మీడియా స్వాతంత్ర్య పరిణామ గతి

0

(నాగ‌సూరి వేణుగోపాల్‌, 9440732393)
స్వాతంత్య్ర భారతదేశంలో మీడియా పరిణామాలు అని తప్పక తరచి చూడాల్సిన అవసరం ఉందా? ఒక మహా ప్రయాణంలో సమాజం తనవైపు నుంచి తాను ఒకసారి పరికించుకోవడానికి ఇలాంటి ప్రశ్న తప్పదు. ఈ అంతరావలోకనం మనం ఎటు నుంచి ఎటు వైపునకు పయనిస్తున్నామని తెలుసుకోవడానికీ, అలాగే మన ప్రణాళికలు పునర్‌ రూపొందించు కోవడానికీ దోహదపడుతుంది. ఇదే రకంగా స్వాతంత్య్రం వచ్చిన ఈ ఏడు దశాబ్దాలలో మీడియా (రేడియో, టీవీ, పత్రికలు వగైరా) ఎటువంటి మార్పులకు లోనయ్యాయని విహంగ వీక్షణం చేద్దాం. ఇందులో సంవత్సరాలు, అంకెలు, శాతాలు వీటి కన్నా గుణాత్మకంగా పరిణామాలు ఏమిటనే భావనాత్మక విశ్లేషణకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ప్రపంచ వ్యాప్తంగా జర్నలిజానికి ఇది వంద సంవత్సరాలు దాటిన సందర్భం. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత ఇతర ప్రపంచదేశాల పట్ల విపరీతమైన ఆసక్తి పెరిగింది. ఇదే జర్నలిజం అనే కొత్త విభాగం రావడానికీ, అది పరిపుష్ఠం కావడానికి ఎంతో దోహదపడిందని అంటారు.
అలాగే రెండవ ప్రపంచయుద్ధంలో సాంకేతిక విజ్ఞానం కీలక పాత్ర పోషించడంలో వినాశనం విపరీత స్థాయికి చేరింది. ఫలితంగా సైన్స్‌ టెక్నాలజి పట్ల ఆసక్తి పెరిగి, సైన్స్‌, జర్నలిజం వద్ధి చెందడానికి తోడ్పడింది. కనుక మీడియా గురించి బేరీజు వేసుకోవడం చాలా అవసరం.
అచ్చు యంత్రం, టెలిగ్రాఫ్‌, టెలిఫోన్‌, టెలి ప్రింటర్‌, రేడియో, టీవీ వంటి ఆవిష్కరణలు 20వ శతాబ్దం రాకతో గొప్పగా విచ్చుకున్నాయి. ఇది సైన్స్‌ ప్రగతి, సాంకేతిక విజ్ఞాన ప్రగతి! సామాజిక అవసరాలకు తగినట్టు సాంకేతిక విజ్ఞానం అందించిన పనిముట్లను వినియోగించడం ఒక సౌలభ్యం, ఒక చరిత్ర. అగ్రరాజ్యాల కాంక్షల వెనక ప్రణాళికలు ఏమిటో, అంతర్గత ఉద్దేశాలు ఏమిటో బోధపడడం పెరిగింది. అప్పటికే సర్వమానవ సౌభ్రాతృత్వపు భావనలు వృద్ధి చెందాయి కనుక అవి విచ్చుకొని మరింత మందిని చేరడానికి మీడియా ఎంతో ఉపయోగపడింది. మానవ మస్తిష్కంలో ప్రపంచపు ఎల్లలు విస్తృతమయ్యాయి.
ఇతర దేశాల సంగతులే కాదు, ఆయా దేశాలలోని అంతర్గత విషయాలు తెలుసుకోవడానికి కూడా మీడియా పోషించిన పాత్ర విశేషమైంది. అప్పటికి పత్రికలు, రేడియో మాత్రమే సాధనాలు. అక్షరాస్యత తక్కువ ఉన్నా, అచ్చు యంత్రాలు అతి సాధారణంగా ఉన్నా – చేయాల్సిన పనిని సమగ్రంగా, చిత్తశుద్ధితో చేసే ధోరణి స్పష్టంగా కనబడుతుంది. మన దేశంలో ఉన్న విభిన్న భాషలు, సంస్కృతులు, ప్రాంతాలు ఏకమైంది కేవలం ఈ సమాచార ప్రసారం కారణంగానే! అప్పటికి పుస్తకాలు, పత్రికలు చాలా కీలకంగా మారాయి. అందుకే ఆ దశలో పుస్తక ప్రచురణ సంస్థలూ, పత్రికా ప్రచురణ సంస్థలూ వేర్వేరుగా ఉండేవి కావు.
