అమ‌ర‌జీవి త్యాగం వెనుక‌?

0

అమరజీవి బలిదానానికి నేపథ్యం ఏమిటి?
డిసెంబరు 15 పొట్టి శ్రీరాములు బలిదానం
(డా. నాగసూరి వేణుగోపాల్, 9440732392)

“… చూడు పట్టాభీ – ఆంధ్రా పి.సి.సి. పరిధిలో వున్న వివాదరహిత ప్రాంతాలని ఎంచుకుని, ఎక్కడ ఎక్కువ మంది ఆంధ్రులు స్థిరపడిన ప్రాంతాలలో ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేసుకుని, మూడు నాలుగేండ్లు తర్వాత మిగిలిన ప్రాంతాల కోసం సరిహద్దు కమీషన్ ని అడగవచ్చు” అని గాంధీజీ ఇచ్చిన సలహాను భోగరాజు పట్టాభి సీతారామయ్యకు గుర్తు చేశారు కొండా వెంకటప్పయ్య! జెవిపి (జవహర్ లాల్, వల్లభభాయి, పట్టాభి సీతారామయ్య) రిపోర్టుకు తీవ్ర అసంతృప్తిని తెలియజేస్తూ ఈ మాటలు పట్టాభి సీతారామయ్యకు చెప్పారు. అప్పటికి గాంధీజీ లేరు. స్వాతంత్ర్యం వచ్చింది. భారత రాజ్యాంగ పరిషత్తు ద్వారా నియమింపబడిన ఎస్.కె.ధార్ కమీషన్ ఒక సంవత్సరం శ్రమించి 1948 డిసెంబరు 18న నివేదికను సమర్పించింది. బొంబాయి, మద్రాసు నగరాలు బహుభాషా ప్రాంతాలే కాకుండా రెండింటికి చాలా పోలికలు ఉండటంవల్ల – వీటికి తగిన ప్రాముఖ్యత ఇవ్వాలని, అంటే ప్రత్యేక రాష్ట్రాలుగా చెయ్యాలని ఈ కమిషన్ సూచించింది. ఈ కమిషన్ నివేదికను పూర్వపక్షం చేసి, జెవిపి కమిటీ 1949లో ఏర్పడింది. అప్పటి ప్రధానమంత్రి, హోం మంత్రి అదనంగా డా. భోగరాజు పట్టాభి సీతారామయ్యను కలుపుకుని త్రిసభ్య కమిటీ ఏర్పడి, ఒక రిపోర్టు తయారు చేసింది. అలా తయారైన రిపోర్టును ప్రధానమంత్రి, హోంమంత్రి ఆమోదించారు. ఇది రాజ్యాంగ పరిషత్తు ద్వారా ఏర్పడింది కాదు. అసలు ఈ రిపోర్టును రూపొందించింది చక్రవర్తి రాజగోపాలాచారి అంటారు. అప్పటికి రాజగోపాలాచారి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా (1948 జూన్ 21 నుంచి 1950 జనవరి 26 దాకా) గా పూర్తిగా నిర్ణాయక స్థానంలో ఉన్నారు. కొండా వెంకటప్పయ్య ఈ జెవిపి రిపోర్టును విబేధిస్తూ గాంధీజీ చేసిన న్యాయబద్ధమైన సూచనను గుర్తుచేస్తూ పట్టాభిసీతారామయ్యకు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలా మొదలైన వ్యవహారం 1952 డిసెంబరు 15 రాత్రి 11 గం. 20 నిమిషాలకు పొట్టి శ్రీరాములు ప్రాయోపవేశంతో కీలక ఘట్టానికి చేరుకుంది. తర్వాత ఏమైందీ, ఎలా మలుపులు తిరిగింది ఇంకోసారి గుర్తు చేసుకుందాం.


