దారుణం క‌ల‌చివేసింది

0

సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది
పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్పందించాలి
దోషికి సరైన శిక్ష పడే వరకు బాలిక కుటుంబానికి జనసేన అండ
సైదాబాద్ హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబ సభ్యులకు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రామ‌ర్శ‌
హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 15:
సైదాబాద్‌లోని సింగ‌రేణి కాల‌నీలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ దారుణం తనను ఎంతగానో కలచివేసిందని తెలిపారు. అంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది అన్నారు. హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన ఆరేళ్ల చిన్నారి కుటుంబాన్ని బుధవారం సాయంత్రం పరామర్శించారు. ఆ బిడ్డ తల్లిదండ్రులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ “చిన్నారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు చెప్పారు. సభ్య సమాజం మాట్లాడుకోలేని ఘోరమైన సంఘటన ఇద‌న్నారు. ఒక ఇంటి మీద అనుమానం ఉంది చూడమంటే పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోలేకపోయార‌ని కుటుంబ స‌భ్యులు చెబుతున్నార‌న్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు చనిపోయిన బిడ్డకు న్యాయం జరగాలని కోరుకోవాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆకాంక్షించారు. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పెద్దలకు నా విన్నపం.. మంత్రి వర్గంలోని పెద్దలను పంపి బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకు భరోసా కల్పించండి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధితులకు ఓదార్పు అవసరం. ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయగలమో ఆలోచించి చేయాలని కోరుకుంటున్నాను అన్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.


మీడియా బాధ్యతగా వ్యవహరించాలి
ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడం సమాజానికి అంత మంచిది కాదని చెప్పారు. మీడియా కొన్ని సంఘటనలపై ఎక్కువగా ప్రచారం చేసి ఇలాంటి వాటిపై స్పందించకపోవడం కూడా సరికాదన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో కూడా బాధ్యతగా ఉండాలి. ఏదో ఒక సంఘటనను పట్టుకుని హైలెట్ చేసి వదిలేయకుండా అన్యాయం జరిగినప్పుడు దాన్ని ఎక్కువ మందికి తెలియచేయాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా ద్వారా ఈ ఘటన బయటకు వచ్చింద‌న్నారు. తమకు న్యాయం జరగలేదని చిన్నారి తల్లిదండ్రులు బాధపడుతున్న అంశాన్ని గుర్తుచేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు నా తరఫున ఓ విన్నపం. బిడ్డ చనిపోయిన బాధలో ఉద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. పెద్ద మనసుతో అర్ధం చేసుకోవాలని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here