మిగతా దేశాల మాట ఏమో గానీ, భారతీయ పత్రికల ప్రారంభ చరిత్ర మహోజ్వలం. వందేళ్ల క్రితం మన సమాజంలో బయలుదేరిన ప్రతి మంచి ఆలోచనకు బాసటగా నిలిచినవి పత్రికలు. సమాజం గురించి ఆలోచించిన ప్రతి వ్యక్తీ, పత్రికల వేదికగానే ముందుకు సాగాడు. రాజారామమోహన రాయ్, బాలగంగాధర్ తిలక్‌, లాలాలజపతిరాయ్‌, బిపిన్‌ చంద్రపాల్‌, మహాత్మాగాంధీ, అంబేద్కర్‌, కందుకూరి వీరేశలింగం, టంగుటూరి ప్రకాశం ఇలా ప్రతి మహావ్యక్తితో పాటు ఒక పత్రికో, కొన్ని పత్రికలో కనబడతాయి. వారు చేపట్టిన పనులు సాధించడానికి పత్రికలు కేవలం సాధనాలు మాత్రమే.
స్త్రీ విద్య, గ్రంథ్రాలయోద్యమం, మత్తుపానీయాల విసర్జన, మూఢ నమ్మకాల నిర్మూలన, కుటీర పరిశ్రమల వ్యాప్తి, స్వదేశీ వస్తువుల తయారి, చదువు వ్యాప్తి వంటి సంస్కరణ కార్యక్రమాలన్నీ పత్రికల జెండాలో అంతర్భాగం అయ్యాయి. మన దేశంలో ప్రతిభాషలోనూ స్వాతంత్రోద్యమంతో మమేకమైన పత్రికలూ చాలా కనబడతాయి. ఆ పత్రికల పరిధి, ప్రతుల సంఖ్య తక్కువ కావచ్చు- కానీ అన్నీ కలసి సాధించిన ఫలితం విశేషమైంది. దేశ ప్రజలను ఒక తాటి మీద నిలపడానికి దోహదపడిన వాటిలో పత్రికలు కీలకమైనవి. తెలుగునాట టంగుటూరి ప్రకాశం, భోగరాజు పట్టాభి సీతారామయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు వంటి ప్రజా నాయకులు ప్రముఖ సంపాదకులు కూడా అని గమనించాలి. కాశీనాథుని నాగేశ్వర రావు (ఆంధ్ర పత్రిక), కేసరి (గహలక్ష్మి), పందిరి మల్లికార్జున రావు (కిన్నెర), వరద రాజులు నాయుడు (ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌) వంటి పత్రికా స్థాపకులందరూ ఔషధాల అమ్మకం ద్వారా లాభించిన మొత్తంలో పత్రికలు నడిపారు.
వాణిజ్యం, జర్నలిజం అనేవి కలవడం అనేది ఈనాటి విషయం మాత్రమే కాదు. అయితే అంతర్గత లక్ష్యాలు పూర్తిగా మారిపోవడం తర్వాతి అసలు పరిణామం. బ్యాంకుల జాతీయకరణ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, దాని వెనుక ఉండే మీడియా కోణం సాధారణంగా చర్చకు రాదు. అప్పట్లో మీడియా యజమానులకు జనుము (జూట్‌) పరిశ్రమలు ఉండేవి. అందువల్లనే ‘జూట్‌ ఇండస్ట్రీ’ అనే మాట శ్లేషతో వాడేవారు. పత్రికల యజమానులను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతోనే బ్యాంకుల్ని ఇందిరాగాంధీ ప్ర‌ధానమంత్రిగా జాతీయం చేశారని భావిస్తున్నారు. ఇది అంతర్గత వ్యూహమని వేరుగా చెప్పనక్కరలేదు!
(వ్యాస ర‌చ‌యిత ప్ర‌ముఖ విశ్లేష‌కుడు, ఆల్ ఇండియ రేడియో హైద‌రాబాద్ కేంద్ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here