పరమ పవిత్రం… మాఘమాసం

0

(రామ కిష్టయ్య సంగన భట్ల, 9440595494)
హైందవ సాంప్రదాయాన్ని అనుసరించి ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంది. మాఘ ఫాల్గుణాలు శిశిర రుతువులో ఉంటాయి. సంవ త్సరంలో పదవ మాసమూ, హేమంత రుతువులోని రెండో మాసమూ అయిన పుష్యం తెలుగు వారికి శూన్యమాసం. సంవత్స రంలోని నాలుగవ మాసమూ, గ్రీష్మ రుతువులోని రెండవ మాసమూ అయిన ఆషాఢం కూడా తెలుగు వారికి శూన్య మాసమే. శూన్య మాసాలు శుభ శోభనాలకు పనికిరానివి. ఒక సంవత్సరం చివరి పాదంలో వచ్చే పుష్య మాసానికి, మరు సంవత్సరం రెండో పాదంలో వచ్చే ఆషాఢానికీ మధ్య ఆయిదు మాసాల తేడా ఉంటుంది. మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టంలకు “మాఘాది పంచకం” అని పేరు. ఇవి శుభకార్యాలకు అనుకూల కాలం. వాన, చలి అంతగా ఉండక, వస్త్ర గృహ సమస్య ఇబ్బంది కలిగించక, ధాన్యలక్ష్మి ఆరు బయట విరివిగా మసలే కాలమిది. శాక పాకాలు సమృద్ధిగా, అనుకూలంగా ఉండే మాస పంచకానికి తొలిమాసం మాఘం. ‘మఘం’ అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించేవారు.మాఘమాసం మహిమ అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థం. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక మాఘ మాసమైంది. సంవత్సరంలో పదకొండవ మాసమైన మాఘంలో గృహ నిర్మాణాలు ఆరంభిస్తే సంపత్తి కలుగగలదని మత్స్య పురాణం స్పష్ట పరుస్తున్నది. మాఘ మాసపు ఆదివారాలు మహిమాన్వితాలు. ఈ రోజులలో సూర్యపూజ చేసిన వారికి ఆరోగ్య, భోగ భాగ్యాలు కలుగుతాయని పద్మ పురాణాధారం. కార్తీకంలో “దీపానికి” ఎంత ప్రాధాన్యత ఉందో, మాఘ మాసంలో “స్నానానికి” అంత ప్రాముఖ్య ఉంది. మరమేశ్వరుడు లింగరూపంలో ఆవిర్భవించింది ఈ మాసంలోనే. శుక్ల పక్ష చవితి” దీనిని “తిల చతుర్థి”అంటారు. దీన్నే “కుంద చతుర్థి” అని కూడా అంటారు. మాఘంలోనే వసంత పంచమి నాడు జ్ఞాన స్వరూపిణి సరస్వతీ దేవి జన్మించింది. ఆరోగ్యం ప్రసాదించమని కొలిచే కాల చక్రాత్మగా పిలువబడే ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుని జయంతి “రథ సప్తమి”గా పిలువబడే మాఘ శుక్ల సప్తమి. సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి ఈ రోజునే “శమంతకమణి” ప్రసాదించాడు. హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యజవాల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు. మకర లగ్నంలో సూర్య భగవానుడు ఉండే సమయాన స్నానం ఫలితం కోటి జన్మాల పుణ్య కార్యాలతో లభ్యం కానిదని చెపుతారు. శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి (భీష్మాష్టమి) తిథినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ప్రాణ త్యాగం చేశాడు. మాఘ పూర్ణిమను ‘మహామాఘం’ అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. మహా మాఘి ఇది విశేష పర్వదినం. కృష్ణ పాడ్యమి సౌభాగ్యప్రాప్తి వ్రతం చేస్తారు. కృష్ణ సప్తమి నాడు సర్వాప్తి సప్తమి వ్రతం, సూర్యవ్రతాలు ఆచరిస్తారు. అష్టమినాడు మంగళా వ్రతం చేస్తారు. కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని, రామసేతు నిర్మాణం పూర్తి అయిన రోజుని చెబుతారు. ద్వాదశినాడు తిల ద్వాదశీ వ్రతం జరుపుతారు. త్రయోదశిని ద్వాపర యుగాదిగా పేర్కొంటారు. చతుర్దశి మహశివ రాత్రి పర్వదినం వ్రతం జరుపుతారు. చివరిదైన కృష్ణ అమావాస్యనాడు పితృశ్రాద్ధం చెయ్యడం అధిక ఫలప్రదనని విశ్వాసం.
ఉషఃకాల స్నానం పుణ్య‌ప్ర‌దం
మాఘమాసంలో ఉషఃకాల స్నానం పుణ్యప్రదం. సూర్యుడు ఉన్న మకర రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్య కిరణాల్లో ఉండే అతినీల లోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. సూర్యుడు మకర రాశిగతుడు అయినప్పటి నుండి ప్రాతఃకాల స్నానాలు తప్పక చేయాలి. మాఘ మాసంలో ఉషఃకాల సమయాన నదులలో, చెరువులలో, మడుగులలో, కొలనులలో, తుదకు బావులలో స్నానం చేస్తే ప్రయాగ స్నాన ఫలితం దక్కుతుంది.
ఉత్కృష్టం దీపారాధ‌న
”గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ – నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు”.
గంగ, గోదావరి, కావేరి లాంటి పవిత్ర నదులను తలుచుకుని, పుణ్య స్నానం ఆచరించాలి. సూర్యుడికి అర్హ్యం ప్రదానం చేయాలి. అశక్తత చేత నిర్ణీత సమయమందు స్నానం చేయ జాలని వారు పొద్దు పొడిచిన జాములోగా చేయాలి. చలికి వెరవ కయే, మంచు ఆవరించి ఉన్న నదీ జలాలలో, స్నానం శ్రేష్ఠమని పురా ణాలు ఘోషిస్తున్నాయి. స్నానానంతరం శివాలయాలకు వెళ్ళి, నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే సకల దోష పరిహారం కాలదనే విశ్వాసం. మాఘమాస అరుణోదయ స్నానం, అరుణోదయ దీపారాధనం, తిల దానం, తిల భక్షణం ఉత్కృష్టమైనవి. (వ్యాస ర‌చ‌యిత సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌)

Ramakishtayya Sanganabhatla

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here