సినీ వినీలాకాశంలో మెరిసిన నీలాంబరి

0

సెప్టెంబ‌ర్ 15 ర‌మ్య‌కృష్ణ జ‌న్మ‌దినం
(శ్రీధర్ వాడవల్లి, 9989855445)

జాజిమల్లి తెల్లచీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల్లపూలు పెట్టుకుంటే అది నువ్వే నువ్వేనమ్మా నూరుపాళ్ళు నిన్ను చూడాలంటే చాలవమ్మ వేయికళ్ళు. నిన్ను వెండితెరపై చూసినది లగాయతు కుర్రకారు రోమియోలుగా మారిపోయారు ఏం పిల్లది ఎంత మాటన్నది సిగ్గులపురి చెక్కిలి తనకుంది అంది . మాగబాసలను పలికించగల ముద్ద బంతి ఈ ఇంతి. “కంటే కూతుర్నే కనాలి అంటూ దాసరి దర్శకత్వంలో నటించి మెప్పించిన సొగసరి. ఆల్లరిప్రియుడిని ఆటపట్టించి అల్లరి ప్రేమికుని గుండెల్లో సితారను మ్రోగించిన తళుకులతార .సినీ వినీలాకాశంలో మెరిసిన నీలాంబరి. అభినయంతో ఆమె మాటను శాసనంగా చలామణి చేయించుకుంటున్న మమతల తల్లి ఈ శివగామిని. కేవలం అందాల ప్రదర్శనకు మాత్రమే అనుకున్న ప్రేక్షకులకి తన నటనతో సమాధానం చెప్పిన నటి. ఏ భావోద్వేగాన్న‌యినా పండించగల సామర్ధ్యం ఆమె సొంతం.
ఎటువంటి పాత్ర‌యినా పండించే స‌త్తా
ద్వేషం పెంచుకున్న పాత్రైనా, అసూయతో రగిలిపోయే పాత్రైనా, ఆమాయకపు భార్య పాత్ర… ఇలా పాత్ర ఏదైనా ఆమె పరకాయ ప్రవేశం…అభినయ ప్రదర్శనం అత్యద్భుతం. . అందివచ్చిన ప్రతి పాత్రకు ప్రాణం ఆమె పోయగలరు. అందంతోనే కాదు నటనలో నూ ప్రేక్షకులను మెప్పించగలరు. అందుకే … సినీ రంగ ప్రవేశం చేసి ఏళ్ళు గడిచినా ఇప్పటికీ వెండితెర రాజ్యాన్ని ఏలుతోంది. రమ్యకృష్ణ నటిస్తే ఆ పాత్ర విజయవంతంగా ప్రేక్షకులకు చేరినట్టే అనే భరోసాని అగ్ర దర్శకులకు కలిగించడంలో విజయవంతమయ్యారు రమ్యకృష్ణ. రమ్యకృష్ణ తెలుగులోనూ ఎన్నో శక్తిమంతమైన పాత్రలు పోషించారు. ‘భలే మిత్రులు’ అనే సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు. కె.విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సూత్రధారులు’ అనే సినిమా తెలుగులో రమ్యకృష్ణకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 1990లలో మీనా, రోజా, నగ్మా, సౌందర్య వంటి అగ్ర కధానాయికల జాబితాలో చోటు దక్కించుకోగలిగారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘అల్లుడుగారు’, ‘అల్లరి మొగుడు’, ‘మేజర్ చంద్రకాంత్’, సినిమాలలో మోహన్ బాబుకు జోడీగా నటించి బాగా గుర్తింపు సంపాదించుకొన్నారు.


