Saturday, March 25, 2023
Homeటాప్ స్టోరీస్ఆయనకు ఏమిస్తే ఋణం తీరుతుంది?

ఆయనకు ఏమిస్తే ఋణం తీరుతుంది?

అమరజీవికి నీరాజనాలు ఎలా పట్టాలి..
పొట్టి శ్రీరాములు జీవితం ఎలా సాగిందో తెలుసా?
మార్చి 16 తెలుగు జాతి గుర్తుంచుకోవలసిన రోజు
(డాక్టర్ ఏ. శ్రీనివాస్, అమరావతి)
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు అమరజీవి. మహా పురుషుడు, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు.
బాల్యం-తొలి జీవితం
పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌనులో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. వీరి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పడమటిపాలెం గ్రామం. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసులోనే చేశారు. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివారు. “గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే”లో చేరి నాలుగేళ్ళు ఉద్యోగం చేసారు. జీతం నెలకు 250 రూపాయలు.
1928లో ఆయన కుమారుడు బిడ్డ మరణించాడు. కొద్ది రోజులకే అతని భార్య కూడా కన్నుమూశారు. శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా ఇచ్చారు.
ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమం చేరారు.


స్వాతంత్ర ఉద్యమంలో…..
పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాల్సివచ్చింది. 1985లో ప్రచురితామైన ఆంధ్ర ఉద్యమం కమిటీ అధ్యయనంలో పొట్టి శ్రీరాములు – మహాత్మా గాంధీ మధ్య అనుబంధం గురించి వివరించారు. – “సబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు సేవ చరిత్రాత్మకమైనది. ప్రేమ, వినయం, సేవ, నిస్వార్ధతలు మూర్తీభవించిన స్వరూపమే శ్రీరాములు. సత్యాన్ని అహింసను ఆరాధించే ప్రేమమూర్తి. దరిద్ర నారాయణుల ఉన్నతికి అంకితమైన మహానుభావుడు….. శ్రీరాములు తన కర్తవ్య దీక్షలను ఉత్సాహంగా నిర్వహిస్తూ ఆశ్రమంలో అందరి మన్ననలనూ గాంధీ ఆదరాన్నీ చూరగొన్నారు.
గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లోను, ఆంధ్రలో కృష్ణా జిల్లాలోని కొమరవోలులోను గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొమరవోలులోయెర్నేని సుబ్రహ్మణ్యం నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరారు. 1943-44ల్లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషిచేసారు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవారు.


ఆలయంలో హరిజనుల ప్రవేశానికి నిరాహారదీక్ష
1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష బూని, సాధించారు. మరోసారి నిరాహారదీక్ష చేసి, మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసారు. దీని ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చెయ్యవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తరువులు ఇచ్చింది.
గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానంతో పాటు అతని మంకుతనం మీద కాస్త చిరాకు కూడా ఉండేవి.
శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవారు.
1946 నవంబరు 25న ఈ గాంధీ శిష్యుడు మద్రాసు ప్రొవిన్సులోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే స్వాతంత్య్రం రావచ్చునన్న ఆశాభావంతో కాంగ్రెసు నాయకులు, సభ్యులందరి దృష్టీ ఆ ఉద్యమంపైనే ఉంది. కనుక శ్రీరాములు దీక్షను మానుకోవాలని వారు సూచించినా అతను వినకపోయేసరికి ఇక వారు గాంధీని ఆశ్రయించారు. ఎలాగో గాంధీ శ్రీరాములుకు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశారు.
జీవితం చివరిదశలో…..
జీవితం చివరిదశలో నెల్లూరులో ఉంటూ, హరిజనోద్ధరణకు కృషిచేసారు. దీనిగురించిన నినాదాలను అట్టలకు రాసి, మెడలో వేలాడేసుకుని ప్రచారం చేసేవారు. కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండుటెండల్లో తిరుగుతూ ప్రచారం చేసే ఆయన్ను పిచ్చివాడనేవారు. ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని, అమరజీవి అయ్యారు.


ప్రత్యేక రాష్ట్ర సాధనకు నిరాహారదీక్ష
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆంధ్రదేశానికి కూడా మద్రాసు రాజధానిగా వుండేది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించారు పొట్టి శ్రీరాములు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్ధించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు చేశారు.
ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా ప్రకటన చెయ్యలేదు. చివరికి 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యారు. ఆగ్రహావేశులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. మద్రాసులో జరిగిన ఆయన శవయాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగనిరతిని కొనియాడారు. తదుపరి జరిగిన పరిణామాలలో మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలు, హింస చెలరేగాయి. పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారు.
చివరికి డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటన చేసారు. కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రంఏర్పరచారు.
తర్వాత 1956 నవంబర్ 1 న.తెలంగాణ తో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.
ప్రముఖ రచయిత, చరిత్రకారుడు రామచంద్ర గుహ.. శ్రీరాములు గురించి ‘ది హిందూ’ పత్రికలో రాసిన వ్యాసంలో ఇలా పేర్కొన్నారు….
దురదృష్టవశాత్తూ ఆంధ్రా బయట ఆయనొక మర్చిపోయిన వ్యక్తి. భారతదేశ చరిత్ర, భౌగోళిక స్వరూపంపై శ్రీరాములు గణనీయమైన ప్రభావం చూపారు. ఆయన దీక్ష, దాని తదనంతర పరిణామాలు.. భారతదేశ చిత్రపటాన్ని భాషాప్రయుక్త రేఖల్లో పునఃచిత్రీకరించాయి. పొట్టి శ్రీరాములు భారతదేశ మెర్కాటర్ (1569లో ప్రపంచ పటాన్ని తయారు చేసిన జర్మన్-ఫ్లెమిష్ భౌగోళిక శాస్త్రవేత్త)గా అభివర్ణించవచ్చు.‘‘


