‘శ్రీ భాష్య’ నిర్మాత యతిరాజ

Date:

రామానుజ వైభ‌వం – 7
(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 9440103345)
లోకక్షేమం కాక్షించి గురువు యామునాచార్యులు సంకల్పించిన బ్రహ్మసూత్రాలకు శ్రీభాష్య రచన మహా కార్యం రామానుజులను వెంటాడుతోంది. ఆయన అవసాన దశలో తాము చేసిన మూడు వాగ్దానాలలో ఇది అత్యంత ప్రధానమైనది. మోక్షమార్గమైన దాని రచనకు కశ్మీరంలోని బోధాయనుడు అనే మహర్షి రాసిన వ్యాఖ్యానం ‘బోధాయనవృత్తి’ని పరిశీలించవలసి ఉంది. కాశ్మీర్ ‘శారదా పీఠం’లో ఉన్న దాని కోసం ఆంతరంగికుడు కూరేశునితో కలసి కాలినడకన బయలుదేరారు. వారం రోజులు బసచేసిన వారు అక్కడి ఉద్ధండ పండితులతో వేదాంత చర్చలలో విజయం సాధించారు. ఆ తాళపత్ర గ్రంథాన్ని పొందలేకపోయారు. పడిన శ్రమ వృథా అయిందన్న ఆవేదనతో శ్రీరంగానికి తిరుగుముఖం పట్టారు. ‘బోధాయన వృత్తి’ని పరిశీలించకుండా భాష్య రచన చేసినప్పటికి సంపూర్ణత్వం సిద్ధించదని అనుకుంటున్న రామానుజుల మనసు చదివిన కూరేశులు ‘గురుదేవా! చింతించకండి. అక్కడ ఉన్నన్ని రోజులూ రాత్రి వేళల్లో ఆ గ్రంథాన్ని ఆసాంతం పరిశీలించాను.


అందులోని విషయాలన్నిటిని యథాతథంగా చెప్పగలను’ అని విన్నవించారు. మాటలతో తనను మించిన శిష్యుడు దొరికాడన్నపరమానందంతో బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యాన రచనకు ఉపక్రమించారు. ఏకసంథాగ్రాహి అయిన శిష్యుడి వల్ల బోధాయన వృత్తి విశేషాలను ఆకళింపు చేసుకుని భాష్యం చెబుతుండగా కూరుశులు రాసుకుంటూపోయారు. ఆదిశేషుని అవతారుడు యతిసార్వభౌముడు వేదాంతార్థాలను సులభసుందరంగా గంగాప్రవాహంలా చెబుతుండగా, ఆచార్యుల మనసెరిగి కూరేశుడు అంతర్వాహిని సరస్వతిలా దానిని అవగాహన చేసుకుంటూ రాసుకుంటూ పోయారు. శ్రీభాష్యంతో పాటే రామానుజుల చెబుతుండగా, వేదాంత దీపం, వేదాంత సారం, వేదార్థ సంగ్రహం, గీతాభాష్యాలను రాశారు. అప్పటికే యతిపతిగద్యత్రయం, భగవదారాధన క్రమం రాశారు.
భాష్యకారా!
శంకరభగవత్పాదుల పాదస్పర్శతో పునీతమైన శంకరాచార్య పర్వతాన్ని సేవించిన రామాజునులు శారదా పీఠంలో శ్రీభాష్య కాలక్షేపం చేయగా సంతసించిన శారదామాత ‘భాష్యకారా’ అని సంబోధించి ఆశీర్వదించారు. హయగ్రీవమూర్తిని ప్రసాదిస్తూ ‘దీని అర్చనతో పండిత సభలలో అజేయుడవుతావు ’అని దీవించారట. రామానుజ విశిష్టతను అప్పటికే విన్న కాశ్మీర దేశాధిపతి, ఆయన ఇప్పుడు శారదానుగ్రహం పొందారన్న వార్త విని మంత్రి సామంత పరివారంతో రామానుజులను ఆశ్రయిచి శిష్యుడయ్యారు. ఇక్కడ కూడా రామానుజులు కుట్రను ఎదుర్కోక తప్పలేదు. ఆయనకు ఒకవంక కీర్తి ప్రఖ్యాతులకు తోడు తమ రాజు కూడా రామానుజులకు శిష్యుడు కావడం కొందరు స్థానిక పండితులకు ‘గోరుచుట్టుపై రోకటిపోటు’లా మారింది.ఈర్ష్యతో ఆయనను అంతమొందించేందుకు ‘అభిచార హామం’ (చేత బడి)కి దిగారు. అది గమనించిన రామానుజులు ‘ప్రతి క్రియ ’జరిపి మిన్నకుండిపోయారు. ఫలితంగా ప్రత్యర్థులు తాము చేసిన అకృత్యం తమకే చుట్టుకోవడంతో ఆయనను శరణు వేడి, విశిష్టాద్వైతమతావలంబికులయ్యారు. అక్కడి నుంచి రామానుజులు గంగాస్నాన తీర్థయాత్ర చేసి ప్రయాగ మీదుగా కాశీని సేవించి పూరీ జగన్నాథక్షేత్రానికి చేరారు.


