Tuesday, March 21, 2023
HomeArchieveసలక్షణ సమన్వితుడు ఘంట‌సాల మాస్టారు

సలక్షణ సమన్వితుడు ఘంట‌సాల మాస్టారు

నిర్మాత‌లు న‌ష్ట‌పోరాద‌నేది ఆయ‌న త‌త్త్వం
కొత్త గాయ‌కుల‌ను ప్రోత్స‌హించిన మ‌నీషి
వారం వారం ఘంట‌సాల స్మృతి ప‌థం
(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 9440103345
‘ఏ రంగమైనా,ముఖ్యంగా చలనచిత్ర రంగం కళాకారులను రమ్మనదు, పొమ్మనదు. తమతమ అంకితభావం, పట్టుదల, కృషి, అణకువ, మర్యాద, మన్ననలు వంటివి మాత్రమే అక్కడ నిలదొక్కుకునేందుకు సాధనాలు. ఒకవేళ ‘పెద్దదిక్కు’ (గాడ్ ఫాదర్)ఉన్నా అది తాత్కాలికం’ అనే లక్షణాలను పుణికిపుచ్చుకున్న వ్యక్తిత్వం ఘంటసాల వారిది. తమ కుటుంబ సభ్యులకు నేర్పింది కూడా అదేనని ఆయన కుమారుడు రత్నకుమార్ చెప్పేవారు. ఘంటసాల గారు చిత్రసీమకు, ఆకాశవాణి, హెచ్ఎంవీ సంస్థలకు పరిచయం కావడంలో సముద్రాల రాఘవా చార్యులు,పేకేటి శివరాం, బాలాంత్రపు రజనీ కాంతరావుల పాత్ర కీలకమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఘంటసాల వారు జీవిత పర్యంతం వారి సహాయ సహకారాలను స్మరించుకునే వారు. అది ఆయన సంస్కారమని, అనంతర కాలంలో ఆయన సాధిం చిన విజయాలలో అలా తమకు స్థానం కల్పించారని ఆ ‘ముగ్గురూ’ చెప్పేవారు. తాము నాటిన మొక్క చిగిర్చి, పుష్పించి, ఫలించడం ఆనందదాయకమని మురిపెంగా చెప్పేవారు. సముద్రాల దర్శకత్వం వహించిన చిత్రాలకు ఘంటసాల సంగీత దర్శకత్వం వహించడమే కాక నేపథ్య గానాన్ని అందించారు.పేకేటి దర్శకత్వంలోని చిత్రాలకూ, రజనీ సంగీత దర్శకత్వంలో పాటలు పాడారు. ఎదగడమే కాదు..ఒదిగి ఉండడమూ తెలిసిన మనీషి.


నిర్మాతల శ్రేయోభిలాషి
నాటి అగ్రనటులు నందమూరి, అక్కినేనిలా నిర్మాతల బాగే తమ బాగని భావించారు (స్వయంగా నిర్మాత కావడం వల్ల ఆ కష్ణనష్టాలూ తెలిసి ఉండవచ్చు). వచ్చిన అవకాశాలను ఎలాగైనా వినియోగించు కోవాలను కోవడం, పారితోషికం కంటే పని విజయవంతంగా పూర్తి కావడం ప్రధానమని భావించే వారు. అప్పటి (1970వ దశకంలో) వర్థమాన గాయకుడు వి.రామకృష్ణ ఒక సందర్భంలో చెప్పిన ఒక అనుభవాన్ని ఉదాహరణగా మననం చేసుకుంటే…. నటుడు కృష్ణ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు’కు శ్రీశ్రీ రాసిన ‘తెలుగువీర లేవర…. ‘పాటను ఘంటసాల ఆలపించిన సంగతి తెలిసిందే.

(జాతీయ పురస్కారాన్ని అందుకున్న తెలుగు తొలి గీతం). అయితే ఆయన ఆరోగ్యం అంతగా సహకరించక పోవడంతో పాటలోని చివరి చరణాన్ని (స్వాతంత్య్ర యోధుడా. స్వరాజ్య భానుడా…)ఆయన సూచన మేరకు రామకృష్ణతో పాడించారు. వాస్తవానికి తానే పాటను పూర్తి చేసేందుకు ఘంటసాల చిత్ర సంగీత దర్శకుడు, దర్శక నిర్మాతలను కొంత వ్యవధి కోరవచ్చు. ముందే చెప్పుకున్నట్లు నిర్మాతల శ్రేయోభిలాషిగా, చిత్రీకరణకు అంతరాయం కలగరాదన్న ఉద్దేశంతో సహ గాయకుడికి అవకాశం కలిగించారు. కేవలం ఒకే చరణం (నాలుగైదు పంక్తులు) ఆలపించినా, తనతో సమా నంగా పారితోషికం ఇప్పించారని రామకృష్ణ చెప్పేవారు.


మహాగాయకుడికి గాత్రదానం
తనకు బదులుగా వర్ధమాన గాయకుడితో పాడించడానికి మహానటుడు నాగయ్య గారితో ఎదురైన అనుభవం కారణం కావచ్చని అనిపిస్తుంది.1959-60వ దశకాలలో ‘లవకుశ’లో, స్వతః గాయకు లైన నాగయ్య గారు తాము ధరించిన ‘వాల్మీకి’ పాత్రకు పాట (‘సందేహించకువమ్మా’… పద్యాలు)ను తానే పాడవలసి ఉంది. కానీ గాత్రం సహకరించడం లేదు. ఆ చిత్రనిర్మాతకు ఎటూ పాలు పోక,వాటిని మీరే పాడాలంటూ చిత్ర సంగీత దర్శకుడు ఘంటసాలను కోరారు.నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు, గాయకుడిగా బహుముఖ ప్ర జ్ఞాశాలి, తనలాంటి వారినెందరినో ఆదరించి అన్నం పెట్టిన ఆ మహాను భావుడికి తాను పాడడమంటే అపచారమే అను కున్నారు. అదే మాట నాగయ్య గారికి చెబితే ‘నాయనా! పాడే స్థితిలోలేని నాకు ఎవరో ఒకరు గొంతు అరువివ్వక తప్పదు. ఆ స్వరం నీదే అయితే అంతకన్నా కావలసిందేముం టుంది? పోనీ గాయకుడిగా అవకాశాల కోసం ప్రయత్నించే సమయంలో నా వల్ల ఉపకారం పొందావనుకుంటున్నావ్ కనుక నీ గాత్రం నాకు గురుదక్షిణ అనుకో’ అని నచ్చచెప్పాక పాడక తప్పలేదట. కాలమంతా ఒకేలా ఉండదని, పాత నీటి స్థానంలో కొత్త నీరు అనివార్యమన్న భావన అనంతర కాలంలో ఆదర్శమైంది. కొత్త తరాన్ని ప్రోత్సాహించాలన్న తపనా ఉంది. ఆ తరంలో (ఘంటసాల యుగంలో) చిత్రాలు విజయవంతం కావడానికి చిత్రబృందం చేసిన సామూహిక కృషి ఎంతటిదో, ఎలాంటిదో ఇలాంటి అనుభవాల ద్వారా వెల్లడవుతుంది. (వ్యాస ర‌చ‌యిత ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్‌)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