స్వాతంత్ర్య భారతదేశ పటాన్ని పునర్లింఖించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని ప్రముఖ పాత్రికేయుడు ఎం.జె. అక్బర్ “ఇండియా – ది సీజ్ వితిన్ ఛాలెంజెస్ టు ఏ నేషన్స్ యూనిటి” (1985) అనే పుస్తకంలో అభిప్రాయ పడతారు. “ఏక రూపమైన జాతీయత కంటే ప్రజాస్వామ్యంతో కూడిన బహు ప్రాంతీయత విశిష్టమైంది. భాష ప్రజల సామూహిక జీవనానికి ఊపిరి వంటిది. మన భారత ప్రజాస్వామిక, మతరహిత, సామాజిక వాద రిపబ్లిక్ తాలూకు మనస్సునూ, హృదయాన్ని ఆకట్టుకోవలసి ఉన్న ఉదాత్త రాజనీతి ఇది. భారతీయ ఫెడరల్ రాజ్యాంగ విధానానికి సంబంధించిన ఈ ఉత్తమ సూత్రానికి అమరజీవి పొట్టి శ్రీరాములు గొప్ప బలం చేకూర్చాడు… ” జస్టిస్ వి. ఆర్. కృష్ణయ్యర్ 1985 మార్చి 16 (అమరజీవి జయంతి రోజున) తన ప్రసంగంలో విపులీకరించారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు తోడ్పడిన పొట్టి శ్రీరాములు కృషి గురించి చరిత్రకారులు రామచంద్ర గుహ 2003 మార్చి 30వ తేదీన ‘ది హిందూ’ పత్రికలో వ్యాసం రాస్తూ – శ్రీరాములు పాత్రనూ, మూర్తిమత్వాన్ని మిగతాదేశం విస్మరించిందని రాశారు! పొట్టి శ్రీరాములు కనుమూసిన పది నెలల తర్వాత 1953 అక్టోబరు 1న మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి వేరుపడి ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ప్రకాశం, పట్టాభి సీతారామయ్య, గాడిచర్ల, ఆచార్యరంగా, ఉన్నవ లక్ష్మీనారాయణ వంటి ఎంతోమంది నాయకులుండగా పొట్టి శ్రీరాములు ఎందుకు ఈ సాహసం చేసి ఆత్మార్పణ చేసుకున్నాడు?
పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు నగరం జార్జిటౌన్ లో ఒక పేద వైశ్యకుటుంబంలో జన్మించారు. తన ఏడవ ఏట నుంచి 17వ ఏట మధ్య తండ్రిని, అన్ననూ, అక్కను కోల్పోవడం విషాదం. దాంతో ఆయన చదువు మద్రాసులో ఫిఫ్త్ ఫారమ్ మధ్యలో ఆగిపోయింది. తర్వాత మరెక్కడా కొనసాగించే వీలు లేక బొంబాయిలో విక్టోరియా జాబిలి టెక్నికల్ ఇన్ స్టిట్యూట్ లో శానిటరీ ఇంజనీరింగ్, ప్లంబింగ్ డిప్లొమా పొందారు. 1924లో బొంబాయిలోనే గ్రేట్ ఇండియన్ పెనున్సిలర్ రైల్వేలో ఉద్యోగం లభించింది. గాంధీ యంగ్ ఇండియా, నవజీవన్ పత్రికలు అధ్యయనం చేయడం విద్యార్థి దశనుంచే మొదలైంది. తర్వాత తల్లి, భార్య, బిడ్డ కనుమూశారు. 1930 ఏప్రిల్ 1న గాంధీజీని కలిశారు. పొట్టి శ్రీరాములు స్థిర చిత్తులు, కార్యవాది. పక్షం రోజుల్లో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా జీవనంలోకి వెళ్ళిపోయారు.
ప్రాణాలు అర్పించాలనే తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి నేపథ్యం ఏమిటి? ఈ విషయాలు అధ్యయనం చేయడానికి ప్రధమంగా మనకు కీలకంగా లభ్యమవుతున్నవి పొట్టి శ్రీరాములు రాసిన ఉత్తరాలు! మొత్తం 11 ఉత్తరాలు నేను సంపాదకత్వం వహించి 2018 ఆగస్టులో ప్రచురించిన అమరజీవి బలిదానం – పొట్టి శ్రీరాములు పోరాట గాథ అనే పుస్తకంలో లభ్యమవుతున్నాయి. ఇందులో రెండు భాగవతుల లక్ష్మీనారాయణ రాయగా, మిగతా ఎనిమిది పొట్టి శ్రీరాములు నుంచి లక్ష్మీనారాయణ అందుకున్నారు. టంగుటూరి ప్రకాశం, ఆచార్య రంగాగార్లకు ఒక ఉత్తరాన్ని పొట్టి శ్రీరాములు జెవిపి రిపోర్టు ప్రకటన అనంతరం 1949 అక్టోబరు 11న నెల్లూరు నుంచి రాశారు. ఈ ఉత్తరంలో ఈ ఇరువురు నాయకులకు బాధ్యతలు గుర్తు చేస్తూ కటువుగా రాయడమే కాక తనను నిరాహారదీక్ష చేయమని రంగాగారు హాస్యంగా చెప్పడం గురించి పొట్టి శ్రీరాములు పేర్కొన్నారు. తర్వాత సుమారు మూడు సంవత్సరాలుఈ సమస్య గురించి మధనపడిన పొట్టి శ్రీరాములు తీవ్ర మనస్తానికి గురై ఉండాలి. మళ్ళీ మనకు 1952 సెప్టెంబరు 15 నుంచి 1952 అక్టోబరు 16 మధ్యకాలంలో నెల్లూరు నుంచి మద్రాసులో వుండే న్యాయవాది భాగవతుల లక్ష్మి నారాయణకు ఎనిమిది ఉత్తరాలలో తన ప్రణాళికను, ఆకాంక్షనూ, అప్పటికి జరుగుతున్న పరిణామాలనూ వివరించారు. ఈ ఉత్తరాలను పరిశీలిస్తే పొట్టి శ్రీరాములు ఎంత త్యాగశీలియో, ఎంత వికసనం గలవాడో, ఎంత పట్టుదల గల వ్యక్తో బోధపడుతుంది.
