బ‌లోపేత‌మైన ప‌త్రిక‌లు

0

ప్రైవేటు మీడియా సాధించిన ఫలితాలు
ఎమ‌ర్జ‌న్సీ అన‌త‌రం బ‌ల‌ప‌డిన ప‌త్రికా రంగం
(నాగ‌సూరి వేణుగోపాల్‌, 9440732392)

మన దేశంలో 1977లో ఎమర్జన్సీ రద్దు చేసిన తర్వాత పత్రికారంగం బలపడింది. తొలుత దక్షిణాది పత్రికారంగం విస్తరించగా, మధ్య భారతదేశపు హింది పత్రికారంగం 1995 తర్వాత వ్యాప్తి చెందింది. పాతికేళ్లకు ముందు కొన్ని ప్రాంతాలలో కొన్ని పత్రికలు బహుళ వ్యాప్తిలో ఉండేవి. ఆనంద బజార్‌ పత్రిక, మలయాళ మనోరమ, దైనిక్‌ జాగరణ్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, హిందుస్తాన్‌ టైమ్స్‌, స్టేట్స్ మన్‌, గుజరాత్‌ సమాచార్‌- ఇలా ఉండేవి. అప్పట్లో ఇండియన్‌ ఎక్స్ ప్రెస్‌ ఒకటి మాత్రమే పలుచోట్ల ప్రచురింపబడేది. ఇప్పుడు అలా కాదు గతంలో పెద్ద ఆంగ్ల పత్రికలు ఒక్కో నగరంలో గుర్తింపు పొంది ఉండేవి – ది హిందూ – మదరాసు, డెక్కన్‌ క్రానికల్‌ – హైదరాబాదు, డెక్కన్‌ హెరాల్డ్‌ – బెంగుళూరు, ది స్టేట్స్ మన్‌ – కలకత్తా, ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా – బొంబాయి. ది హిందూస్తాన్‌ టైమ్స్‌ – ఢిల్లీ. పత్రికా సంస్థలు భాషలు దాటి, ప్రాంతాలు దాటి తమ వాణిజ్యాన్ని విస్తరించుకుంటున్నాయి. అంతే కాదు పత్రికల వారు టీవీ, రేడియో రంగాలలో ప్రవేశించి తమ స్థానాలను పటిష్టం చేసుకుంటున్నారు. తర్వాతి దశలో అన్ని మీడియా సంస్థలకూ ఛానల్‌, పత్రిక, రేడియో డిజిటల్‌ ప్లాట్‌ఫాం అనే స్థితికి వచ్చాయి.
ఈ రకంగా చూసినపుడు అంశాల వారీగా విశ్లేషించడం సులువుగా ఉంటుంది.
1) విస్తరణ: ఈ ఏడున్నర దశాబ్దాలలో పత్రికలు, రేడియో, టెలివిజన్‌ పెద్ద ఎత్తున విస్తరించాయి. జన జీవితంలో మీడియా చాలా ముఖ్యమైనదిగా మారింది. జన జీవితంలో మీడియా జోక్యం చేసుకుంటుంటే; యజమానులు, జర్నలిస్టులు అధికార కేంద్రాలలో జోక్యం చేసుకోవడం పెరిగింది.
2) పెట్టుబడి: అభిప్రాయాలు చెప్పగలిగే వారు పత్రికలు స్థాపించుకునే అవకాశం గతంలో ఎంతో కొంత ఉండేది. నేడు పెద్ద స్థాయిలో పెట్టుబడి కీలకం కావడంతో, పత్రిక ఉంటే అభిప్రాయాలు, ఉద్బోధలు తయారు చేసుకోవచ్చు అనే ధోరణి పెరిగింది. దానితో ఎటువంటి ఫలితాలు సాధ్యమో అవే ఎదురవుతున్నాయి.
