Tuesday, March 21, 2023
HomeArchieveసాంకేతికత లేకుండానే స‌మ్మోహ‌న దృశ్యాలు

సాంకేతికత లేకుండానే స‌మ్మోహ‌న దృశ్యాలు

అద్భుత ద‌ర్శ‌కుడు విఠ‌లాచార్య
(వైజ‌యంతి పురాణ‌పండ‌, 8008551232)
కథలు అల్లేసేవారు…
విఠలాచార్య… జానపద బ్రహ్మ…
అట్టలతో సెట్టింగులు.. కత్తి యుద్ధాలు…
మాయలు మంత్రాలు… దెయ్యాలు, పిశాచాలు…
మనిషి ఎలుగుబంటిగా మారటం..
అబ్బో పిల్లలకు విఠలాచార్య అంటే మహా ఇష్టం…
ఆయన సినిమాలలోని మ్యాజిక్కులు చూడటానికి ఎగపడేవారు..
క్రమశిక్షణ, పొదుపు, పరోపకారం..
ఇటువంటివన్నీ ఒక పాత్రలో పోస్తే ఆయనే విఠలాచార్య..

విఠ‌లాచార్య జ‌యంతి సంద‌ర్భంగా త‌న తండ్రి గురించిన ఎన్నో వివరాలను పెద్ద కుమార్తె రాధ వ్యూస్‌కు వివ‌రించారు.

Radha elder daughter of Sri B. Vithalacharya


ఎనిమిదిమంది సంతానం
నాన్నగారికి మేం ఎనిమిదిమంది సంతానం. నలుగురు ఆడపిల్లలు, నలుగురు మగ పిల్లలం.
ఆయన మొత్తం 70 సినిమాలు తీశారు. ఆ రోజుల్లో చాలా బిజీగా ఉండేవారు. మాతో మాట్లాడటానికి ఇంటి దగ్గర దొరకడమే కష్టంగా ఉండేది. అందుకే ఇంటి విషయాలన్నీ అమ్మే చూసుకునేది. మేం ఉడిపివాళ్లం. అందరూ బాగా చదువుకున్నాం. నేను బి.ఏ. చేశాను. ఇంతమందిలో మా అన్నయ్యకి, నాకు మాత్రమే తెలుగు వచ్చు.
గౌరవంతో కూడిన భయం..
సినిమా టీమ్‌ అందరికీ సినిమా ప్రివ్యూ వేసేవారు, అది చూసి వచ్చాక, ఆ సినిమా గురించి నాన్నగారితో ఎక్కువగా చర్చించేవాళ్లం. ఆయన చాలా తక్కువ అంటే అవసరానికి మాత్రమే మాట్లాడేవారు.
నాన్నగారికి మాయమంత్రాలు చేయడమంటే చాలా ఇష్టంగా ఉండేది. నాన్నగారి అమ్మమ్మ… నాన్నగారి చిత్నతనంలో రాజుల కథలు, మాయమంత్రాల కథలు చెప్పేవారట. అవన్నీ నాన్న చాలా ఆసక్తితో, ఉత్సాహంగా వినేవారట. ఆవిడ ప్రభావం కారణంగానే నాన్న జానపద చిత్రాలు తీసి, జానపద బ్రహ్మ అనిపించుకుని ఉంటారు. అప్పటికప్పుడు కథలు రూపొందించి, మాకు తమాషాగా చెప్పేవారు నాన్న.
చిన్నతనంలో నాన్నగారితో పాటు షూటింగులు చూడటానికి స్టూడియోలకి వెళ్లేవాళ్లం.