“… ఆంధ్రనాయకులలో విషాదకరమైన భేదాభి ప్రాయాల్నిఅవకాశంగా తీసుకుని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సైతం పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తోంది… ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి సాహసించకపోతే మీ ఆంధ్రాభిమానం, మీ వాగ్దానాలు అసత్యాలవుతాయి…” (ప్రకాశం, రంగాగార్లకు పొట్టి శ్రీరాములు, 1949 అక్టోబరు 11)
“… ఆంధ్రరాష్ట్ర సమస్య అనేకమందికి, అనేక పార్టీలకు, అనేక అభిప్రాయాలకీ, అనేక భావాలకి అనేక విధాలుగా పుట్టిల్లు అయ్యింది. ప్రతి ఒక్కరి స్వార్థం వేరువేరుగా ఉంది. పత్యక్ష ఆర్ధిక లాభాలున్నాయి. కాబట్టి అందరూ పరమార్ధ దృష్టితో ఆలోచిస్తే తప్ప ఏకాభిప్రాయానికి రాలేదు.”
“… ఏ రాజకీయ పార్టీ చేతుల్లోనైనా కీలుబొమ్మగా ఉండటం నా ప్రకృతికి విరుద్ధం. నాకు పార్టీ లేదు. అనుచరులు లేరు. ఎక్కడ ఉన్నా ఏం చేసినా నాకు నేనే…”
(నెల్లూరు నుంచి 1952 సెప్టెంబరు 15న భాగవతుల లక్ష్మీనారాయణకు)
“… నిన్న సభలో శ్రీ ఉన్నవ లక్ష్మీ నారాయణగారి ప్రకటన చూచినప్పటి నుంచి ఆంధ్రరాష్ట్రం నానాటికి వెనకకి పోతున్నట్టనిపిస్తోంది…” ఆర్ధిక, సాంఘిక, రాజకీయ రంగాలన్నీ స్వార్ధ దృష్టితో కలుషితమైపోతున్నాయి… ఎవరో కొంతమంది రాజకీయజ్ఞులు, అధికారులు, వర్తకులు బాగుపడటానికి మాత్రం అవకాశం కలుగకూడదు…”
(పై ఉత్తరంలోనే ఆంధ్రరాష్ట్రం గురించి వివరిస్తూ…)
“గాంధీ నాకు నేర్పిన ద్వేషరహితమైన స్వార్ధం లేని త్యాగానికి విలువ – రోజులు గడిచినప్పటికీ పెరుగుతుందే కానీ తగ్గదు…”
(పై ఉత్తరంలోనే ఆంధ్రరాష్ట్రం గురించి వివరిస్తూ…)
“… ఇప్పటికీ ఉపవాసాలకి, సత్యాగ్రహాలకీ పెడర్ధాలు తియ్యబడుతున్నాయి. నేను కూడా ఏదో చేశాను అనిపించుకోవడం నాకిష్టం లేదు…”
(1952 సెప్టెంబరు 20 నెల్లూరు నుంచి)
“నెహ్రూగారి ప్రకటన చూడడంతో నేనకున్న పని వెంటనే చెయ్యడం తప్పా మరొక మార్గం లేదని రోజు రోజుకూ నా నిర్ణయం గట్టి పడుతోంది… తప్పించుకోవడానికి ఏ దారిని ఉంచుకోలేదు. నాకు వెనక చూపు ఆఖరి రోజులలో కూడా కలగకూడదని ప్రార్ధిస్తున్నాను… నాకు పర్యవసానం ఏమతుందా అనే చింత లేదు. నేను సరైన మార్గంలో ఉన్నాననే నమ్మకం ఉంది.ఈ నమ్మకం నన్ను కాపాడగలదు…” (1952 అక్టోబరు 7 నెల్లూరు నుంచి)
“1952 అక్టోబరు 19న బలిదాన నిశ్చయం”
(1952 అక్టోబరు 13 నెల్లూరు నుంచి)
గాంధీని మించి గాంధేయవాది, మనస్సన్యాసి, స్థిరచిత్తులు, త్యాగశీలి 58 రోజులు నిరాహారదీక్ష చేసి 1952 డిసెంబరు 15 రాత్రి 11 గం.20 నిలకు అమరుడయ్యాడు!
అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అమరజీవి ఒక విరాణ్మూర్తి!
(వ్యాస ర‌చ‌యిత ప్ర‌ముఖ సామాజిక విశ్లేష‌కుడు, ర‌చ‌యిత‌, ఆలిండియా రేడియో అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here