భాషా ప్రయుక్త రాష్ట్రాలకు బీజం వేసింది శ్రీరాములేనా?
భాషాప్రయుక్త రాష్ట్రాలకు బీజం వేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములే అని మేధావుల అభిప్రాయం. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాతే భారతదేశంలో అనేక భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినాయి.
శ్రీరాములు మరణానికి కారకులెవరు?..
పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి.. ప్రాణత్యాగం చేస్తే ఆయన్ను కనీసం పట్టించుకోలేదని మదరాసు ముఖ్యమంత్రి రాజగోపాలాచారి, ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూలపై చాలామంది అప్పట్లో మండిపడ్డారు. శ్రీరాములు అంత్యక్రియల సందర్భంగా ప్రకాశం పంతులు మాట్లాడుతూ.. ‘‘నెహ్రూ తలచుకుంటే శ్రీరాములు ఆదర్శం అతను బతికి ఉండగానే అమలు జరిగేది. ధార్ కమిటీ వ్యవహారమంతా సౌకల్యంగా పరిశీలించి.. మద్రాసును ప్రత్యేక రాష్ట్రం చెయ్యమన్నది. అదే శ్రీరాములు కోరాడు. అన్యాయమైనదేమీ అతడు కోరలేదు.(ఆంధ్రపత్రిక)
మరణించాక మరీ దారుణం ఎదురైంది
ఇక మరణించాక మరీ దారుణం ఎదురైంది. తెలుగువారి హీన దీన హైన్య చాతకానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు. చివరి వరకు దీక్షలో తోడుగా ఉన్న సాధు సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివాడ వాళ్ళవైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆశయాన్ని చంపుకుని వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీగాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనుక మనమైనా సాగనంపుదాం అని ఒప్పించి తెచ్చారు. ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే కళాకారుడు నేను గుడివాడ వాడినే కదా నేనూ వస్తానని వచ్చారు. తెలుగుజాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళటం సబబుకాదు అని తెలుగువాళ్ళ కళ్లు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఒక ఎద్దులబండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు. అప్పటికప్పుడే ఆశువుగా ఘంటసాల తన వీరకంఠాన్ని ఎలుగెత్తి తెలుగుజాతి పౌరుషం చచ్చిందని, చీము నెత్తురు లేని తెలుగుజాతి కోసం అసువుల బాసిన శ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడుతూ శవయాత్ర ప్రారంభించారు. యేర్నేని సాధు సుబ్రహ్మణ్యం గారే అమరజీవి శ్రీరాములకు దహనక్రియలు కర్మకాండ జరిపారు.
శ్రీరాములు అంత్యక్రియల సందర్భంగా ప్రకాశం పంతులు మాట్లాడుతూ.. ‘‘మనలో మనం తగువులాడుకుంటున్న సమయంలో ఆంధ్రరాష్ట్రం కోసం తన ప్రాణాలను బలిదానం చేసి, మనందరికీ ఒక గుణపాఠం నేర్పాడు శ్రీరాములు. స్వార్థంతో మనమంతా శ్రీరాములును దీక్ష విరమించవలసిందిగా కోరాం. శ్రీరాములు ఒక ఆదర్శం కోసం చివరిదాకా దీక్షను కొనసాగించి, నిస్సంకోచంగా తన నిండు ప్రాణాలను అర్పించారు.


పొట్టి శ్రీరాములు ప్రశంస
తపాలాశాఖ 2000లోపొట్టి శ్రీరాములు గుర్తుగా తపాలాబిళ్ళనువిడుదల చేసింది.
మద్రాసు మైలాపూరు, రాయపేట హైరోడ్డులో శ్రీరాములు అమరజీవియైన 126 నంబరు ఇంటిని ఆయన స్మృతి చిహ్నంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కాపాడుతున్నది.
ఈ మహనీయుని జ్ఞాపకార్థం రాష్ట్రప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించింది.
నెల్లూరు జిల్లా పేరును 2008లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు.


ఆంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకై అహింసాయుత సత్యాగ్రహం ద్వార ఆత్మబలిదానం చేసిన ఆ అమరజీవి కథ నేటి యువతరానికి మార్గదర్శకం అయి, భవ్య భావోన్నత భవిష్య నిర్మానానికి ప్రేరకం కాగలదు. (వ్యాస రచయిత అమరావతి మండలం మునుగోడు జిల్లా పరిషత్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