యాదవ ప్రకాశకుల ఆలోచనల్లో మార్పు వచ్చింది. రామానుజుల మాటలలోని మంచి, హేత బద్ధత అవగతమైంది. వయసు మీరి ఒంటరితనం,నిరాశతో కాలం గడుపుతున్న ఆయనను రామానుజులను ఆశ్రయించవలసిందిగా మాతృమూర్తి (ఆమె దృష్టిలో రామానుజులు సాక్షాత్తు వరద రాజులే) సూచనతో మఠానికి వెళ్లి శిష్యుడికి పాదాభివందనం చేయబోయారు. రామానుజులు వారించి, ముకుళిత హస్తాలతో సాదరంగా ఆహ్వానించి, ప్రత్యేక ఆసనంపై కూర్చోపెట్టి అత్యంత గౌరవంతో సంభాషించారు. గురువు పట్ల ఎలాంటి అవిధేయత చూపకపోగా మరింత కృతజ్ఞతగా మెలిగారు రామానుజులు. తనకు వరదరాజ పెరుమాళ్ సేవాభాగ్యం కలగడానికి గురువే పరోక్ష కారణమని, కలలో కూడా ఊహించని దేవదేవేరీల సాక్షాత్కారం కలిగిందన్నది ఆయన భావన.


రామానుజులతోనూ, వారి మరో ప్రియ శిష్యుడు కురేశులతోనూ అనేక వేదాంత అంశాలను చర్చించి, సందేహాలను నివృత్తి చేసుకున్న ప్రకాశకులు, సంతృప్తితో ‘నాయనా…! నీవు ఆ రాఘవుడు తమ్ముడు లక్ష్మణుడవే’ అంటూ ఆలింగన‌పూర్వక అభినందనలు అందచేశారు.
‘పలానా వారు నా శిష్యుడని చెప్పుకోవడం కన్నా,వారికి గురువును అనిపించుకోవడం మిన్న’ అనే భావనను కూడా పక్కనబెట్టి ‘శిష్యునికే శిష్యుడనిపించుకోవడమూ’గౌరవమే అన్నట్లు భావించిన రామానుజుల నుంచి పంచ సంస్కారాలు పొందారు యాదవ ప్రకాశకులు ‘గోవిందజీయర్’గా సన్యసించి,‘యతిధర్మ సముచ్ఛయం’ అనే గ్రంథాన్ని రచించి ఆచార్యులకు అర్పించి, తనువు చాలించారు. (వ్యాస ర‌చ‌యిత ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు)

ALSO READ: ‘పూజలు పునస్కారాలు నమస్కారాలు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