బీజేపీకి జాబ్ ఇవ్వ‌ని పంజాబ్‌!

0

కాషాయానికి ఈసారీ కష్టకాలమే!
బీఎస్పీతో అకాలీద‌ళ్ పొత్తు
సిద్దూ-కెప్టెన్ త‌గ‌వు కాంగ్రెస్‌కు చెంప‌పెట్టు
ప్ర‌జ‌ల మొగ్గు అకాలీద‌ళ్ వైపే
పొత్తు లేకుండా బీజేపీకి సీటే ద‌క్క‌దు
(ఆశ్లేష‌)

వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిల్లో యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో ఒక్క పంజాబ్ తప్ప మిగిలిన నాలుగు రాష్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఇతర రాష్రాలను పక్కనపెడితే పంజాబ్‌లో ఈసారీ కాషాయ పార్టీకి కష్టాలు తప్పేటట్లు లేదన్నది రాజకీయ నిపుణుల అంచనా. పేరుకు దేశ రాజధాని ఢిల్లీకి దగ్గరగా ఉన్నప్పటికీ పంజాబ్‌లో ఏనాడూ కాషాయ పతాకం రెపరెపలాడలేదు. అకాలీదళ్, లేదా కాంగ్రెస్ పార్టీలే చండీగఢ్‌లో చక్రం తిప్పుతూ వస్తున్నాయి. రాష్ట్ర‌ రాజకీయాల్లో భాజపా పాత్ర నామమాత్రమే. నిన్న మొన్నటిదాకా అకాలీదళ్ తో పొత్తు పెట్టుకుని రాజకీయంగా మనుగడ సాగిస్తోంది. అంతేతప్ప పార్టీకంటూ సొంత ఓటుబ్యాంకు లేదు. అకాలీల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడుతూ వస్తోంది. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ గత ఏడాది అకాలీదళ్ కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగింది.

ఆ పార్టీకి చెందిన కేంద్రమంత్రి హర్ సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆమె అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ భార్య. మంత్రివర్గం నుంచి వైదొలగడమే కాకుండా భాజపాతో గల దశాబ్దాల స్నేహాన్ని సైతం వదిలేసుకుంది. కాషాయపార్టీతో బంధం కొనసాగిస్తే సంప్రదాయ రైతువర్గాలు ఎక్కడ దూరమవుతాయోనన్న భయంతో ముందు జాగ్రత్తగా భాజపాతో పొత్తును తెంచుకుంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మొదట పంజాబ్ నుంచే పోరాటం ప్రారంభమైంది. ఎక్కువమంది సిక్కులు ఇందులో పాల్గొంటున్నారు. కేవలం ఒక వర్గం రైతులు మాత్రమే వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నారన్న అభిప్రాయం కలగడంతో యూపీకి చెందిన రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ రంగప్రవేశం చేశారు. ఈయన ఒకప్పటి నాయకుడు రైతు నాయకుడు మహేంద్ర సింగ్ టికాయత్ కుమారుడు.


బీఎస్పీతో అకాలీద‌ళ్ పొత్తు
బీజేపీతో పొత్తు వద్దనుకున్న అకాలీదళ్ పార్టీ తాజాగా మాయావతి సారథ్యంలోని బహుజన సమాజ్ పార్టీ (బీ ఎస్ పీ) తో పొత్తు పెట్టుకుంది. పంజాబ్ లో దళిత జనాభా గణనీయంగానే ఉంది. దాదాపు 20 శాతం వరకు ఉండవచ్చని అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో అకాలీలకు గట్టి పట్టుంది. సిక్కుల్లో ఎక్కువమంది అకాలీలకు మద్దతుదారులు. కెప్టెన్ అమరీందర్ సింగ్ సారథ్యంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతప్తి నెలకొంది. విద్యుత్ కొరత పంజాబ్‌ను పట్టి పీడిస్తోంది. దీంతో పంజాబ్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీనికి తోడు రాష్ట్ర‌ కాంగ్రెస్‌లో తీవ్ర అసమ్మతి స్వరాలు వినపడుతున్నాయి. అమరీందర్ అభీష్టానికి విరుద్ధంగా మాజీ క్రికెటర్ నవజ్యోతి సింగ్ సిద్ధూను అధిష్టానం పీసీసీ చీఫ్ చేసింది. అమరీందర్, సిద్ధూ వర్గాల మధ్య పరిస్థితి ఉప్పూనిప్ఫూలా ఉంది. ఒకరినొకరు ఓడించుకునేందుకు కత్తులు నూరుతున్నారు.


ఈ నేపథ్యంలో తనకంటూ ప్రత్యేక ఓటు బ్యాంకు లేని బీజేపీ రాజకీయంగా ఒంటరైంది. పంజాబ్‌లో మెజార్టీ ప్రజలు సిక్కులు. వారి ఓట్లు అకాలీదళ్, కాంగ్రెస్ మధ్య చీలుతాయి. హిందువుల ఓట్లు గంపగుత్తగా బీజేపీ ఖాతాలో పడవు. వీరి ఓట్లు ఎక్కువగా వస్తాయి. కరడుగట్టిన హిందువులు మాత్రమే భాజపావైపు నిలబడతారు.


ఓటు బ్యాంకు లేని బీజేపీ
ఈ నేపథ్యంలో భాజపాకు నికరమైన ఓటుబ్యాంకు అంటూ ఏమీ లేదు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో మధ్యతరగతి ఓటర్లు సైతం భాజపాకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర‌ అధ్యక్షుడు అశ్వనీ కుమార్ శర్మ కొట్టి పారేస్తున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117కు గాను బీజేపీకి వచ్చిన సీట్లు కేవలం మూడంటే మూడు. అదీ అకాలీదళ్‌తో పొత్తు పుణ్యమే. 2019పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 13 సీట్లకుగాను కేవలం రెండంటే రెండు సీట్లు కాషాయ పార్టీ గెలుచుకుంది. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గతంలో వచ్చిన అసెంబ్లీ సీట్లను కాపాడుకుంటే గొప్పేనని రాజకీయ పండితుల అంచనా. మోడీ గ్రాఫ్ క్రమంగా తగ్గడం, రాష్ట్రంలో ప్రజాదరణ గల నాయకుడు లేకపోవడం పెద్ద లోటుగా పరిణమించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పార్టీ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదన్నది చేదు నిజం. (వ్యాస ర‌చ‌యిత సీనియ‌ర్ జ‌ర్నలిస్ట్‌)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here