Family of Sri B. Vithalacharya


యాక్ష‌న్ చెబితే ఫ్లోర్ అంతా సైలెంట్‌
ఒకసారి ఆయన మెగా ఫోన్‌ పట్టుకుని, ‘యాక్షన్‌’ అన్నారంటే మేమంతా మాట్లాడకుండా మౌనంగా ఉండాల్సిందే. చిన్నపిల్లలం కావడంతో మాట్లాడకుండా కూర్చోవటం మాకు చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ చూడాలనే ఉత్సాహంతో కష్టపడి మౌనంగా కూర్చునేవాళ్లం. ఒక్కో షాటుకి చాలా టేకులు ఉండేవి. ఒకే సీన్‌ని అన్నిసార్లు చూడాలంటే మాకు బోర్‌ కొట్టేది. అందుకే ఒక్కోసారి అక్కడ నుంచి వచ్చేసేవాళ్లం. మేం కొంచెం పెద్దవాళ్లం అయ్యాక, ఆడపిల్లల్ని సినిమా నుంచి చాలా దూరంగా ఉంచారు నాన్నగారు. మమ్మల్ని బయటకు వెళ్లనిచ్చేవారు కాదు. మేం చెన్నైలో ఉన్నప్పుడు మా ఇల్లు కింద ఉండేది. మేడ మీద డ్యాన్సులు, పాటలు ప్రాక్టీసు, రికార్డింగు జరిగేవి. పాటల కోసం పి. సుశీల, జిక్కి వంటి వారు వచ్చేవారు. అప్పడు మేం చిన్న పిల్లలం కావటంతో, వారు మాకు చాకొలేట్స్‌ తెచ్చి ఇచ్చి ముద్దు చేసేవారు. ప్రముఖ సంగీత దర్శకులు రాజన్‌ నాగేంద్ర అప్పట్లో నాన్నగారి చిత్రాలకు సంగీతం సమకూర్చేవారు. వారు కూడా ఇంటికి వచ్చేవారు. అక్కడకు వచ్చేవారినందరినీ దూరం నుంచి చూసేవాళ్లం.
అందరి సంక్షేమం చూసేవారు..
నాన్నగారు మధ్యలో కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్‌ ఇచ్చారు. ఆ సమయంలో నాన్న దగ్గర పనిచేసిన టెక్నీషియన్స్‌ అందరూ బయటి సంస్థలకు పనిచేయడం ప్రారంభించారు. నాన్నగారు మళ్లీ ప్రొడక్షన్‌ ప్రారంభించగానే, వారంతా వెనక్కు వచ్చేశారు. స్టంట్‌ వాళ్లు, లైటింగ్‌ బాయ్స్‌ నుంచి అందరూ మళ్లీ నాన్న ప్రొడక్షన్‌ రీ ఎంట్రీగా నాన్నగారి దగ్గరకే వచ్చేశారు. నాన్న వాళ్లందరి క్షేమసమాచారాలు కనుక్కునేవారు. నాన్నగారి దగ్గర వారంతా వారి వారి కష్టాలు చెప్పుకునేవారు. వారు నాన్నగారి పాదాల మీద సాష్టాంగ పడేవారు. వారంతా ఎంత కష్టపడతారో నాన్నకు తెలుసు కదా. సినిమాలలో హీరోలకు బదులుగా గుర్రాల మీద దూకడం వంటివి డూప్‌లు చేసేవారు. వాళ్లకి దెబ్బలు కూడా తగిలేవి. అందుకే వారి సంక్షేమం నాన్నగారు చూసుకునేవారు.


కన్నడ చిత్రాలతో ప్రారంభం…
నాన్నగారు మొదట్లో కన్నడ పరిశ్రమలోనే చిత్రాలు తీశారు. ఆ భాషలో ఏడెనిమిది సినిమాలు తీశారు. అందులో ఎక్కువగా సాంఘిక చిత్రాలే తీశారు. అక్కడ నాన్నగారి సినిమాలకు పెద్దగా లాభాలు రాలేదు. అందువల్ల తెలుగులోకి మారారు. తెలుగులో ఎక్కువగా జానపదాలే తీశారు. నాన్నగారు తక్కువ ఖర్చులో సినిమా పూర్తి చేసేవారు. సెట్టింగ్‌లకు కూడా ఎక్కువ ఖర్చు చేయించేవారు కాదు. ఆయన సినిమాలు చూస్తుంటే చాలా ఎగ్జయిటెడ్‌గా అనిపించేది. జగన్మోహిని చిత్రాన్ని నాన్నగారు ముందర కన్నడంలో తీశారు. ఆ తరవాత తెలుగులో తీశారు. ఆ రోజు నుంచి నాన్నగారిని జగన్మోహిని విఠలాచారి అని పిలిచేవారు. కథ, దర్శకత్వం అన్నీ నాన్నగారే. అన్నీ ఆయనకు నచ్చితేనే సినిమా ప్రారంభమయ్యేది.


నాన్నగారు క్రియేటివ్‌
జగన్మోహిని చిత్రంలో..‘దెయ్యాల రెండు కాళ్ల మధ్య పొయ్యి పెట్టిన సీన్‌ ఇప్పటికీ మరచిపోలేను. బాలకృష్ణ (అంజి) గారితో చేయించిన కామెడీ, పాత్రలను జంతువులుగా మార్చడం వంటి సన్నివేశాలు బాగా నచ్చేవి. ముఖ్యంగా ఎలుగుబంటితో చేయించే పోరాటాలు బాగా సరదాగా ఉండేవి. నాన్నగారు చాలా క్రియేటివ్‌. చాలా తక్కువ ఖర్చుతో సెట్టింగులు వేసేవారు. ఆ సెట్స్‌ వేయించటంలో నాన్న చాలా యూనిక్‌. షూటింగ్‌ స్పాట్‌కి కరెక్ట్‌ టైమ్‌కి వచ్చేసేవారు. అప్పటికే ఆర్టిస్టులందరూ మేకప్‌ వేసుకుని సిద్ధంగా ఉండేవారు. నాన్నగారు వస్తుంటే, ‘అమ్మో! టైగర్‌!’ అంటూ భయపడిపోయేవారు. పని విషయంలో నాన్న చాలా నిబద్ధతో ఉండేవారు. వాళ్లకి ఇచ్చే పేమెంట్‌ విషయంలోనూ అంతే. కరెక్టు టైమ్‌కి ఇచ్చేసేవారు. ఒక్కరోజు కూడా ఆలస్యం చేసేవారు కాదు. అందుకే నాన్నగారి మీద అందరికీ గౌరవంతో కూడిన భయం ఉండేది.