జగన్నాథ మహిమ
శ్రీరంగాది దివ్యక్షేత్రాల మాదిరిగానే పూరీ క్షేత్రంలోనూ ఆళ్వార్ల సహితంగా, దివ్యప్రబంధాను సంధానం, అర్చనోత్సవాలు నిర్వహించాలని, అలా చేయడం వల్ల జగన్నాథుడి మహిమా ప్రభావం దినదిన ప్రవర్థమాన మవుతుందని అక్కడి అర్చకులకు సూచించారు. ఈ క్షేత్రంలో మడి లాంటి నియామాలు లేక ‘సర్వం జగన్నాథం’ అని సూక్తి ప్రకారం అర్చనాదులు సాగుతుండగా, దాని స్థానంలో పాంచరాత్రాగమ విధానాన్ని ప్రవేశపెట్టాలనుకున్న యతిరాజ సంకల్పానికి అంతరాయం కలిగింది. ఆ ప్రతిపాదన నచ్చని స్థానిక అర్చకులు పూరీనాథుడికి తమ అసమ్మతిని తెలియచేస్తూ ‘అనాదిగా వస్తున్న పూజా విధానాన్నే కొనసాగించాలని, లేనిపక్షంలో ప్రాణత్యాగమే శరణ్యమని మొరపెట్టుకున్నారు. జగన్నాథుని సేవించి ఆయనపై సంకల్పం చేసి ఆత్మానుసంధానం తరవాత విశ్రమించిన రామానుజులకు స్వప్పసాక్షాత్కారం చేసిన పూరీశుడు అర్చకుల విన్నపాన్ని వివరించారట. ‘పతితులైనవారిని,ఆచార భ్రష్టులను సయితం ఉద్ధరించబూని అవతరించిన పుణ్యక్షేత్రం పూరీ.ఇక్కడి పండాలు, పూజారులు తమ సంప్రదాయబద్ధమైన పూజాదికాలు నిర్వర్తిస్తున్నారు. శ్రీరంగది దివ్యక్షేత్రాలలో అర్చనాది సేవా విధానం ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం ప్రస్తుత విధానాన్నే కొనసాగనివ్వు’ అని ఆదేశించారట. అంతేకాదు… రామానుజులను ఇంకా పూరీలోనే ఉండనిస్తే తన సంకల్పాన్ని నెరవేర్చక మానడన్న భావనతో జగన్నాథుడు తన యోగమాయతో ఆయనను శ్రీకూర్మ క్షేత్రానికి తరలించాడట.


శ్రీకూర్మనాథానుమతి
అంతవరకు లింగాకృతిలో పూజలు అందుకుంటున్న శ్రీకూర్మనాథుడు సాక్షాత్ శ్రీమహావిష్ణువని, క్షీరసాగరమధన వేళ మందర పర్వతాన్ని ఉద్ధరించిన శ్రీమన్నారాయణ మూర్తి అని గ్రహించారు రామానుజ. ‘నీ రాక ఆనందదాయకం శంఖచక్రాదిధరుడైన నేను లింగాకృతిలో పూజల అందుకుంటున్నాను. పరికించి చూస్తే వాస్తవం బోధపడుతుంది.
ఆలయం సమీపంలోగల స్వచ్ఛమైన తిరుమణిని ధరింపచేయి’ అని కలలో సూచించారట ( (జగన్నాథుడు ఆయనను శ్రీకూర్మం చేర్చడంలోని పరమార్థం కూడా ఇదే కావచ్చు). ఆ విషయాన్నే స్థానిక శైవాచార్యులకుచెప్పి చూశారు. దానికి అంగీకరించని వారు, అందుకు ప్రత్యక్ష నిదర్శనం కావాలని కోరారు. ‘మరునాడు ఉదయానికి కూర్మమూర్తి స్థానం మారితే విష్ణుస్వరూపి అని, యథాతథంగా ఉంటే లింగాకృతి’ అని శైవాచార్యులకు, రామానుజలకు మధ్య అవగాహన కుదిరింది. ఆ రాత్రి ఆలయ వెనుకభాగంలో ఆశీనులైన రామానుజులు స్వామిని ఆవాహన చేసుకుని సంకల్పంతో తమ మధ్య ఒప్పందాన్ని నివేదించారు.మరునాడు ఉదయం ఆలయానికి చేరిన వారందరికి గర్భాలయంలో పశ్చిమాభిముఖుడైన స్వామి సాక్షాత్కరించాడు. కూర్మనాథుడి ఆదేశం మేరకు కొంతకాలం అక్కడే విడిది చేసిన రామానుజులు ఆలయం పడమర వైపునే కొత్తగా ధ్వజస్తంభం ప్రతిష్ఠింపచేశారు.పాంచరాత్రాగం ప్రకారం అర్చన విధానం, దివ్యప్రబంధానుసంధానం తదితర క్రియలు ప్రవేశపెట్టారు. అనంతం సింహాచలం సందర్శించారు. (వ్యాస ర‌చ‌యిత ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్‌)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఇండియన్ బ్రాండ్ అంబాసడర్ టాటా

ఉప్పు నుంచి ఉక్కు వరకూ…టీ నుంచి ట్రక్ వరకూఅప్రెంటిస్ నుంచి చైర్మన్...

Will China collapse after possible alliance of US with India?

An Analysis about Communist China’s 75th anniversary (Dr Pentapati Pullarao) On...

కుల గణనకు ఏక సభ్య కమిషన్: రేవంత్

60 రోజుల్లో నివేదిక : ఆ తరవాతే ఉద్యోగ నోటిఫికేషన్లుకులగణన కమిటీలతో...

Wiki for All: Empowering Voices, Expanding Horizons

Hyderabad, October 08: The Wikimedia Technology Summit 2024 successfully...