3) టెక్నాలజి : విస్తరణ, పెట్టుబడి, టెక్నాలజి ఈ మూడు ఒక వలయంలో ఉంటాయి లేదా మరో రకంగా చూస్తే మూడూ సమానార్థకాలుగా మారిపోతాయి. వస్తువూ, దాని ధోరణి కాకుండా; వేగం, ఆకర్షణ, మేళవింపు కీలకంగా మారాయి. ఎక్కువ మందిని వేగంగా చేరగలిగే సదుపాయం కల్గింది టెక్నాలజీ ద్వారానే.
4) భాషలు: మనదేశంలో ఉండే ఎన్నో భాషలకు ఊతం కల్గిస్తూ పత్రికలు విస్తరించాయి. ఇది పత్రికల తోడ్పాటు కాగా, లిపి లేని భాషలకు సైతం తోడైంది రేడియో. నిజానికి రేడియో, టెలివిజన్లు అక్షరాస్యత అనే పత్రికల పరిమితిని దాటి విజయవంతమయ్యాయి. చదివే, రాసే భాషకు పత్రికలు తోడ్పడగా, రేడియో, టెలివిజన్లు మాట్లాడే విధానాలకూ, మాండలికాలకూ హారతి పట్టాయి.
5) ప్రజాస్వామ్య విలువలు, పారదర్శకత: మీడియా విస్తరణ వల్ల అవాంఛనీయ ధోరణులు బహిర్గతం కావడమే కాకుండా పలు రకాల వివక్షల గురించి అవగాహన పెరిగింది. తద్వారా ఆరోగ్యకరమైన లక్షణాలు పెరిగే వీలుంది. వార్తాపత్రికలో వచ్చిన అంశాలను సుమోటోగా న్యాయస్థానాలు స్వీకరించే పరిస్థితి దీనినే చెబుతోంది.
6) అందరికీ అవకాశం: పెట్టుబడి పెట్టగలిగే వారంతా మీడియాలో ప్రవేశించడం నేటి చరిత్ర. ఫలితంగా వాణిజ్యవేత్తలు, రాజకీయ నాయకులు మీడియా యజమానులుగా మారిపోతున్నారు. తత్ఫలితంగా ఈ ప్రముఖుల లక్ష్య సాధనకు మీడియా ఒక పనిముట్టుగా మారి పోయింది.
7) అవినీతి: అవినీతిని ప్రశ్నించి, అరికట్టే మీడియా ఏదో ఒక దశలో అందులోనే కూరుకుపోవడం ఇప్పటి విషాదం. స్కాము ఏ స్థాయిదయినా అందులో ఎంతో కొంత కీలక పాత్ర పోషించిన పత్రికా రంగపు వ్యక్తి ఉండటం తప్పనిసరి అయ్యింది.
8) నడమంత్రపు సిరి : ఎంతో కొంత అవకాశం మాత్రమే ఉంది. తగిన జీతభత్యాలు లేకపోవడంతో మీడియా జర్నలిస్టులు కొత్త ధోరణిలో పడుతున్నారు. ఇది యజమానులకూ వర్తిస్తుంది.
9) వేగం : తక్కువ వ్యవధిలో ఇపుడు సమాచారం అందుతోంది. ఎక్కువ ప్రాంతాలకు చేరుతోంది. ఇది ప్రజలకు ఆనందదాయకం, యజమానులకు లాభదాయకం అయినా జర్నలిస్టులకు వత్తిడి పెంచుతోంది. అది వారి ఆరోగ్యం, కుటుంబ పరిస్థితి మీద ప్రభావం చూపుతోంది.
10) స్త్రీ వివక్ష : మీడియాలో స్త్రీల సంఖ్య బాగా తక్కువ. లోతుగా పరిశీలించి త్రీవంగా కృషిచేయాల్సిన కోణమిది.
11) ఆధిపత్య ధోరణి : చదువులు, పత్రికలు గతంలో కొందరికే పరిమితం అయినా నేడు ఇటు యాజమాన్యంగా అటు జర్నలిజంలో చాలా మంది ప్రవేశిస్తున్నారు. అయినా అగ్రవర్ణాల అధిపత్యం ఉందనే విమర్శ స్పష్టంగానే వినబడుతోంది. డిజిటల్‌ మీడియాలో కూడా అడుగు వర్గాలు అడుగునే ఉన్నారు.