క్రమశిక్షణ మొదటి ప్రాణం
ఒకసారి ఒక హీరోయిన్‌ ఆలస్యంగా వచ్చారట. ఆ తరవాత ఆ హీరోయిన్‌ వచ్చిన సమయంలో, ఆమెను కూర్చోబెట్టి, రీల్‌ తెప్పించి, ఆవిడ ఎదురుగానే తగలపెట్టించారట. మరో షూటింగులో… ఒక అమ్మాయి ఆ పాత్రకు అనుగుణంగా ఎంత ప్రయత్నించినా ఏడవట్లేదట. దానితో నాన్నగారు ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్లు తిట్టారట. ఆ అమ్మాయి ఏడుపు ప్రారంభించిందట. వెంటనే ‘స్టార్ట్‌! కెమెరా! అన్నారట నాన్నగారు. అంతే నాన్నకు కావలసిన భావం ఆ అమ్మాయిలో వెంటనే పలకటంతో, అసలు విషయం అప్పుడు చెప్పారట ఆ అమ్మాయికి. ఎవరైనా షూటింగ్‌కి రాకపోతే, వాళ్లని జంతువులుగా మార్చేసి షూటింగ్‌ పూర్తి చేసేవారు. అందువల్ల ఎవరూ ఆలస్యం చేయకుండా, గొడవ పెట్టకుండా షూటింగ్‌కి సరైన సమయం కంటె కొంచెం ముందుగానే వచ్చి నాన్నగారి కోసం చూస్తూ కూర్చునేవారు. నాన్నగారికి క్రమశిక్షణ అంటే అంత గౌరవం. ఎన్‌ టి ఆర్‌తో 15 సినిమాలు తీశారు.


అందరికీ సహాయం చేసేవారు
నాన్నగారు ఉదయాన్నే వరండాలో ఒక కుర్చీలో కూర్చునేవారు. ఆ సమయంలో చాలా మంది సహాయం కోసం వచ్చేవారు. ఎవరు ఏది అడిగితే వాళ్లకి అది ఇచ్చి పంపేవారు నాన్నగారు. పరిశ్రమలో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా వారికి సహాయం చేయటంలో ముందుండేవారు. కొందరు స్టౌ మీద ఎసరు పెట్టుకుని బియ్యం కోసం వచ్చేవారు. వెంటనే నాన్నగారుఎంతో కొంత ఇచ్చి పంపేవారు. ఆ రోజున వచ్చినవారిది ఏం అదృష్టమో అనుకునేదాన్ని. జేబులో ఉన్నంతా ఇచ్చేసేవారు. బాగా ఇబ్బందిగా ఉన్నవారికైతే నెల రోజులకు సరిపడా సంభారాలు తెప్పించి ఇచ్చేవారు. ఎవ్వరు ఏమి అడిగినా లేదనేవారు కాదని అన్నయ్య చెప్పేవారు మాకు.
జాన‌ప‌ద బ్ర‌హ్మ కుటుంబం వివ‌రాలు
భార్య – జయలక్ష్మీ ఆచార్య
సంతానం ఎనమండుగురు
మొదటి అబ్బాయి – శ్రీనివాస్, (ఫిల్మ్‌ డైరెక్టర్, మైసూరు)
రెండో అబ్బాయి – డా. శశిధర ఆచార్య – లాస్‌ఏంజిలిస్‌
మూడో అబ్బాయి – పద్మనాభ ఆచార్య – సినిమా రంగం, మైసూరు
నాలుగో అబ్బాయి – మురళీధర్‌ ఆచార్య – కంప్యూటర్‌ ఇంజినీర్, బెంగళూరు
మొదటి అమ్మాయి – రాధ – విజయవాడ (సోషల్‌ సర్వీస్‌) (మోడరన్‌ కేఫ్, విజయవాడ)
రెండో అమ్మాయి – రాజి – లాస్‌ ఏంజిలిస్‌
మూడో అమ్మాయి – పద్మిని – మంగళూరు
నాలుగో అమ్మాయి – లలిత – ద్వారక హోటల్, హైదరాబాద్‌
(విఠ‌లాచార్య జ‌యంతి సంద‌ర్భంగా వ్యూస్ ఆయ‌న పెద్ద కుమార్తె రాధాతో నిర్వ‌హించిన ముఖాముఖి ఇది)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