ద‌ర్శ‌కేంద్రుని హీరోయిన్‌
రాఘవేంద్రరావు దర్శకత్వంలో రాజశేఖర్, రమ్యకృష్ణ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘అల్లరి ప్రియుడు’ సినిమా ఎంతో విజయవంతమైంది. ‘అన్నమయ్య’ సినిమాలో నాగార్జున, కస్తూరిలతో స్క్రీన్ ని షేర్ చేసుకొన్నారు. నరసింహ’ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పాత్రకు ధీటైనా పాత్రను పోషించి అభిమానులను ఆకట్టుకోగలిగారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన పాత్ర పేరు ‘నీలాంబరి’. అభిమానులు ఈ సినిమాలో రమ్యకృష్ణ నటనని, పాత్రని అంత సులభంగా మర్చిపోలేరు. పాత్రల్లో జీవించడం రమ్యకృష్ణ శైలి. పొగరుగల పాత్రలు చేస్తే… రమ్యకృష్ణకు నిజంగా పొగరేమో అని ప్రేక్షకులు అనుకునేంత స్థాయిలో నటిస్తారు. ఏడిపించే పాత్రల్లోనూ నటించి ప్రేక్షకులను ఏడిపించగల సామర్ధ్యం ఈ యాక్ట్రస్ సొంతం. ‘సంకీర్తన’, ‘బృందావనం’, ‘బంగారు బుల్లోడు’, ‘అల్లరి ప్రేమికుడు’, ‘హలో బ్రదర్’, ‘క్రిమినల్’, ‘ఆయనకు ఇద్దరు’, ‘అల్లుడా మజాకా’, ‘ఘరానా బుల్లోడు’, ‘అమ్మోరు’, ‘అదిరింది అల్లుడు’, ‘ధర్మ చక్రం’, ‘అమ్మ అమ్మని చూడాలని ఉంది’, ‘సోగ్గాడి పెళ్ళాం’, ‘దేవుడు’, ‘చిన్నబ్బాయి’, ‘చిలకొట్టుడు’, ‘ఆహ్వానం’, ‘ఊయల’, ‘కంటే కూతుర్నే కను’, ‘దీర్ఘ సుమంగళి భవ’, ‘చంద్రలేఖ’, ‘లవ్ స్టోరీ 1999’, ‘ఆవిడే శ్యామల’, ‘ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు’, ‘ఇద్దరు మిత్రులు’, వంశోద్ధారకుడు’, ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’, ‘మనసు పడ్డాను కానీ’, ‘బడ్జెట్ పద్మనాభం’, ‘మా అల్లుడు వెరీ గుడ్’, వంటి ఎన్నో చిత్రాలలో తన నటనతో ప్రేక్షకులను అలరించారు. నాగార్జున హీరోగా నటించిన సినిమాలోని రమ్యకృష్ణ ‘నిన్ను రోడ్డుమీద’ పాటలో నర్తించి అభిమానులూ నర్తించేలా చేశారు.
చిన్న గౌను వేసుకున్న పెద్ద‌పాప‌
అలాగే, ‘ప్రేమకు వేళయరా’ మూవీలో ‘చిన్న గౌను వేసుకొన్న’ పాటలో రమ్య స్టెప్పులను ఎవరూ మర్చిపోలేరు. జూనియర్ ఎన్టీఆర్ తో ‘చిన్నదమ్మే’ పాటలో డాన్స్ చేశారు. ఇది రాజమౌళి దర్శకత్వం వహించిన ‘సింహాద్రి’ సినిమాలోది. ఇంకా ‘అంజి’, ‘అడివి రాముడు’, తదితర సినిమాలలో ప్రత్యేక గీతాలలో మెరిశారు. సీనియర్ హీరోయిన్స్ లో గ్లామరస్ హీరోయిన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు రమ్యకృష్ణ. అందం అభినయం కలబోసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది రమ్యకృష్ణ. సీనియర్ హీరోలు అందరి సరసన నటించి అలరించింది ఈ సొగసరి. హీరోయిన్ గానే కాకూండా ఆ మధ్య స్పెషల్ సాంగ్స్ లో ను మెరిసి ఆకట్టుకుంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత కొంత కాలం క్యారక్టర్ ఆర్టిస్ట్ గాను రాణించింది రమ్యకృష్ణ.. ఘరానా బుల్లోడు, హలో బ్రదర్, చంద్రలేఖ, అన్నమయ్య.. ఇలా ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది నటి రమ్యకృష్ణ. 1990-2000 సంవత్సరం వరకు దాదాపు దశాబ్దం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా వెలిగిపోయింది సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు.


సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆచితూచి సినిమాల ఎంపిక‌
అప్పట్లో గ్లామరస్ హీరోయిన్ గా రాణించారు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటూ.. దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో రామకృష్ణ చూపించిన అభినయం సినిమాకే హైలైట్ అని చెప్పాలి. రాజమాత శివగామి పాత్రలో రమ్య కృష్ణ నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. బాహుబలి’ సినిమాలోని శివగామి పాత్ర దక్కింది.. ఆ తర్వాత పరిస్థితి ఏంటో అందరికి తెలిసిందే. బాహుబలిగా ప్రభాస్, భల్లాలదేవగా రానా ఎంత పాపులర్ అయ్యారో.. శివగామిగా రమ్యకృష్ణ విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఆ పాత్రలో ఆమెను తప్ప మరెవరిని ఊహించలేని విధంగా అద్భుతంగా నటించారు. ‘బాహుబలి’ సినిమాతో ఆమెకు డిమాండ్ పెరిగింది.
రూపొందుతున్న ప్ర‌త్యేక పాత్ర‌లు
దర్శకులు ఆమె కోసం ప్రత్యేకమైన పాత్రలను రూపొందిస్తున్నారు. ఇక ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమాలో చేస్తున్నారు రమ్యకృష్ణ. దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘కంటే కూతుర్నే కను’ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా నంది అవార్డును అందుకొన్నారు. ‘పడయప్పా’లో తమిళనాడు రాష్ట్ర సినిమా పురస్కారం, ఫిలింఫేర్ అవార్డును సంపాదించుకొన్నారు. తెలుగు చిత్రం ‘రాజుమహారాజు’ సినిమాకు ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు అందుకొన్నారు. సిద్దార్ధ్, తమన్నా భాటియా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ చిత్రంలో నటనకుగానూ ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు సంపాదించుకొన్నారు. ‘బాహుబలి: ద బిగినింగ్’ సినిమా అయితే రమ్యకృష్ణ ఇంటి వాకిట్లో వరుసపెట్టి పురస్కారాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు ఉత్తమ నటిగా నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డు, సైమా అవార్డు, ఐఫా అవార్డు తదితర పురస్కారాలను అందిపుచ్చుకున్నారు. ‘బాహుబలి: ద కంక్లూజన్’ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు, సైమా అవార్డును దక్కించుకోగలిగారు. (వ్యాస ర‌చ‌యిత ప్ర‌ముఖ సినీ విమ‌ర్శ‌కుడు)

Vadavalli Sridhar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here