12) న్యూమీడియా : సోషల్‌ మీడియా! ప్రధాన స్రవంతి మీడియా అంటే పత్రికలు, చానళ్ళు తమదారి విస్మరించి పక్షపాతం, స్వీయ ప్రయోజనాలలో కూరుకుపోవడం విషాదకరం. సగటు మనిషికి ప్రత్యామ్నాయం అవసరమైనవేళ ప్రవేశించిన సులభ, సాంకేతిక వెసులుబాటు ఈ న్యూమీడియా అంటే ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ట్విట్టర్‌, ఇన్‌స్ట్రాగ్రామ్స్‌ వంటివి. వీటిద్వారా సమాచార వ్యాప్తి మాత్రమే కాదు; ఉద్దేశపూర్వకంగా పత్రికలు, చానళ్ళు పరిహరించే విషయాలను వెలికితీస్తున్నాయి. ఫలితంగా ఈ వైపు దృష్టిపెట్టక తప్పని పరిస్థితి పత్రికలకు చానళ్ళకు ఏర్పడింది. అదే సమయంలో ఈ కొత్త జనమాధ్యమాలలో వెకిలితనం, చౌకబారు భాష, కుసంస్కారం, మితిమీరిన స్వోత్కర్షలు వెగటుపుట్టిస్తున్నాయి. మరోవైపు టీవీ ఛానళ్ళు టీఆర్‌పి ఉచ్చులో పడిపోతాయి. చెయ్యాల్సిన పని కాకుండా మరేమిటో చేస్తున్నాయి. క్రమంగా న్యూస్‌ టెలివిజన్‌ ప్రాధాన్యత కోల్పోవడం మీడియా స్వయంకృతాపరాధం.
హార్డ్‌వేర్‌ మాత్రమే వృద్ధి చెంది, సాఫ్ట్ వేర్‌ చాప కిందకు వెళ్లిపోతున్నప్పుడు సామాజిక విలువల స్థానంలో వైయక్తిక ప్రయోజనాలు పెద్ద పీట పొందుతాయి. నియంత్రణ భావనను తిరస్కరిస్తూ పయనించే మీడియాకు న్యాయస్థానాల నుంచి గుణపాఠాలు తరచూ ఎదురవుతున్నాయి. సమాంతర అభిప్రాయాలను తిరస్కరించే మీడియాకు టెక్నాలజీ అందించిన ప్రత్యామ్నాయం సోషల్‌ మీడియా. మరో సరళమైన, చౌకైన మాధ్యమం మనమధ్యకు వచ్చేదాకా సోషల్‌ మీడియా రాజ్యమేలుతుంది. అయితే చాలా పేలవంగా మారిపోయిన సోషల్ మీడియా అభాసుపాలవుతోంది. అదే సమయంలో ప్రధాన స్రవంతి మీడియా సంస్థల లొసుగులను గొప్పగా బట్టబయలు చేస్తోంది. ఈ మారిన వాతావరణంలో ఒకవైపు రాజకీయ పక్షాలు, మరోవైపు మీడియా సంస్థలు, ఇంకోవైపు స్వచ్ఛంద సంస్థలూ రకరకాల పేర్లతో సోషల్ మీడియాలో ప్రయోగాలు చేస్తున్నారు. అదే సమయంలో మీడియాలో పనిచేసిన రాజకీయపరమైన ఆసక్తి ఉన్నవారు సైతం ఇందులో పాలుపంచుకుంటున్నారు. ఫలితంగా సోషల్ మీడియాకు మంచి ప్రాచుర్యంతోపాటు, చెడ్డ పేరు కూడా పుష్కలంగా లభిస్తోంది.
మీడియా వినియోగదారులు అప్రమత్తంగా ఉంటూ, ప్రత్యామ్నాయ అభిప్రాయాలను కూడా గుర్తించడమే వ్యక్తి స్థాయిలో చిన్న తరుణోపాయం. (వ్యాస‌క‌ర్త ప్ర‌ముఖ విశ్లేష‌కుడు, ఆలిండియా రేడియా హైద‌రాబాద్ కేంద్ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here